Editorial

Monday, December 23, 2024
Peopleచీకటిని పారద్రోలే వెలుగు : వెంకట్ సిద్దారెడ్డి On కాశీభట్ల వేణుగోపాల్

చీకటిని పారద్రోలే వెలుగు : వెంకట్ సిద్దారెడ్డి On కాశీభట్ల వేణుగోపాల్

ఆయన మూడు నవలలను, “ట్వైలైట్ సీరీస్” గా ప్రచురించిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన రాసిన సరికొత్త నవల “అసత్యానికి ఆవల” ను ప్రచురించే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, ఒక సామాన్య పాఠకుడి మెదడుపై ఆయన సాహిత్యం కలిగించిన ప్రభావం గురించీ నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకూ కాశీభట్ల వేణుగోపాల్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపు…’చీకటిని పారద్రోలే వెలుగు’ అంటూ…

వెంకట్ సిద్దారెడ్డి

ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఎండాకాలం మధ్యాహ్నం.

కొత్తగా హైదరాబాద్ లో అడుగుపెట్టి, అప్పడప్పుడే టీనేజ్ దాటుతున్న ఒక యువకుడు.

జీవితమనే ఓపెన్ మైదానమూ ఒక జైలు లాంటిదే అని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న వయసు. పరిస్థుతులు, మనిషీ పోటీపడి బతుకు పగ్గాలను తన చేతుల్లోకి లాక్కోవలనుకునే పోరాటమే జీవితం అని ఇంకా తెలియని వయసు. బాధ్యతలు అనే కొత్త పగ్గాలతో జీవితం అతన్ని కంట్రోల్ చేయబోతున్న విషయం అప్పుడప్పుడే అర్థమవుతున్న కాలం.

ఆమీర్పేటలో ఏ బస్సెక్కితే నారాయణగూడలో కాలేజీ దగ్గర దింపుతుందో మాత్రమే తెలుసుకుని రోజూ కాలేజీ, ఇల్లు తప్ప మరేమీ ఎరుగని ఒక అమాయకపు జీవితం గడుపుతోన్న ఒకరోజు…

బస్ లక్డీకాపూల్ లో టెలిఫోన్ భవన్ మీదుగా వెళ్తుండగా, రోడ్డు పక్కన పేవ్మెంట్ పై కుప్పలుగా పోసున్న పుస్తకాలను చూసి, కాలేజీకి వెళ్లకుండా ఆ రోజంతా పుస్తకాలు తిరగేస్తూ, జేబులో ఉన్న యాభై రూపాయలతో, ఎందుకు ఆకర్షించిందో ఏమో కానీ “తపన” పుస్తకం కొనుక్కున్నాడు. బస్సెక్కి కిటికీ పక్కన సీటులో కూర్చున్నాడు.

“తపన” పుస్తకం కొనుక్కున్నాడు. ఎప్పుడూ వినని కొత్త పదాలు, ఎన్నెన్నో కొత్త విషయాలు, కొత్త కొత్త పేర్లు.

పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు అతను.

బస్సు బయల్దేరింది. మళ్లీ ఎక్కడో బస్ ఆగింది. చివరి స్టాప్ లో అందరూ దిగేశారు. మళ్లీ బస్ వెనక్కి తిరిగింది. అతను మాత్రం అదే కిటికీ సీట్లో కూర్చుని చదువుతూనే ఉన్నాడు. జేబులో ఉన్న బస్ పాస్ ఇచ్చిన ధైర్యం కంటే, ఈ పుస్తకం అయ్యేవరకూ ఎటువంటి డిస్టర్బెన్స్ అతనికి ఇష్టం లేకపోవడమే అతని సుధీర్ఘ ప్రయాణానికి కారణం. అంత వేగంగా చదివించే పుస్తకం అతను అంతవరకూ చదవలేదు. రెండు మూడు గంటల తర్వాత పుస్తకం మూసేసి, తేరుకుని చూస్తే చార్మినార్ ఎదురుగా నిలబడి ఉన్న బస్ లో ఉన్నాడని గమనించాడతను.

ఎప్పుడూ వినని కొత్త పదాలు, ఎన్నెన్నో కొత్త విషయాలు, కొత్త కొత్త పేర్లు.

