Editorial

Monday, December 23, 2024
కథనాలుఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి - వెంకట్ సిద్దారెడ్డి

ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి – వెంకట్ సిద్దారెడ్డి

ఇది ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి.
కానీ దానిగురించి చెప్పే ముందు….. నా గొడవ కొంచెం.

వెంకట్ సిద్దారెడ్డి

సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ, ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్ – మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుందేమోనని భయపడుతూనే మొదలుపెట్టి ఒక రాత్రి పూర్తిగా చదివేశాను. సరిగ్గా అలాగే జరిగింది ఖదీర్ బాబు పుస్తకం విషయం లో కూడా.

ఈ రెండు పుస్తకాలకీ ఉన్న పోలిక ఏంటంటే – వీళ్లిద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఎంతో సాధించిన తర్వాత, వారి అనుభవాలను చాలా ఇన్‍ఫార్మల్ వాయిస్ లో, ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అలాగే రెండు పుస్తకాల్లోనూ అథారిటేటివ్ వాయిస్ ఉండదు. టోన్ చాలా మోడెస్ట్ గా ఉంటుంది. మేము చెప్పిందే రైట్ అని తలబిరుపూ ఉండదు. అందుకే ఈ రెండు పుస్తకాలు చదువుతుంటే మనకి ఆప్తులైన వారితో మాట్లాడినట్టనిపిస్తుంది.

నేను కూడా ఈ మధ్య కథలు రాస్తున్నాను. ఇంకా రాయాలనుకుంటున్నాను. చాలా సార్లు నాకు తెలిసిన రచయితలతో కలిసి మాట్లాడి నా కథలని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అని సలహా తీసుకుందామనుకున్నాను. కానీ నాకు మరీ అంత బాగా పరిచయమున్న రచయితలు చాలా తక్కువ.అలాంటి సమయంలో ఈ బుక్ రిలీజ్ అయింది. రిలీజైన రోజే కొన్ని చాప్టర్స్ చదివేశాను. చదివేశాను అనడం కంటే చదివించింది అనడం కరెక్ట్. అంతా ఒకేసారి చదివేసి ఆయాసపడకండి అని ఖధీర్ బాబు ముందే వార్నింగ్ ఇచ్చినా, చదవడం మొదలు పెట్టాక ఆపడం కష్టం. ఏదైతేనేం. పూర్తి చేశాను.

ఐతే ఒక మనవి. ఇది సమీక్ష కాదు. ఏదో నాకనిపించిన నాకు తోచిన నాలుగు మాటలునిజాయితీగా పంచుకోవడమే!

https://www.facebook.com/venkatsiddareddy/videos/311509480863230

ఫస్ట్ కట్

పుస్తకం ఎలా ఉంది అంటే?… ఖదీర్ బాబు తో నాకు బాగా పరిచయం ఏర్పడి, ఒక సాయంత్రం పూట ఆయనతో కూర్చుని ఒక నాలుగైదు గంటలు – ఆయన కథల గురించి, ఆయనకు నచ్చిన కథల గురించీ – చెప్తుంటే హాయిగా విన్నట్టుంది. ఏదో మూడొందల పేజీల భారీ నాన్‌ఫిక్షన్ పుస్తకం చదివిన ఫీలింగ్ లేదు. కథలు రాయాలనుకున్న వాళ్ళకి, రాస్తున్న వాళ్ళకీ తప్పకుండా ఉపయోగపడే పుస్తకం. అసలు కథ అంటే ఏ మాత్రం ఇంట్రస్ట్ ఉన్నా వాళ్ళకి కూడా నచ్చేసే పుస్తకం. అది చెప్పాలనే ప్రయత్నమే ఇది రాయడం!

పుస్తక కథకు హీరో – ఫుట్ నోట్స్

ఇందులో మనం తెలుసుకున్న కొత్త కథలు, రచయితలు, వారి గురించి రాసిన ఫుట్ నోట్స్ చూస్తే – బాబోయ్, అసలు ఈ పుస్తకం ఎలా రాసాడ్రా బాబూ అనిపిస్తుంది. బహుశా వందేళ్ల తెలుగు కథ రాయబట్టే ఖధీర్ బాబు ఈ పుస్తకం రాయడం వీలైందేమో అనిపించింది. ఎందుకూ కాకపోయినా కేవలం ఫుట్ నోట్స్ కోసమైనా ఈ పుస్తకం చదవొచ్చు.

