Editorial

Wednesday, January 22, 2025
స్మరణజయంతికళాపిపాసి భరత్ భూషణ్ : వివి

కళాపిపాసి భరత్ భూషణ్ : వివి

గత ఏడాది జనవరి 31 కాలం చేసిన ప్రసిద్ధ ఛాయా చిత్రకారులు శ్రీ గుడిమళ్ళ భారత్ భూషణ్ పుట్టిన రోజు నేడు. వారి స్మారకార్థం ‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట స్మారక సంచిక సిద్దం అవుతున్నది. ఈ ప్రత్యేక  సంచిక కోసం వరవరరావు గారు రాసిన ఆత్మీయ వ్యాసం ఆ కళాకారుడి స్మృతికి తెలుపు అపురూప నీరాజనం.

వరవరరావు 

భరత్ భూషణ్ 1972-74 విద్యా సంవత్సరంలో సి.కె.ఎమ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1968లో చందా కాంతయ్య స్మారక కళాశాలగా మొదట వరంగల్‍లోని ఆంధ్ర విద్యాభివర్ధిని జూనియర్ కాలేజీ. సాయంకాలాలు నడిచిన ఈ కాలేజీ 72 నాటికి తన స్వంత భవనం నిర్మించుకొని వరంగల్ పొలిమేరల్లోని దేశాయి పేట గ్రామానికి మారింది. కళాశాల తరఫున ఒక వార్షిక సాహిత్య పత్రిక వెలువరించాలని సంకల్పించి ముఖచిత్రం కవర్ డిజైన్ వేయడానికి విద్యార్థులలో కళాకారుల కోసం అన్వేషించినపుడు భరత్ భూషణ్ ముందుకొచ్చాడు. బహుశా అప్పుడు అతను 16 ఏళ్ల కౌమార్యంలో ఉన్నాడు. చిదిమితే పాలు కారేంత స్ఫురద్రూపిగా కూడా వున్నాడు. కవర్ డిజైన్ చేసి ఆయన రాసిన “చైతన్య” అనే అక్షరాలు ఇప్పటికీ నా కళ్ళలో ఆడుతున్నాయి. గుండ్రంగానూ, పలకలుగానూ కాకుండా అక్షరాలనిట్లా దూరం నుంచి కనిపించే సూర్యగోళంలా రాసి “చైతన్య” కిరణాలను స్ఫురింప చేసానని చెప్పాడు. అతను కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు అభ్యాసంతో పాటు, ఊహ సృజనాత్మక దృష్టి వున్నవాడు అనిపించింది.

భరత్ భూషణ్ కళాకారుడిగా వికసించిన కాలం నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు సెట్ బ్యాక్‍కు గురై, ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లుగా మళ్ళీ వికసిస్తోన్న కాలం.

అట్లా ఏర్పడిన అనుబంధం నాకు ఆయన జీవితాంతం కొనసాగింది. గత నాలుగు సంవత్సరాలలో కూడా ఆయన ఆరోగ్య ఆర్థిక కుటుంబ స్థితిగతుల గురించి నా సహ అధ్యాపకుడు మా యిరువురి చిరకాల మిత్రుడు జీవన్ కుమార్ ద్వారా తెలుస్తూనే వున్నది. ఆయన మరణ వార్త జీవన్ ద్వారా తెలిసింది. ఆంధ్ర జ్యోతిలో జీవన్ రాసిన జీవన రేఖలు ఆయన కళా సృజన గురించి రూపుకట్టినట్లుగా వుంది. జీవన్ రాసిందాని కన్నా నేను రాయగలిగిందేమీ లేదు. భరత్ భూషణ్ ఆ కాలేజీ నుండి వెళ్లిపోయాకనే జీవన్ ఇంగ్లిష్ లెక్చరర్ గా వచ్చినప్పటికి మా కాలేజీతో సంబంధాలలో వున్న భరత్ భూషణ్ ఆయన ప్రాణమిత్రుడయ్యాడు. ఒక విధంగా జీవన్ ఆయనకు “ఫ్రెండ్ ఇన్ నీడ్”. నాకు భరత్ భూషణ్ కు మధ్య అనుబంధం నిరంతరం కొనసాగడానికి జీవన్ ఒక సజీవ సంబంధం.