మోంటాజ్ అంటే ఏమిటి? Havelock Ellis ఎవరు? వ్యాలియం? ఇటాలియన్ స్ఫగటీ అంటే ఏమిటో? షెల్లీ, మొజార్ట్, తలత్, జిబ్రాన్, ఫ్రాయిడ్ – ఎవరు వీళ్ళంతా? డివైన్ కామెడీ అంటే ఏంటి? – పుస్తకం మూసేసాక ఎన్ని ప్రశ్నలో? ఇవేవీ తెలియకుండా ఎంతటి అజ్ఞానంలో బతుకుతున్నానని ఒక్కసారి ఆలోచించుకున్నాడు. అప్పట్నుంచీ పుస్తకాలు కొనడమూ, వాటిలో కొన్నింటిని చదవడమూ అలవాటయ్యంది. కానీ ఎన్ని తెలుగు పుస్తకాలు చదివినా తపన చదివిన కిక్కే రాలేదు. ఎప్పుడో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఎక్కడో లండన్ లైబ్రరీలో దొరికిన రేమండ్ క్విన్యూ, మురాకమీ, అకుతగవా, బి.యస్.జాన్సన్ లాంటి రచయితల పుస్తకాలు చదివాక గానీ అతనికి కాశీభట్లతో పోల్చదగ్గ రచయుతలే కనిపించలేదు.

“తపన” ముందుమాటలో కాశీభట్ల చెప్పినట్టు, సామాన్య పాఠకుడి సోమరి మెదడుని తట్టిలేపి వ్యాయామం కలిగించాల్సిన అవసరమూ, బాధ్యతా సీరియస్గా కలం పట్టిన ప్రతి ఒక్కరిమీదా ఉన్నాయని నమ్మి, అంతటి బాధ్యతను నెత్తికెత్తుకోలేక అప్పటివరకూ కథలు రాద్దామనే ఆలోచనలో ఉన్న అతను పెన్ మూసి పక్కన పెట్టేసి పాఠకుడిగానే మిగిలిపోయాడు.

కానీ జీవితం మనతో ఆడే అటలు ఎప్పుడో ఒకేలా ఉండవు. దొంగాపోలీసాటలా కాసేపు మనం జీవితం వెంట పరిగెడితే, ఇంకాసేపటికి జీవితం మనల్ని వెంటపడి పరుగులు తీయిస్తుంది. ఇలా జీవితం ఆడిన ఆటలో పాఠకుడిగానే మిగిలిపోవాలనుకున్న అతను ఒకరోజు హఠాత్తుగా రచయిత అయ్యాడు. అతను రాస్తున్నంత సేపూ మెదడులో కొమ్మలు వేస్తున్న ఆలోచనల చివరన వేలాడుతున్నవి మాత్రం కాశీభట్ల, త్రిపుర, ఆర్.యస్.సుదర్శనం లాంటి కొంతమంది రచయితల కథలే!

అతను కథలు రాయడమూ అయింది. ఆ కథల గురించి స్పందనకోసం ఎదురుచూస్తూ బొక్కబోర్లాపడడమూ అయింది. ఇదంతా అతనికి అలవాటే అయినా, నిరాశ పడకుండా ఉండడం అలవాటు కానీ ఒకరోజు…

అతని ఫోన్ మోగింది.

ట్రూ కాలర్ లో “కాశీభట్ల వేణుగోపాల్” అని కనిపించింది.

అతని ఆశ్చర్యానికి హద్దులు లేవు.

అతను రాసిన ఒక కథ చదివి మాట్లాడాలని కాశీభట్ల ఫోన్ చేశారు.

జీవితం మనతో ఎన్ని ఆటలాడినా, ఒక్కోసారి కొన్ని ఆటల్లో మన పాత్రేమీ లేకుండానే మనల్ని గెలిపిస్తుంది జీవితం. అలా అతనికి కాశీభట్లతో పరిచయం అనే గెలుపుని ప్రసాదించింది జీవితం. చుట్టూ ఉన్నదంతా శూన్యమే అని నిర్థారణ అయిపోయిన తర్వాత ఈ శూన్యంలో మన ఉనికి ప్రశ్నార్థం కాకుండా కాపాడుతుంది కొంతమంది వ్యక్తులతో పరిచయం. అలా అతనికి కాశీభట్ల పరిచయం అయ్యాడు. జీవితమనే ఓపెన్ జైలునుంచి తప్పించుకునే మార్గాలన్నీ కాశీభట్ల పుస్తకాల్లో రహస్యంగా కోడిఫై చేసున్నాయని నమ్మిన వ్యక్తికి స్వయానా కాశీభట్లే ఫోన్ చేయడం, మాట్లాడ్డం, కలవడం – ఎవరో కొద్దిమందికి మాత్రమే కలిగే భాగ్యం. ఆ భాగ్యం పొందిన వ్యక్తి రాసిన వాక్యాలే మీరిప్పుడు చదువుతున్నది.

