ఒలింపిక్స్ జరపాలా? వద్దా?
జులై 23న టొక్యో నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనతో ఈ క్రీడలు ప్రారంభం కావాల్సివుంది. కానీ ఆ ఒలింపిక్ జ్యోతి ఇప్పుడు గాలివాటుకు రెపరెపలాడుతున్నది.
క్రీడా ప్రపంచంలో ఒలింపిక్ గేమ్స్ అతి పెద్ద పండుగ. నాలుగేళ్ళకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రాత్రనకా పగలనకా కఠోర సాధన చేస్తూ ఉంటారు. క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి ఈ క్రీడోత్సవం చుట్టూ కొరోనా కారు మేఘాలు కమ్ముకున్నాయి. 2020 లోనే జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను మహమ్మారి పుణ్యమాని ఓ ఏడాది పాటు వాయిదా వేసి ఈ జులైలో జరిపే ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ పోటీలు జరగడం మళ్ళీ ప్రశ్నార్ధకంగానే కనిపిస్తున్నది.
క్రీస్తు పూర్వం గ్రీకు నగరాల మధ్య ఒలింపిక్స్ జరిగేవి. ఆ నగర రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా కూడా వాటిని తాత్కాలికంగా నిలిపేసి మరీ ఈ క్రీడలను వాటి నిర్ణీత సమయంలో నిర్వహించేవారు. ఇప్పటి ఒలింపిక్స్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు. రెండు ప్రపంచ యుద్ధాల టైములో ఒలింపిక్ క్రీడలు నిలిచిపోయాయి . అయితే ఆ యుద్ధాలు మినహా మరే శక్తి ఇన్నాళ్ళూ ఈ నాలుగేళ్ళ పండుగను అడ్డుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి దాపురించిన ఈ మహమ్మారి వల్ల 32వ ఒలింపిక్స్ రద్దవ్వక తప్పదేమోననిపిస్తున్నది.
ఒలింపిక్ వేరియంట్ అనే ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు.
జులై 23న టొక్యో నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనతో ఈ క్రీడలు ప్రారంభం కావాల్సివుంది. కానీ ఆ ఒలింపిక్ జ్యోతి ఇప్పుడు గాలివాటుకు రెపరెపలాడుతున్నది. జపాన్లో కోవిడ్ మళ్ళీ కోరలు చాచుతోంది. వారికిది ఫోర్త్ వేవ్ అంట. వ్యాక్సినేషన్ విషయంలోనూ ఆ దేశం చాల వెనకబడిఉంది. మరి ఒలింపిక్స్ క్రీడలకు రెండు వందల దేశాల నుంచి 15 వేల మంది క్రీడాకారులు, లక్షకు పైగా కోచ్లు, రిఫరీల వంటి అధికారులు, మీడియా సిబ్బంది టోక్యో రానున్నారు. కొరోనా కాలంలో ఇన్ని దేశాలవారు ఒకే దగ్గర చేరడం ఇదే మొదటి సారవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇంత మంది టోక్యో వస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, వారంతా రకరకాల వైరస్ వేరియంట్లు మోసుకొస్తారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒలింపిక్ వేరియంట్ అనే ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. ఎనిమిది టీమ్స్ ఉండే ఐపిఎల్లోనే కోవిడ్ కేసులు రావడం మనం చూశాం. 200 దేశాల అథ్లెట్లు పాల్గొనే ఈ గేమ్స్లో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే జపాన్ హెల్త్ కేర్ వ్యవస్థ కోవిడ్ చికిత్స విషయంలో సరైన వైద్య సదుపాయలు అందించలేకపోతున్నది. ఒలింపిక్ నిర్వహణ వల్ల వారి వైద్య వ్యవస్థ పైన మరింత వత్తిడి పెరుగుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. అందుకనే అక్కడి ప్రజాభిప్రాయం ఒలింపిక్స్కు వ్యతిరేకంగా ఉంది. ఇటీవల జరిగిన ఒపీనియన్ పోల్స్లో 60 నుంచి 80 శాతం మంది జపనీయులు ఈ క్రీడల నిర్వహణ రద్దు చేయాలనే అంటున్నారు.
క్రీడాకారుల షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. అందులో నాలుగేళ్ళు కోల్పోవడమంటే అదొక పిడుగుపాటు లాంటిదే.
జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఒసి) మాత్రం ఈ క్రీడలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఒలింపిక్స్ జరిపి వైరస్ను మానవాళి ఓడించగలిగిందన్న సందేశం ఇద్దామని జపాన్ ప్రధాని సూగా చెబుతున్నారు. ఈ క్రీడలు గనుక సజావుగా నిర్వహించగలిగితే, జపాన్ సామర్ధ్యం ప్రపంచానికి చాటినట్టవుతుందని కూడా ఆయన ఆశిస్తున్నారు. 1964లో ఇదే టొక్యోలో ఒలింపిక్స్ జరిపినప్పుడు, జపాన్ సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతే కాదు, ఒలింపిక్స్ను గనుక రద్దు చేస్తే జపాన్కు దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా. ఇప్పుడు జరపలేకపోతే మళ్ళీ 2032 వరకు జపాన్కు ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాదు. ఒలింపిక్స్ రద్దు చేస్తే ఐఒసి కూడా భారీగా నష్టపోతుంది.
ఆర్ధిక పరమైన నష్టాలకన్నా క్రీడాకారులకు జరిగే నష్టాన్ని కొలవడానికి ఎలాంటి తూకపు రాళ్ళు చాలవు. ఈ సారి ఒలింపిక్స్లో పతకం సాధించి నిష్క్రమిద్దామని రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అథ్లెట్లు కలలు కంటూ ఉంటారు. గేమ్స్ రద్దయితే వారి ఆశల సౌధం నిలువునా కూలిపోతుంది. మిగతా అథ్లెట్లు కూడా సాధన కొనసాగించాలా వద్దా అన్న సందేహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ అనిశ్చిత పరిస్థితి వల్ల వారు మానసికపరమైన వత్తిడికి కూడా లోనవుతున్నారు. క్రీడాకారుల షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. అందులో నాలుగేళ్ళు కోల్పోవడమంటే అదొక పిడుగుపాటు లాంటిదే.
క్రీడాప్రేమికులందరూ ఒలింపిక్స్ జరగాలనే కోరుకుంటారు. అయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా జరుగుతాయన్న నమ్మకం ఉన్నప్పుడే ఈ క్రీడోత్సవం జరపాలి. ఐపిఎల్ మధ్యలో ఆగిపోయిన లాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు. ఆటలు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం.
తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్. జాతీయంగా, అంతర్జాతీయంగా టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించిన తొలితరం కామెంటేటర్ కూడా. వారు Bits and pieces, Second Iinnings, క్రీడాభిరామం- పేరిట వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. అలాగే, సికె నాయుడు ఆత్మకథ, సచిన్ పై Such a 100 అన్న గ్రంధాన్ని కూడా వెలువరించారు. ‘Yours Sportingly’ ప్రతివారం తెలుపు పాఠకులకు వారందించే క్రీడా స్ఫూర్తి.