తిరిగి ఇవాళ ఆ సినిమా చూస్తుంటే మతిపోయింది. అంత సంక్లిష్టమైన నవల లోని కథను తన స్క్రీన్ ప్లే తో ఎంతో సరళంగా చేసి తేలికైన సంభాషణ లద్వారా కథను వెండితెరమీదకి ఎక్కించి దాన్ని బంగారుమయం చేశాడు సత్యజిత్ రాయ్.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి
రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘ఘరే బైరే’ నవల తెలుగు అనువాదం ‘ఇంటా బయటా’ నవల ఎప్పుడో చదివాను. సత్యజిత్ రాయ్ దాన్ని అదేపేరుతో బెంగాలీ లో సినిమాగా తీశాడు.
దూరదర్శన్ మనకి అందిన కొత్తరోజుల్లో ఆదివారం మధ్యాహ్నాలు ప్రాంతీయభాషా ఉత్తమచిత్రాలు వచ్చేవి. అపురూపంగా పడిపడి చూసేవాళ్లం. శుక్రవారం రాత్రి పది తర్వాత మొదలై అర్ధరాత్రి దాకా వేరే దేశభాషల సినిమాలు వచ్చేవి. అవీ అంతే. ‘టేల్ ఆఫ్ టూ సిటీస్’ సినిమా రాత్రి రెండుదాకా చూసి పొద్దున్నే ఎనిమిదింటికి నిద్ర కళ్లతో కాలేజీకి వెళ్లి పాఠం చెప్పినరోజులవి.
అలా ఒకనాటి శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘరే బైరే చూశాను. తర్వాత నవల సంపాదించి చదివాను. ఎందుకనో వాటి ప్రభావం ఏదీ నా మీద లేకపోయింది. కానీ అప్పుడు ఆ నవలా సినిమా కూడా నా మీద ప్రభావం చూపలేదు కానీ తర్వాత చదివిన టాగూర్ నవలల వల్ల మళ్లీ చదవాలనిపించింది. ఈ మధ్య చదివాను.ఎప్పటిదో పాత ఎడిషన్. అనువాదం చాలా క్లిష్టంగా ఉంది.
పూర్వం చదివినప్పుడు అందులో ఒక్కమాట మాత్రం గుర్తుంది. నాయిక విమల “అందం అనేది వైభవచిహ్నం, తక్కువ చేయవలసినది కాదు” అంటుంది. అది నన్ను ప్రభావితం చెయ్యకపోలేదు. అందంగా ఉండాలనుకోవడం, తగురీతిన అలంకరించుకోవడం ఉన్నతమైన అభిరుచులే అన్న భావం ఆ నవల తాలూకు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మనచుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదపరచే రీతిగా అలంకరణ వేపు ఆలోచించడం కూడా బాగానే ఉంటుందనిపించింది.
ఇక సినిమా ప్రభావితం చేసేటంతగా గుర్తులేదుకానీ ఎస్టేట్ జమీందారు నిఖిల్ అతని భార్య విమలా కలిసి జనానా లోంచి బయట అడుగుపెట్టి డ్రాయింగ్ హాల్ దాకా నడచుకుంటూ వచ్చే దృశ్యం మాత్రం బాగా గుర్తుండి పోయింది. రే ఆ దృశ్యాన్ని అద్భుతంగా తీశాడు. అతనే కూర్చిన నేపధ్యసంగీతంతో. బహుశా కధకి అదే ప్రధాన విషయమైన సన్నివేశం కావడం వల్లనేమో. నల్లటి గెడ్డంతో సౌమిత్రీచటర్జీ మాత్రం లీలగా గుర్తున్నాడు.
కానీ తిరిగి ఇవాళ ఆ సినిమా చూస్తుంటే మతిపోయింది. అంత సంక్లిష్టమైన నవల లోని కథను తన స్క్రీన్ ప్లే తో ఎంతో సరళంగా చేసి తేలికైన సంభాషణ లద్వారా కథను వెండితెరమీదకి ఎక్కించి దాన్ని బంగారుమయం చేశాడు సత్యజిత్ రాయ్.
ఉద్యమాల పట్ల నిబధ్ధులైన వాళ్లు ఏ విధంగా ఉంటారో, స్వార్ధపరులు వాటిని ఎలా విధ్వంసానికి వాడి తాము నాయకులుగా మారాలనుకుంటారో టాగూర్ స్పష్టంగా ఈ కథలో చెప్పేడు.
