Editorial

Wednesday, January 22, 2025
Peopleవిను తెలంగాణ 1 : బడి అంటే చదువు మాత్రమే కాదు!

విను తెలంగాణ 1 : బడి అంటే చదువు మాత్రమే కాదు!

“బడి అంటే చదువు, మార్కులు, ఫలితాలు మాత్రమే కాదు, ఆకలి, అణచివేత, హింస, వివక్షలకు దూరం చేసే మరో ప్రపంచం.

కందుకూరి రమేష్ బాబు

నిన్న చాంద్రాయణగుట్టలో ఉన్న ఎంవిఎఫ్ రెసిడెన్శియల్ క్యాంప్ లో ఆ సంస్థ జాతీయ కన్వీనర్ శ్రీ వెంకట్ రెడ్డి గారిని మరోసారి కలుసుకుని వారి దశాబ్దాల కార్యాచరణ నుంచి ‘బడి’ గురించి లోతైన అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశాను.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక నిర్లక్ష్యం కాబడిన ‘బడి’ మాత్రమే కాదు, దశాబ్దాలుగా బడి, అది నిర్వహించిన మహత్తర పాత్ర, దానికంటే ముందు ఆ బడి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడిన తాపత్రయం, ఆరాట పోరాటాలు, భూస్వామ్యం లోపల ఉన్నవాళ్ళు, దాని బయట ఉన్నవాళ్ళు పడ్డ సంఘర్షణ, చివరాఖరికి ఆ బడిని సాధించిన తీరు తెన్నులు, ఇలాంటి బడి గురించి మాట్లాడుకున్నాం.

బడి తెచ్చిన మౌలిక మార్పు ఏమిటో అర్థం చేసుకునే దిశలో వారి నుంచి ఎంతో విలువైన అంశాలు గ్రహించగలిగాను. ఆ అంశాలను, గ్రామీణ ప్రాంతాల్లోని బడులను కళ్ళారా చూసి, మూడు తరాల ప్రజలతో మాట్లాడి, తరచి చూసి రాసే కథనాలు వచ్చేనెలలో అందిస్తాను.

అందరికీ తెలుసు. ఒక నెల రోజులు గడిచిన తర్వాత మనకు కొత్త ప్రభుత్వం వస్తుంది. అది కెసిఆర్ గారి ఆధ్వ్యర్యంలో ముచ్చటగా మూడవసారి ఏర్పడినా లేదా రాష్ట్రం ఏర్పాటయ్యాక తొట్ట తొలిసారి కాంగ్రెస్ ఆధ్వ్యర్యంలో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా; కాదు, బిజెపి, మజ్లీస్ తో సహా బీఎస్ పి, ఇండిపెండెంటట్లు, తదితరుల మద్దతుతో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, ఎవరు పాలానా పగ్గాలు చేపట్టినా రాజకీయాలకు అతీతంగా చెప్పవలసిన విషయాలు చెప్పవలసిందే. ప్రజల మాటలనుపెడచెవిన పెట్టే రాజకీయాలు ఎంత లావుగా ఉన్నా కూడా కంఠం సవరించుకుని ప్రజలు లోగొంతుతో చెప్పినా చెవొగ్గి విని ఆ స్థితిగతులను విశాల ప్రయోజనాల కోసం దండోరా వేసి చెప్పవలసినదే. అది మంచిదా చెడుదా అని కాదు, చెప్పవలసినవి చెప్పాలి. ఎన్నికల తర్వాత అటు ప్రభుత్వం, ఇటు పౌర సమాజం ఇరువర్గాలూ మరింత బాధ్యతంగా వినేందుకు, పునరాలోచనకు, పరిపాలన గురించి లేశమాత్రమైనా ఆలోచించి మరింత సానుకూల దృక్పథంతో ముందుకు పోయేందుకు కూడా పరిశీలనలు చెప్పవలసిందే. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి తెలుపవలసిన విషయాలు, తెలుసుకుని చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నవి. వాటిని చెప్పేందుకు ముందు శ్రద్దగా వినవలసిందే. ఇది ఒకరకంగా విను తెలంగాణ సిరీస్. అందుకోసం ఒక స్వతంత్రంగా విశాల పర్యటనకు బయలుదేరే ముందు వివిధ రంగాల నిపుణులను కలవడం ఎంతో exciting గా ఉన్నది. అందులో భాగంగా శ్రీ వెంకట్ రెడ్డి గారిని కలిస్తే, ‘బడి బయట ఉన్న వారందరూ బాల కార్మికులే’ అన్నారు వారు.

బడి లేకపోతే వీరంతా ఏమిటీ అన్నది మేరె ఆలోచించుకోండి. బడి అందని లక్షలాది బిడ్డలా గురించి కూడా ఒకసారి ఊహించండి.

