Editorial

Wednesday, January 22, 2025
ఆనందంహోలి తెలుపు : రంగుల ప్రకృతి - విజయ కందాళ

హోలి తెలుపు : రంగుల ప్రకృతి – విజయ కందాళ

హోలీ అనగానే రంగుల పండుగ కదా! అందుకే ఈ పండుగకు మూలమైన రంగుల గురించి కాస్త ముచ్చటించుకుందాం. రంగుల స్వరూప స్వభావాలను కొంచం గుర్తుచేసుకుందాం.

విజయ కందాళ

హోలి అంటే చాలు ఆకాశాన్నంటే సంబరాలు, వయసును మురిపించి, మరిపించే సరాగాలు. నేలకు దిగిన వర్ణవిన్యాసాలు. ప్రతి మొహమూ ఓ అధ్భుత కాన్వాస్ గా మారిపోతుంది. ప్రతి ముంగిలీ పలువర్ణాలతో చిత్రపటంలా రూపుదిద్దుకుంటుంది.

హోలీ అని మనం సింపుల్ గా పిలిచే ఈ పండుగకు ఎన్నో పేర్లు. హోలికా పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, డుండిక, కామదహనం, కామదహన పూర్ణిమ, కామదహనోత్సవం, డోలికోత్సవం – ఇలా ఎన్నో. ఎలా పిలిచినా జీవితాన్ని రంగులమయం చేసి వసంతాగమనానికి పట్టం కట్టడమే ముఖ్య ఉద్దేశ్యం.

హోలీ అనగానే రంగుల పండుగ కదా! అందుకే ఈ పండుగకు మూలమైన రంగుల గురించి కాస్త ముచ్చటించుకుందాం. రంగుల స్వరూప స్వభావాలను కొంచం గుర్తుచేసుకుందాం.

వివిధ రంగులు, మానసిక స్థితిపై వాటి ప్రభావాల గురించి చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ఫలితాలను బట్టి వివిధ రంగులను ఇష్టపడే వారి వ్యక్తిత్వాన్ని కూడా కొంత వరకు అంచనా వేయొచ్చట.

ఈ విశాల విశ్వం నిరంతర మార్పుకు సంకేతం. ప్రకృతి మారగానే దానిలోని రంగులూ మారతాయి. మరోలా చెప్పాలంటే రంగుల మార్పు వల్లే మనకు కాలం మారిందని కూడా  తెలుస్తుంది. దాని ప్రభావం మనస్సు మీద కూడా తప్పక ఉంటుంది.

వివిధ రంగులు, మానసిక స్థితిపై వాటి ప్రభావాల గురించి చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ఫలితాలను బట్టి వివిధ రంగులను ఇష్టపడే వారి వ్యక్తిత్వాన్ని కూడా కొంత వరకు అంచనా వేయొచ్చట. అందులో కాసిన్ని వివరాలను ఈ పండుగ సందర్భంగా గుర్తు చేసుకుందాం. మొదట తెలుపుతోనే మొదలెడుదాం.

పసిపాప నవ్వు లాంటి తెలుపు

స్వఛ్చతకు సంకేతం.

దీన్ని ఇష్టపడేవారు నిజాయితీగా, అమాయకంగా, నిరాడంబరంగా ఉంటారు. ఎవ్వరినీ నొప్పించకుండా తమ పని తాము చేసుకుని పోయే లక్షణం వీరిలో ఉంటుంది.

ఆశావాద దృక్పథంతో ఉన్నా సరే ప్రాక్టికల్ గా ఆలోచించి మరీ ప్రణాళిక సిధ్దం చేయడం వీరి ప్రత్యేకత. అయితే అన్ని రంగులూ తెలుపులో దాగి ఉన్నట్లుగా వీరిలోని భావాలు అంత త్వరగా బయటపడవనే చెప్పాలి.

శుభ సంకేతమైన ఎరుపు

దీన్ని ఇష్టపడే వారిలో దూకుడు, ధృఢమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. అవిశ్రాంతంగా పని చేస్తారు. గుండె నిబ్బరం, క్రమశిక్షణ బాగా ఎక్కువ. పోటీ తత్వం వీరికి ఇష్టం. ఎప్పుడూ ఏదో రకమైన లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసహనం వీరిలోని నెగిటివ్ లక్షణమైతే నిజాయితీ పాజిటివ్ లక్షణం.

ప్రేమ సంకేతమైన గులాబీ

మృదుస్వభావులు. ఆప్యాయత, అనురాగాలను కోరుతారు. సున్నిత మనస్కులు. త్వరగా ప్రతిస్పందిస్తారు. ఎవరినైనా సరే మృదుభాషణతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్నీ పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తారు. ప్రతి వ్యక్తిలో మంచిని చూస్తారు.

