Editorial

Wednesday, January 22, 2025
ఆనందంవంజంగి : వాడ్రేవు చినవీరభద్రుడి గగన మందాకిని

వంజంగి : వాడ్రేవు చినవీరభద్రుడి గగన మందాకిని

వంజంగి : ప్రత్యూషం కోసం ప్రతీక్షలో జీవితాన్ని ప్రగాఢంగా జీవించిన అనుభవం కోసం పయనం.

వాడ్రేవు చినవీరభద్రుడు

సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి రెండవ రోజు. ఇంకా తెల్లవారకుండా అయిదింటికల్లా సిద్ధంగా ఉండమని మరీ చెప్పారు. ముందు రోజు రాత్రే ఒక జెర్కిన్, ఒక జత యాక్షన్ షూ కూడా తెచ్చిపెట్టారు. పర్వతారోహకుడిలాగా వేషం కట్టేటప్పటికి ప్రభాకర్, సీతారాం వచ్చేసారు. టీ తీసుకుందామా అన్నారు. కాని నాకు ఎంత తొందరగా వంజంగి వెళ్దామా అని ఉంది.

ఇన్నాళ్ళూ లంబసింగి గురించే విన్నాను. ఈ వంజంగి ఎక్కణ్ణుంచి వచ్చింది? అది కూడా పాడేరుకి ఇంత దగ్గరలో?

దాదాపు ముప్పై ఏళ్ళ కిందట ఇక్కడ పనిచేసాను కాని అప్పట్లో ఈ ఊరి పేరే వినలేదు. కొత్త కాలం కొత్తలోకాల్ని కూడా పట్టుకొస్తుంది కాబోలు అనుకున్నాను. కాని నా దృష్టి ఆ కొండల మీద సూర్యోదయమెలా ఉంటుందో చూడాలన్నదాని మీదే ఉంది. ప్రత్యూషం కోసం ప్రతీక్షలో జీవితాన్ని ప్రగాఢంగా జీవించిన అనుభవం దక్కుతుందని నాకు తెలుసు.

సూర్యోదయాలే సుందరమనుకునే కాలం ఒకటి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది.

మా వాహనాలు వంజంగి ఊరు దాటి కొండమలుపులో ఆగేక అక్కడ దిగి నడక మొదలుపెట్టబోయాను. కాని అప్పుడే కాదు, ఈ కొండ కూడా ఎక్కాలి. ఫోర్ వీల్ డ్రైవ్ అన్నారు. కాని అప్పటికే ప్రాచీదిశమీద ఒక అరుణారుణరేఖ కనిపించడం మొదలుపెట్టింది. నాకు ఉద్వేగం ఆగలేదు. సూర్యోదయాలే సుందరమనుకునే కాలం ఒకటి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది. అదొకలాంటి శైశవం. పెద్దవాణ్ణయి, ఎన్నో ప్రభాతాలు నిద్రలోనో, మరపులోనో, మాటల్లోనో గడిపేసాక, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను, సూర్యోదయాత్పూర్వ ప్రత్యూషకాలాలు మరింత మహిమాన్వితమైనవని. ఇంకా సూర్యుడు ఉదయించకముందే, ఇంకా భళ్ళున తెల్లవారకముందే, ఒక లేత నారింజరంగు కాంతి ఆకాశమంతా పరుచుకుంటుందే ఆ వేళల్లో లేవగలిగినవాడు, లేచి నిశ్శబ్దంగా గగనాన్ని తిలకించగలిగినవాడు కదా ధన్యుడు.

