Editorial

Monday, December 23, 2024
స్మరణజయంతిమహాత్మా గాంధీ - నిత్య జీవన సత్యాగ్రహి - విజయ కందాళ తెలుపు

మహాత్మా గాంధీ – నిత్య జీవన సత్యాగ్రహి – విజయ కందాళ తెలుపు

గాంధీ ముద్ర అనితరసాధ్యం. మన దేశమే కాదు, విశ్వమంతా వ్యాపించిన మహాత్ముని జీవనశైలి సదా స్ఫూర్తి దాయకం. నిరంతరం ప్రేరణ.

విజయ కందాళ

స్వాతంత్ర్యోద్యమ కాలంలో నీరసించిన జాతిని మేల్కొల్పి, ఐకమత్యభావాన్ని పెంపొందింపజేసి, త్యాగనిరతిని వికసింపజేసి, సత్యాహింసలనే ఆయుధాలతో ఆబాలగోపాలాన్ని సైనికులుగా కదంతొక్కించిన కర్మయోగి ఆయన. నమ్మిన విలువలు, సిధ్ధాంతాలను త్రికరణ శుధ్ధిగా ఆచరించి చూపిన మహాత్ములు వారు. అదే సమయంలో నిత్యజీవితంలోని అనేక అంశాలపై ఆబాల గోపాలానికి ఆయన సదా ఒక దిక్సూచి.

ఆరోగ్యం

అందరూ విలువైనదాన్ని బంగారంతో, వజ్రాలతో పోలుస్తారు. కానీ అసలైన విలువ మన ఆరోగ్యంలోనే ఉంటుందని ఆయన నమ్మేవారు. ఇదెంత ముఖ్యమో మనందరికీ ఈ మధ్యకాలంలో బాగానే అందరికీ అవగతమయ్యింది. ఎన్నో విపరీతాలకు మూలమైన నేటి జీవనశైలి సరైన పంథాలో ప్రయాణించాలంటే ఆ విషయాన్ని అందరం మనసుకి ఎక్కించుకోవాలి.

ఉపవాసం

గాంధీ జీవితంలో విడదీయరాని అంశం ఇది. స్వాతంత్ర్య సమర కాలంలో ఎన్నో సార్లు నిరాహారదీక్షను పాటించారు. 17 సార్లు ఒక వ్రతంగా ఉపవసించారు. ఓ సారి 21 రోజులు కేవలం తక్కువ మోతాదులో ద్రవాలను తీసుకుంటూ గడిపారు. పలువురు ఆయుర్వేద నిపుణులు ఉపవాసం ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తుంటారు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడం, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం లాంటివి నియమబధ్దమైన ఉపవాసాలవల్లే సాధ్యమని నేడు అనేకులు ఆచరిస్తున్నారు.

ఆహారం

ఆయన ఉద్దేశ్యంలో మంచి ఆరోగ్యానికి రహదారి మంచి అలవాట్లే. తొలుత పాలపదార్థాలకు దూరంగా ఉండేవారు. తరువాతి కాలంలో వైద్యుని సలహా మేరకు మేకపాలను వాడడం మొదలుపెట్టి చివరివరకూ కొనసాగించారు. రోజుకు 1లీ మేకపాలు, 150 గ్రా చిరుధాన్యాలు, 75 గ్రా ఆకుకూరలు, 125 గ్రా కాయగూరలు, 25 గ్రా పచ్చికూరలు, 40 గ్రా నెయ్యి, 40 గ్రా పంచదార వాడేవారు. గమనించండి ధాన్యం కంటే కూరగాయల వాడకమే ఎక్కువగా ఉంది.

ధ్యానం

మనిషి మానసిక, శారీరక ప్రశాంతతలను సాధించాలంటే ధ్యానం తప్పనిసరి అని ఆయన సిధ్ధాంతం. రోజూ ప్రార్థన, ధ్యానం తప్పక చేసేవారు. ఇవి రెండూ ఆయన జీవితంలో విడదీయరాని అంశాలు. ఆయుర్వేదం మానసిక రుగ్మతలు తగ్గడానికి ధ్యానం ముఖ్య సాధనమని చెప్తున్నది.