రత్ భూషణ్ వృత్తి వల్ల, ప్రవృత్తి వల్ల కూడా కళాకారుడిగా జీవించడం ఎంచుకున్నాడు. చిత్రకారుడిగా నాకు పరిచయం అయిన భరత్ భూషణ్ ఆశ్చర్యంగా ఎంచుకొన్న కళ ఫోటోగ్రఫి. బహుశా సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ హైదారాబాద్ లో స్థిరపడిన రాజన్ బాబు ప్రభావం కావొచ్చు. వరంగల్ కు ఫోటోగ్రాఫర్ల సంప్రదాయ పరంపర ఉన్నది.

ఇంటర్మీడియట్ పూర్తి చేయగానే సహజంగానే భరత్ భూషణ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేయడానికి హైదరాబాద్ వెళ్లిపోయాడు. వరంగల్ రైల్వే గేట్ ఆవల స్వంత ఇల్లు ఉన్న ఆయన కుటుంబం అప్పటి ప్రమాణాల ప్రకారం ఎగువ మధ్య తరగతి కుటుంబం. నాకు పరిచయం అయ్యేనాటికే ఆయన అన్న డాక్టరు. అక్క చెల్లెళ్ళు విద్యావంతులు. బహుశా విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. భరత్ భూషణ్ వృత్తి వల్ల, ప్రవృత్తి వల్ల కూడా కళాకారుడిగా జీవించడం ఎంచుకున్నాడు. చిత్రకారుడిగా నాకు పరిచయం అయిన భరత్ భూషణ్ ఆశ్చర్యంగా ఎంచుకొన్న కళ ఫోటోగ్రఫి. బహుశా సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ హైదారాబాద్ లో స్థిరపడిన రాజన్ బాబు ప్రభావం కావొచ్చు. వరంగల్ కు ఫోటోగ్రాఫర్ల సంప్రదాయ పరంపర ఉన్నది. నైజాం వ్యతిరేక ఉద్యమంలో జనగామ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన బిట్ల నారాయణ పోరాట విరమణ తర్వాత వరంగల్ లో తన చిన్న కొడుకు పేరు మీద రవి ఫోటో స్టూడియో అని పెట్టుకొన్నాడు. ఇప్పుడుందో లేదో కానీ జె.పి.ఎన్ రోడ్డులో ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళి బిట్ల నారాయణ గారు తెప్పించే స్టీలు గిన్నెలో స్టీలు గ్లాస్ పెట్టి యిచ్చే టీ తాగని సాహిత్య, రాజకీయ కళాజీవి ఎవరూ వుండరు. పాములపర్తి సదాశివరావు, కాళోజీలకైతే ఆయన శిష్యుడిలాంటి మిత్రుడు.

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని తన చిత్రాల వల్ల (ఇలస్ట్రేషన్స్) ప్రపంచానికి పరిచయం చేసిన చిత్తప్రసాద్, తన ఫోటోల వల్ల పరిచయం చేసిన సునీల్ జానాల ప్రభావం వల్ల అనుకుంటాను ఆ పోరాటంలో పాల్గొన్నవారి కుటుంబాల నుంచి వచ్చినవారు చాలామంది చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు అయ్యారు.

భరత్ భూషణ్ కళాకారుడిగా వికసించిన కాలం నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు సెట్ బ్యాక్‍కు గురై, ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లుగా మళ్ళీ వికసిస్తోన్న కాలం. ముఖ్యంగా వరంగల్‍లో కొండపల్లి సీతారామయ్య, కె. జి. సత్యమూర్తుల కాలంలో 1968 నుంచే వీచిన ఆ గాలులు 72, 73ల నాటికి ప్రాణం పోసుకుంటున్నాయి.

