ఏడేళ్ళ కరువు కాలంలో తినడానికి చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతూ ‘గునుగు కూర’ వండుకొని తిన్న ఉదంతాన్ని గోపి పెద్ద కిష్టమ్మ పంచుకుంటుంటే మనసుకు చాలా కష్టం అయింది.
కందుకూరి రమేష్ బాబు
పాలమూరు ఉమ్మడి జిల్లాల్లో వలస వెళ్లడానికి గల కారణాలు అన్వేషిస్తుండగా 70 దశంలో వచ్చిన తీవ్రమైన కరువు గురించి చాలామంది వివరించి చెప్పారు. దాదాపు ఏడేళ్ల తీవ్రమైన కరువు వారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. అప్పటికే వలస వెళ్లడం మొదలైన వారికి అదనంగా OC కులస్తులు తప్పించి మిగతా కులాల వారంతా పెద్ద ఎత్తున వలస పోయే పరిస్థితులు తీవ్రమయ్యాయి. విషాదం ఏమిటంటే, ఆ సమయంలో తినడానికి చాలా ఇబ్బందులు ఉండగా ‘గునుగు కూర’ వండుకొని తిన్న ఉదంతాలు చాలా మంది చెబుతుంటే మనసుకు కష్టం అయింది.
బతుకమ్మ పండుగ సమయంలో వాడే గునుగు పూలలో లేత పూలను ఏరుకుని, వాటి ఆకులను కూడా కొంత దట్టించి ఉప్పు కారం వేసుకుని ఉడికించి కూరగా వండుకొని, రొట్టెలతో తిన్న జ్ఞాపకాలు పలువురు పెద్ద మనుషులు పంచుకున్నారు.
వనపర్తి జిల్లా చెలిమిళ్ళగ్రామానికి చెందిన గోపి పెద్ద కిష్టమ్మ అనే వృద్ధురాలు మాట్లాడుతూ, ఇటువంటి స్థితిలో నూరు రూపాయలు ఇచ్చిన సరే అని భార్యాభర్తలం దేశం వెళ్లి ఐదు నెలలు పని చేసి వచ్చామని, అట్లా కరువు కాటకాల నుంచి పొట్ట పోసుకోవడానికి ఒక గుంపులో 20, 30 మందిమి కలిసి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఎంతో బాధతో వివరించి చెప్పింది.
కాగా, నూటికి ఇప్పుడు 20 శాతం మంది ఇంకా వలస పోతున్నారు. ఇందులో గోపి పెద్ద కిష్టమ్మ సామాజిక తరగతికి చెందిన మాదిగ కులస్తులు పదిహేను శాతం పైగా ఉంటారన్నది వాస్తవ స్థితి.
పాలమూరు వలసకు దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. వివరంగా ఆ కథనాలు వచ్చే నెలలో రాస్తాను. అయితే, స్వరాష్ట్రం వచ్చినాక ఆ వలసలు పెద్ద ఎత్తున తగ్గుముఖం పట్టడం గొప్ప ఉపశమనం. ఈ మాట చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. కాగా, నూటికి ఇప్పుడు 20 శాతం మంది ఇంకా వలస పోతున్నారు. ఇందులో గోపి పెద్ద కిష్టమ్మ సామాజిక తరగతికి చెందిన మాదిగ కులస్తులు పదిహేను శాతం పైగా ఉంటారన్నది వాస్తవ స్థితి.
దళితుల వలసలు కూడా తగ్గుముఖం పట్టాలి అంటే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లు ఇంటికి ఒక ఉద్యోగం గానీ, మూడు ఎకరాల భూమి గానీ ఇచ్చి ఉంటే బహుశా ఈ పార్టీకి గునుగుపూల కూర గురించి చెప్పడం మానేసి బతుకమ్మ పండుగ గురించి లేదా తమ బతుకు పండుగ గురించి చెప్పే వాళ్ళం అని పెద్ది గారి అయ్యన్న ఆవేదనతో అన్నారు. వారు 12 కు పైగా సీజన్లు వలస వెళ్లిన వారు.