ఇది ఒక వనపర్తి జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనే కాదు, ఇతర చోట్ల కూడా ఉందని వింటున్నాను.
కందుకూరి రమేష్ బాబు
నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పాటయ్యాక ఆ పత్రిక జర్నలిజం స్కూలు ప్రారంభించి నేటికి 13 ఏండ్లు నిండి 14వ వసంతంలోకి అడుగు పెట్టిందని ఒక మిత్రుడు పోస్ట్ చదివాను ఇప్పుడే. ఈ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకడిగా, బతుకమ్మ ఎడిటర్ గా , స్పెషల్ కారస్పాండెంట్గా పత్రిక ప్రారంభానికి ఆరు నెలల ముందు చేరి 2017 వరకు పని చేశాను. ఆ పత్రికకు రాజీనామా చేసింది మొదలు ఇక స్వతంత్ర జర్నలిస్ట్ గానే ఉన్నాను. అయితే, ఆ రోజుల్లో మేము పేపర్ ని ఫ్రీ గా వేసినట్లు నాకైతే జ్ఞాపకం లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. వనపర్తి జిల్లాలో అయితే నమస్తే తెలంగాణ పేపర్ను చాలా చోట్ల రెండు ఇండ్ల మధ్య వేస్తారు. ఎవరిష్టం ఉంటే వాళ్ళు చదువుకోవచ్చు. ఒక్కోసారి ఆ పేపర్ వద్దనుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు కావాలంటే తెచ్చిస్తారట. ఎవరో ఒక రాజకీయ నాయకుడు/మంత్రివర్యులు ఉచిత బాధ్యత తలకెత్తుకొని ఈ పని చేసి పెడతాడని అంటారు. హోటల్స్, మంగల్ షాపులు, నలుగురు కూడా అడ్డాలు, పలుకుబడి గల అధికారులు, రాజకీయ నాయకులు కొంచెం అభిప్రాయం కలిగిన వాళ్లు, వాళ్ళ ఇంటికి ఇట్లా పేపర్ ఉచితంగా చేరుతుందట. ఇది ఒక వనపర్తి జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనే కాదు, ఇతర చోట్ల కూడా ఉందని వింటున్నాను.
నేను వేరే విషయాలు అధ్యయనం చేయడానికి వచ్చాను కనుక ఇది కూడా ఒక విశేషం అవుతుందని అస్సలు ఊహించలేదు. నిజానికి ఇది స్థానికులకు పాత విషయమే కావచ్చు, కానీ పట్టణాల్లో బ్రతికే మాలాంటి వారికి వార్తా విశేషమే, కాకపోతే చౌకబారు. అయితే, మీ చోట కూడా ఇలాగే వస్తుందా? దయచేసి మిత్రులు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు.
ఆ పత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అంటే దాన్ని కొనుక్కొని చదివే పాఠకులు పెరిగితే తప్ప మరో దారి లేదన్నది ఒక స్వతంత్ర అభిప్రాయం మాత్రమే.
నిజానికి కేసీఆర్ గారు ఒక ఉద్యమ పత్రికను స్వప్నించి ఆవిష్కరించడంలో గొప్పగా అభినందనీయుడు. ఆయన గమ్యాన్ని ముద్దాడిన వెంటనే తన కర్తవ్యాన్ని వీడినందు వల్ల అంతగా విమర్శకు యోగ్యుడు.
కేసీఆర్ గారు ‘నమస్తే’ ప్రారంభించడంలోని ఉద్దేశ్యం స్వీయ ఆత్మగౌరవం పెంచడం, సీమాంధ్ర కుట్రలను ఎండగట్టడం, ఆంధ్ర యాజమాన్యాల చేతుల్లోని పత్రికలను దాటి, సర్కులేషన్ పెంచి, నమస్తే తెలంగాణను నిలబెట్టాలని ఆకాంక్షించారు. మాకు అదే స్పిరిట్ ని ఉద్బోధించారు. తర్వాత, ఆయన ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారిన నేపథ్యంలో నమస్తే తెలంగాణ ఒక పాంప్లెంట్ గా మారడం ఎవరైనా చూస్తున్నదే. ఈ పర్యవసనాల వల్ల ఉద్యమకారులు ఎట్లాగైతే దెబ్బ తిన్నారో ప్రభుత్వము ఉచిత పథకాల మీద ఎట్ల ఆధారపడిందో సరిగ్గా అట్లాగే పత్రిక కూడా అట్లానే క్రమక్రమంగా దెబ్బతిని ఈ మరి ఈ అనుచిత ఉచిత స్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో దాని మేనేజింగ్ డైరెక్టర్ రాజ్యసభ సభ్యులు కావడం విశేషం.
ఆ పత్రికకు, జర్నలిజం స్కూల్ కి వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అంటే దాన్ని కొనుక్కొని చదివే పాఠకులు పెరిగితే తప్ప మరో దారి లేదన్నది ఒక స్వతంత్ర అభిప్రాయం మాత్రమే.
మరి, నమస్తే తెలంగాణ.