మేము బండి మీద ఆ కొండ కూడా ఎక్కేటప్పటికి అక్కడొక బేస్ కేంపు లాగా ఉంది. వందలాది వాహనాలు, యాత్రీకులు, చిన్న చిన్న దుకాణాలు, పొగలు కక్కుతున్న టీ కప్పులు కనిపించాయి. కొద్దిగా కాఫీ తాగి వెళ్దామన్నారు మిత్రులు. ఆ చలిలో ఆ కాఫీ వేడిగా ఉండటానికి వాళ్ళు ఆ ఫ్లాస్కు నిప్పుల్లో చుట్టి తెచ్చారా అన్నట్టుంది. కాఫీ తాగుతూ ఎదట చూసాను. దూరంగా ఒక చిన్న కొండ దాని వెనక మరొక పెద్ద కొండ ఉన్నాయి. ఆ కొండల మీద అప్పటికే వేవెలుగు పరుచుకుంది. పచ్చటి పసుపు, గులాబి రంగు ఆవిరి గగనమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక్కడినుంచేనా చూడటం అని అడిగాను. కాదు ఇంకొంతదూరం నడవాలన్నారు. రెండు మూడు ఫర్లాంగుల తర్వాత మేమొక చిట్టడవిలో అడుగుపెట్టాం. రాత్రంతా ఆ చెట్లమీంచి కురిసిన మంచుకి అదంతా ఏదో పెద్ద వర్షం కురిసిపోయినంత చిత్తడిగా ఉంది. అప్పుడు అర్థమయింది నాకు ఆ జెర్కినూ, ఆ బూట్లూ ఎంత అవసరమో. గ్లోవ్స్ కూడా తెచ్చుకుని ఉంటే బాగుండేది అనుకున్నాను, ఏమంటే అప్పటికే వేళ్ళు కొంకరపోవడం మొదలుపెట్టాయి.

ఒక్కసారిగా ఆ అడవి ఉలిక్కిపడేటట్టు ‘ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికీ ప్రణామం ‘ అని బిగ్గరగా పాట మొదలయ్యింది.

మా ముందు యువతీయువకుల బృందమొకటి చురుగ్గా అడుగులేస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు చిన్న సౌండ్ సిస్టమేదో ఆన్ చేసారు. ఒక్కసారిగా ఆ అడవి ఉలిక్కిపడేటట్టు ‘ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికీ ప్రణామం ‘ అని బిగ్గరగా పాట మొదలయ్యింది. ఆ తెల్లవారు జామున, రాత్రంతా ఆకాశం చెప్పిన మాటలు విని మౌనంగా ముడుచుకున్న అడవిలో ఆ సినిమా పాట క్షణంపాటు చికాకుపెట్టింది. కాని మరుక్షణంలోనే నా ఆలోచనలు మరోలా సాగాయి. ఈ ప్రకృతి, ఈ ప్రాగాకాశం, ఈ తొలిమంచు చూడగానే ఆ పిల్లల హృదయాల్లో కంపించే ఆ సున్నితమైన సంవేదనల్ని వాళ్ళు గుర్తుపట్టుకోడానికి నేనుకాని నా లాంటి రచయితలు గాని ఏమి చెయ్యగలిగాం? తాము చూస్తున్న నవ్యసౌందర్యాన్ని మాటల్లో పంచుకోడానికి మనమేమి కవిత్వం ఇవ్వగలిగాం? ఏ పాటలు నేర్పగలిగాం? కనీసం ఆ సినిమా కవి ఎవ్వరో, అతడొక పాట కూర్చిపెట్టాడు. ఆ పిల్లలు బహుశా నిన్నటినుంచీ ఎదురు చూస్తూండవచ్చు, ఎప్పుడెప్పుడు ఆ అడవిలో వింటామా, తమంత తాముగా మాటల్లో చెప్పుకోలేని ఆ ఉద్వేగాన్నేదో ఆ కవి మాటల్లో ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు.

 ఆ పర్వతశ్రేణి ఏదో దేవాలయ ప్రాంగణంలో మంగళసంగీతం వినిపించడానికి సిద్ధమవుతున్న వాద్యకారుల బృందంలాగా ఉంది.

