Editorial

Saturday, January 11, 2025
Opinionఈ ఏడాది తెలుపు : డా.నలిమెల భాస్కర్ 'నిత్యనూతనం'

ఈ ఏడాది తెలుపు : డా.నలిమెల భాస్కర్ ‘నిత్యనూతనం’

 కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. అప్పుడప్పుడు లోతైన గాయాలు చేస్తుంది. సోదరి మరణంతో  దుఃఖితుడైన నన్ను రచనా వ్యాసంగం, సత్సాంగత్యం, సంగీతం   నిత్యనూతనంగా ఉంచాయి.

డా.నలిమెల భాస్కర్

చెల్లెలు ఇందిర

నాకు ఈ 2021 అనే నాలుగు అంకెల సంఖ్యను చూడగానే మొదటి రెండంకెలు 20 వెంటనే గుర్తుకొస్తాయి. కారణం 21లో మార్చి 20 నాడు మా చెల్లె ఇందిర పోవడం (కోవిడ్ తో కాదు).

ఆమె నాకన్నా ఆరేండ్లు చిన్న. సోదరి మరణంతో దాదాపు రెణ్ణెళ్ళు రాత్రుళ్ళు నిద్రకు దూరమయ్యాను. మాత్రలు వేసుకున్నా నిద్రాదేవి కరుణించని దుస్థితి. పగలంతా చెల్లెలి జ్ఞాపకాలే! ఏ పుస్తకాన్ని ఆశ్రయించినా ఆమె రూపమే ఎదుట ఉపస్థితి. ఇంక… దు:ఖోపశమనం కోసం ‘తెలంగాణ భాష – క్రియారూపాలు’ అనే పుస్తక రచనలో తలమునకలయ్యాను. అది మార్చి మాసాంతానికి పూర్తయిపోయింది. ఐనా… నిదుర రాదు. సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వాళ్ళు ఒక బెంగాలీ నవల తెలుగు అనువాదాన్ని ఎడిట్ చేయమన్నారు. ఒప్పుకున్నాను. అది దేబేశ్ రాయ్ గారి ‘తీస్తా పరేర్’ నవల. 850 పేజీలు. మద్దిపట్ల సూరి అనువాదం. అది పూర్తి చేశాను. ఈలోపు పత్తిపాక మోహన్ నేషనల్ బుక్ ట్రస్టు, ఢిల్లీకై బాలసాహిత్యంలో ‘సముద్ర శాస్త్రజ్ఞురాలు’ అనే మలయాళ పుస్తకం అనువదించమన్నాడు. అది మరీ చిన్నది కనుక ఓ గంటలో అయిపోయింది.

దు:ఖోపశమనం కోసం ‘తెలంగాణ భాష – క్రియారూపాలు’ అనే పుస్తక రచనలో తలమునకలయ్యాను. అది మార్చి మాసాంతానికి పూర్తయిపోయింది. ఐనా… నిదుర రాదు.

మోహన్ ఏనాటి నుండో ఎన్.బి.టి.కి ఏదైనా ఒక పుస్తకం తర్జుమా చేయండి అంటూ అడుగుతూనే వున్నారు. మరలా అడిగాడు. ఈసారి ‘మహాభారతంతో ద్రౌపది పాత్ర’ అనే ఆర్.హరి గారి మలయాళ గ్రంథం పంపించాడు. ఇష్టమైతేనే అనువదించమన్నాడు. నిద్రలేమి మునుపటిలాగనే కొనసాగుతున్నది. గోరువెచ్చెని నీళ్ళ స్నానం రాత్రిపూట, గోరెచ్చని పాలు తాగటం రాత్రిపూట, ధ్యానం, ఇష్టమైన సంగీతం… ఊహూ.. దేనికీ లొంగడం లేదు ఇన్సోమ్నియా. ఇందాకటిలాగే పగలంతా మా చెల్లి జ్ఞాపకాలు. అందుకని పత్తిపాక ప్రతిపాదనకు సమ్మతించాను. ఆ పుస్తకం దాదాపు 200 పేజీలు. అనువదించి పంపాను.

