Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఒత్తిడి నుంచి లే... – వెలుతురు కిటికీ కథల పిలుపు

ఒత్తిడి నుంచి లే… – వెలుతురు కిటికీ కథల పిలుపు

ఈ వారం వెలుతురు కిటికీ అద్భుతమైన కథల బడి. ఒత్తిడిని తొలగించే చిన్న చిన్న కథలు, అనుభవాలు, ఉదాహరణలు, సూచనల సమాహారం. చదవండి. వీటిల్లో అప్పుడప్పుడూ ఎదో ఒకదాన్ని జ్ఞాపకం చేసుకొండి. అది మీలో మంచి మార్పుకు దారి చూపు. మరి, తెరవండి కిటికీ…వెలుతురు తెలుపు.

 సిఎస్ సలీమ్ బాషా

ఒక ప్రొఫెసర్ తన తరగతి గదిలోకి ఒక గ్లాసు నీళ్ళతో వచ్చాడు. గదిలోని ప్రతి ఒక్కరూ “సగం ఖాళీ గా ఉందా లేదా సగం నిండి ఉందా” అని అడుగుతాడనుకున్నారు. బదులుగా, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ప్రొఫెసర్ “నేను ఒక నిమిషం గ్లాసును పట్టుకుంటే? ”, అని అడిగాడు. “ఏమీ కాదు” అని విద్యార్థులు ఏకగ్రీవంగా సమాధానం ఇచ్చారు. “నేను ఒక గంట పాటు పట్టుకుంటే? ” అని ప్రొఫెసర్ అడిగారు.”మీ చేతులు నొప్పి పుడతాయి” అని విద్యార్థులలో ఒకరు సమాధానం ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే!, కానీ నేను రోజంతా దానిని పట్టుకుంటే ఏమవుతుంది”, అని ప్రొఫెసర్ ప్రశ్నించాడు.

“మీ కండరాలు ఒత్తిడికి గురవుతాయి. అలాగే పక్షవాతం కూడా రావచ్చు అని విద్యార్థులు చెప్పారు. “మీరు చెప్పింది నిజమే!”, అని “కాబట్టి నొప్పి లేకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి?” అని ప్రొఫెసర్ అడిగాడు.” గ్లాసును పక్కన పెట్టేయాలి “, ఒక విద్యార్థి సమాధానం ఇచ్చాడు.

ఎక్కువసేపు నేను దానిని పట్టుకున్నాను కాబట్టి అది బరువు అనిపించింది. జీవితంలో సమస్యలు కూడా అంతే.

అప్పుడు ఆ ప్రొఫెసర్ “అన్ని సందర్భాల్లో గ్లాస్ బరువు మారలేదు. కానీ, ఎక్కువసేపు నేను దానిని పట్టుకున్నాను కాబట్టి అది బరువు అనిపించింది. జీవితంలో సమస్యలు కూడా అంతే. మీరు వాటి గురించి కాసేపు ఆలోచిస్తే, ఏమీ జరగదు. వాటి గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మీరు బాధపడడం ప్రారంభిస్తారు. వాటి గురించి ఇంకా ఎక్కువసేపు ఆలోచిస్తే , మీరు ఒత్తిడిని అనుభవిస్తారు అలాగే మీకు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

జీవితంలో సమస్యల గురించి ఆలోచించడం ముఖ్యం. కానీ, మీరు ఒత్తిడిని ఎక్కువసేపు మోయకూడదు, అది మీ జీవితాన్ని స్తంభింపజేయడం ప్రారంభిస్తుంది. మీ ఒత్తిళ్లను వీడటం చాలా ముఖ్యం. రోజంతా మీ ఒత్తిడిని మోయకండి మీరు పడుకునే ముందు గ్లాస్ ను పక్కన పెట్టాలని గుర్తుంచుకోండి!” అన్నాడు.