ఒక ఫోటోగ్రాఫర్ ముఖ్యంగా ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకొన్నప్పుడు అది కూడా స్టూడియోకి పరిమితం కాకుండా అవుట్ డోర్ కు మాత్రమే కాకుండా సభలు సమావేశాలకు తిరిగి ఫోటోలు తీసే వృత్తి, వ్యావృత్తిగా అలవర్చుకొని అది ప్రవృత్తిలో భాగం అయినపుడు అతడిని ఉద్యమం కూడా తనలో భాగంగానే చూస్తుంది. భరత్ భూషణ్ విశాల ప్రజాస్వామిక అర్ధంలో అట్లా విప్లవోద్యమ సహపథికుడు.

ఫైనార్ట్స్ కాలేజీలో చదువు పూర్తయ్యాక ఆయన హైదరాబాదులో మొదట గాంధీ భవన్ దగ్గరో మరెక్కడో ఫోటో స్టూడియో పెట్టుకున్నాడో కానీ నా జ్ఞాపకంలో మాత్రం వైఎంసిఏ పక్కన పెట్టిన డాజిల్స్ ఫోటో స్టూడియో మాత్రం వుంది. అయితే ఆయన జీవితంలో వేయబడిన దారుల్లో కాకుండా ఆయన వేసుకొన్న దారుల్లో నడవలని కోరుకొన్న సాహసి. ఈ ఫోటో ల్యాబ్‍లో ఫిల్మ్ లు కడిగి ఆరవేసే పనుల్లో కానీ ఇతరత్రా స్టూడియోకి సంబంధించిన పనుల్లో కానీ సహకరించడానికి దగ్గర బస్తీలోని శ్రామికవర్గం నుండి వచ్చిన మహిళ సుభద్రను నియోగించుకున్నాడు. ఇద్దరి మధ్యా శ్రమలో వికసించిన ప్రేమ సహజీవనానికి దారి తీసింది. ఇది ఆయన తన కుటుంబం మీద చేసిన మొదటి తిరుగుబాటు బహుశా వ్యవస్థ మీద కూడా. న్యాయంగా కుటుంబం నుంచి రావాల్సిన ఆస్తికి కూడా ఎన్నో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఇంక ఆయన జీవితం అంతా ఓ ఘర్షణ, సంఘర్షణ, ఓ పెనుగులాట. ‘డాజిల్స్’ ఇంక ఆయన కెమెరా క్లిక్ మంటే ప్రకాశించవలసిందే తప్ప అప్పటి నుంచి ఆయన ఒక చలన నిశ్చల చిత్రకారుడే.

భరత్ భూషణ్ ఫోటోగ్రఫి ఒక సృజనాత్మక రచనలాగ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. చూపు కెమెరాలో వుండదు, కళాకారుడి చూపులో వుంటుందని మాకందరికి అనిపించింది, 1979 వరంగల్ లో జరిగిన సాహిత్య పాఠశాలలో ఆయన తీసిన ఫోటోలు చూసినపుడు. కె. జి. సత్యమూర్తి (శివసాగర్) జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చిన తర్వాత మొదటిసారి పాల్గొన్న విరసం సభలవి, త్రిపురనేని మధుసూదనరావు, సంపత్ కుమార, ఎస్. ఎమ్ తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికీ నా కళ్ళల్లో ఆడుతున్నాయి. 1988 డిసెంబర్-1989 మార్చిలో నేను జైలు నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్‌కు రాసిన లేఖలకు వాడుకొన్నవన్నీ ఆయన తీసిన ఫోటోలే.

ఇంక కాళోజీ అయితే భరత్ భూషణ్ కు ఒక లైఫ్ టైమ్ స్టడీ. వాళ్ళు పరస్పరం ఒకరినొకరు అంత ఇష్టపడ్డారు. నిక్కచ్చితనము, నిజాయితీ విలువల విషయంలో భరత్ భూషణ్ కు కాళోజీ ఒక ఆదర్శం.

