Editorial

Monday, December 23, 2024
కథనాలుHAPPY NEW YEAR : మీ చేతిలో ఉంది స్పందన : విజయ కందాళ...

HAPPY NEW YEAR : మీ చేతిలో ఉంది స్పందన : విజయ కందాళ తెలుపు

ప్రతి లాభంలో కొంత నష్టం అంతర్లీనంగా ఉంటుంది. అలాగే ప్రతి నష్టంలోనూ కొంత పాఠమో, గుణపాఠమో దాగి ఉంటుంది.

పరిస్థితులు చాలాసార్లు మన చేతిలో ఉండవు. కానీ వాటిపట్ల మన స్పందన ఇంకా మన చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి.

చదవండి, సానుకూల అంశాలు తెలుపు సమీక్షణం.

విజయ కందాళ

కాలం విచిత్రమైనది. మనకు తెలీకుండానే మనల్ని తనవెంట లాక్కెళుతుంది. పిడికిట్లోని ఇసుకలా చేతుల్లోంచి జారిపోతుంది. దానికి తనపర బేధం లేదు. అందరినీ తన పరిధిలోకి తెచ్చేసుకుంటుంది. అందుకే కాలచక్రం అన్నారు. ప్రవాహంలా కదిలిపోతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నిర్దాక్షిణ్యంగా కనిపిస్తుంది. ప్రగతికి అద్దం పట్టిన నాగరికతలనెన్నింటినో తుడిచి పెట్టేసింది. అదే కాలం నూతన ఆవిష్కరణలకు దారినీ ఇస్తుంది. ఆకులు రాలుస్తూనే కొత్తచిగుళ్ళకు స్వాగతం పలుకుతుంది. ఎంత చిత్రం.

కాలం విలువను పెంచేలా మన విలువను పెంచుకోవడంతోనే దాని నిరంతరాయ చక్రంలో మన ఉనికికి సార్థకత ఉంది.

ప్రతి లాభంలో కొంత నష్టం అంతర్లీనంగా ఉంటుందని. అలాగే ప్రతి నష్టంలోనూ కొంత పాఠమో, గుణపాఠమో దాగి ఉంటుందని!

ప్రతి ఒక్కరూ తమ సమస్యలకు కృంగి పోకుండా పరిష్కారాలను వెదకాలి. అనుభవాలను తరచి చూసుకుంటూ ఆచరణ వదలకుండా ముందుకు సాగాలి.

ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయముంది. ప్రతి లాభంలో కొంత నష్టం అంతర్లీనంగా ఉంటుందని. అలాగే ప్రతి నష్టంలోనూ కొంత పాఠమో, గుణపాఠమో దాగి ఉంటుందని!

చెరువులో ఈదే బాతులను ఒక్కక్షణం గుర్తుతెచ్చుకోండి. చూడ్డానికి ఎంత బావుంటుందో కదా. అయితే అలా ప్రయాణించడానికోసం అవి నిరంతరం నీటి అంతర్భాగాన ఎంతో బలంగా కాళ్ళను కదుపుతూనే ఉంటాయని తెలుసా? అందమైన జీవితం కోసం మనమూ అలానే కృషి చేస్తుండాలని వాటిని చూసినప్పుడల్లా గుర్తుకొస్తూనే ఉంటుంది.

కరోనా నేర్పినవెన్నో…

ఆత్మీయులను పోగొట్టుకోవడం, అనుకున్న సమయానికి చేరాల్సిన గమ్యం చేరలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అనిశ్చిత స్థితి ప్రపంచాన్ని వదిలి మనశ్శాంతి కోసం దూరతీరాలకు పారిపోవాలనే ఆలోచనలు, గుండెలను చీల్చేసే చేదు జ్ఞాపకాలు? ఇవేనా కరోనా పాదముద్రలు. కోవిడ్ నేర్పిన పాఠాలు…కానే కాదు.