రోజువారీ జీవితంలోని దుమ్మూ ధూళితో కప్పబడిన జీవితపు అస్పష్టతలను తొలగించి మనిషిలోని నిజరూపాన్ని బయటపెట్టే ప్రయత్నమే కాశీభట్ల రచనలు. మొదటి నవల “నేనూ-చీకటి” నుంచి ఇప్పుడు వస్తున్న సరికొత్త నవల “అసత్యానికి ఆవల” వరకూ ప్రతీ కథలో ఇదే ఆయన ప్రయత్నం.

 

తెలుగు సాహితీలోకమంతా గర్వపడాల్సిన విధంగా రచనలు చేసిన రచయిత కాశీభట్ల వేణుగోపాల్. కానీ అప్పటికే ఏర్పరచబడిన పఠనాభిరుచులతో, ఇదే సాహిత్యం అని స్థిరాభిప్రాయం ఏర్పరుచుకుని ఇప్పటికీ అదే పాత సాహిత్యం చదువుకుంటూనో, లేదంటే అసలు చదవడమే మానేసిన తెలుగు పాఠకుల మధ్యలో అస్సలు ఉండాల్సిన రచయిత కాదు కాశీభట్ల వేణుగోపాల్. ఎక్కడో ఏదో చిన్న యూరోపియన్ దేశంలో పుట్టబోయి దారితప్పి ఇక్కడ తెలుగుదేశంలో పడిపోయాడీయన. మధ్యతరగతి బతుకుల్లోని సాధారణతను, తెలుగు సాహిత్యం అనే environment లోని కంట్రోల్డ్ నెస్ నీ స్వయంగా విస్మరించి ఒక కొత్త ఎక్స్ప్రెషన్ అన్వేషణలో ప్రయోగాలు చేస్తూ తన దారిని తానేసుకున్న రచయిత కాశీభట్ల.

ఆయన రచనలు కొంతమందిని కలవరపెట్టాయి. అయినా ఎందుకో చాలామందికి ఆయన రచనల పట్ల ఒక ఉదాసీనత. ఇంకా చాలామంది తెలుగు పాఠకులకైతే ఇన్నేళ్ల తర్వాత కూడా కాశీభట్ల సాహిత్యం పరిచయమే లేదు. ఇప్పటికీ మహాప్రస్థానం కథల పుస్తకమని, మైదానం సెక్స్ పుస్తకమనీ నమ్మి రోజూ చీప్ గా అమ్ముడుపోతున్న తెలుగు పాఠకులకి కాశీభట్ల రచనలు తెలిస్తే ఎంత? తెలియకపోతే ఎంత? అని ఒక్కోసారి అనిపించినా, నాలాగే మరొక నలుగురికి ఆయన సాహిత్యాన్ని పరిచయం చేస్తే మంచిదే కదా అని ఇంకొకసారి అనిపిస్తుంది.

నిరంతరం ఏదో తెలియని వెలితి. చింత. ఎగిరిపోవాలనే కోరిక. రెక్కలు తెంపబడ్డ పక్షి. వింతప్రపంచంలో అజ్ఞాతవాసి. పరిస్థుతులకు ఎదురీదుతూ నిరంతర పోరాటం. ఇబ్బందులు. ఇరుకు ఇళ్ళు. అంతే ఇరుకు మనసులు, తీరని కోరికలు – మధ్యతరగతి జీవితంలోని ఈ అంశాలన్నీ అక్షరాలై ఖాళీ పేజీల్లోకి ప్రపహించడమే కాశీభట్ల రచనలు. రోజువారీ జీవితంలోని దుమ్మూ ధూళితో కప్పబడిన జీవితపు అస్పష్టతలను తొలగించి మనిషిలోని నిజరూపాన్ని బయటపెట్టే ప్రయత్నమే కాశీభట్ల రచనలు. అంతేకాదు చదివే పాఠకుల స్వంతభావనల వెనుక వున్న స్వాతిశయాన్నీ, నార్సిసిజంనీ బట్టబయలు చేస్తాయి. మొదటి నవల “నేనూ-చీకటి” నుంచి ఇప్పుడు వస్తున్న సరికొత్త నవల “అసత్యానికి ఆవల” వరకూ ప్రతీ కథలో ఇదే ఆయన ప్రయత్నం.