‘నవలా సినిమా కలిపి చలంగారి సుశీల కథని గుర్తుచేశాయి. జాతీయోద్యమం నడుస్తున్న కాలం నేపథ్యం రెండు కథలకూ. చలంగారి కథకు సహాయ నిరాకరణోద్యమం ఐతే ‘ఘరే బైరే’ స్వదేశీ ఉద్యమ నేపథ్యం లో నడుస్తుంది.
భారతదేశంలో వచ్చిన సంస్కరణోద్యమాల ప్రభావం వల్ల కొందరు ఆదర్శవంతులైన పురుషులు తమ భార్యలకు విద్యలు నేర్పి పంజరాల తలుపులు తెరచి బయటప్రపంచాలను పరిచయం చేశారు. రెక్కలలో జవం నింపేరు.
అలాంటి వారే ఘరే బైరేలో నిఖిల్ కానీ సుశీల కథలో నారాయణప్ప గానీ. నిఖిల్ బెంగాల్ లో ఎస్టేట్ జమీందారు. లార్డ్ కర్జన్ ఆర్డర్ వల్ల బెంగాల్ రెండుముక్కలవుతోంది. దాన్ని స్వదేశీ ఉద్యమం ద్వారా ప్రజలను ఏకం చేసి ఎదిరించాలన్నది కథా నేపథ్యం.
ఉద్యమాల పట్ల నిబధ్ధులైన వాళ్లు ఏ విధంగా ఉంటారో, స్వార్ధపరులు వాటిని ఎలా విధ్వంసానికి వాడి తాము నాయకులుగా మారాలనుకుంటారో టాగూర్ స్పష్టంగా ఈ కథలో చెప్పేడు.
నిఖిల్ కి స్వదేశీ ఉద్యమం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అతని పాలనలో స్వదేశీ వస్తువుల తయారీ కూడా జరుగుతోంది. కానీ సత్యమేమిటంటే స్వదేశీ వస్తువులకు నాణ్యత లేకపోవడంతోపాటు ఎక్కువధర కూడా. విదేశీ వస్తువులు పంచదార ఉప్పు మొదలైనవాటికి ధర తక్కువ. బట్టలతో సహా.
ఉద్యమం కోసం వాటిని నిషేధిస్తే పేదలు కష్టాలపాలౌతారు. మిల్లుల మూసేస్తే వాటిలో పనిచేసే వారు రోడ్డున పడతారు, ఎక్కువశాతం ముస్లిం ప్రజలు. కాబట్టి నిఖిల్ తన ఎస్టేట్ లో ప్రజల సంక్షేమం కోసం నిషేధాన్ని అంగికరించడు.
సరిగ్గా ఆసమయంలో అతని చిన్నప్పటి మిత్రుడు సందీప్ ఆ రాజప్రాసాదంలోకి అడుగుపెడతాడు. మిత్రుడి భార్య పరిచయం కోరతాడు. సందీప్ ఉద్యమనాయకుడు. తన వాగ్ధారతో ప్రజలను అప్పటికే చిత్తు చేస్తూఉన్నాడు.
అతనిలో పలు విధాలైన ఆకర్షణలు ఉన్నాయి. అలాంటి ఆకర్షణలున్న పురుషులు ప్రజలనూ అంతకన్న ఎక్కువ స్త్రీలను సమ్మోహితులను చేయగలరు.
సందీప్ దేశ సేవ పేరుతో వందేమాతరం నినాదంతో ఒకవైపు, ప్రశంసల ప్రవాహంతో మరొకవైపు ఆమెను వివశను చేశాడు.
నిఖిల్ భార్య విమలను సందీప్ కు పరిచయం చేశాడు. విమలకు అప్పటికి అతనిపట్ల వ్యతిరేకభావం ఉంది. కానీ మొదటి పరిచయం లోనే దాన్ని ఎగరగొట్టి తన మాయలోకి లాగేసుకున్నాడు అన్యోన్య దాంపత్యం. నిఖిల్ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా విమల ఇంటి నుంచి బయటకు వచ్చింది ఆ బయట సందీప్ లాంటివారు ఉన్నారు. సందీప్ దేశ సేవ పేరుతో వందేమాతరం నినాదంతో ఒకవైపు, ప్రశంసల ప్రవాహంతో మరొకవైపు ఆమెను వివశను చేశాడు.
బయట ఎస్టేట్లో ప్రజలను రెచ్చగొట్టి మతకల్లోలం తెచ్చేడు. విదేశీవస్తుబహిష్కరణ వల్ల ఎక్కువ నష్టపోయేది పేదమహమ్మదీయవర్గాలే కనుక నిఖిల్ వారిపక్షాన ఉండగా సందీప్ హిందువులను ఉద్రిక్తపరచాడు.