కొంతసేపటికి నాకు అర్థమయింది, మేము అంతకు ముందు చూసిన చిన్న కొండని దాని అంచమ్మటే మేము దాటుతున్నామని. పైన ఉషస్సు వ్యాపిస్తున్న కొద్దీ, అంతదాకా ఆకాశంలో ఉన్న అంధకారమంతా ఆ చిక్కటి చెట్లమధ్యలో ఆ దట్టమైన ఆకుల గుబుర్ల మధ్య నుంచి కిందకు దిగుతున్నది. అట్లా రెండుమూడు కిలోమీటర్లు నడిచి ఉంటామేమో, ఒక్కసారిగా ఆ కొండ అంచు దాటి ముందుకు అడుగుపెట్టగానే విశాలమైన బయలు, దూరంగా కెరటాల్లాగా మళ్ళా కొండలు కనిపించాయి. దూరంగా నీలిగగనంలో నురగలుకక్కుతున్న పాలసముద్రం. ఆ సముద్రం మధ్య మందరగిరిలాగా ఒక కొండ. దాని అంచుపైన బంగారు తాపడం చేసినట్టు తొలిసూర్యస్వర్ణకాంతి. మాకు దగ్గర్లోనే మరొక కొండ శిఖరం మీంచి వాలుపొడుగునా బంగారు వస్త్రం కప్పినట్టు హేమరశ్మి. ఆ అంచుని ఆనుకుని చిక్కటి ఆకుపచ్చని, దట్టమైన నీలం ముద్దల్లాంటి కొండలవరసలు. కొంత వెలుగులోకి తెరుచుకుని, కొంత ఇంకా చీకట్లో కుదురుకుని ఆ పర్వతశ్రేణి ఏదో దేవాలయ ప్రాంగణంలో మంగళసంగీతం వినిపించడానికి సిద్ధమవుతున్న వాద్యకారుల బృందంలాగా ఉంది.

ఎప్పుడు వచ్చేరు వీళ్ళంతా ఇక్కడికి? ఎప్పుడు చేరుకున్నారు, ఈ చీకట్లో, ఈ అడివిబాటన? ఎందుకు చేరారు వీరంతా ఇక్కడికి? ఏ భర్మలోకం నుంచి ఏ పిలుపు వీళ్ళనిట్లా లాక్కొచ్చింది?

మరికొంత ముందుకు వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా సముద్రంలోంచి బయటపడ్డ అట్లాంటిస్ లాగా గొప్ప ధీధితి చిమ్ముతూ హిరణ్మయలోకం. పైన అప్పుడే తెరిచిన మూతలాగా నీలమేఘం. ఆ లోకాన్ని చూస్తో, కెమేరాలో బంధిస్తో, ఆ కాంతిని ఎట్లా కైవసం చేసుకోవాలో తెలియక సెల్ ఫోన్లు అటూ ఇటూ తిప్పుతూ అటూ ఇటూ కదుల్తో సందర్శకులు, ఒక్కరు కాదు, వందలాది. ఎప్పుడు వచ్చేరు వీళ్ళంతా ఇక్కడికి? ఎప్పుడు చేరుకున్నారు, ఈ చీకట్లో, ఈ అడివిబాటన? ఎందుకు చేరారు వీరంతా ఇక్కడికి? ఏ భర్మలోకం నుంచి ఏ పిలుపు వీళ్ళనిట్లా లాక్కొచ్చింది? ఏం చూస్తున్నారు వీళ్ళంతా ఇక్కడ?