అయన రచనలను ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటే మన జీవితంలోని గందరగోళమూ అర్థమయ్యి చల్లని రాత్రిలో వెచ్చదనాన్నిచ్చే దుప్పటిలా మనల్ని కప్పి సేదతీరుస్తాయి కూడా!

ఆయన రాసే ఒక్కో అక్షరం ఏదో చీకటిని చీల్చుకుని వచ్చిన మెరుపులా, భూకంపపు ప్రకంపనల్లా, రాగాలాపనలోని తీవ్రస్థాయిలా ఉంటాయి. అయన రచనలను ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటే మన జీవితంలోని గందరగోళమూ అర్థమయ్యి చల్లని రాత్రిలో వెచ్చదనాన్నిచ్చే దుప్పటిలా మనల్ని కప్పి సేదతీరుస్తాయి కూడా!

ఆయన రచనలోని చీకటిని మాత్రమే చూసేవాళ్లు, ఆయన అక్షరాలు రాతి మీద చిందిన నీటిబిందువులని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాశీభట్ల రచనలన్నీ మనుషుల దారుణ ప్రవర్తనల గురించి రాసే డార్క్ లిటరేచర్ అనుకుంటారు చాలామంది. కానీ ఆయన పుస్తకాల్లో – “అంతరంగితను కోరుకున్నప్పుడు మనిషి మనిషి నుంచి తప్పుకోడానికి అవసరమైన సభ్యత యెన్ని వేల సంవత్సరాల క్రితం జన్మించిందో…!” అనే అద్భుతమైన ఆలోచనలు కలిగివుంటాయి. చిన్న చిన్న ఎమోషన్స్ కి కదిలిపోయే మనుషులుంటారు. అంతే కాదు. “ఇట్లాంటి ఏమోషన్లకి అతీతంగా బతికే బతుకు ఎందుకు?” అని ప్రశ్నిస్తాడు. ఆయన రాసిన దాంట్లో ఉన్న చీకటిని పారద్రోలే వెలుగూ ఆయన కథల్లోనే ఉందని తెలుసుకోడానికి కొంతసమయం పడ్తుంది. అందుకు సామాన్య పాఠకుడు తన మెదడుతో కొంత వ్యాయామం చేయించాలి.

గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి, సాదా సీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన వాక్యాలు ఒక ఇమేజే మీద మరొక ఇమేజ్ ఏర్పడి form అయ్యే మాంటేజ్ లు. ఇంగ్లీషూ, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాషగా morph అవుతుంది. కథ ముందుకు సాగుతూండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తుంటాడు.

మొదటి రచన “నేనూ-చీకటి” లో ఎంత స్ట్రాంగ్ గా తన ఐడియాలకు అక్షరరూపం ఇచ్చారో, ఇప్పుడు వస్తున్న “అసత్యానికి ఆవల” లో కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మొదటి రచన “నేనూ-చీకటి” లో ఎంత స్ట్రాంగ్ గా తన ఐడియాలకు అక్షరరూపం ఇచ్చారో, ఇప్పుడు వస్తున్న “అసత్యానికి ఆవల” లో కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడో కర్నూల్ లో ఒక గదిలో ఒంటరి జీవితం గడుపుతూ కూడా మారుతున్న ప్రపంచ వైఖరినీ అంత స్పష్టంగా ఎలా తన కిటికీలోంచి గమనిస్తున్నారో అనిపించి ఇంత వండర్ఫుల్ రైటర్ తెలుగులో ఉండడం ఆనందం కలిగిస్తుంది.

అయన రచనా శైలి ఒక వైపు మనల్ని కలవరపెడ్తుంది. ఆయన కథలోని పాత్రలు మన ముందు దర్శనమిచ్చి భయపెడ్తాయి. వారు రక్తమాంసాలతో మన ముందు కదలాడ్డమే కాకుండా వారి వారి ఫ్రాగ్రెన్స్ కూడా మన ముక్కుపుటాలకు చేరి మనమూ ఆ కథలోని unnamed character గా మారిపోతాం.

“అసత్యానికి ఆవల” చదివాక మీకు ఈ కథలోని అసత్యం అనబడే A.సత్యం, నాగలింగం, షణ్ముఖ లాంటి పాత్రలు మీ ఊర్లోనో, మీ జీవితంలోనో కనిపిస్తే అది రచయిత తప్పు కాదు. కనిపించపోతే అది ఎవరి తప్పు అని మీరడగొచ్చు. అది కూడా రచయిత తప్పు కాదు. మనం చుట్టూ చూడ్డం మానేశామని అర్థం. లేదంటే మన జీవితంలోని డార్క్ నెస్ ని మనం ఒప్పుకోలేనంతగా మనల్ని మనం మోసం చేసుకుంటూ బతికేస్తున్నామని కూడా అర్థమేమో?