నిద్ర

మొదట్లో కేవలం 4 నుండి 5 గంటలే నిద్రించేవారు. తర్వాతి రోజుల్లో పధ్దతిని మార్చుకుని, త్వరగా పడుకుని, త్వరగా మేల్కోవడం అలవాటు చేసుకున్నారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ధ్యానం చేయడం వల్ల దినమంతా ఉత్సాహం తనని అంటిపెట్టుకుని ఉంటుందని తరచూ సన్నిహితులతో చెప్పేవారు.

నడక

దండి మార్చ్ చేసిన బాపూజీ జీవితం నుండి నేర్వాల్సిన గొప్పఅంశం నడక. 79 మంది వాలంటీర్లతో కలిసి 24 రోజులపాటు రోజుకు 10 మైళ్ల చొప్పున అంటే 240 మైళ్లు నడిచారు. అంటే 384 కి.మీ అన్నమాట . 12 మార్చి 1930 నుండి 6 ఏప్రెల్ 1930 వరకు ఈ కార్యక్రమం సాగింది .
మీ గుండె ను చిక్కబట్టుకోండి. మైండ్ బ్లాంక్ అయ్యే నిజం వినండి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన 1913 నుండి 1938 లోపల దాదాపు 79,000 కి.మీ నడిచారట.

మహానుభావులతో పరిచయాలు

ఉత్తరాల ద్వారా ఆయన ఎందరో మహనీయులతో పరిచయాలు పెంచుకుని, స్నేహాన్ని కొనసాగించేవారు. లియో టాల్ స్టాయ్, అడాల్ఫ్ హిట్లర్, ఐన్ స్టీన్ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు. ఈ ఉత్తరాలలో నిత్యజీవితంలో వారెదుర్కునే ఇబ్బందులు చర్చించుకునే వారు. సాధించిన విజయాలకు ఒకర్నొకరు ప్రశంసించుకునేవారు. ఒక ఉత్తరంలో గాంధీ హిట్లర్ చర్యల పట్ల అసంతృప్తిని కూడా వెల్లడించారట.

సమయపాలన

సత్యాహింసలతో బాటు ఆయన జీవితంలో ప్రధానపాత్ర వహించిన వస్తువు ఆయన గడియారం. అదే ఆయనను The most Punctual Man of India గా నిలిపింది. ఇప్పుడది ఢిల్లీలోని National Gandhi Museumలో భద్రపరచబడి ఉంది. సభలకు, సమావేశాలకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా క్షమార్పణ కోలేవారు. జనవరి 30 ,1948 నాటి సాయంత్రం ప్రార్థనకు ఆలస్యంగా వెళ్లారు. ప్రజలలో మతవిద్వేషాలు కూడదని చెప్పాలనుకున్నారు. ప్రార్థనకు ఒక్క నిముషం ఆలస్యమైనా నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని ప్రారంభించారు. 5.12 గంటలకి ఆయన మనమద్య లేరు.

హే రామ్

పొరపాట్లు, తడబాట్ల నుంచి తనను తాను తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగిన ఓ మహర్షి గాంధీ. తనలోని కార్యదక్షత కేవలం భౌతిక శక్తికి చెందింది కాదని ఆయన అభిప్రాయం.అది తాను చివరిదాకా విశ్వసించిన ఉపవాసం , బ్రహ్మచర్యం, సత్యవ్రతాచరణల వల్ల కలిగిన మానసిక ధృడత్వమని వినయంగా తన ఆత్మకథలో పలుమార్లు చెప్పుకున్నారు.

సిరిసంపదలున్న కుటుంబంలో పుట్టినా సామాన్యుడిగా జీవితం గడిపాపారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి , పట్టుదల, నిరంతర కృషి, అహింసామార్గం పట్ల ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ చెప్పడం కాదు పాటించి చూపారు.

రచయిత్రి విజయ కందాళ తెలుపు కోసం చేసిన రచన – గత ఏడాది సమీక్షణం. దాన్ని ఇక్కడ చదవొచ్చు. అలాగే వారి ఆడియో రచనలు ఈ లింక్ ద్వారా వినవచ్చు. మొబైల్ 9912842104

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article