ఇలా సందీప్ నిఖిల్ మిత్రుడుగా ఇంటా బయటా కల్లోలం రేపుతాడు. విమల ఇంటినుంచి బయటిప్రపంచంలోకి రావాలని అక్కడి ఆటుపోట్లు చూశాకనే వాటికి తట్టుకోగల శక్తి సంపాదించికున్నాకనే సంపూర్ణ స్త్రీగా లేదా మానవిగా ఎదగగలదని భర్త నిఖిల్ నమ్మకం. ఠాగూర్ లేదా చలం నమ్మకం కూడా అదే.
అందుకే సుశీల కథలో నారాయణప్ప భార్య గా సుశీల తమ ఇంటికివచ్చే పురుషులందరితోనూ కరచాలనం చేస్తూ అనేకవిషయాలు చర్చిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులూ, గొప్పకళాకారులూ వారి ఇంటికి అతిథులుగా వస్తూంటారు. దంపతుల మధ్య ఎంతో అవగాహన, అన్యోన్యమైన ప్రేమ.
ఇంటి నుంచి స్వాతంత్య్రోద్యమ సమయంలో స్త్రీలు బయటకు వచ్చేరు, చైతన్యవంతులయ్యారు. కానీ వారు ఎదుర్కొన్న ఇలాంటి సమస్యలను వెలుతురులోకి తెచ్చినవారు ఒక టాగూర్, ఒక చలం.
కానీ ఒకనాడు కొత్తగావచ్చిన పోలీస్ అధికారి సులేమాన్ ఆమెను తనను తాను మరచిపోయేలా చేస్తాడు తానూ అలాగే సమస్తమూ ఆమె పాదాలముందు వదిలేస్తాడు.
ఇంటి నుంచి స్వాతంత్య్రోద్యమ సమయంలో స్త్రీలు బయటకు వచ్చేరు చైతన్యవంతులయ్యారు. కానీ వారు ఎదుర్కొన్న ఇలాంటి సమస్యలను వెలుతురు లోకి తెచ్చినవారు ఒక టాగూర్, ఒక చలం.
భర్తలు నిఖిల్ గానీ నారాయణప్ప గానీ ఉత్తములు.స్వేచ్ఛకు నిజమైన అర్ధం తెలిసిన వారు. తమ స్త్రీల మనసులోని ప్రణయ కల్లోలాలు తెలిసినా మౌనమే వహించారు తప్ప అడ్డు నిలవలేదు. ఆ ఎంపిక తాలూకు స్వేఛ్ఛ వారికే వదిలేశారు. అంతే కానీ బలవంతంగా తిప్పుకోలేక కాదు.
వారిరువూ తమ స్త్రీలపట్ల ఉన్నట్టే ఉద్యమం పట్ల కూడా అంత నిబద్ధతతో ఉన్నారు. పైపై ఉపన్యాసాలు, ఉద్రేకాలూ, ఆవేశాలూ, నినాదాలూ ఏ ఉద్యమాన్నీ ముందుకు తీసుకు వెళ్లవని వారికి తెలుసు. మౌనంగా కీలకమైన పని చెయ్యడమూ తెలుసు
సుశీలకు నారాయణప్ప సహాయ నిరాకరణోద్యమంలో భాగమయి జైలుకు వెళ్లడం ఆలోచింపజేసింది. ఆమెకు సులేమాన్ పై తన ప్రణయం అది ఎంత గొప్పదయినా తక్కువగా అనిపించింది. సులేమాన్ కి నచ్చజెప్పి జైలుజీవితం వల్ల జబ్బు పడిన నారాయణప్ప దగ్గరకు వచ్చేసింది.
ఇలా ఆమె ఇంటా బయటా తన స్వేచ్ఛ తో తన నిర్ణయాధికారంతో మానవిగా మారడం చెప్తాడు చలం
ఐతే టాగూర్ విమలకు ఆ అవకాశం లేదు. సందీప్ కుహనా ప్రేమికుడు కుహనా దేశభక్తుడు. వందేమాతరం అన్న మంత్రం అడ్డుపెట్టుకుని స్త్రీలను, ప్రజలను మోసగించడమే ధ్యేయంగా ఉంటాడు.
నిఖిల్ కోరుకున్నట్టు ఆమె అమాయకత్వంతో కాక అనుభవంతో పరిణతి చెంది అతని విలువ మరింతగా గ్రహించి తిరిగి అతని వద్దకు చేరింది.
