వారాల ఆనంద్
మనసంతా ఆర్తి నింపుకున్న కవి
జైల్లో వున్నాడు
లేదా బెయిల్లో వున్నాడు
జైలుకీ బెయిలుకీ నడుమ
గడియారంలో లోలకంలా
అటూ ఇటూ ఊగుతూ వున్నాడు
కవి చేతులకు బేడీలు లేవు
అన్నం తినొచ్చు
కాళ్ళకు గొలుసులు లేవు
ఇంట్లోనో జెయిలు గదిలోనో
అటూ ఇటూ స్వేచ్చగా తిరగొచ్చు
చూపునకు దూరం పరిమితమే
రెప్పలకు కుట్లేసారు
మాటకు ధ్వనీ పరిమితమే
పెదాలకు తాళాలేసారు
మనసుకే ఏ నియంత్రణా లేదు
గతం, వర్తమానం, సుఖం, దుఖం
అన్నీ నిండా కమ్ముకోవచ్చు
ఒక్కోసారి మత్తడీ దూకొచ్చు
ఇవ్వాళ వెన్నెల వెళ్తూ వెళ్తూ
జెయిలు పహారాల్నీ
ఇంటి వసారాల్నీ దాటి
కవిగారి బుజాలపై వాలింది
ఓ కవిత చెప్పవూ అంటూ
దీనంగా వేడుకుంది
ఆకాశంలో చంద్రుడూ
వాకిట్లో నేనూ కొత్త కవిత కోసం
ఎదురు చూస్తూ నిలబడ్డాం