‘అబలా జీవితం’ పై నాకు తెలిసి నేను రాసినదే మొదటి వ్యాసం` చేసినదే ప్రథమ ప్రసంగం.

తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న ముఖ్యంగా జయప్రకాశ్ నిర్వహిస్తున్న ‘కావ్యగానం’లో నా ‘సుద్దముక్క’ వచన కవితా సంపుటి గురించి మాట్లాడాను. దాదాపు ఇప్పటివరకు జరిగిన కావ్యగాన పరంపరల్లో ఒక నాలుగైదు కావ్యాలకే నాలుగు వందల పై చిలుకు వీక్షకులున్నారు. అందులో నా ‘సుద్దముక్క’ ఒకటి. ఈ ‘సుద్దముక్క’ కవిత రమేష్ బాబు అప్పట్లో నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో వేశాడు. ఆ తదనంతరం ఒక నెలలో 23 జామ్ మీటింగుల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందులో పన్నెండింటిలో నేను ప్రసంగించాను. ముఖ్యంగా మాడభూషి సంపత్కుమార్ గారు నిర్వహించే చెన్నై కార్యక్రమంలో మొత్తంగా నా సాహితీ ప్రస్థానం గురించి మాట్లాడాల్సి వచ్చింది. దీనికి మంచి స్పందన వచ్చింది.

ఈ సంవత్సరమే పి.వి. గారి శతజయంతి సమాపనోత్సవాలు కనుక వారు మరాఠీ నుండి అనువదించిన ‘అబలా జీవితము’ (హరి నారాయణ ఆప్టే) నవలను ఆసాంతం అంటే 724 పేజీలను సెల్లులో చదివి ఒక వ్యాసం రాసి ఒక ప్రసంగం చేసి, ఆకాశవాణి కేంద్రం వారిక్కూడా ఒక ప్రసంగం చేశాను. ‘అబలా జీవితం’ పై నాకు తెలిసి నేను రాసినదే మొదటి వ్యాసం` చేసినదే ప్రథమ ప్రసంగం.

ఐతే… ఈ జూముల వల్ల మా సోదరి స్మృతులు, విస్మృతులు అవుతాయనుకుంటే, చిత్రంగా ఒక నెలలో 23 సభలు పాల్గొన్న కారణంగా మెదడు బాగా యాక్టివ్ అయిపొయి నిద్రే రావడం లేదు. పగలంతా ఏదో ఓ వ్యాసంగం ఎప్పుడూ వుండేదే!

ఈ పని చేయడం ద్వారా కలిగిన లాభం ఏంటంటే… ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి కథా రచయిత జి.రాములు గారు కాదనీ, ఆవునూరి వేణుగోపాలరావు గారు ‘కుమిదుని’ కథను 1932లోనే రాశారనీ కనిపెట్టాను.

ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన గాయంతో ఆ వ్యాసంగం మరింత అధికమైంది. నాకు తెలిసిన పదునాల్గు భాషలు ముందర వేసుకుని తులనాత్మకంగా కొన్ని వ్యాసాలు రాద్దామని ప్రణాళిక వేసుకున్నాను. రెండు రాసాను. పత్రికల్లో వచ్చాయి. కానీ ఆ ప్లాను ముందుకు సాగలేదు. కారణం… రంగినేని మోహన్రావు గారి ట్రస్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కథాసంకలనం వేయ సంకల్పించింది. దాని సంపాదకమండలిలో నేనూ ఓ సభ్యుణ్ణి! ఇంకేం… నడుములు విరిగే పని. అయితే… ఈ పని చేయడం ద్వారా కలిగిన లాభం ఏంటంటే… ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి కథా రచయిత జి.రాములు గారు (1942లో రాశారు) కాదనీ, ఆవునూరి వేణుగోపాలరావు గారు ‘కుమిదుని’ కథను 1932లోనే రాశారనీ కనిపెట్టాను. ఈ విషయమై ఒక వ్యాసం ఇంకారాయల్సే వుంది. అన్నట్లు… ‘నిజామాబాద్ జిల్లా భాషా ప్రత్యేకతలు’ అని ఒక కొత్త వ్యాసం పత్రికలో వచ్చింది. దాన్ని నంది శ్రీనివాస్ చక్కగా వాళ్ళ తెలుగు దళంలో విజ్వలైజు చేశాడు.