నేను కూడా ఆ మనుషుల మధ్య ఏదో ఒక చోటనిలబడి నా ఎదురుగా ఉన్న ఆ రుక్మమండలాన్ని నా మొబైల్లోకి ఇమడ్చగలనేమో చూడటం మొదలుపెట్టాను. అప్పటికే చలికి నా చేతులు పూర్తిగా కొంకర్లు పోయాయి. మధ్యలో ఒక బండమీద అడుగు వేస్తూండగా కాలు మెలికపడి జారబోతూండగా పక్కనొక బండని పట్టుకుని నన్ను నేను ఆపుకున్నాను. నా ఎదట మేఘాలు, చల్లగానే కాంతులు చిమ్ముతున్న సూర్యుడు, ఖగోళం మొత్తం అక్కడే తెరుచుకుందా అన్నట్టు హాటక దిగంతం.

ఆ చలికి, ఆ గాయం, ఆ మంట ఎంత తెలియకుండా పోయాయంటే, నా చేతుల్లో చిందిన ఎర్రరంగు ఏదో పళ్ళరసమేమో అనుకునేటంతగా!

మనం ఆ కొండ ఎక్కాలి అన్నాడు సీతారాం. ఉద్యోగంలో చేరిన మొదట్లో వారానికొకసారేనా కొండలెక్కి ఊళ్ళూ, పాఠశాలలూ చూసేవాణ్ణి. ఏళ్ళ తరబడి నాలుగు గొడల మధ్య జీవితానికి పరిమితమైపోయాక, ఈ పాటి దూరం నడవడమే దేహానికి కష్టంగా తోస్తూ ఉన్నది. ఇంకా అంత కొండ ఎక్కగలనా అనుకున్నాను. అప్పటికే ముణుకులు ఇబ్బందిగా మూలగడం మొదలుపెట్టాయి. కాని ఇంతదూరం వచ్చీ, ఈ చివరి మెట్టు ఎక్కకపోతే ఈ దివ్యబ్రహ్మాండ దర్శనం పూర్తి కాదనిపించింది. సరేనంటూ అడుగులు ముందుకేసాను.
ఈ లోపు నా ఎడమ అరచేతినిండా ఎర్రగా. ఇవేమి పళ్ళు? ఏ కొమ్మని అదిమితే ఏ పళ్ళు చితికితే నా చేతికింత ఎర్రరంగు అంటిందని ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంటే, కొన్ని క్షణాల తర్వాత అర్థమయింది, అది పండ్ల రసం కాదు, నా నెత్తురేనని. ఇందాకా కిందకి జారబోతుండగా ఓ బండని చేత్తో పట్టుకుని నన్ను నేను ఆపుకున్నప్పుడు అరచెయ్యి తెగి గాయమై నెత్తురు స్రవిస్తున్నదని తెలిసొచ్చింది. కాని నవ్వు కూడా వచ్చింది. ఆ చలికి, ఆ గాయం, ఆ మంట ఎంత తెలియకుండా పోయాయంటే, నా చేతుల్లో చిందిన ఎర్రరంగు ఏదో పళ్ళరసమేమో అనుకునేటంతగా!

ఎక్కడో ఒక మూల ఇంకా నిష్కల్మషమైన సౌందర్యం నిలిచిఉందనీ, ఒక రాత్రి నిద్రని ఆపుకుంటే, పొద్దున్నే నాలుగు అడుగులు నడవగలిగితే ఒక పువ్వునో, ఒక కిరణాన్నో చూడగలమని నమ్మే అమాయికత్వం వాళ్ళల్లో ఇంకా మిగిలే ఉంది.

నెమ్మదిగా ఆ పక్కనున్న పెద్దకొండ ఎక్కడం మొదలుపెట్టాం. కొందరు అప్పటికే ఆ కొండమీంచి కిందకి దిగుతున్నారు. మరికొందరు మాతో పాటు ఎక్కుతున్నారు. వాళ్ళల్లో కొందర్ని పలకరించాను. ఎక్కణ్ణుంచి వస్తున్నారని అడిగాను. వాళ్ళల్లో చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్న యువతీయువకులు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, శ్రీకాకుళం నుంచి కాకినాడ దాకా పనిచేస్తున్న కొత్తతరం ఉద్యోగులు. వాళ్ళంతా నవ యవ్వనంలో అడుగుపెడుతున్న పిల్లలు. జీవితంలో ఎక్కడో ఒక మూల ఇంకా నిష్కల్మషమైన సౌందర్యం నిలిచిఉందనీ, ఒక రాత్రి నిద్రని ఆపుకుంటే, పొద్దున్నే నాలుగు అడుగులు నడవగలిగితే ఒక పువ్వునో, ఒక కిరణాన్నో చూడగలమని నమ్మే అమాయికత్వం వాళ్ళల్లో ఇంకా మిగిలే ఉంది.

