Editorial

Monday, December 23, 2024
Peopleయండమూరి తాజా పుస్తకం : ప్రభు పాద 'అంతర్దర్శనం'

యండమూరి తాజా పుస్తకం : ప్రభు పాద ‘అంతర్దర్శనం’

“ఎవరు ఇతడు? అందమైన వాడు. ఆనందం మనిషైన వాడు. కృష్ణ జపం పెదవులపై నిలిపినవాడు. జీవితాన్ని ప్రేమించిన వాడు. జీవించడం తెలిసినవాడు. వైష్ణవాన్ని వైజయంతిపై నిలిపినవాడు. నవనవోజ్వల ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు”.

యండమూరి వీరేంద్రనాథ్ 

జన్మాష్టమి. ఈ సందర్భంగా ఇస్కాన్ వారు 8 మంది భారతీయ రచయితలకు, శ్రీల ప్రభుపాద జీవితచరిత్రని ఎనిమిది భాషల్లో వ్రాసే పని అప్పచెప్పారు. తెలుగులో ఆ భాద్యత నాది. అయితే, నేను అనువాదం చేయననీ, స్వేచ్ఛగా వ్రాస్తాననీ వారికి చెప్పాను. దానికి ఉదాహరణ గా….తన గురుదేవులు భక్తీ సిద్దాంత సరస్వతి జయంతి సందర్భంగా శ్రీల ప్రభుపాద వ్రాసిన బెంగాలీ కవితకి ఇది స్వేచ్ఛానువాదం…

“గురుదేవా… మీ సామీప్యం
గోకులం వెన్నలా స్వచ్చంగా ,
శరత్కాలo వెన్నెలలా చల్లగా,
గోవర్ధన గిరిలా అండగా.
మీ దూరం రాధ విరహం, ఆశిస్సు బృందావన సమీరం.
మీ సూక్తి జ్ఞాన యమునా జలధార. మీ వాక్కు మాపై అమృత వర్షధార”.

ఎల్లుండి… అంటే.. సెప్టెంబర్ 1న, కృష్ణాష్టమి తరువాతి రోజు, ప్రభుపాద పుట్టినరోజు.

ఎల్లుండి… అంటే.. సెప్టెంబర్ 1న, కృష్ణాష్టమి తరువాతి రోజు, ప్రభుపాద పుట్టినరోజు. ఈ 8 భాషల పుస్తకాలూ భారతప్రధానితో ఆవిష్కరింప చేయాలనీ, జన్మాష్టమికల్లా వ్రాతపతిని అందజేయ్యమనీ ఇస్కాన్ వారు కోరారు. 5౦౦ పేజీలు రాత్రింబవళ్ళు కూర్చుని వ్రాసి (మధ్యలో రెండు సినిమాలు పూర్తి చేసి ) నిన్న వెళ్లి అందజేస్తే తెలిసిందేమిటంటే మిగతావారు ఇంకా సగంలోనే ఉన్నారట.

ఇది వ్యక్తి పూజ పుస్తకంగా కాదు- వ్యక్తిత్వ వికాస పుస్తకంగా వ్రాస్తానని వారికి స్పష్టంగా చెప్పాను. దానికి ఉదాహరణ, ఈ బ్యాక్-పేజి మాటరు…

రెండుసార్లు గుండెనొప్పి వచ్చినా ఆ విషయమే మర్చిపోయి ఆ తరువాత దాదాపు వెయ్యి సభల్లో పాల్గొన్న ఒక నిరంతర శ్రామికుడి విజయ గాథ ఇది.

స్వంత ఖర్చులతో కృష్ణచరిత్ర ప్రింటు చేయించి ఫుట్ పాత్‌ల మీద అమ్ముతూ వడదెబ్బకి స్పృహ తప్పి పడిపోయిన ఒక సామాన్యుడి గాథ ఇది. చేతిలో పైసా లేకుండా పడవెక్కి విదేశాలకు వెళ్ళిన ఒక యాత్రికుడి కథ ఇది. రెండుసార్లు గుండెనొప్పి వచ్చినా ఆ విషయమే మర్చిపోయి ఆ తరువాత దాదాపు వెయ్యి సభల్లో పాల్గొన్న ఒక నిరంతర శ్రామికుడి విజయ గాథ ఇది. కొన్ని వందల పుస్తకాలు వ్రాసిన చరిత్రకారుడి జీవిత కథ ఇది. వందల మందిరాలు కట్టిన శిల్పి కథ ఇది. అలుపూ సొలుపూ లేకుండా హనలులూ నుంచి ఆఫ్రికా వరకూ, కెనడా నుంచి న్యూజిల్యాండ్ వరకూ తిరుగుతూ ఉపన్యాసాలిచ్చిన నిరంతర శ్రామికుడి స్వేద జల చరిత్ర ఇది. అభయ్ చరణ్ గా పుట్టి భక్తి వేదాంతస్వామిగా పరివర్తనం చెంది, శ్రీల ప్రభుపాదగా ఉన్నత శిఖరాన్ని అందుకున్న ఈ మహనీయుడు ప్రతీ వ్యక్తికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తారు.

ఈరోజు ప్రపంచమంతా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయoటే, వాటి నిర్మాణం వెనుక ఎంతమంది కష్టపడ్డారో, ఎన్ని నిష్టూరాలు, ఎందరి శిష్యుల కష్టనష్టాలూ, భావోద్వేగాలూ ఉన్నాయో ఊహించలేం.

ఈ రోజు ప్రపంచమంతా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయoటే, వాటి నిర్మాణం వెనుక ఎంతమంది కష్టపడ్డారో, ఎన్ని నిష్టూరాలు, ఎందరి శిష్యుల కష్టనష్టాలూ, భావోద్వేగాలూ ఉన్నాయో ఊహించలేం. వైష్ణవిజం ఉన్నంతకాలం-ప్రజల్లో కృష్ణ భక్తి నిలిచినంత కాలం- శ్రీల ప్రభుపాద పేరు కూడా నిలిచే ఉంటుంది.

ఈ పుస్తకపు ఆఖరి పేజీ ఈ విధంగా సాగుతుంది..

ఒకచోట బాలగంగాధర తిలక్ అoటాడు: “అమృతం కురిసిన రాత్రి-అందరూ నిద్ర పోతున్నారు. ఆకాశం మీద అప్సరసలు నన్ను చూసి చూసి కిల కిల నవ్వి ఇలా అన్నారు- ‘చూడు వీడు. అందమైన వాడు. ఆనందం మనిషైన వాడు. కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు”.

అదే శ్రీల ప్రభుపాద గురిoచి చెప్పవలసి వస్తే: “ఎవరు ఇతడు? అందమైన వాడు. ఆనందం మనిషైన వాడు. కృష్ణ జపం పెదవులపై నిలిపినవాడు. జీవితాన్ని ప్రేమించిన వాడు. జీవించడం తెలిసినవాడు. వైష్ణవాన్ని వైజయంతిపై నిలిపినవాడు. నవనవోజ్వల ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు”.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article