‘జీవనకాంక్ష’ అంటూ నేను రాసిన పద్యాలను స్వయానా పియానో వాయిస్తూ పాడాను. నంది శ్రీనివాస్ దాన్ని మరలా విజ్వలైజ్ చేశాడు.

నేను అడపాదడపా పోయట్రీ రాస్తాను. ఆ ప్రక్రియను సీరియస్ గా తీసుకుని రాస్తున్నవాడిని కాను. ఐతే ‘రాపిడి’ పేరుతో నేను రాసిన ఓ కవిత ఆంధ్రజ్యోతి ‘వివిధ’లో అచ్చయింది. దు:ఖసమయాల్లో కాలం తొందరగా గడవదు. కరోనా వుండనే వుంది. భయాందోళనల పరిస్థితి. వార్తాపత్రికల్లోనూ, టీవీ మాధ్యమాల్లోనూ, చావుల రుతువు. ‘జీవనకాంక్ష’ అంటూ నేను రాసిన పద్యాలను స్వయానా పియానో వాయిస్తూ పాడాను. నంది శ్రీనివాస్ దాన్ని మరలా విజ్వలైజ్ చేశాడు. దానికి చక్కని రెస్పాన్స్ వచ్చింది.

 

ఎప్పుడో 2010లో నా ‘భారతీయ కథలు’ అనే అనువాద కథాసంకలనాన్ని జూలూరు గౌరీశంకర్ వేసారు. ఆ తర్వాత నా అనువాద కథలు మరలా రాలేదు. కానీ ఈ పదేళ్ళలో పత్రికల్లో చాలా వచ్చాయి. వాటిని ‘చలనాచలనం’ పేరున పుస్తకం తెచ్చాను. అందులో మొదటి కథే నాది. మిగిలినవి అనువాదాలు.

నిజాం వెంకటేశం గారు ఇచ్చిన రాబర్ట్ షెల్లర్ పుస్తకం ‘టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, బట్ టఫ్ పీపుల్ డూ’ మరలా రెండుసార్లు చదివాను. గొప్ప పుస్తకం. సానుకూల ఆలోచనా విధానాలకు దాదాపు మూలగ్రంథం.

అన్నట్లు… వరంగల్ కాళోజీ పౌండేషన్ వాళ్ళు ఈ ఏడు నాకు కాళోజీ అవార్డు ఇచ్చారు. ఇది నన్ను బాగా ఆనందింపచేసిన అనుభవం. ఈ సంవత్సరం చదివిన పుస్తకాలకు లేక్కే లేదు. ముఖ్యంగా నిజాం వెంకటేశం గారు ఇచ్చిన రాబర్ట్ షెల్లర్ పుస్తకం ‘టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, బట్ టఫ్ పీపుల్ డూ’ మరలా రెండుసార్లు చదివాను. గొప్ప పుస్తకం. సానుకూల ఆలోచనా విధానాలకు దాదాపు మూలగ్రంథం.

ఇక, ఆత్మీయ మిత్రుడు వేముల సత్యనారాయణతో దాదాపు నిత్యం సంభాషణలు. మద్దికుంట లక్ష్మణ్, అన్నవరాలతో ముచ్చట్లు. ఇవన్నీ నా గాయాల లేపనాలు. ఇక… ఈ వారం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘సాహితీ సోపతి’ కరీంనగర్ పుస్తకాలు ఓ స్టాల్లో పెట్టడం మరపురాని అనుభూతి.

కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. అప్పుడప్పుడు లోతైన గాయాలు చేస్తుంది. కానీ రచనా వ్యాసంగం, సత్సాంగత్యం, సంగీతం మొదలైనవి మళ్ళీ మనల్ని మునుపటిలా చిగురింపజేసి నిత్యనూతనులను చేస్తాయనడంలో సందేహమే లేదు.

More articles

2 COMMENTS

  1. సాహిత్యం మనిషి ని కాపాడుతుంది అనడానికి మీరు నిదర్శనమైనా రు. Congrats sir

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article