ఈ నెల పదిహేడున థియేటర్స్ లో విడుదల కానున్న ‘విరాట పర్వం’ టీం రేపు జూన్ 12న హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సాయంత్రం ఆత్మీయ వేడుక నిర్వహిస్తోంది. ఇదే మిత్రుల సాదర ఆహ్వానం.
జిలుకర శ్రీనివాస్
విరాటపర్వం ఆత్మీయ వేడుకకు రండి.
విప్లవోద్యమాలకు పుట్టిల్లు వరంగల్. ఇక్కడే విప్లవోద్యమ నేతలు తమ పాదముద్రలను నెత్తుటి చాళ్లలో లిఖించి అమరులయ్యారు.
ప్రేమకు విప్లవభాష్యం పలికిన గడ్డపై ఒక ఉద్విగ్న కలయిక, వెండితెర కరచాలనం
దొడ్డి కొమురయ్య, చిట్యాల అయిలమ్మ, ఠానూ నాయక్ వంటి వీరులు తెలుగు రైతాంగ సాయుధ పోరాటంలో ఎర్ర జెండాలెత్తారు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు వంటి అభ్యుదయ కవులు అక్షర విత్తనాలు నాటింది ఇక్కడే మరి. శ్రీకాకుళ గిరిజన పోరాటం వెలుగులను దేదీప్యమానం చేయ హన్మకొండ పట్టణం నుండి కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి పీపుల్స్ వార్ ను స్థాపించారు. ఇక్కడి ఆర్ఈసీ నుండి గద్దరన్న, బాలగోపాల్ ప్రజల కోసం బయల్దేరారు. జన్ను చిన్నాలు అమరత్వం పచ్చిగా ఇక్కడే కదలాడుతున్నది. వరవరరావు ఇక్కడి నుండే విరసం పుట్టుకకు బీజం వేశారు.
https://www.facebook.com/vijaysadhu9/videos/703964750875033
ప్రజలను, ఈ సమాజాన్ని ప్రేమించిన ఎంతోమంది ప్రేమికులకు వరంగల్ జిల్లా ఒక పారిస్. విప్లవోద్యమాలకు, ప్రజా ఉద్యమాలకు ఇది పుట్టిల్లు. ఇలాంటి చారిత్రక నగరంలోకి విప్లవ ప్రేమగాథ వినిపించడానికి ‘విరాటపర్వం’ బృందం వస్తున్నది. ఆలగనం చేసుకొని, అభినందిద్దాం రండి.
అనన్యం, అసామాన్యమైన పోరు మార్గంలో సాగిన మందారాలకు ఎర్రఎర్రని దండాలు అర్పిస్తూ వెండి తెరపై ఒక దృశ్యకావ్యంగా వేణు ఊడుగుల మలిచిన ఈ సినిమాపై తెలుపు ప్రచురించిన కథనం ‘యుద్దమే కథగా ప్రేమనే విప్లవం’ చదవండి.