రెండో కథ…

ఒక వ్యాపారస్తుడు తన గదిలో ఎంత వెతికినా తన చేతి గడియారం కనపడలేదు. అప్పుడు అతను తన భార్యను పిలిచి గడియారం వెతక మన్నాడు. ఆమెకు కూడా ఎంత వెతికినా అది కనపడలేదు. అప్పుడు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కూడా దాన్ని వెతకడం మొదలు పెట్టారు. చాలా సేపు పిల్లలు వెతికినా తర్వతా కూడా గడియారం దొరకలేదు. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో ఆయన ఫ్రెండ్ వచ్చి ఏమైంది? అని అడిగాడు. గడియారం కోసం వెతుకుతున్నామని ఆ వ్యాపారస్తుడు చెప్పాడు. నా ఫ్రెండు నవ్వి ” మీరంతా బయటికి వెళ్ళండి. నేను దాన్ని వెతికి తీసుకు వస్తాను” అన్నాడు. కాసేపటి తర్వాత ఆ ఫ్రెండ్ వాచ్ తో బయటికి వచ్చాడు. వ్యాపారస్తుడు ఆశ్చర్యపోయి “ఇంతమంది వెతికితే మాకు దొరకలేదు, నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు.
దానికి ఆ ఫ్రెండు నవ్వి ” నేను ఏమీ చేయలేదు. కాసేపు ఊరికే కూర్చున్నాను. గడియారం శబ్దం వినిపించింది. అప్పుడు నాకు గడియారం ఎక్కడుందో తెలిసిపోయింది” అన్నాడు.దీని అర్థం ఏంటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే పని సులువుగా అవుతుందని, అదే మనసు గందరగోళంగా ఉంటే ఏ పని చేయలేమని…

పైన చెప్పిన రెండు సందర్భాలలో, ఒక విషయం స్పష్టమవుతుంది. అదే మనం ప్రశాంతంగా ఉండాలన్నది… మరొక విషయం ఏంటంటే రెండింటికి “ఒత్తిడి” అన్నది కారణమని..

ఒత్తిడే మహమ్మారి!

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న మహమ్మారి ” కరోనా “. దీనికి పెద్దగా మందులు లేవు. అది ఈ మధ్యనే వచ్చింది. దానికన్నా ప్రమాదకరమైన రోగం “ఒత్తిడి”. విచిత్రమేమిటంటే అది అసలు ఉన్నట్టు కూడా చాలామందికి కి తెలియదు. బయటికి కనబడదు. ఎన్నో రోగాలకు మూలం. ప్రస్తుతం సమాజంలో ఎంతోమందిని తినేస్తున్న అతిపెద్ద మహమ్మారి! దీనికి కూడా మందులు లేవు. “Stress is the mother of all diseases” అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఈ కరోనా కాలంలో ఇది మరింత ప్రమాదకరమని కూడా చాలామంది శాస్త్రవేత్తలు డాక్టర్లు చెబుతున్నారు.

అసలు “ఒత్తిడి” అంటే ఏమిటి?

“మన ఊహలకు, ఆలోచనలకు, ఆశలకు వాస్తవానికి ఉన్న అంతరం (it is a gap between our expectations and reality”. ఈ అంతరం (gap) ఎక్కువయ్యేకొద్దీ ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. సింపుల్ గా చెప్పాలంటే మనకు అనుగుణంగా ఏదైనా లేనప్పుడు ఒత్తిడి వస్తుంది.

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు రెండు గంటలపాటు కదలకుండా కూర్చుంటాం. అప్పుడు ఏమీ అనిపించదు. అదే ఆఫీసులో లేదా షాపింగ్ మాల్ లో ఎవరికోసమన్నా వెయిట్ చేస్తూ రెండు గంటలపాటు కూర్చోగలమా? కూర్చోలేము. బోర్ కొడుతుంది, చిరాగ్గా ఉంటుంది. మనం వెయిట్ చేస్తున్న వారు రాకపోతే కోపం వస్తుంది. అసహనం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఒత్తిడి తాలూకు లక్షణాలు. మొదట చెప్పిన ఉదాహరణలో సినిమా నచ్చకపోయినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. బస్టాప్ లో బస్సు కోసం ఎదురు చూడడం కూడా అంతే. కాళ్లు లాగినట్లు ఉంటుంది, ఎక్కడైనా కూర్చోవాలి అనిపిస్తుంది, చిరాగ్గా ఉంటుంది. అదే గర్ల్ ఫ్రెండ్ కోసం లేదా నచ్చిన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తే ఏమి అనిపించదు. మానసికంగా మాత్రం రెండు సందర్భాల్లోనూ శారీరకంగా అదే పరిస్థితి ఉన్నప్పటికీ, మానసికంగా మాత్రం గందరగోళంగా ఉంటుంది. దాన్నే సింపుల్ గా ఒత్తిడి అంటారు.