ఆ కొండ ఎక్కడం నిజంగానే నా శక్తికి మించిన పని అయింది. ఎవరో కుర్రవాడు తన చేతుల్లో ఉన్న కర్ర ఒకటి నాకు ఊతంగా ఉంటుందని కానుకచేసాడు. నాతో పాటు వచ్చిన మా బృందంలో మత్స్యరాజు, సింహాచలం, సాంబశివరావు, కుమార్ ఒకరూ ఒకరూ నాకు చేయూతగా నన్ను కనిపెట్టుకుని నా పక్కనే అడుగులో అడుగు వేసుకుంటూ కొండ ఎక్కుతున్నారు. అలాగని అది మరీ పెద్ద కొండాఎమీ కాదు. కాని అప్పటికే చాలాదూరం నడిచి ఉన్నందువల్లా, ఆ చలికి చేతులూ, కాళ్ళూ కొంకర్లు పోతున్నందువల్లా, అలవాటులేని యాక్షను షూలో అడుగులు తడబడుతున్నందువల్లా నిజంగానే ఏ హిమాలయాలో ఎక్కినట్టే అనిపించింది నాకు.

అవి నిజంగానే హిమాలయాలు. అపారమైన ప్రాణవాయువూ మాత్రమే ప్రవహిస్తున్న లోకం అది. కనిపించని పూలతోట. గగన మందాకిని.

కాని అవి నిజంగానే హిమాలయాలు. ఇంకా చెప్పాలంటే మేఘాలయాలు. పరిశుభ్రమైన నీటి ఆవిరీ, ధారాళమైన సూర్యకాంతీ, అపారమైన ప్రాణవాయువూ మాత్రమే ప్రవహిస్తున్న లోకం అది. కనిపించని పూలతోట. గగన మందాకిని.

ఎట్లాగైతేనేం కొండ ఎక్కాం. అక్కడ ఆ కొండమీద నలుచదరంగా ఉన్న ఒకింత స్థలంలో ఎవరో ఒక జెండా పోలు పాతి ఉన్నారు. సందర్శకులు దాని చుట్టూ నిలబడి రకరకాల భంగిమల్లో ఫొటోలు తీసుకుంటూ ఉన్నారు. ‘కానీ మీరు అక్కడ ఆగకండి, ఇంకా ముందు, ఆ మూలకి వెళ్ళి చూడండి, మనుషులు ఎక్కువలేకపోయినా అదే వ్యూ’ అన్నాడు ఎవరో యువకుడు నన్ను దాటిపోతూ. అతడు నాకే ఆ మాటలు ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు. కాని గ్రంథాలయాల్లోనూ, పుస్తకాల షాపుల్లోనూ ఉన్నట్టే పర్యాటక ప్రదేశాల్లో కూడా ఏంజెల్సు ఉంటారని అర్థమయింది. ఆ దేవదూత నిజంగానే నాకు తగినచోటు చూపించాడని అక్కడకు వెళ్ళి నిలబడగానే అర్థమయింది.

అతణ్ణి అట్లా చూడగానే ప్రసిద్ధ రొమాంటిక్ చిత్రకారుడు ఫ్రెడెరిక్ డేవిడ్ గేస్పర్ చిత్రించిన The Wanderer above Sea of Fog గుర్తొచ్చింది (చివరినుంచి రెండవ ఫొటో). అచ్చం అలానే ఉన్నాడు ఆ యువకుడు.