ఆ సాహిత్య పాఠశాలలోనే (మొదటిసారి) ప్రజాకళలపై ప్రసంగాలు ఏర్పాటు చేసి ఆ ప్రసంగ పాఠాలు బుక్‍లెట్స్ గా తెచ్చాము. గద్దర్, వంగపండు, అరుణోదయ రామారావు కలిసి దిగిన ఫోటోలు ఆయన తీసినవే.

ఇంక కాళోజీ అయితే భరత్ భూషణ్ కు ఒక లైఫ్ టైమ్ స్టడీ. వాళ్ళు పరస్పరం ఒకరినొకరు అంత ఇష్టపడ్డారు. నిక్కచ్చితనము, నిజాయితీ విలువల విషయంలో భరత్ భూషణ్ కు కాళోజీ ఒక ఆదర్శం. ఒక నమూనా. నాకు తెలిసి కాళోజీవి ఆయన 90 ఫోటోలు తీశాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రభాకర్ ఇంట్లో కాళోజీ కింద గచ్చు మీద కూర్చొని పక్కన చేతికర్ర పెట్టుకొన్న ఫోటో ఎంత ప్రచారం పొందిందో చెప్పలేము.

ఇట్లా మనుషుల పోర్ర్ట్రేట్లు తీస్తే భరత్ భూషణ్ తీయాలని ఎంతగా ప్రచారం వచ్చిందంట్ తర్వాతి కాలంలో ఎందరో ఫోటోలు తీయించుకున్నారు.

అలిశెట్టి ప్రభాకర్ తప్ప జీవితంలో ఇంక ఏ కళాకారుడూ భరత్ భూషణ్ అనుభవించినన్ని కష్టాలు అనుభవించలేదు. అయితే ఆయన క్షయ వ్యాధితో 38 ఏళ్లకే కన్ను మూశాడు. భరత్ భూషణ్ రెండు దశాబ్దాల పైననే క్యాన్సర్ తో బాధపడి ఉంటాడు. ఎన్ని చికిత్సలు, శస్త్ర చికిత్సలు, వాటితో కూడా అతను సహజీవనం గడపవలసి వచ్చింది.

నిజానికి ఫోటో జర్నలిస్టులను బతికించి కాపాడుకోవాల్సిన బాధ్యత పత్రిక యాజమాన్యాలదే. ఆ యాజమాన్యాలను ఒప్పించాల్సిన బాధ్యత సంపాదకులదే. ఆ కర్తవ్యాన్ని అలిశెట్టి ప్రభాకర్ విషయంలో మాత్రమే కాకుండా భరత్ భూషణ్ విషయంలో కూడ నిర్వహించినవాడు ఎ.బి.కె ప్రసాద్.

భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు కూడా అట్లని ఏ పత్రికలో పని చేయకపోవచ్చు కానీ అన్ని పత్రికలు ఆయన ఫోటోలు ప్రచురించాయి. ఆయన స్వయంగా తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కళా విమర్శక వ్యాసాలు రాశాడు. బహుశా ఫోటోగ్రఫి చిత్రకళ గురించి ఒక నిర్దిష్టమైన ఒక విమర్శనాత్మకమైన దృక్పథం ఉన్నవాడే ఆయన. ఆయనలోని ఈ కళా సృజనను కనుగొని గడ్డుకాలంలో ఆయన సృజనను వినియోగించుకొని అండగా నిలిచింది అస్మిత వ్యవస్థాపకురాలు వసంత కన్నభిరన్ అని నాకు తెలుసు. నిజానికి ఫోటో జర్నలిస్టులను బతికించి కాపాడుకోవాల్సిన బాధ్యత పత్రిక యాజమాన్యాలదే. ఆ యాజమాన్యాలను ఒప్పించాల్సిన బాధ్యత సంపాదకులదే. ఆ కర్తవ్యాన్ని అలిశెట్టి ప్రభాకర్ విషయంలో మాత్రమే కాకుండా భరత్ భూషణ్ విషయంలో కూడ నిర్వహించినవాడు ఎ.బి.కె ప్రసాద్.