మూడో కథ…

సాధారణంగా పిల్లల్లో కనిపించే ఒక ఉదాహరణ చూద్దాం.

9 గంటలకు మోగిన స్కూల్ బెల్ కు పిల్లలు నిదానంగా ఏడ్చుకుంటూ నీరసంగా గేటు లో నుంచి స్కూల్ లోకి వెళ్తారు, అదే బెల్ సాయంత్రం నాలుగు గంటలకు మోగినప్పుడు అదే గేటులో నుంచి పిల్లలు ఉత్సాహంతో ఉరకలేస్తూ బయటికి పరిగెడతారు. ఒకసారి ఒత్తిడి కలిగించే విషయం, మరోసారి ఆనందాన్ని కలిగిస్తుంది? మొదటిది పిల్లలకి నచ్చనిది, రెండోది పిల్లలకి నచ్చేది. కాబట్టి మనకు నచ్చడం, నచ్చకపోవడం, మనకు సరిపోవడం, సరిపోకపోవడం, మనకు ఇష్టం ఉండడం, ఇష్టం ఉండకపోవడం వీటి మీద ఒత్తిడి అనేది ఆధారపడుతుంది.

తమాషా ఏమిటంటే మనిషికి ఒత్తిడి అవసరం. దాన్ని సానుకూల ఒత్తిడి “యూస్ట్రెస్” (eustress) అంటారు- ఇది మనిషికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఉత్సాహాన్నిస్తుంది. అయితే అది మందులాగా కొంచెం మాత్రమే ఉండాలి. అయితే అది ఎక్కువ స్థాయిలో ఉంటే దాన్ని ప్రతికూల ఒత్తిడి “డిస్ట్రెస్స్”(distress) అంటారు. అదే ప్రమాదకరం. ఒత్తిడి కూడా పాము విషం లాంటిదే. కొంచెం ఉంటే ఒక మందు లాగా పనిచేస్తుంది, కాస్త ఎక్కువైనా విషం లాగానే పనిచేస్తుంది. అంతే తేడా!

ఒత్తిడి ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుంది?

ఇక్కడ బుద్ధుడు చెప్పిన ఒకటి రెండు అంశాలు ప్రస్తావించుకుందాం.

“Expectations always lead to disappointment”. ఇది చాలా గొప్ప మాట. ఎవరి నుంచైనా, దేని గురించైనా ఆశించడం అనేది ఎప్పుడూ నిరాశపరుస్తుంది. అది ఒత్తిడికి దారితీస్తుంది. పిల్లలు చదువులో కావచ్చు, మన డబ్బు సంపాదనలో కావచ్చు, స్నేహితుల ప్రవర్తన కావచ్చు, సమాజంలో మంచి పేరు గురించి కావచ్చు. ఇలా ఏదైనా సరే ఆశించడం ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం ఎప్పుడైనా స్నేహితుల ఇళ్లకు వెళ్తాం. అక్కడ వాళ్ళు కాఫీ ఇవ్వరు, కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. మనం బయటకు వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అవుతాం. అక్కడ ఏదో ఒక మర్యాద మనము ఆశించాము. అది జరగలేదు. జీవితంలో చాలా మటుకు ఆశించడం వల్లనే మనకు ఒత్తిడి వస్తుంది.

చివరికి మిగిలింది ఏమిటి అని అడిగాడు, అతను “సంతోషం” అన్నాడు. “ఇక వెళ్లి రా” అని చెప్పాడు బుద్ధుడు.

