Editorial

Wednesday, January 22, 2025
కథనాలువిరాట పర్వం : సరళ ఉత్తరం : "ఎం.ఎల్ ఆఫీసులో సైకిలుంది...తెచ్చుకోగలరు"

విరాట పర్వం : సరళ ఉత్తరం : “ఎం.ఎల్ ఆఫీసులో సైకిలుంది…తెచ్చుకోగలరు”

వేణు ఊడుగుల విరాట పర్వానికి మూలం నిజ జీవిత సరళ గాథే కావొచ్చు. ఐతే, దర్శకుడు ఈ చిత్రానికి ప్రాణపదమైన వెన్నెల పాత్ర మన కళ్ళముందు సజీవంగా ఆవిష్కరించడానికి ఆధారభూతమైనది సరళ తన తండ్రికి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం ఆ పాత్ర పోషణకే కాదు, మొత్తం చిత్రానువాదానికి కీలకం అని భావిస్తూ సరళ మనోగతం తెలుపు లేఖపై తెలుపు ప్రత్యేక కథనం.

కందుకూరి రమేష్ బాబు 

విరాట పర్వం చిత్రానికి మూలం అప్పటి పీపుల్స్ వార్ చేతిలో పోలీసు యిన్ ఫార్మర్ గా భావించి పొరబాటుగా హత్యకు గురైన సరళ గాథ అని ఇప్పటికే మీకు తెలుసు. ఐతే, సరళ ఎందుకు పార్టీ అగ్ర నేతలను వెతుక్కుంటూ వెళ్ళింది? అన్న ప్రశ్నకు సమధానం అప్పట్లో ఆమె తండ్రికి రాసిన ఉత్తరం స్పష్టంగా తన మనోగతాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఆమె రెండు ఉత్తరాలు రాసింది. అందులో ఒకటి తండ్రికి. మరొకటి తన బావకు రాసింది. తండ్రికి రాసిన ఉత్తరంలో ఆమె తన నిర్ణయానికి కారణాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.

వెన్నెల పాత్ర రెండో దశలో అన్నట్టు, రవి ఆశయంలో తాను భాగం కావాలని ఏ విధంగానైతే అన్నదో అదే సరళకు మొదటి నుంచీ ఉన్నది.

సరళను హత్య చేయడానికి పీపుల్స్ వార్ సరైన కారణాలను లోతుగా ఇప్పటికీ వెల్లడించలేదు గానీ ఆ అమ్మాయి ఎందుకు పార్టీ కాంటాక్ట్ కోసం వెళ్లి దళాలను కలిసింది అన్నదాంట్లో మాత్రం ఎంతమాత్రం అనుమానం లేదు. అది సినిమాలో చూపినట్లు ప్రేమనే.

సినిమాలో వెన్నెల దళ కమాండర్ రవి కోసం ఎట్లా వెళ్లిందో అట్లే ఆమె ఉద్యమంపై అపారమైన ప్రేమతో వెళ్ళింది.

వెన్నెల పాత్ర రెండో దశలో అన్నట్టు, రవి ఆశయంలో తాను భాగం కావాలని ఏ విధంగానైతే అన్నదో అదే సరళకు మొదటి నుంచీ ఉన్నది. అందుకే తాను ఉద్యమ ఆశయాల్లో భాగం కావాలని వెళ్ళింది. భంగపడింది. సినిమాలో చూపినట్లే అనుమానానికి గురై హత్య గావింపబడింది.

దర్శకుడు ఆ సైకిల్ ని వెన్నెల చైతన్యానికి ప్రతీకగా రెండు మూడు బలమైన సన్నివేశాల్లో చూపించడం విశేషం.