ఆ మాట ఎందుకు అన్నారో బ్రిడ్జి కోర్సులో ప్రవేశించిన బాలికలు కొందరిని పరిచయం చేయగా బోధపడింది. వారి బ్యాక్ గ్రాండ్ చాలా చిన్నది కాదు, అది హృదయ విదరకమైనది. నా బొమ్మల్లో సంతోషంగా నవ్వే చెత్త ఎరుకునే మనుషుల బిడ్డలు వాళ్ళు. తల్లుల వెంట భరువైన సంచులతో పరిగెత్తే బిడ్డలు వాళ్ళు. రైల్వే స్టేషన్ల లో ఆకాశం కింద నక్షత్ర రాశులను లెక్కించడానికి కూడా తీరుబాటులేక సొమ్మసిల్లి పడుకునే కష్టజీవుల పిచ్చితల్లులు వాళ్ళు. వేలు, లక్షలాది మందిలో ఇలాంటి కొందరిని గుర్తించి వారికి ప్రాథమిక చదువు సంధ్యలు నేర్పి అటు తర్వాత పాఠశాలకు, కాలేజీలకు, విశ్వ విద్యాలయాలకు పంపించేందుకు తాము ఒక వంతెన వేస్తన్న తీరును వెంకట్ రెడ్డి అన్న ఎంతో ప్రేమతో చూపించారు.

ఈ పిల్లలు ఎన్ని బాధలు పడ్డారో చెప్ప వశం కాదు. కోల్పోవడానికి ఏమి ఉంటుందని మనం భావిస్తామో వాటన్నితినీ ఇందులో చాలా మంది కోల్పోయిన వారే, బాల్యంతో సహా. అలాంటి వారు ఇప్పుడు తమను తాము గెలుచుకునేందుకు రెండో జీవితంలోకి అడుగుపెట్టి బడి అనే భద్ర జీవితంలోకి మొదటగా కాలీడారు. బడి లేకపోతే వీరంతా ఏమిటీ అన్నది మేరె ఆలోచించుకోండి. బడి అందని లక్షలాది బిడ్డలా గురించి కూడా ఒకసారి ఊహించండి.

నయం. వీరు ఇటు వైపు వచ్చారు. అందుకే ఇక వారు గతం గురించి చింతించడం లేదు. సిగ్గు పడటం లేదు. దాన్ని దాటేసే యోచనలో వాళ్ళు అది చిన్న గీత చేసుకున్నారు. కొత్త తలరాత రాసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇంకో జీవితంలోకి అడుగిడి తమను తాము గెలుచుకునేందుకు వాళ్ళు దృడంగా నిలబడ్డరు.

బడే లేకపోతే ఇదంతా సాధ్యమా? అన్నారు వెంకట్ రెడ్డి గారు. నిస్సహాయంగా బలైపోయే మొగ్గలను చేరదీసి వారి జీవితాలకు భద్రత ఏర్పాటు చేసి తమదైన రీతిలో వాళ్ళ జీవితాలను పుష్పింపజేయడం బడి పనే. ఇదే బడి చేసే గొప్ప మేలుగా వెంకట్ రెడ్డి గారు అభివర్ణించారు.

ఇదే ప్రాథమికం. ఇంకా వెంకట్ రెడ్డి గారు అన్నారు, “బడి అంటే చదువు, మార్కులు, ఫలితాలు మాత్రమే కాదు, ఆకలి, అణచివేత, హింస, వివక్షలకు దూరం చేసే మరో ప్రపంచం. అందులోకి ప్రవేశం లభించాలి. ఇలాంటి బిడ్డలు ప్రవేశించడానికి ముందు వాళ్ళు వేరు, రేపటి వాళ్ళు వేరు” అని ఎంతో అభిమానంగా చెప్పారాయన.

దురదృష్టవశాత్తూ రేపటి తరం కోసం బడిని కాపాడుకునే ప్రయత్నాలు ఈ దశాబ్దంలో సవ్యంగా జరగకపోగా అంతకుమించి ఒక ప్రణాళికా బద్దంగా ధ్వంస రచన జరిగిందన్నది మరో విషాదం.

ఇక్కడి బాలికలతో మాట్లాడితే ఆ సంతోషం ఏమిటో దాని విలువ ఏమిటో సులభంగా తెలిసింది. బడి ఆవశ్యకతా బోధపడింది. అదే సమయంలో దురదృష్టవశాత్తూ రేపటి తరం కోసం బడిని కాపాడుకునే ప్రయత్నాలు ఈ దశాబ్దంలో సవ్యంగా జరగకపోగా అంతకుమించి ఒక ప్రణాళికా బద్దంగా ధ్వంస రచన జరిగిందన్నది మరో విషాదం.

“విశేషం ఏమిటంటే, గతంలో బడి కోసం చేసిన విప్లవం ఒక అధ్యాయం. రేపు రేపు బడిని కాపాడుకోవడానికి జరిగాల్సిన అనివార్య ప్రయత్నాల అవసరం ఏమిటో కూడా ఈ బాలికలకు దక్కిన అవకాశమే చెప్పకనే చెబుతోంది. అది మరో అధ్యాయం.

ఏమైనా బడి చేసిన మేలు ఏమిటో బలంగా చెప్పాలి. అదే బడిని కాపాడుకోవడానికి మార్గం. ఇలాంటి లోతైన అవగాహన కలిగించిన Venkat Reddy R గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక చూడాలి. విని చెప్పాలి. బడి మొదలు అనేకం.

ఈ పర్యటనలో, ప్రయత్నంలో ఎక్కడికక్కడ మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నాను. మీ దగ్గరికి వచ్చేముందు చెబుతానని మనవి. మరి, కృతజ్ఞతలు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article