Editorial

Monday, December 23, 2024
సంపాద‌కీయంఅధిష్టాన తెలంగాణ - స్వీయ రాజకీయ విఫల తెలంగాణ

అధిష్టాన తెలంగాణ – స్వీయ రాజకీయ విఫల తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నట్టు కానవస్తున్న తరుణంలో తిరిగి ‘అధిష్టానం’ అన్నది కీలకం కాబోతుండటం గమనార్హం. ఒక నాటి స్వీయ రాజకీయ అస్తిత్వం స్థానంలో మళ్ళీ డిల్లి కేంద్రంగా రాజకీయాలు ఊపందుకునే పరిస్థితే ఉంది. కాకపోతే, ప్రస్తుతానికి అన్ని పార్టీలనూ నడిపించే ‘అధిష్టానం’ మరెవరో కాదు, కేసీఆర్ మాత్రమే అని ఒప్పుకోక తప్పదు.

కందుకూరి రమేష్ బాబు

నేడు ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిక కావొచ్చు, నేడో రేపో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డో మరొకరో ఖాయం కావడమూ కావొచ్చు, ఇక కెసిఆర్ ని ఎదుర్కొనేందుకు రెండు ప్రధాన పార్టీలు బలమైన వ్యూహాలతో ముందుకు పోవడానికి సర్వదా సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ ని ఎదుర్కునేందుకు బలమైన ప్రత్యామ్నాయం, స్వతంత్ర కార్యాచరణ, స్థానిక నేతల నిర్ణయాలతో కూడిన ఒకానొక కనీస ప్రభలశక్తి ఏర్పడుతుందని ఎవరైనా అనుకుంటే ఆ ఆశలు పూర్తిగా వీగిపొయాయి. ప్రస్తుతం కేసీఆర్ కి పోటీగా ఎదురొడ్డి నిలుస్తాడనుకున్న ఈటెల బిజేపీలో చేరడంతో ఆ బలమైన సదవకాశం తెలంగాణ కోల్పోయినట్టే. దాంతో స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నది పక్కదారి పట్టినట్టే. కాగా, ఇక్కడే ఇంకొక అశం ఇక్కడ చెప్పుకోవలసి ఉన్నది.

సన్నిహిత సమాచారం ప్రకారం ఈటెల రాజీనామా కన్నా ముందే సుమారు వందకు పైగా తెలంగాణ ఉద్యమకారులు, వ్యక్తులు, శక్తులు, పాత్రికేయ ప్రముఖులు ఒక అంతర్జాల చర్చ జరిపినట్లు తెలిసింది. ప్రొ. కోదండరాం గనుక తన రాజకీయ పార్టీని, వ్యక్తిగత పోరాట బాటను పక్కన పెట్టి గనుక నేతృత్వం వహిస్తే, కేసేఆర్ ని ఎదుర్కునే ఒక ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేయలన్నది ఆ సన్నాహక చర్చ సారాంశం. కానీ, ఈ వేదికలో ఈటెల చేరి ఉంటే అది నిజంగానే బలమైన వేదిక అయ్యే అవకాశం ఉండేది. కానీ, ఈటెల అటు సొంత పార్టీ పెట్టుకోకుండా – ఇటు వేదిక ఆలోచన బలపర్చకుండా విధిలేక బెజీపిని ఆశ్రయించడంతో ఆ ఆశలు కూడా నీరుగారాయి.