నిజానికి దర్శకులు వేణు ఊడుగుల సరళ పాత్రను ఎంత అద్భుతంగా తెరపైకి చిత్రానువాదం చేశారూ అంటే మనకు సరళ తన పూర్తి వ్యక్తిత్వంతో మన కళ్ళముందు కనబడుతుంది. సినిమాలో తాను రవిపై ప్రేమ అంటుంది గానీ ఆమె ప్రేమించింది అరణ్యను. అరణ్య విప్లవ కవి కూడా. సరళ కూడా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసింది. నలుగురికి భోదించే స్థితిలో ఉండింది అని కూడా సుప్రభాతం కథనం పరిశోధనలో తేలింది కూడా. అటువంటి చైతన్యవంతురాలు కాబట్టే వేణు ఊడుగుల వెన్నెల పాత్రను పున:సృష్టించడంలో ఎంతో అధ్బుతమైన ప్రేమ గాథను సరళకు ఆపాదించగలిగారు. వెన్నెల పాత్ర పోషణలో అనేక ఘట్టాలను సమర్థవంతంగా అల్లుకోగలిగారు. అందులో సరళ ఇల్లు వదిలి వెళ్లేముందు ఎం ఎల్ ఆఫీసులో సైకిల్ వదిలి వెళుతుంది. అది తెచ్చుకోమని కూడా తండ్రికి రాస్తుంది. దర్శకుడు ఆ సైకిల్ ని వెన్నెల చైతన్యానికి ప్రతీకగా రెండు మూడు బలమైన సన్నివేశాల్లో చూపించడం విశేషం. అలాగే, “జేబులోంచి రెండు వందలు చెప్పకుండా తీసుకున్న…క్షమించు” అన్న మాటలు సైతం సినిమా చూస్తున్న ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి.

కాగా అవన్నీటికీ మౌలికంగా ఆధారంగా నిలిచింది సరళ రాసిన ఉత్తరమే అని తెలుపు భావిస్తూ ఆమె ఆశయం తెలుపు ఆ లేఖను ఇక్కడ ప్రచురిస్తోంది.

మన్ననలు పొందిన దర్శకులు

ఐతే, ఆ ఉత్తరం చదివే ముందు మరోక్క విషయం.

సరళపై రూపొందిన సినిమా పట్ల ఆ కుటుంబం పల్లెత్తు విమర్శ చేయకపోవడం గమనించాలి. నిజానికి వారు సాయి పల్లవిలో తమ బిడ్డను చూసుకోవడం మరింత ఆర్ద్రం. అభిమానం పెంచిన అంశం. తల్లితో పాటు అన్నయ్య కావొచ్చు, సోదరి కావొచ్చు, దర్శకులు వేణు ఊడుగులను, సాయి పల్లవిని సాదరంగా ఆహ్వానించారు. ఆదరించారు.

ఒక సంక్లిష్ట చిత్రం తెరపై ఆడటం సరే, తెర వెనుక కూడా ఇలా గాయపడ్డ హృదయాలను గెలుచుకోవడం గొప్ప విషయం. ఆ మేరకు దర్శకుడు సాధించిన విజయానికి తెలుపు అభినందనలు తెలియజేస్తోంది.

చూడండి…సరళ తల్లి సరోజను, కుటుంబ సభ్యులను విరాట పర్వం టీం కలిసినప్పటి వీడియో…

https://www.facebook.com/venu.udugula.9/videos/3232467990369745

 

మీ యొక్క కూతురు సరళ వ్రాయునది…

ప్రియమైన అమ్మా నాన్నలకు…మీ యొక్క కుమార్తె సరళ వ్రాయునది…నేను క్షేమంగానే పార్టీ కార్యకర్తలను కలిసాను. పని చేస్తున్నాను. నాకు District ఆర్గనైజరు, ఉత్తర ప్రాంతీయ తెలంగాణా ప్రాంతీయ కమిటీ కార్యదర్శి శంకరన్నతో కాంటాక్టు కుదిరింది. నేను మీ అందరికీ చెప్పుదామనుకున్నాను. మీరు ఓపిక పట్టలేదు. అందుకే మీకు చెప్పకుండా బయలుదేరాను. నన్ను క్షమించండి. అడుగు ముందుకు వేస్తాను. కానీ వెనుకకు మాత్రం వేయను.

