అక్టోబర్ 24న కర్నూల్ జిల్లా నందవరంలో జరిగిన చేనేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.
ఆత్మ గౌరవ ప్రకటనలో స్వీయ అస్తిత్వం ఎంత ముఖ్యమో తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో తెలుగుతల్లి మాదిరే తెలంగాణ తల్లి ఆవిష్కారం కావడం చూశాం. అలాగే దళితులతో పోలిస్తే బహుజనుల్లో, అత్యధిక జనసంఖ్య గల వెనుకబడిన తరగతుల్లో ఆయా కులాలు తమ ఉనికిని, ఆత్మ గౌరవ ప్రకటనని, నైపుణ్యం కౌశలాన్ని, తమ పురాణ ఐతిహేసిక గాథల నుంచో చారిత్రక దశల నుంచో ఒక మూర్తిమత్వాన్ని రూపొందించుకోవడం అరుదే. తమ మూలాలను తడుముతూ ఒక కళగానూ అదే మాదిరి రాజకీయ చైతన్యం దాకా వివిధాలుగా ప్రకటించుకోవడం బహు తక్కువే. ఇటీవల ఆవిష్కారం ఐన ఈ చేనేత తల్లి ఆ దిశలో ఒక విస్మయమే.
అనంతపురంకు చెందిన విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు ఈ ‘శ్రీ చేనేత కళామతల్లి’ చిత్రాన్ని రూపొందించారని, అది అక్టోబర్ 24న కర్నూలులో జరిగిన చేనేత రౌండ్ టేబుల్ సమావేశంలో ఆవిష్కారం ఐనదని పేర్కొంటూ రాపోలు జగన్ సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రాన్ని పంచుకున్నారు.
ఈ నవ్య ప్రయత్నానికి అభినందనలు. చేనేత కళామతల్లికి అభివాదాలు తెలుపు.