ఈ పుస్తకం చదివే తారాగణం? వారి పాత్రౌచిత్యా(త్రా)లు

చాలామందే చదువుతారు. చదివిన ప్రతి ఒక్కరూ ఇంకొక్కరికైనా చెప్తారు. ఎందుకంటే ఇందులో కరుణ ఉంది. బోల్డెన్ని జ్ఞాపకాలున్నాయి. ఇంకా…తనకి తెలిసింది నలుగురికీ పంచుకోవాలనే గుణం ఉంది. తెలుగులో ఇంకా మంచి కథలు రావాలనే తపన ఉంది. కాబట్టి ఇది కొత్త వాళ్లు,పాతవాళ్లు అందరూ చదువుతారు. ఎ ఉద్దేశంతో చదువుతారని అడిగితే గొప్ప చిక్కే …. ఎందుకంటే చదివేవారు అన్నిరకాల ఉద్దేశాలతో చదువుతారు. హమ్మయ్య ఈ పుస్తకం చదివేస్తే మనకీ కథలు రాయడం తెలిసిపోతుందనే అమాయకత్వం తోనూ, తొక్కలోది మనకి తెలియంది ఏం చెప్పుంటాడులే అనే గర్వంతోనూ, ఇతను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా రాసెయ్యగలుగుతున్నాడనే ఈర్ష్యతోనూ, ప్రేమతోనూ, కోపంతోనూ – ఇలా అన్ని ఉద్దేశాలతో చదువుతారు. మొత్తానికైతే చదివి తీరుతారు.

కానీ చదివేముందు బుక్ కవర్, వెనుక చాప్టర్స్ లిస్ట్, ఇప్పటికే అక్కడా ఇక్కడా వచ్చిన టాక్ బట్టి ఇది ఆషామాషీ పుస్తకం కాదనే చేతులోకి తీసుకుంటారు. తెలుగులో కథలు రాయడం గురించి వచ్చిన చాలా తక్కువ పుస్తకాల్లో ఇది ఒకటి కావడం, సైజు కూడా భారీగా ఉండడం వల్ల – బోర్ కొడ్తుందేమోనని భయమూ, ఏదో తెలుసుకోబోతున్నామనే ఉత్సుకతతోనే ఈ పుస్తకం తెరుస్తాం. అయిపోయాక మంచి ఫీలింగ్ తోనే మూసేస్తాం. తెలుసుకోవాలన్నోడికి తెలుసుకున్నంత ఉంది. (ఇంకా ఉంటే బావుండేది. నిజానికి ఇంకా చాలా చాలా ఉండాలనిపిస్తుంది. ఆ విషయం గురించి తర్వాత.)

అసలు కథేమిటంటే..?

ఒక సంవత్సరంలో తెలుగులో వేల కొద్దీ కథలొస్తున్నా అందులో మంచి కథలు చాలా తక్కువ ఉంటున్నాయి. అవి ఎక్కువ కావడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. కథలు రాయడానికి కాస్తా పిచ్చి ఉండాలి. కొంచెం భావుకత్వం ఉండాలి. అన్నింటికంటే ఎక్కువగా కరుణ ఉండాలి. రాయడంకంటే ముందు చదవడం తెలియాలి. మనకంటూ ఒక ధృష్టి కోణం ఉండాలి…అని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇంతే కాదు. ఇంకా కథా రచనకు సంబంధించి ఎన్నో విషయలాను ఖదీర్ మనతో ఈ పుస్తకం లో షేర్ చేసుకున్నారు. కొత్తగా కథలు రాసేవాళ్లకంటే -ఆల్రెడీ రాస్తున్న వాళ్లకి, కొన్ని రాసి ఆపేసిన వాళ్లకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. తట్టి లేపుతుంది. మనకి తెలియని ఎన్నో కథలని పరిచయం చేస్తుంది. ఎంతో మంది రచయితలకు దగ్గర చేస్తుంది. కొన్ని తెలిసిన విషయాలే అయినా భలే చెప్పాడే అనిపిస్తుంది. అసలు నాన్ ఫిక్షన్ ని కూడా ఇంత ఇంట్రస్టింగా రాయొచ్చా అనిపిస్తుంది. కాబట్టి ఈ పుస్తకం చదవాల్సిందే.

