అందుకే ఆమె అంటుంది, దేవుడు మతిమరిస్తే బాగుండు అని! ఆ మాట ఆశ్చర్యం కలిగించింది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే, “నేను బతికే ఉన్నానని తెలిస్తే ఆ దేవుడు వెంటనే తీసుకుపోతాడు. మతిమరిస్తే….” అని నవ్వుతూ చెప్పింది.
-కందుకూరి రమేష్ బాబు
పాలమూరు లేబర్ దేశాలు పట్టి వలస పోవడాన్ని సాధారణంగా ఎన్ని సీజన్లు వెళ్లారనే దాన్నిబట్టి లెక్కిస్తాము. 80 సంవత్సరాల ఈ బుడగ జంగాల వృద్ధురాలు పెళ్లూరుల సవారమ్మ సీజన్ కు తొమ్మిది నెలల చొప్పున మొత్తం 22 సీజన్లు వెళ్లి వచ్చింది. అలా వెళ్లి వస్తూ సంపాదించిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసింది.
ప్రస్తుతం ఒక కొడుకు రిక్షా తొక్కి జీవిస్తే ఇంకొక కొడుకు చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాడు. మరో కొడుకు దేశాలకు వలస వెళ్లాడు. మొన్నటి బతుకమ్మ పండగకి అతడు రావాలి. మధ్యలో ఆయన భార్య ఒక బిడ్డను ఈ ముసలమ్మ దగ్గర వదిలేసి వెళ్లిపోవడంతో అతడు మరికొన్ని నెలలు ఆమె తరఫున కూడా పనిచేయవలసి వస్తోంది.
సవారమ్మ పెళ్లయి కడుపుతో ఉండేనాటికి ఏడేళ్ల కరువు పరిస్థితులు మొదలయ్యాయి.(1970-77). ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి, ముందు చెప్పినట్లు 22 సీజన్లు దాకా వలస వెళ్లింది.
దేశాలు పోవడం వల్లే తన పిల్లలకు కాస్త మెరుగైన జీవితం ఇచ్చానని, నిజానికి తాము చేసింది వెట్టి చాకిరే అయినా అదే ‘నౌకర్’ గా భావించినట్లు ఆమె చెప్పడం విశేషం.
పక్షవాతం వచ్చిన భర్తతో పాటు కోడలు వదిలి వెళ్ళిన మనవరాలి సంరక్షణ చూసుకోవడమే తనకున్న బాధ్యతలుగా సవారమ్మ చెప్పింది. అందుకే ఆమె అంటుంది, దేవుడు మతిమరిస్తే బాగుండు అని!
ఆ మాట ఆశ్చర్యం కలిగించింది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే, నేను బతికే ఉన్నానని తెలిస్తే ఆ దేవుడు వెంటనే తీసుకుపోతాడు. మతిమరిస్తే నా మనవరాలిని మరింత కాలం నేను చూసుకోవచ్చు కదా అని నవ్వుతూ చెప్పింది.
బ్రతుకు తెరువుకు ఎటువంటి ఆధారం లేని పాలమూరులో రెక్కల కష్టాన్ని, ఆ భగవంతుడిని నమ్ముకుని జీవితాలు వెళ్లదీసిన ఎందరో సవారమ్మలు జీవన బలిమికి నిండు ప్రతిబింబాలు. వీళ్లు గడిచిన జీవితం గురించి భారంగా చెప్పరు. దుఃఖంతో మాట్లాడరు. ఎంతో ఆత్మవిశ్వాసం, సెన్స్ ఆఫ్ హ్యూమర్, చిరునవ్వుతో మాట్లాడతారు.
నిజానికి అంతటి కరువు పరిస్థితుల మధ్య, స్థానికంగా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని స్థితిలో వలస వెళ్లి జీవితాలు గెలుచుకున్న వీళ్ళు పోరాట యోధులుగానే కనబడతారు.