మనుషులు కొండలు ఎందుకు ఎక్కుతారు? సముద్రాల లోతుల్లోకి ఎందుకు దూకుతారు? ఎక్కడో ఎవరికీ తెలియని అజ్ఞాత ద్వీపాల వైపు ఒక తెప్పవేసుకుని మరీ ఎందుకు సాగిపోతారు? నా ఎదట కొండకొమ్ముమీద ఒక కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతడు సూర్యకాంతికి అడ్డంగా contre-jour position లో నిలబడిఉన్నాడు. అతడి వెనగ్గా రోచిర్మయ మేఘమండలం, దానివెనగ్గా కనకప్రభాతం. అతణ్ణి అట్లా చూడగానే ప్రసిద్ధ రొమాంటిక్ చిత్రకారుడు ఫ్రెడెరిక్ డేవిడ్ గేస్పర్ చిత్రించిన The Wanderer above Sea of Fog గుర్తొచ్చింది (చివరినుంచి రెండవ ఫొటో). అచ్చం అలానే ఉన్నాడు ఆ యువకుడు. ఆ దృశ్యం నాలో ఏకంగా పెద్ద సోషియాలజీనే రేకెత్తించింది. ఒకప్పుడు యూరోపులో ఎన్లైటెన్ మెంట్ యుగానికి ప్రతిఘటనగా పద్ధెనిమిదో శతాబ్దం చివరలోనూ, పందొమ్మిదో శతాబ్ది ప్రారంభంలోనూ రొమాంటిసిజం తలెత్తింది. అప్పటిదాకా ఎన్లైటెన్ మెంట్ తత్త్వవేత్తలు మాట్లాడుతున్న జ్ఞానం స్థానంలో రొమాంటిక్స్ సౌందర్యం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అది కూడా beauty కాదు, sublime. Sublime అంటే భీషణ సౌందర్యం. ఆ సౌందర్యం ముందు నువ్వుండవు, ఆ సౌందర్యం మాత్రమే ఉంటుంది. ‘ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైన ఇచటనే ఆగిపోనా ‘ అని కృష్ణశాస్త్రి పాడింది ఆ sublime నే. అటువంటి నిరవధిసౌందర్యానికి రొమాంటిక్స్ దృష్టిలో ఆల్ప్స్ పర్వతాలు ఒక చిహ్నంగా నిలబడ్డాయి.

మరొక ప్రసిద్ధ చిత్రకారుడు టర్నర్ చిత్రించిన Hannibal and his Army crossing the Alps చూడండి. భీతిగొలిపే సౌందర్యమంటే ఏమిటో అర్థమవుతుంది. మన కథకుల్లో చలంగారి ‘హంపీకన్యలు’, బుచ్చిబాబు ‘అరకులోయలో కూలిన శిఖరం’, మధురాంతకం మహేంద్ర ‘హొగినేకల్ ‘ అట్లాంటి sublime ని పట్టుకోడానికి ప్రయత్నించిన రచనలే.

ఇంతకీ ఆ క్షణాన నాకు అనిపించిందేమంటే, మన సమాజంలో ఒక రొమాంటిక్ యుగం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నదని.

ఇంతకీ ఆ క్షణాన నాకు అనిపించిందేమంటే, మన సమాజంలో ఒక రొమాంటిక్ యుగం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నదని. సామాజిక స్పృహ గురించి మాట్లాడే విమర్శకులూ, రచయితలూ ఏమన్నా రాస్తూ ఉండవచ్చుగాక, కాని వాళ్ళున్నారని కూడా తెలియని ఒక కొత్త మధ్య తరగతి, నవతరం యువతీయువకులు ఇప్పుడిప్పుడే కొత్త రెక్కలు తొడుక్కుని ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళకి సౌందర్యం కావాలి, ఉత్సాహం కావాలి, నలుగురూ కలిసి నవ్వుకుంటూ తిరిగే తావులు కావాలి. సాహిత్యకారులు పట్టించుకోని ఈ అవసరాన్ని సినిమా దర్శకులూ, సినీగీత రచయితలూ పట్టుకోగలుగుతున్నారు కాబట్టే ఆ అడవిలో అడుగుపెట్టగానే ఆ సినిమా పాట నా చెవిన పడిందని అప్పటికి పూర్తిగా అర్థమయింది నాకు.