మరైతే అంతా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడూ ఒకటో రెండో చాప్టర్స్ చదవాలని ఖదీర్ బాబు చెప్పాడు కానీ, నేను చెప్పేదేంటంటే మొత్తం ఒకేసారి చదివెయ్యాలి. ఆ తర్వాత మనం రాయడం మొదలు పెట్టాలి. రాస్తూ ఉండగానో, రాయడం అయ్యాకనో అప్పుడు చాప్టర్ హెడింగ్స్ చూసుకుని మనకి కావాల్సినవి అప్పుడు మళ్లీ చదువుకుంటే మేలని నా అభిప్రాయం.

ఈ బుక్ లో ఏం చెప్పారు? అసలు థీమ్ ఏంటి?

ఇందులో ఖధీర్ బాబు భారీ ప్రకటనలు చేయలేదు. ఇలానే రాయాలని పట్టుపట్టలేదు. నేను ఇలా రాస్తుంటాను. నాకు నచ్చిన కొంత మంది ఇలా రాశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే ఉంది ఈ పుస్తకంలో. ఆ పైన చాలా ప్రాక్టికల్ విషయాల గురించి మనతో షేర్ చేసుకున్నారు. చాలా వరకూ అందరికీ ఉపయోగపడేవే. థీమ్ అండ్ ప్లాట్ గురించి, శైలీ-శిల్పం గురించి, కాన్‍ఫ్లిక్ట్ గురించి వచ్చిన మూడు చాప్టర్స్ మాత్రమే కొంచెం హెవీగా ఉంటాయి. అసలు ఇలాంటి “హౌ టు ” బుక్స్ దెబ్బతినేదే ఇక్కడ. ఎందుకంటే పైన చెప్పినవి సాంకేతిక అంశాలు. టెక్నిక్ కి సంబంధించినవి. వీటి గురించి ఎంత లాగినా తెగదు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరెవరో ఎన్నో చెప్పారు వీటి గురించి. కానీ పూర్తిగా ఎవరికీ క్లారిటీ ఉండదు. అందుకే ఖధీర్ బాబు థీమ్ విషయం లో థాంక్ గాడ్ అనేసి తప్పించుకున్నాడు. కానీ శైలీ-శిల్పం విషయంలో, కాన్‍ఫ్లిక్ట్ విషయంలో కూడా డెఫినిషన్లతో విసిగించకుండా ఉదాహారణలతో చెప్పి అర్థమయ్యేలా చేశాడు. ఆ విధంగా ఇది హౌటు గైడ్ అని అనుకోవడం కంటే ప్రాక్టికల్ ఎడ్వైజ్ ఫ్రం ఏన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

ఎప్పటికీ నిలిచిపోయే “చిత్రమేనా?”

తెలుగులో కొన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పుస్తకాలు కథల గురించి వచ్చుండొచ్చు కానీ ఇంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాంటి పుస్తకం రాలేదు, వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే దీని వెనుక చాలా శ్రమ ఉంది. తను చేస్తున్న పని మీద చాలా శ్రద్ధ ఉంది. అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి స్థలమూ కాలమూ ఈ పుస్తకానికి ఆపాదించలేం. ఇంకో వందేళ్ళు కాదు. తెలుగు కథ ఉన్నంతవరకూ ఈ పుస్తకం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు – ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడికైనా తెలుగు కథ గురించి తెలుసుకోవాలంటే ఖధీర్ రాసిన రెండు పుస్తకాల తర్వాతే ఏదైనా. ఒకటి వందేళ్ళ తెలుగు కథైతే రెండోది, ఈ పుస్తకం!

అసలు సబ్జెక్ట్ ని ఖధీర్ బాబు ఎలా డీల్ చేశారు?

చాలా తెలివిగా అని చెప్పొచ్చు. ఎందుకో చదివితే మీకే అర్థమవుతుంది. ఖధీర్ అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఒన్లీ బిగినింగ్.