భరత్ భూషణ్ బ్రతకనేర్చినవాడు కాదు, లౌక్యం తెలియనివాడు. వీటికి తోడు తన అభిప్రాయాలను దాచుకోని విమర్శనాత్మక దృక్పథం కూడా ఆయనకు చాలా కష్టాలు తెచ్చింది. అందుకే తెలంగాణా ఏర్పడిన తర్వాత ఆయన బతుకమ్మకు ప్రభుత్వ ఆదరణ లభించిందంటే నాకు ఆశ్చర్యమే అయింది.
ఆయన ఆరోగ్యం బాగుండి తిరగగలిగినంత కాలం రాష్ట్ర స్థాయిలో జరిగిన విరసం సభల, యితర ప్రజాసంఘాల సభల ఫోటోలు తీశాడు. ముఖ్యంగా 1995లో జిఎన్ సాయిబాబా ఏ.ఐ.పి.ఆర్.ఎఫ్ (అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక) రాష్ట్రస్థాయి బాధ్యత తీసికొన్నప్పటినుంచి ఢిల్లీకి వెళ్ళి కేంద్రకమిటీ బాధ్యతలు నిర్వహించిన 2004 దాకా 9 సంవత్సరాలు హైరాదాబాద్ లో జరిగిన ఆ సంస్థ సభల కవరేజ్ అంతా భరత్ భూషణ్ దే. నిజానికది ఆయన ఫోటోల ద్వారా నిలిచిపోగల చరిత్ర. కానీ 2013లో మొదటిసారి ఢిల్లీలో సాయిబాబా క్వార్టర్ పై మహారాష్ట్ర పోలీసులు దాడి చేసి ఆయన ల్యాప్ టాప్ ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు సాహిత్యము, ఫోటోలు ఎత్తుకుపోయారు. అట్లా విలువైన ఫోటోలు కూడా పోయాయి.

తానుగా భరత్ భూషణ్ కెమెరా ద్వారా చెప్పించే రెండు చరిత్రల రచనకు పూనుకున్నాడు. ఒకటి తెలంగాణ పల్లెలు, దాని ద్వారా తెలంగాణ సామాజిక చరిత్రను ఎంత చదవగలిగితే అంత చదవచ్చు. రెండోది బతుకమ్మ. అది తెలంగాణా సామాజిక, సాంస్కృతిక దర్పణం.

తెలంగాణ పల్లెల అధ్యయనంలో మెదక్, నిజామాబాద్, జిల్లాలలో దిగువ మధ్య తరగతి గూన పెంకల ఇళ్ళు ముఖ్యంగా సాలెల మగ్గాలు పెట్టుకొనే ఇళ్ళు, తలుపులు, గొళ్ళాలువంటివెన్నో ఫోటోలు ప్రసిద్ధమైనవి. మగ్గాలు మూలపడి శిధిలావస్థలో కుంగిపోయిన ఇళ్ళు క్రమంగా అనాదరణకు గురువౌతున్న వృత్తులు, ముఖ్యంగా చేనేత వృత్తి దీన స్థితిని వివరిస్తాయి. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచే బట్టల మిల్లులు వచ్చి అన్నిటికన్నా పెద్ద దెబ్బ చేనేత మీద పడ్డది. ఈ వృత్తిలో పద్మశాలీలు మాత్రమే కాదు, నేతగాని మాలలు, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ ప్రాంతాలలో అయితే అత్యధికులు ముస్లింలు ఎట్లా విధ్వంసానికి గురయ్యారో ఒక్కసారి నేను విశ్లేషించినప్పుడు భరత్ భూషణ్ తన బాధనేదో నేను అర్థం చేసికొన్నట్లుగా ఆనందించాడు.

ఈ అధ్యయనంలో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఓ గోడ మీద “రాడికల్స్ జిందాబాద్” అనే నినాదం కింద ఒక అమ్మాయి నిలబడిన ఫోటో కూడా ఆయన నాకు బహూకరించాడు. అంటే కనీసం ఇప్పటికీ 35 ఏళ్ల కిందటిది అయ్యి వుంటుందది.