అక్కడే ఆ కొండకొమ్ము మీద చాలాసేపు కూర్చుండిపోయాము. ఎక్కడో చదివాను, నువ్వు దేవుడితో మాట్లాడటాన్ని ప్రార్థన అంటారనీ, దేవుడు నీతో మాట్లాడింది నువ్వు వింటే దాన్ని ధ్యానం అంటారనీ. అదే నిజమైతే అక్కడ కూర్చున్నంతసేపూ నేను కళ్ళు తెరుచుకునే ధ్యానం చేసానని చెప్పాలి. ఆ శుభ్రగగనం, ఆ నీలిదిగంతం, ఆ శ్వేతమేఘస్రవంతి, ఆ కాంచన కిర్మీరం అవన్నీ నాతో ఏమో చెప్తూ ఉన్నాయి. అప్పుడు నాకు మరేమీ గుర్తు లేదు. కింద నేను అనుభవిస్తున్న మానావమానాలేవీ ఆ సమయంలో నా తలపుకి రాలేదు. అసలు ఏ తలపులూ లేవు. కనిపిస్తున్నంతమేరంతా పరుచుకున్న ఆ పలచటి నీటి ఆవిరి నా మనోమాలిన్యాన్ని పూర్తిగా కడిగేసింది.

ఈ రోజుకి ధ్యానం, సంధ్యావందనం మాత్రమే కాదు, పూజ కూడా పూర్తయిందనిపించింది.

ఇక నెమ్మదిగా సందర్శకులు కిందకి దిగడం మొదలుపెట్టారు. సమయం చూసేటప్పటికి తొమ్మిది గంటలు కావొస్తూంది. సూర్యకాంతి పూర్తిగా వెండిరంగు తిరిగింది. కొండలమీద అంతదాకా సముద్రంలాగా పరుచుకున్న మంచు, మేఘాలూ సన్నబడి పొగలాగా పలచబడటం మొదలయ్యింది. మిత్రులు మళ్ళా వేడి కాఫీ ఇచ్చారు. అందరం కలిసి ఫొటోలు తీసుకున్నాం. ఇక కిందకి దిగుదామని లేచి నిలబడ్డాం.
వచ్చే ముందు మళ్ళా ఒకసారి ఆ మహాపర్వతశ్రేణిని, ఆ రజతశృంగ నిశ్రేణిని తనివితీరా చూసాను.

దేవాలయంలో ధూపమూ, హారతీ ఇచ్చి అర్చన పూర్తయ్యాక తృప్తిగానూ, నిశ్శబ్దంగానూ నిలిచి ఉండే మూలవిరాట్టుల్లాగా ఉన్నాయి ఆ కొండలు. ఈ రోజుకి ధ్యానం, సంధ్యావందనం మాత్రమే కాదు, పూజ కూడా పూర్తయిందనిపించింది.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ప్రభుత్వ ఉన్నతాధికారి.
ఇతర రచనలకు నా కుటీరం క్లిక్ చేయగలరు.

More articles

1 COMMENT

  1. ప్రకృతి ఆవిష్కరణను మనసుతో చూడలంటే అనుభవించాలంటె ఎంత కష్టమైన ఓపిక అవసరమని వాడ్రేవు వారు విశదీకరించన తీరు అధ్బుతం.వర్ణన అపురూపం.🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article