అలాగే ఖదీరుడు పుస్తకానికి టైట్ట్ పేరు తెలివిగా పెట్టాడు. తెలివిగా అని ఎందుకన్నానంటే ఈ పుస్తకానికి పెట్టిన పేరు చూస్తే చాలు మీకర్థమవుతుంది. ఒక వేళ లోపలి కంటెంట్ లో ఒక్క పదం మార్చకుండా, ఈ పుస్తకానికి “కథలు ఎలా రాయాలి?” అని పేరు పెట్టుంటే – ఈ పుస్తకం అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది. అంటే కేవలం టైటిల్ వల్ల సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు, కథలు నచ్చకపోవడాలు చాలా సార్లు జరిగాయి. టైటిల్ ది ఏముంది. అది చాలా ఆబ్వియస్ విషయం అనుకుంటాం. కానీ ఇక్కడే ఖధీర్ చెప్పిన చాలా చిన్న చిన్న విషయాలు మనకి ఉపయోగపడతాయి. మనం చాలా ఆబ్బ్వియస్ అనుకున్న విషయాల గురించి జాగ్రత్త వహించమని చెప్తాడు.

ఈ పుస్తకంతో నాకున్న కాన్ఫ్లిక్ట్ అను పేచీ ఏంటంటే?

కథ అనేది ఎంతో విశాలమైన పరిధి కలిగి ఉన్నది. కథల్లో ఎన్నో రకాలున్నాయి. యాక్షన్ ఎడ్వంచర్ కథలుంటాయి. ఫాంటసీ కథలుంటాయి. డిస్టోపియన్ ఫిక్షన్ ఉంది. యంగ్ అడల్ట్ లిటరేచర్ ఉంది. ఎరోటికా ఉంది. హారర్, థ్రిల్లర్. మిస్టరీ హిస్టరీ. పల్ప్ ఫిక్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.అయితే ఈ పుస్తకంలో ఖధీర్ బాబు డీల్ చేసింది కేవలం “లిటరరీ ఫిక్షన్” గురించే. తెలుగులో మొదట్నుంచీ జాన్రా ఫిక్షన్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఖధీర్ బాబు కూడా దీన్ని వదిలేశారు. అయితే మొదట్నుంచీ ఖధీర్ బాబు రాసినవి లిటరరీ ఫిక్షన్ కథలే. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా వరకూ ఎక్స్‍టర్నల్! కానీ ఈ మధ్యనే – మెట్రో కథలు, బియాండ్ కాఫీ – లలో శైలి మార్చారు. బహుశా కొన్నేళ్ళ తర్వాత వచ్చే మరో ఎడిషన్ లో కొత్త ఛాప్టర్ లు యాడ్ అవుతాయని నమ్మకం. అప్పుడు – అసలు కథలు ఇలానే ఎందుకు రాయాలి? అనే ఒక చాప్టర్ ఉంటుందేమో!

క్లైమాక్స్

అసలు కథలు ఎందుకు రాస్తారు, ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు లాంటి విషయాలతో మొదలైన పుస్తకం చివరికొచ్చేసరికి చాలా ప్రాక్టికల్ సజెషన్స్ తో ముగుస్తుంది. మధ్యలో సంభాషణలు ఎలా రాయాలి, పంక్చుయేషన్ ఎలా ఉపయోగించాలి లాంటి ఆవసరమైన విషయాలు చర్చించాక చివరి చాప్టర్స్ లో చాలా ఫ్రెండ్లీ అడ్వైజెస్ ఇచ్చారు ఖధీర్. ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా విమర్శను ఎలా తట్టుకోవాలి? పుస్తకం ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, వేశాక ఏం చేయాలి లాంటి విషయాలు కొన్ని కథలు రాసి కథకులుగా ప్రాక్టీస్ లోకి వస్తున్న వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి.

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే –

ఇది చాలా మంచి పుస్తకం. ప్రస్తుతం చాలా అవసరమున్న పుస్తకం. సాదా సీదా గా ఉంటూనే చాలా గొప్ప విషయాలను తెలియచెప్పే పుస్తకం. కాబట్టి తెలుగు కథకులు, పాఠకులు, విమర్శకులు చదవాల్సిన పుస్తకం. కాబట్టి, దయచేసి చదవండి.

కథలు ఇలా కూడా రాస్తారు – మొహమ్మద్ ఖదీర్ బాబు. పేజీలు : 350. ధర: 349. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఉన్న122- 123 అన్విక్షికి స్టాల్స్ లో పొందవచ్చు లేదా ఈ amazon లింక్ క్లిక్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు.

More articles

1 COMMENT

  1. నమస్కారం మంచి విశ్లేషణ. చక్కటి సమాచారం. ఇది చదివాక పుస్తకం తప్పకుండా తెప్పించుకుని చదవాల్సిందే. అభినందనలు…గరిపెల్లి అశోక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article