అహం అన్నది ఒత్తిడికి కారణమవుతుంది. ఒకసారి ఒకతను బుద్ధుడి దగ్గరికి వెళ్లి ” నాకు సంతోషం కావాలి” అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆ వాక్యాన్ని పలక మీద రాయమన్నాడు. అతను అలాగే రాశాడు. దాన్ని చూసిన బుద్ధుడు “నాకు” అంటే అహం, దాన్ని తుడిచేయమన్నాడు. అతను అలాగే చేశాడు. మళ్లీ బుద్ధుడు ” కావాలి” అంటే కోరిక. దాన్ని కూడా తుడిచేయమన్నాడు. చివరికి మిగిలింది ఏమిటి అని అడిగాడు, అతను “సంతోషం” అన్నాడు. “ఇక వెళ్లి రా” అని చెప్పాడు బుద్ధుడు.

అంటే దాని అర్థం కోరికలు ఉండకూడదని కాదు. సన్యాసిలా బతకమని కాదు, గొంతెమ్మ కోరికలు ఉండకూడదని. విజ్ఞతతో వ్యవహరించాలని.

నాలుగో కథ…

గౌతముడు ఇంకొక మంచి మాట కూడా చెప్పాడు.”Pain is inevitable; suffering is optional”. ఈ ప్రపంచంలో బాధ ఉంది. బాధపడాలో వద్దా అన్నది మన చేతుల్లో ఉంది. కొంతమంది ప్రతిదానికి బాధపడుతుంటారు. ఒత్తిడికి గురవుతుంటారు.

చాలామంది ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాధపడుతుంటారు, ఒత్తిడికి గురవుతుంటారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి.

“మిత్రమా ఎంతపని చేశావు. ఎంత అపచారం” అంటాడు. అప్పుడు రెండో వాడు నవ్వి “నేను ఆమెను మోసుకొని వెళ్లాను. దింపేసాను. నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నావు.” అంటాడు.

ఇద్దరు యువకులు ఎవరు చెప్పినా వినకుండా బౌద్ధం స్వీకరిస్తారు. తర్వాత ఇద్దరూ కలిసి ఒక అడవి గుండా వెళుతుంటారు. వారికి అక్కడ అర్ధ నగ్నంగా ఉన్న యువతి కనబడుతుంది. ఆమె ఒంటి మీద గాయాలు కూడా ఉంటాయి. వీరిని చూసి ఆమె నమస్కరించి “స్వామి దొంగలు వచ్చి అందర్నీ దోచుకున్నారు. చాలా మందిని గాయపరిచారు. నేను చనిపోయాను అని భావించి వెళ్లిపోయారు. నేను నడవలేక పోతున్నాను. మీలో ఎవరో ఒకరు నన్ను మోసుకెళ్ళి ఈ కాలువ దాటించి పుణ్యం కట్టుకోండి.” అని అడుగుతుంది. అయితే అందులో ఒకడు నువ్వు మహిళ వి, పైగా అర్ధనగ్నంగా ఉన్నావు. నేను ఆ పని చేయలేను అంటాడు. రెండవవాడు ఆమెను ఎత్తుకుని అవతల కెళ్ళి దింపి మౌనంగా వెళ్ళి పోతాడు. మొదటి వాడు కూడా అతనితోపాటు నడుస్తూ వెళ్తాడు. అలా ఒక అయిదు ఆరు గంటల తర్వాత మొదటివాడు “మిత్రమా ఎంతపని చేశావు. ఒక మహిళ, అర్థనగ్నంగా ఉంది. ఆమెను మోసుకెళ్ళి అవతల వదిలావు. ఎంత అపచారం” అంటాడు. అప్పుడు రెండో వాడు నవ్వి “నేను ఆమెను మోసుకొని వెళ్లాను. దింపేసాను. నువ్వు ఇంకా ఆమెను మోస్తున్నావు.” అంటాడు.

ఇది మనలో చాలా మందికి వర్తిస్తుంది. ఎన్నో చిన్న చిన్న విషయాలను మనం చాలా కాలం మోస్తాము, మోస్తునే ఉంటాము. దానివల్ల ఒత్తిడి వస్తుంది.

ఈ మోయడం గురించి మరో రీతిలో ఇంకో ఉదాహరణ చూడండి.