కబీర్ దోహాలు ఒరిస్సా, బెంగాల్ లోని ఏక్ తారా బౌల్ జానపద గాయకులు ఈ కలనేత జీవితాలనుంచి వచ్చిన కళలే అని ఆయనకు తెలుసు. కళాభవన్ లో వీటి ప్రదర్శన ఏర్పాటు చేసిన తర్వాత నాకు ఆయనొక యిల్లు ఫోటో బహూకరించాడు. మలక్ పేట నల్గొండ చౌరస్తా లో గాని, తెలంగాణ ఏర్పడ్డాక హిమసాయి హైట్స్ లో గాని మొదట మా యింట్లో ఆ ఫోటో చూసినవారెవరైనా చిన పెండ్యాలలో మీ ఇల్లా సార్ అని అడిగేవారు. 1960 పూర్వం అట్లా ఉండేది, ఇప్పుడు దాని ఆనవాలు కూడా లేదని చెప్పేవాణ్ణి.
ఈ అధ్యయనంలో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఓ గోడ మీద “రాడికల్స్ జిందాబాద్” అనే నినాదం కింద ఒక అమ్మాయి నిలబడిన ఫోటో కూడా ఆయన నాకు బహూకరించాడు. అంటే కనీసం ఇప్పటికీ 35 ఏళ్ల కిందటిది అయ్యి వుంటుందది. ఆశ్చర్యంగా అప్పటి ఆ బాలిక మీడియా మిత్రుడు మల్లేష్ కూతురు అని తెలిసి ఆ ఫోటో ఆయనకు ఇచ్చేశాను.

ఇక భరత్ భూషణ్ బతుకమ్మ అధ్యయనానికి స్పందన, చర్చ, విశ్లేషణ, చాలా వచ్చే వుంటాయి. తెలంగాణలో బతకు మీద కూడా బతుకమ్మ అనే ఒక పండగ ఉంది అని కాళోజీ నారాయణరావు ఒక హృద్యమైన గేయం రాశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక సాంస్కృతిక ఆయుధం అయింది. భరత్ భూషణ్ తెలంగాణాలోని మెట్ట పంటలు, చెరువులు, కుంటల కింద సాగు చెలకల్లో పూసే పూలు వంటి వ్యవసాయ జీవితంలో భాగంగా బతుకమ్మ అధ్యయనం చేశాడు. ఇది ప్రధానంగా మెట్ట వ్యవసాయ జీవుల, ఆ వ్యవసాయ వృత్తులతో సంబంధం వున్న వాళ్ళ పండగ. ప్రజల భూములు శ్రమతో పాటే సంస్కృతిని దురాక్రమణ చేసిన దొరలు కూడ బతుకమ్మను దొరల గడీలో ఆడించారు. దొరల గడీలోనే బతుకమ్మ ఎందుకు ఆడాలి మన యిళ్లలో మనమే ఆడుకుందాం అని సిరిసిల్లలో లక్ష్మి రాజ్యం చేసిన పోరాటం, జగిత్యాలలో భూమి కోసం పోశెట్టి చేసిన పోరాటం గ్రామాలకు విస్తరించింది. దొరలు వాళ్ళని హత్య చేయించడంతో సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలు ప్రారంభమైనవి.

నేను చిత్రకళ గురించి చదివిన వాణ్ణి కాదు. చలం అన్నట్లు అది తూచే రాళ్ళు నా దగ్గర లేవు అంటే, బహుశా అది స్వీయాభిమానంతో కూడిన ప్రశంస అనిపించవచ్చు. ఆ ఆత్మీయ మిత్రుడికి నివాళి.