అస్తమయ భానుని రంగు ఆరెంజ్

విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడుతారు. జోవియల్ గా అందరితో కలిసి ఉంటారు. ఉత్సాహాన్ని సూచించే రంగు. వెచ్చదనానికి చిహ్నం ఈ రంగు. ఆశా పూర్ణ మనస్తత్వానికి గుర్తు. శక్తి సామర్థ్యాలకు ప్రతీక.

ఆనందాల లోగిలి పసుపు

ఈ రంగును ఇష్టపడేవారు ఆరుహ్లాదంగా, వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వ్యాపార దక్షత వీరిలోని అదనపు ఆకర్షణ. కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటారు. తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోడం చాలా ఇష్టం. ఎలాంటి సందర్భాన్నైనా తేలికగా హ్యాండిల్ చేయగలరు.

పైరుపచ్చల ఆకుపచ్చ

చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఊహలలో తేలియాడడం నచ్చదు. సున్నిత స్వభావం. స్నేహశీలురు. ఆరోగ్యానికి, సామరస్యానికి చిహ్నం ఈ రంగు. ఇది మన భావావేశాలను అదుపులో ఉంచుతుంది. అభివృధ్ధిని సూచించే రంగు కూడా.

చివరగా…నలుపు

హోదాకు, హుందాకు చిహ్నం. గౌరవానికి వీరి దృష్టిలో మొదటిస్థానం. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉబలాటం ఎక్కువ. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. ఊహించని విషయాలను వెలుగులోకి తెస్తారు.

ఫేవరెట్ కలర్ అంటే వ్యక్తిత్వమే!

ఇన్ని రంగులున్నా దేని ప్రత్యేకత దానిదే. దేని గొప్ప దానిదే. రంగులకు మనసుకు చాలా దగ్గరి సంబంధమే ఉంది. అసలు ఫేవరెట్ కలర్ అంటే మన వ్యక్తిత్వమే అని చెప్పాలి.

లేత రంగులు … కలివిడి మనసులు

విడివిడిగా కొన్ని రంగుల గురించి కొంచం తెలుసుకున్నాం గదా. మరిప్పుడు అన్నిటిని కలిపి మరి కాస్త.
అందరితో కలిసిపోయే మనస్తత్వమున్న వారు ముదురు రంగులను ఇష్టపడతారట. తటస్థ వైఖరి ఉన్నవారు సాదారంగుల నెంచుకుంటే, హుందాగా ఉండాలనుకునేవారు లేతరంగులను ఇష్టపడతారు.

మహిళామణులు ప్రత్యేక ఎంపిక

అధికశాతం మహిళల ఓట్లు బ్రైట్, లవ్లీ రంగులకేనట. అలాగే మల్టీకలర్స్ ఇష్టపడేవారిలో విభిన్నవ్యక్తిత్వాల మేళవింపు కనిపిస్తుంది.

స్నేహానికి సంకేతం

ఒకే రంగును ఇష్టపడే ఏ ఇద్దరి స్వభావాలు ఒకేలా ఉండకున్నా వారి మధ్య స్నేహం త్వరగా చిగురిస్తుందట. ఇవన్నీ అనేక పరిశోధనల అనంతరం సైకాలజిస్టులు తేల్చి చెప్పినవే.

క్రమక్రమంగా జనాలకు రంగుల శాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. తెలిసిందెంతో ఉన్నట్లు అనిపించినా, తెలుసుకోవాల్సింది మరెంతో. అందుకే పరిశోధనలు మరిన్ని కోణాలలో సాగుతూనే ఉన్నవి.

ఉగాదికి ఆహ్వానం

ఫలితాలను శాస్త్రజ్ఞుల కృషికి వదిలి, అంతవరకు మనం ఎంచక్కా ఇష్టమైన రంగులను జీవితంలోకి మరింతగా ఆహ్వానిద్దాం. ప్రకృతి అందాలను మన ముంగిట్లోకి తెచ్చేసుకుని, జీవితాన్ని మరిన్ని రంగులతో నింపేద్దాం. అందరం కలిసి సంతోషంగా, సరదాగా పలురంగుల పూర్ణిమను జరుపుకుందాం. అన్ని రంగులలోని మంచిని ఏరి, మన మనసుల్ని రాగరంజితంగా మార్చుకుందాం. రంగురంగుల వేడుకలతో రాబోయే నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదాం. ప్రకృతితో మమేకమై, దాన్ని కాపాడుతూ, మనల్ని మనం మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం.

రచయిత్రి విజయ కందాళ ఆడియో రచనలు ఈ లింక్ ద్వారా వినవచ్చు. వారి మొబైల్ 9912842104

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article