మనస్సును మరింత విశాలం చేసుకొని లోనికి తొంగి చూసే ప్రయత్నం చేయండి. మానవసంబంధాల విలువను తెలుసుకున్నాం. ఆరోగ్యస్పృహను అలవాటుచేసుకున్నాం. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకున్నాం. కుటుంబ ప్రాధాన్యతను గుర్తించాము. పచ్చని పైర్లకు, పిల్లగాలులకు దూరమయ్యామని విచారించాం. అమ్మమ్మల, బామ్మల చిట్కాలను స్వీకరించాం. కాఫీ, టీలను పక్కకు జరిపి కషాయాలను అలవాటు చేసుకున్నాం. వంటింటి దినుసులకు రాజభోగం పట్టించాం. పండగలు, పార్టీల్లో కనిపించే కాజు, బాదాం, ఎండుద్రాక్షలను నిత్యావసరాల్లో చేర్చేసాం. స్వంతలాభం కొంతమానుకుని పొరుగువాడికి చేయూతనిచ్చాం. దేశవిదేశాల పరిస్తితికి తల్లడిల్లిపోయాము. పదిమంది కోసం కులమత ప్రాంతీయ విబేధాలను పక్కనబెట్టి, ప్రార్థనలు చేసాము.

ఇవన్నీ మనతో చేయించింది మనలో అశాంతిని రేకెత్తించిన కరోనాయే. అందుకే ప్రతినష్టంలో కొంతలాభముందని తెలుసుకోండి.

మరకలు సరే… మెరుపులూ ఉన్నాయ్

2021లో మరకలేకాదు మెరుపులూ ఉన్నాయని గ్రహించండి. గట్టిపల్లి శివపాల్ అనే మరుగుజ్జు ఆ విభాగంలో డ్రైవింగ్ లైసెన్స్ అందుకున్న తొలివ్యక్తిగా వార్తల్లోకెక్కాడు.

డా.అక్సా షేఖ్ అనే తృతీయప్రకృతి వ్యక్తి ఒక వాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతూ నలుగురికి ఆదర్శంగా నిలిచిందీ 2021 లోనే.

2019-2021 లో జరిపిన జాతీయ కుటుంబ సర్వేలో దేశంలో స్త్రీలసంఖ్య పెరిగినట్లు వెల్లడైంది. ఆడపిల్ల అని తేలగానే భ్రూణహత్యకు సిధ్ధమయ్యే చోట ఇలాంటి ఫలితాలు కొత్తఊపిరులూదవా?

ఒక్క విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలి. తప్పదు. పరిస్థితులు చాలాసార్లు మన చేతిలో ఉండవు. కానీ వాటిపట్ల మన స్పందన ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది.

ఇవన్నీ చదువుతూ మనం చేయాల్సింది మరిస్తే మరింత వెనక్కి వెళ్లిపోతాం. 2021 వాక్సినేషన్ భరోసాతో మొదలైనా, సాధారణ స్థితికి చేరుకోగలమని ఆశించినా అలా జరగలేదు. కోవిడ్ రెండవ దశ మరింత భయాందోళనలకు గురిచేసింది. మరణించిన వారి గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది. కానీ , బతికున్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. శారీరక , ఆర్థిక సమస్యలతోబాటు మానసిక సమస్యలైన భయం, కుంగుబాటు, ఒత్తిడి, వైరాగ్యం, నైరాశ్యం కుదురుగా ఉండనీయట్లేదు.
ఇలాంటప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలి. తప్పదు. పరిస్థితులు చాలాసార్లు మన చేతిలో ఉండవు. కానీ వాటిపట్ల మన స్పందన ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది.

మానవ మనుగడలోని చీకటి వెలుగులూ, ఎగుడు దిగుళ్ళూ ఉన్నాయి. అవి చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయనేది కాదనలేని సత్యం.

ముల్లున్న పూలతోట

జీవన విధానంలో చేసుకునే చిన్న మార్పులే విత్తే మహా వృక్షమైనట్లు గొప్ప ఫలితాలనిస్తాయి. మీరు మెచ్చిన, లేదా మీకు నచ్చిన వారితో మీ సంఘర్శణను, ఆందోళనలను, సంశయాలను పంచుకోండి. సంకోచించకండి.