2005లో జులై 13న కళాభవన్ లో నేను సకుటుంబంగా భరత్ భూషణ్ బతుకమ్మ ఫోటో ఎగ్జిబిషన్ ను చూశాను. అపుడు పైన చెప్పిన విషయాలు రాశాను. నా సహచరి హేమలత తను పుట్టిన ఊరు రాజవరంలో తాను చెల్లెళ్ళు బతుకమ్మ కోసం వూళ్ళో పూలు ఏరుకొని రావడం, పేర్చడం, బతుకమ్మ ఆడటం వంటి రోజులను గుర్తు చేసుకొన్నది. నా రెండో కూతురు అనల ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో మహిళా మార్గంలో బతుకమ్మ చరిత్ర గురించి ఎవరితో అయినా రాయించాలనుకున్నాము అంటూ, ఇంటి చాకిరితో అలిసిపోయే స్త్రీలకు ఈ తొమ్మిది రోజులు కనీసం సాయంత్రాలైనా బయటకు వెళ్ళే ఒక ఆట విడుపు అని రాసింది. మా మూడో కూతురు పవన తాను కోల్పోయిన పల్లెటూరు జీవితం గురించి రాసింది. ఈ ఇద్దరూ కూడా తమ బాల్యంలోనే రాజవరంలోని బతుకమ్మను చూడగలిగారు.

అందరిలోనూ నా పెద్ద మనవరాలు నయన ఇంగ్లీషులో రాసిన అభిప్రాయం భరత్ భూషణ్ కు ఎంతగానో నచ్చింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్ళు మాత్రమే. కాలాల మార్పులో వచ్చిన మార్పుకు బతుకమ్మ ఒక సంకేతమని, కాగితపు పూల బతుకమ్మలే తప్ప నిజమైన పూల బతుకమ్మలు ఈ చిత్రాలలోనే ఫీలవుతున్నాను అని రాసింది.

తన చిత్రకళ మీద చాలా ఆశలు పెట్టుకొన్నాడు. చిత్రకళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశాడు. గొప్ప ఆత్మ విశ్వాసంతో కూడా చిత్రాలు వేశాడు. కానీ ఆయన ఆశించిన విజయం లభించలేదు.

నాకు చిత్రకారుడిగా పరిచయమైన భరత్ భూషణ్ తన ఆరోగ్యం పూర్తిగా విషమిస్తోన్న దశలో మళ్ళీ చిత్రలేఖనానికి పూనుకొన్నాడు. పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు. తన చిత్రకళ మీద చాలా ఆశలు పెట్టుకొన్నాడు. చిత్రకళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశాడు. గొప్ప ఆత్మ విశ్వాసంతో కూడా చిత్రాలు వేశాడు. కానీ ఆయన ఆశించిన విజయం లభించలేదు. బహుశా అప్పటికే ఆయన ఫోటోగ్రాఫర్ కన్నా చిత్రకారుడిగా గుర్తించబడాలనే ఆకాంక్ష కూడా పెంచుకున్నాడు. ఈ విషయంలో భరత్ భూషణ్ ఎందుకు విజయం సాధించలేక పోయాడో నేను చెప్పలేను కానీ తోటి చిత్రకారులు, చిత్రకళా విమర్శకులు భరత్ భూషణ్ కు ఈ కళలో వున్న స్థానాన్ని నిరపేక్షంగా, వస్తుగతంగా, మూల్యాంకనం చేస్తారని ఆశిస్తున్నాను.

నేను చిత్రకళ గురించి చదివిన వాణ్ణి కాదు. చలం అన్నట్లు అది తూచే రాళ్ళు నా దగ్గర లేవు అంటే, బహుశా అది స్వీయాభిమానంతో కూడిన ప్రశంస అనిపించవచ్చు. ఆ ఆత్మీయ మిత్రుడికి నివాళి.

ఎందుకంటే ఆయన నెత్తురు, చీము వున్న వ్యక్తి.

‘నిలువెత్తు బతుకమ్మ’ సిద్దమవుతున్నది. భరత్ భూషణ్ గారి జీవిత కాల కృషిపై ఆత్మీయుల జ్ఞాపకాలను పంపేందుకు ఈ వారం గడువు ఉన్నది. ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు ఆధ్వర్యంలో ‘చిత్రలేఖ’ ప్రచురణల తరపున ఈ సంచిక వెలువడుతున్నది. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడగలరు. రచనలు kandukurirameshbabu@gmail.comకి పంపగలరు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article