ఇరవై ఏళ్ల క్రితం తపన చదివినప్పుడు, ఇప్పుడు మళ్లీ “అసత్యానికి ఆవల” చదివినప్పుడూ కలిగిన స్పందన ఒకటే – ఇలా రాసే వాళ్ళు తెలుగులో ఇంకొకరున్నారా? మన చుట్టూ ఉన్న ఈ disjointed ప్రపంచాన్ని, ముక్కలైన మనసుల్నీ ఆయన అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్థంచేసుకోలేదు. మనిషి అస్థిత్వాన్ని ఆయన ఆవిష్కరించినట్టుగా మరెవ్వరూ చేయలేదు. తెలుగులో ఇప్పటివరకూ అత్యంత modern fiction రాసిన రచయిత ఎవరూ అంటే నోటికొచ్చే మొదటి పేరు – కాశీభట్ల.

నాలా నేను కథలు చెప్పాలని అనుకుంది ఈయన్ని చదివిన తర్వాతే! అందుకు నేను ఎప్పటికీ అయనకు కృతజ్ఞతా భావంతో ఉండిపోతాను.

గత రెండు దశాబ్దాలుగా నన్ను వెంటాడి వేధించిన తెలుగు సాహిత్యం ఏదైనా ఉందంటే అది కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకాలే! ఈ ఇరవైళ్ళ జీవితంలోని ఎత్తుపల్లాలు, సుఖదుఃఖాలు, జయాపజయాలు, కోపాలు, తాపాలు అన్నింటి మధ్య ఆయన సాహిత్యం అప్పుడప్పుడూ నా జీవితాన్ని మెరిపిస్తూనే ఉంది. ఈ సమయాలన్నింటిలో ర్యాండమ్గా తపనలోంచో, నేనూ చీకటిలోంచో, నికషంలోంచో ఏదో కొన్ని పేజీలు చదివేసి పుస్తకం మూసేసాక, జీవితం మళ్లీ కొత్తగా మొదలైనట్టనిపిస్తుంది. నేను రాయాలనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ కోసం చాలా ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను. కొత్త ఎక్ప్రెషన్స్ ని పుస్తకంలో రాసుకుంటాను. అలా తెలుగులో ఒక సెంటన్స్ రాయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ ప్రయత్నాలేమీ అవసరం లేకుండానే కాశీభట్ల పుస్తకం తెరిచి కొన్ని పేజీలు చదివితే ఏదో కొత్త శక్తి వచ్చినట్టు పదాలు పేజీల మీద ఎగెరిగిరి పడుతుంటాయి. ఆయన రచనలు చాలామందికి కొత్తదారిని చూపాయి. చెప్పే విషయంలో ఏముంది? అందరూ ఏదో ఒకటి చెప్తారు. కానీ ఆ విషయం అందరిలా చెప్పకుండా ఒక ప్రత్యామ్నయ మార్గం వెతుక్కుని చెప్పాలని ఆయన రాతల ద్వారానే నేర్చుకున్నాను. నిజానికి అందరిలా అనడంకూడా తప్పే! నాలా నేను కథలు చెప్పాలని అనుకుంది ఈయన్ని చదివిన తర్వాతే! అందుకు నేను ఎప్పటికీ అయనకు కృతజ్ఞతా భావంతో ఉండిపోతాను.

ఏదో జీవితం ఆడిన ఆటలో కలిగిన ఆయన పరిచయ భాగ్యం మా చేత ఆయన మూడు నవలలను, “ట్వైలైట్ సీరీస్” గా ప్రచురించిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన రాసిన సరికొత్త నవల “అసత్యానికి ఆవల” ను ప్రచురించే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, నాలాంటి సామాన్య పాఠకుడి మెదడుపై ఆయన సాహిత్యం కలిగించిన ప్రభావం గురించీ నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకూ అయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ…

అసత్యానికి ఆవల – కాశీభట్ల వేణుగోపాల్. పేజీలు : 150. ధర: 200. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఉన్న122- 123 అన్విక్షికి స్టాల్స్ లో పొందవచ్చు లేదా ఈ amazon లింక్ క్లిక్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article