డైరీ లేదా జర్నల్ రాయండం మొదలెట్టండి. గుండె బరువు తగ్గుతుంది. మనసు తేలికపడుతుంది.

అలాగే వారి పరిస్థితిలనూ సహనంతో అర్థం చేసుకోండి. ఆలాంటి అవకాశం లేనప్పుడు డైరీ లేదా జర్నల్ రాయండం మొదలెట్టండి. గుండె బరువు తగ్గుతుంది. మనసు తేలికపడుతుంది. అస్పష్ట భయాలకు స్పష్టమైన సమాధానాలు దొరుకుతాయి.

మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నించండి. మనసును ఖాళీగా ఉంచకండి. మొహమాటపడకుండా అవసరమైనప్పుడు నిపుణులను సంప్రదించండి. ఈ జీవితం మీది. పూలతోటలా ఉంచుకొండి..ముళ్ళున్నాయని పూల అందాలను విస్మరిస్తామా?

ఇదే మొదలూ కాదు…

ఇలాంటి తీవ్ర పరిస్థితులు తలెత్తడం ప్రపంచానికి ఇదే మొదలూ కాదు, చివరాకాదు. అంతటి మహాసాగరాలకే ఆటుపోట్లు తప్పడం లేదు.. మనమెంత. ప్రపంచయుధ్ధాలు, కలరా, ప్లేగు, కరువులు, క్షామాలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు ఎన్నో వచ్చాయి. వెళ్ళాయి. మానవ జాతి తాత్కాలికంగా వంగినా, కుంగినా తిరిగి లేచి నిలబడింది. ఆగిన ప్రయాణాన్ని కొనసాగించింది.

మీ చిన్న ప్రపంచాన్ని సంశయాలతో, ఆందోళనతో నింపకండి. కాసింత సహనంతో, మరింత ప్రేమతో ఉండండి.

ప్రస్తుత సమస్య ఒక ప్రాంతానికీ, ఒక దేశానికీ పరిమితం కాలేదు. మీరు ఒంటరి అని అనుకోకండి. మనందరికి తోడుగా శాస్త్రజ్ఞులున్నారు. డాక్టర్లున్నారు. దాతలున్నారు.

ప్రభుత్వయంత్రాంగముంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ మేలుకోసం ,క్షేమం కోసం ఎందరో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రార్థిస్తున్నారు. మీరూ ఆ మహాయజ్ఞంలో పాలుపంచుకోండి. తోటి మానవులకోసం నిస్పార్థంగా మీరు నమ్మిన శక్తిని ప్రార్థించండి. అది మీకు ప్రశాంతతనిస్తుంది. మనోమాలిన్యాన్ని కడిగివేసి, మిమ్మల్ని మరింత స్వఛ్చంగా మారుస్తుంది.

రేపటి వెలుగుకోసం కాస్త చీకటిని ఓపిగ్గా భరిద్దాం.
నూతన సంవత్సరాన్ని కొత్తఆశలతో స్వాగితిద్దాం.

మీ చిన్న ప్రపంచాన్ని సంశయాలతో, ఆందోళనతో నింపకండి. కాసింత సహనంతో, మరింత ప్రేమతో ఉండండి. మన ఋషులేనాడో చెప్పారు, సర్వేజనా సుఖినోభవన్తు అని. ఆందరం అందరి కోసం ప్రార్థిద్దాం. జాగ్రత్తగా నడుచుకుందాం. ఎందుకంటే ఆ ఆందరిలో మనమూ ఉన్నాం, ఉంటాం కదా.

రేపటి వెలుగుకోసం కాస్త చీకటిని ఓపిగ్గా భరిద్దాం.
నూతన సంవత్సరాన్ని కొత్తఆశలతో స్వాగితిద్దాం.

రచయిత్రి విజయ కందాళ రచనలు ఈ లింక్ ద్వారా వినవచ్చు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article