నేడు తారీఖు మే 26. తిథి వైశాఖ పౌర్ణమి
మన భారతీయ సంస్కృతిలొ ఈ పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా బౌద్ధ మతస్థులకు. వీరు వైశాఖ పౌర్ణమిని బుద్ధుని జననానికి, జ్ఞానోదయానికి, మహా పరినిర్వాణానికి ప్రతీకగా జరుపుకుంటారు.
హిందువులు దీన్ని వైశాఖ పున్నమి పర్వదినంగా దానధర్మాలుచేసి ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగు నేలను పాలించిన రాజ వంశాలన్నీ, దాదాపుగా, వైశాఖ పౌర్ణమి పర్వదినాన దాన ధర్మాలు చేసి శాసనాలిచ్చారు. ముఖ్యంగా విజయనగర రాజులపాలనలోవే 30 వరకు శాసనాలున్నాయి.
ఇక తొలిసారిగా వైశాఖ పౌర్ణమిని ప్రస్తావించిన శాసనం శాతవాహన చివరిరాజులలో ఒకడైన విజయశ్రీ శాతకర్ణి వేయించిన నాగార్జునకొండ లో లభించిన ప్రాకృత శాసనం. “క్రీ.శ 201 లేక 202 లో వైశాఖ పౌర్ణమినాడు విజయశ్రీ శాతకర్ణి ఈ ప్రాంతాన్ని(శ్రీపర్వత)సందర్శించి స్తంభమును దానంచేసినట్లుగా”చెప్పబడ్డది. బుద్ధ పూర్ణిమ నాడు ఇక్కడికి వచ్చిన విజయశ్రీ శాతకర్ణి పేరు మీదనే ఈ నగరానికి ‘విజయపురి’ అన్న పేరొచ్చింది.
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.