నిజానికి తెలంగాణ ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు జేఏసి గనుక ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్యాయంగా ముందుకు వచ్చి ఉంటే తెలంగాణకు ఈ గతి ఉండెదే కాదు. అప్పుడు కూడా కేసీఆర్ కనుసన్నల్లో, తానే అధిష్టానంగా ఉండటంతో జేఏసి నిలదొక్కు కోలేకపోయింది. ఇప్పుడు ఆ దిశలో మరో ప్రయత్నం మొదలైనప్పటికీ అది ఆశాజనకంగా ఉండేది కష్టమే.నేడు నిరసనతో ఉన్న తెలంగాణా శక్తులన్నీ సమీప భవిష్యత్తులో ఒక వేదికగా ఏర్పాటై ప్రజల గొంతుకగా మారే అవకాశం ఇప్పట్లో కష్టమే. ఉంటే గింటే అది కోదండరాం రాజకీయ మనుగడ గురించి ఆలోచించడం వదిలేసి ప్రజలు పునాదిగా ఒకనాటి కోదండరాంగా ప్రజలే జనశక్తిగా భావించి పని చేయడానికి నడుం కట్టడం అవసరం. కాకపోతే కేసీఆర్ ఎట్లా ఒక్కొక్కరినీ తన కార్యరంగంలోకి కవ్వించి ఆహ్వానించి వారి భవిశ్వత్తును సమాధి చేస్తారో ఆయనకూ బాగా తెలిసిపాయింది గనుక తానూ ఒక్కడిగా ఏమీ చేయలేని స్థితి.

ఇక ఈ వ్యాసం ఉద్దేశించిన కోణానికి వస్తే, ఎవరు సిసలైన అధిష్టానం అని! ప్రస్తుతం ఈటెల గానీ బండి సంజయ్ గానీ కేంద్రంలోని అధిష్టానం చెబితేనే కదిలే పరిస్థితి. వీళ్ళు కేసీఆర్ ని ఎంత వరకు కట్టడి చేయాలీ అన్నది బిజెపి అధిష్టానం తమ రాజకీయ వ్యూహాన్ని బట్టే నిర్ణయిస్తుంది కనుక ఈటెలతో సహా అందరూ డిల్లీ వైపు చూడవలసిందే లేదా నాగపూర్ వైపు చూడ వలసిందే. విషాదం ఏమిటంటే ఏ క్షణంలో నైనా కేసీఆర్ మోడిని ప్రసన్నం చేసుకుని స్థానిక బిజెపి నేతలకు తానే అనధికార అధిష్టానం కావడమూ విస్మయం కలిగించే అంశం కానే కాదు.


ఇక కాంగ్రెస్ గురించి చెప్పనవసరం లేదు. అన్ని విధాలా చతికిల పడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి ఎన్నిక విషయంలోనే ఆపసోపాలు పడే స్థితిని బట్టి, ఆ పార్టీ తెలంగాణాలో తిరిగి జవసత్వాలు పొందాలంటే అందులో ఉన్న నేతలకు కార్యక్రమం ఇవ్వడంలో మళ్ళీ తగిన వ్యక్తి కేసీఆర్ యే. వారిని అంతో ఇంతో చేతనలోకి తేవాలంటే స్వయంగా కేసీఆర్ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టే గట్టి రాజకీయ కార్యాచరణ ఎంతమాత్రమూ లేదు కనుక అది కూడా కేసీఆర్ కదలికలపై నడిచే పార్టీయే అవుతుంది తప్పా మరొకటి కాదు. అట్లా కాంగ్రెస్ కు కూడా అధిష్టానం కేసీఆర్ అవుతాడు.

ఇక చివరకు ఈటెల బిజెపిలో చేరిన ఈ ఉదయం చంద్రబాబు అధిష్టానంగా బతికిన టిడిపి రమణ నేడు పార్ట్టీ చివరి ప్రాణాన్ని కూడా తానే గొంతు నులిమి తిరిగి కేసీఆర్ నే తన అధిష్టానంగా చేసుకునే స్థితిలో ఉండటం చూస్తూనే ఉన్నాం.

ఇక మిగిలింది ప్రజలు… ఆ ప్రజలను కూడా తన అధిష్టానం అని భావించని కేసీఆర్ ఒక్కరే… ప్రజలను కేవలం ఓటర్లు, లబ్దిదారులుగా మార్చివేసిన ఏకైక అధిష్టానం ఆయనే. నేటి పరిణామాలన్నిటిలో వారే పై చేయిలో ఉండటం తాజా స్థితి. కాదనలేని వాస్తవం.

ప్రజలను కేవలం ఓటర్లు, లబ్దిదారులుగా మార్చివేసిన ఏకైక అధిష్టానం ఆయనే. నేటి పరిణామాలన్నిటిలో వారే పై చేయిలో ఉండటం తాజా స్థితి. కాదనలేని వాస్తవం.

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article