శంకర్

మీరు అనుకొన్నట్టుగా నాకు చదువుకోవాలని ఏమాత్రం లేదు. పెళ్లి చేసుకోవాలని అంతకంటే లేదు. నా మనసులో ఉన్నది పార్టీ పని చెయ్యాలని. నేను సాయుధ పోరాటానికి సిద్దం కావాలని. ఆ ఉద్దేశ్యంతోనే పార్టీలో సంవత్సరం నుంచి సంబంధాలు పెట్టుకున్నాను. ఎన్ని రోజులున్నా నేను ఈ విధంగానే వెళ్ళేదాన్నే తప్ప మీరు కోరుకుంటున్నట్టుగా మాత్రం ఉండేదాన్ని కాదు. నా గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. నా గురించి ఏ ఫ్రెండుకు తెలవదు. అందుకని నా గురించి ఎవ్వరినీ ఏమీ అడగవద్దు.

నాన్నా! పడుకుంటే అందరూ కళ్ళలోనే కనపడుతున్నారు.

పెద్దన్నయ్యను, చిన్నన్నయ్యను ఎలాంటి బాధ పెట్టుకోవద్దని చెప్పగలరు. నాకు ఎవ్వరి మీదా ఎలాంటి కోపం లేదు. చిన్నన్న…నీ జేబులోంచి 200 రూ. చెప్పకుండా తీసుకొన్నాను. క్షమించు. నేను ఇంట్లోంచి వచ్చేటప్పుడు అందరికి విరక్తి వచ్చేలా చేయాలనే చేసాను. కానీ వేరే ఉద్దేశ్యంతో కాదు. మీరు నన్ను కోపగించుకున్నారనే బాధ నాకు ఎంత మాత్రం లేదు. పెద్దన్నా! నా మీద కోపం తగ్గిందా. నీకు చాలా దూరంలో ఉన్నాను. నేను కావాలని వస్తే తప్ప నేను ఎవ్వరి కంటికి కనపడను. గణేష్ అన్నయ్యను, రవి అన్నయ్యను అడిగినట్లు చెప్పగలవు. శ్రీధర్ రావు పిన్నోల్లను అడిగినట్లు చెప్పగలవు. నాకు మిమ్మల్ని చూడబుద్ది అయినప్పుడు నేను వస్తాను. చూడటానికి నాకు అవకాశం ఇవ్వండి. మీ కూతురుగా మీ ఇంటి అడపడుచుగా నాకు ఇచ్చే స్త్రీ ధనం అదొక్కటే. దయచేసి యింటి  ముందుకు వచ్చిన తర్వాత కాదనవద్దు. అదే నా ప్రార్థన. అక్కకు కూడా లెటర్ వేసాను. నాన్నా! పడుకుంటే అందరూ కళ్ళలోనే కనపడుతున్నారు. ఎం. ఎల్. పార్టీ ఆఫీసులో సైకిలుంది. తెచ్చుకోగలరు.

-సరళ
9-3-1992

చిరునవ్వుతో అడవి బాట పట్టిన సరళగా సాయి పల్లవి

ఇలా ధైర్యంగా, స్థిరంగా, ఆశతో – ఆశయంతో చిరునవ్వుతో అడవి బాట పట్టిన సరళ ఉత్తరం ఇది. ఆమె ‘ప్రేమ’ ఉద్యమంపై అన్నది అక్షరాలా స్పష్టమవుతోంది. దాన్నే అపురూప ప్రేమగా మలిచి ‘రవి – వెన్నెల’ కథగా మలిచారు దర్శకులు.

చూడండి. ఒక కదిలించే గతానుగతం. అరణ్య పర్వం – విరాట పర్వం.

ఆమె హత్య ఘోరమైన పొరబాటు నిర్ణయమని అందరూ ఎరిగినదే. కానీ కేవలం అడవి మాత్రమే గాంచిన ఒక వెన్నెల విషాద పర్వం అది. తెలిసింది ఇది మాత్రమే. అందుకే ప్రేమతో ఈ ‘సరళ’ ఉత్తరం.

ఈ సినిమాకు మూలమైన సరళ జీవితంపై వివరణాత్మకమైన తెలుపు కథనం నాటి ‘విషాద పర్వం’ స్పూర్తితో నేటి ‘విరాట పర్వం’. అలాగే, విరాట పర్వంలో తండ్రీ తనయల ప్రేమపై తెలుపు కథనం ఇక్కడ చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article