Editorial

Saturday, December 28, 2024
వ్యాసాలుజయతి లోహితాక్షణ్ : Of Solitude 2021

జయతి లోహితాక్షణ్ : Of Solitude 2021

ఈ సంవత్సరం ఏమీ చేయలేదు. నదిచల్లగాలిలో నది ఇసుకలో నదినీళ్ళలో పాదాలు తడుపుకుంటూ గడిపాం. మైల్లకొద్దీ చీకట్లో చెరువలకడ్డుపడి నడిచాం. ఎండిన చెరువుల్లో సాయంకాలాలు గడిపాం. గాయపడ్డ వైటీని తీసుకుని స్నేహితుల తోటలోకి బూరుగుపూడి చేరుకున్నాం. రాతి కుటీరం నిర్మాణం మొదలైంది.

జయతి లోహితాక్షణ్

నేను మిత్రుల ఫామ్ హౌజ్ లో ఉన్నాను. ఆ సమయానికి ఒక్కతిని. నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. కరెంటు వాళ్ళొచ్చారు. కొత్త మీటరు మార్చి రెండువందలివ్వండని అడిగారు. నా దగ్గర డబ్బులుండవన్నాను. అర్థం కాలేదతనికి. ఫోన్ పే చేయండన్నాడు. నేను డబ్బుని తాకి ఐదారేళ్ళయిందంటే అతడు నమ్ముతాడా? బ్యాంకు నా అకౌంటుని నిలిపివేసి ఉండవచ్చు కూడా. నా పుస్తకానికి ఎవరైనా డబ్బు నా చేతికిచ్చారా లోహికిచ్చేస్తాను. నా అవసరాలు ఒకపూట అన్నం, ఇంటర్నెట్. కవిత్వం కోసం.

కొండల్లో కొండరెడ్ల పల్లెలో రాములక్కాయలు కోసుకొచ్చాను విత్తనానికి రెండేళ్ల క్రింద (‘ఆదిచింత’ అడవి పుస్తకం). అడవి కుటీరంలో నాటాను. మొలవలేదు. విత్తనాలు నాటిన కవర్లు చెల్లాచెదురు చేసి వైటి పడుకునేది చల్లని మట్టిలో. రెండు నెలల తరవాత నేను నాటని చోట కొన్ని మొలకలు కనిపించాయి. రెండు బ్రతికి పందిరిపైకి పెరిగిపోయాయి. మళ్ళీ విత్తనాలు దాచాను. అడవి కుటీరం వదిలి వస్తూ వాటిని నాతో తెచ్చాను. కొత్త తోటలో నాటాను. మొలవలేదు. మళ్ళా ఆ కొండరెడ్ల పల్లెకి ఎవరు వెళ్తారా అని చూసాను. నా ఊరి నుంచి ఎవరు వస్తారా అని చూసాను. ఎవరు వెళ్ళలేదు. ఎవరూ దొరకవన్నారు. మొలవలేదని మిగిలిన విత్తనాలన్నీ వెదజల్లేసాను. మూడునెలలు గడిచిపోయాయి. చల్లినవి మరిచిపోయాను. సంవత్సరం ఆఖరులో రెండు మొలకలు కనిపించాయి.

Consider me
As one who loved poetry
And persimmons.

హైకూ కవి Masaoaka Shiki, అంటాడు.

ఈ టమాటా మొక్క నాకు ఇష్టం.

ఈ సంవత్సరం నేను ఏమీ చేయలేదు. సంవత్సరం రావడమే కొండవాలులో చెట్టు కిందికి నెట్టింది మమ్మల్ని. నెలన్నర రోజులు స్వచ్ఛమైన చీకటిని అడవి నట్టనడుమ రాత్రిని చలినీ చూసాం. ఏమని చెప్పను మా మనసుకి అవెంత సుఖంగా ఉండేవో. Bicycle Diaries విడుదల చేసాం. అడవి పుస్తకం పూర్తిచేసి అడిగిన వారికల్లా పంపించాం. దుమ్ము దూళికి ఎండకి శబ్దాలకి (ఎన్నికల గోల) తేనెటీగల దాడికి మరొక రహదారి పక్కన కొన్నినెలలు నివసించాం. అదేచోట లాక్డౌన్ పరిస్థితుల్ని ఎదుర్కున్నాం.

నదిచల్లగాలిలో నది ఇసుకలో నదినీళ్ళలో పాదాలు తడుపుకుంటూ గడిపాం. నదిలో వైటీ ఈతకొట్టడం చూసాం. తుని, ఈదటం సముద్ర తీరాన్ని చేరుకున్నాం. వైటీ అలలతో ఆడుకుంటుంటే చూసాం. తిరిగు దారిలో మైల్లకొద్దీ చీకట్లో చెరువలకడ్డుపడి నడిచాం. ఎండిన చెరువుల్లో సాయంకాలాలు గడిపాం. గాయపడ్డ వైటీని తీసుకుని స్నేహితుల తోటలోకి బూరుగుపూడి చేరుకున్నాం. One Hundred Years of Solitude పదకొండు అధ్యాయాలు పూర్తిచేసాను.

రాతి కుటీరం నిర్మాణం మొదలైంది. గోడల్లోపల పైకప్పు కింద ఉండదు మనసు. ఎండ, ఎగుడుదిగుడు నేల, విసిరే గాలి సుఖాన్నిస్తుంది. గాలికి వానకి ఎండకి కాలానికి బిగిసిన కఠినమైన నేలని తవ్వాం. తోటని పెంచాం. ఈ ఏడాది రెండో సగమంతా రాళ్ళని నేలలోంచి బైటికితీస్తూ రాళ్ళని ఎత్తుతూ ఉన్నాం. పువ్వులు పూచాయి. కుటీరం పూర్తైంది. తోట ఆకుకూరలిస్తున్నది. దానికై అది పెరుగుతుంది. రానున్న రోజుల్లో మార్క్వెజ్ నవల మిగతా తొమ్మిది అధ్యాయాలు పూర్తిచెయ్యగలుగుతాను.

జయతి లోహితాక్షణ్ అడవి వ్యామోహి. జీవిత రచయిత. ‘అడవి నుంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ తాను వెలువరించిన అక్షర కృతులు. చెట్టు చేమ పురుగు భూషి ఆకులు అలములు నదీ నదాల మొదలు, ముందు చెప్పినట్టు అడవి దాకా చిత్రిక పడుతున్న వెలుగు నీడల రచయిత, ఛాయా చిత్రకారిణి. సహచరుడు లోహితాక్షణ్. Bicycle Diaries రచయిత. వారెక్కడుంటే అక్కడే అడవీ, కుటీరం.  

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article