ఐదో కథ…

ఒక సమావేశంలో ఓ పెద్దమనిషి ఒక జోక్ చెప్తే అందరూ నవ్వారు. కాసేపటి తర్వాత మళ్లీ అదే జోక్ చెప్తే సగం మంది మాత్రమే నవ్వారు. మళ్లీ కాసేపు తర్వాత నేను చెప్తే కొంతమంది మాత్రమే నవ్వారు. మళ్లీ ఆ పెద్దమనిషి అదే జోక్ చెప్తే ఒకరిద్దరు మాత్రమే నవ్వారు. అప్పుడాయన ఎందుకు మీరు నవ్వలేదు, జోక్ బాగాలేదా అని అడిగాడు. అందరూ జోక్ బాగా ఉంది. మేమంతా బాగా ఎంజాయ్ చేశాం. కానీ ఎంత నవ్వించే జోక్ అయినా అన్నిసార్లు చెప్తే బోర్ కొడుతుంది.

అప్పుడా పెద్దమనిషి నవ్వి ” మీరు నవ్వి, ఎంజాయ్ చేసే విషయాన్ని నాలుగు సార్ల కన్నా ఎక్కువ చెప్తే మీకు బోర్ కొడుతుంది. కానీ మీరు బాధించే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు కదా. అది బాగుంటుందా” అన్నాడు.

అదీ విషయం! ఒత్తిడి అంటే అదే మరి.

దేనిమీద ఆసక్తి లేకపోవడం, నిరాశా నిస్పృహలు, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి కోపంగా స్పందించడం, ప్రతి విషయం గురించి నెగిటివ్ గా మాట్లాడడం, అతిగా తినడం, అసలు తినకపోవడం, చికాకు పడటం ఇలాంటివన్నీ ఒత్తిడికి సంకేతాలు.

ఒత్తిడి రాకుండా చేసుకోవడం అన్నది సాధ్యం కాని పని, అయితే ఒత్తిడిని సమర్థవంతంగా మేనేజ్ చేయడం మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఒత్తిడి అనేది ఒక ఎమోషన్ (ఉద్వేగం). ఎప్పుడు కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకూడదు. మేనేజ్ చేయాలి. ఉద్వేగాలను కంట్రోల్ (నియంత్రించడం) చేయడం మరింత ప్రమాదకరం. అందుకే ప్రతి ఒక్కరికి లో ఉద్వేగప్రజ్ఞ (Emotional Intelligence) తక్కువస్థాయిలో అయినా సరే ఉంటే మంచిది.

ఇలా చేయండి!

ఇక ఒత్తిడి అనిపించినప్పుడు ఇలా చెయ్యొచ్చు…

* ఒకచోట ప్రశాంతంగా కూర్చొని ఊపిరి పీల్చి వదలడం
* ఇష్టమైన వారితో మాట్లాడటం
* ఏదైనా పుస్తకం చదవడం
* పిల్లలతో ఆడుకోవడం
* కాసేపు అలా నడవడం
* పాటలు చూడడం లేదా వినడం
* కొత్త పని ఏదైనా చేసే ప్రయత్నం చేయడం
* ఒత్తిడికి కారణమైన పనిని కాసేపు పక్కన పెట్టడం
* ఇక నవ్వడం, నవ్వుకోవడం గురించి చెప్పేదేముంది. అత్యంత అద్భుతమైన చిట్కా ఇది.

ఇవన్నీ మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిట్కాలు. అవి అప్పటికప్పుడు వచ్చిన ఒత్తిడికి
పనికొస్తాయి. దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉన్న వారు, ఒత్తిడికి కారణమైన వాటిని గుర్తించి వాటిని మేనేజ్ చేయాలి.

ఒత్తిడికి వ్యాక్సిన్ గురించి మరోసారి…

ఇవన్నీ ఒక ఎత్తయితే ఒత్తిడికి అద్భుతమైన ఔషధం “పాజిటివ్ దృక్పథం” (positive thinking). దీన్నే “కామన్ సెన్స్” అని కూడా అనొచ్చు. కరోనా కు వ్యాక్సిన్ ఎలాంటిదో, ఒత్తిడికి వ్యాక్సిన్ ఇది. ఇది ఒక రోజులో వచ్చేదికాదు. అయితే ఒకసారి దీన్ని మొదలుపెడితే (అంటే వేసుకుంటే) ఒత్తిడి రాదని కాదు గాని, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదు. ” పాజిటివ్ దృక్పథం” (positive thinking) గురించి మరోసారి చూద్దాం.

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article