విమలకు అతని దొంగవేషం అర్ధమయ్యేసరికి ఎస్టేట్ లో పరిస్థితి విషమించింది. భర్త నిఖిల్ దగ్గర ఆమె తన బయటి ప్రపంచానుభవం తాలూకు పరితాపాగ్నిని విన్నవించుకుంది. నిఖిల్ కోరుకున్నట్టు ఆమె అమాయకత్వంతో కాక అనుభవంతో పరిణతి చెంది అతని విలువ మరింతగా గ్రహించి తిరిగి అతని వద్దకు చేరింది.
నిఖిల్ ఇంటా బయట కూడా మూలాలనుంచి నిబద్ధుడై ఉన్నాడు. అందువల్లనే ఉద్యమానికి తనను స్వచ్ఛందంగా సమర్పించుకున్నాడు.
సందీప్ ఇంట్లో రగిల్చిన అగ్ని వెలుగుగా మారినా బయటి చిచ్చుకు నిఖిల్ బలి కాక తప్పలేదు. తోటికోడలు లాగే తనూ తెల్లచీర లోంచి తలమీది ముసుగుతో విమల ను చూపించి సత్యజిత్ రే ప్రేక్షకుల గుండెలు పిండుతాడు.
విమల ఇంటా బయటా కూడా అన్నీ పోగొట్టుకుంది. ఆమెకు బయట కలిగిన అనుభవం మోసపూరితం కావడం కారణం. సుశీలకు బయట కూడా జీవితంలోకి వచ్చిన పురుషుడు నిజమైన ప్రేమికుడు. కాబట్టే ఆమెకు ఆ ఇద్దరు పురుషులూ కానీ ఉద్యమం కానీ మేలు చేశాయి. విమలకు ఆ అవకాశం లేకపోయింది.
స్త్రీలు మోహాల కోసం ప్రేమల కోసం అలమటిస్తారు. భర్తలు ఉత్తములైనా సరే. బయట ప్రపంచంలో అడుగు పెడితే సందీప్ వంటి పురుషులు కాచుకుని ఉంటారు. శలభాలను చేసి లాక్కుంటారు. వారి చాకచక్యాలముందు స్త్రీలు తట్టుకుని ఆగడం దుస్సాధ్యం
ఇక భర్తలు ఏ మాత్రమూ మంచివాళ్లు కానప్పుడు ఆ భార్యలు ప్రేమోన్మాదులై ఇళ్లు వదిలి బయటికి వస్తే వారికి బయట ఏం మిగులుతుంది. ఇంట్లో పురుషులేమోగానీ బయటిపురుషులు మాత్రం ఎక్కువశాతం సందీప్ వంటివారే ఐనప్పడు బయటి ప్రపంచాన్ని నమ్మి ఇళ్లు వదలడంలో ఉన్న ప్రమాదం ఎలాంటిది.
ఇలాంటి ప్రశ్నలు కలిగిస్తుంది ఈ టాగూర్ నవల… ముఖ్యంగా సినీమా.
స్త్రీలు ఇంటి నుంచి బయటికి రావాలి ప్రపంచానుభవం కోసం, జ్ఞానానుభవం కోసం. అంతే తప్ప కేవలం పురుషుల ప్రేమ కోసం వద్దు సుమా అని ఎందుకో మరీ మరీ చెప్పాలనిపిస్తోంది.
సందీప్ గా సౌమిత్రీచటర్జీ చూపిన నటన కి మాటలు లేవు. తన అందంతో, కాదనలేని చొరవతో, ముంచెత్తే ప్రశంసలతో, వేడుకోళ్లతో, తెలివితో, వాక్చాతుర్యంతో పురుషుడు స్త్రీని ఎలా మోహవివశను చెయ్యగలడో తెర మీద అతను నటించగా ఆశ్చర్యంతో మతిపోతుండగా చూశాను.
స్త్రీలు ఇంటి నుంచి బయటికి రావాలి ప్రపంచానుభవం కోసం, జ్ఞానానుభవం కోసం. అంతే తప్ప కేవలం పురుషుల ప్రేమ కోసం వద్దు సుమా అని ఎందుకో మరీ మరీ చెప్పాలనిపిస్తోంది.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రముఖ తెలుగు కవయిత్రి, రచయిత్రి, కాలమిస్టు. ‘శేఫాలికలు’ పేరిట వారు తనను ప్రభావితం చేసిన రచనల గురించి రాస్తుంటారు.