Editorial

Wednesday, January 22, 2025
Peopleశీలా వీర్రాజు గారు - వెంటాడే ఆరాధ భావన : వాడ్రేవు చినవీరభద్రుడి ఆత్మీయ...

శీలా వీర్రాజు గారు – వెంటాడే ఆరాధ భావన : వాడ్రేవు చినవీరభద్రుడి ఆత్మీయ నివాళి

శీలా వీర్రాజు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. వారు రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. ఆ రచయిత, ప్రముఖ చిత్రకారుడిపై ఆత్మీయ నివాళి ఇది.

వాడ్రేవు చినవీరభద్రుడు

చాలా ఏళ్ళ కిందటి మాట. నేను బి ఏ మొదటిసంవత్సరంలో ఉన్నప్పటి సంగతి. ఒకరోజు నేను బొమ్మలు వేసుకుంటూ ఉండటం చూసి భమిడిపాటి జగన్నాథ రావు గారు ‘మా డిపార్ట్ మెంటులో శీలా వీర్రాజు గారని ఉన్నారు, ఆయన కూడా కవితలు రాసుకుంటూ వాటికి తనే బొమ్మలు వేసుకుంటూ ఉంటారు తెలుసునా’ అన్నారు. అంతేకాదు, ‘ఆయన తన చేతిరాతలోనే రాసుకున్న కవితల్ని ప్రతి కవితనీ ఒక బ్లాకుగా చెక్కించి, ఆ బ్లాకుల్ని ముద్రించి పుస్తకం వేసుకున్నారు తెలుసా’ అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు పట్టలేని కుతూహలం కలిగింది.

ఇప్పుడు మనం డెస్కు టాప్ ప్రింటింగ్ కాలంలో, ఫొటోషాపు, కోరల్ డ్రా యుగంలో ఉన్నాం కాబట్టి బ్లాకు ప్రింటింగు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు పుస్తకాల్లో ఫొటోలు, చిత్రలేఖనాలు ప్రచురించాలంటే వాటిని ముందు బ్లాకులుగా తయారుచేసేవారు. ఆ బ్లాకుల్ని పుస్తకంలోని అక్షరాల మధ్య ఎక్కడ కావాలో అక్కడ అమర్చుకుని ట్రెడిల్ ప్రెస్సు మీద ప్రింటు చేసేవారు. అక్షరాల్ని ప్రింటు చెయ్యడం అదొక ప్రక్రియ. అన్ని అక్షరాలూ కొన్ని వందలు సీసం, తగరంలాంటి ఒక మిశ్రలోహంతో తయారు చేసి ఉండేవి. ఆ అక్షరాల్ని ఒక్కొక్కటీ ఏరి ఒక వాక్యంగా కూర్చేవారు. వాక్యానికీ వాక్యానికీ మధ్య ఉండే ఖాళీ వల్ల ఆ అక్షరాలు జారిపోకుండా వాటి మధ్యలో మళ్ళా బ్లాంకు లెడ్ పేర్చేవారు. దాన్ని ఇప్పుడు మన కంప్యూటరులో వర్డ్ ప్రాసెసర్ స్పేసింగ్ లో లెడింగ్ అని వ్యవహరిస్తున్నాం. ఒకప్పుడు శ్రీ శ్రీ, మహాప్రస్థానం మొదటి సారి ప్రింటయినప్పుడు, ఆ అక్షరాల్లో ఒక అక్షరం జారిపోయినందువల్ల, మొదటి ఎడిషను లో ఒక ముద్రారాక్షసం దొర్లిందని ఎంతగానో ఖేదపడ్డాడు!

ఆయన అప్పుడు ఆ పుస్తకం వెంటపెట్టుకుని వెళ్ళిపోయారుగానీ, ఆ నవల్లోని ఒక అపూర్వ ప్రేమాన్విత వాతావరణం, ఆ చిత్రణ, అందులోని పాత్రలు మాత్రం ఆయనతో తిరిగి వెళ్ళిపోకుండా నాతో పాటే ఉండిపోయాయి.

అక్కడితో ఆగకుండా ఆయన రాసిన మైనా నవల గురించి కూడా ప్రస్తావించేరు. ఆ నవల ఎక్కడ దొరుకుందని అడిగాను. తన దగ్గర ఉందనీ, అది కూడా ఒకే ఒక్క కాపీ అని, ఈసారి వచ్చినప్పుడు తీసుకువస్తాననీ చెప్పారు. అప్పట్లో జగన్నాథరావు గారు ఏలూరులో పనిచేసేవారు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు, ఆ పుస్తకం తీసుకువచ్చారు. అప్పటికే ఎంతో ఆశగా ఆ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నానేమో, ఆ పుస్తకాన్ని ప్రేమగా తడిమి చూసాను. ఆయన అది చూసినట్టున్నారు, ‘నేను మళ్ళా పొద్దున్నే వెళ్ళిపోతున్నాను, ఈ పుస్తకం కూడా పట్టుకుపోతాను. నువ్వు చూస్తావని తీసుకు వచ్చేను. అంతే’ అన్నారు. దాదాపు మూడు వందల పేజీల నవల అని గుర్తు, దాన్ని ఆ ఒక్కరాత్రిలో నేను చదవడం కష్టమని కాబోలు ఆయన ఆ మాట అన్నారు. కాని, ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక, నేను కిచెన్ లో కూచుని, తలుపు దగ్గరకు వేసుకుని, ఆ నవల పూర్తిగా చదివేసాను. ఆయన అప్పుడు ఆ పుస్తకం వెంటపెట్టుకుని వెళ్ళిపోయారుగానీ, ఆ నవల్లోని ఒక అపూర్వ ప్రేమాన్విత వాతావరణం, ఆ చిత్రణ, అందులోని పాత్రలు మాత్రం ఆయనతో తిరిగి వెళ్ళిపోకుండా నాతో పాటే ఉండిపోయాయి.

అప్పుడు ఆ బౌండు పుస్తకం లోపలి మొదటిపేజీమీద తన స్వహస్తాలతో నా పేరు రాసి ఎంతో ప్రేమగా నా చేతుల్లో పెట్టారు. అప్పటి నా సంతోషాన్ని ఏమని చెప్పేది!

నేను 1983 లో హైదరాబాదు వచ్చినప్పుడు మా అన్నయ్యని నన్ను ఇద్దరి దగ్గరికి తీసుకువెళ్ళమని అడిగాను. ఒకరు గుంటూరు శేషేంద్ర శర్మ, మరొకరు శీలా వీర్రాజు. మా అన్నయ్య నన్నొక ఆదివారం వీర్రాజు గారింటికి తీసుకువెళ్ళాడు. నేనాయన్ను చూడగానే అడిగిన మొదటి ప్రశ్న, తన కవిత్వాన్ని బ్లాకులుగా చేసి ముద్రించిన ఆ పుస్తకం కాపీ ఒకటి ఉందా, చూడాలని ఉంది అని. జగన్నాథ రావు గారు ఆ పుస్తకం గురించి చెప్పినప్పణ్ణుంచి, బహుశా, అప్పటికి మూడేళ్ళపైనే అయి ఉంటుంది, ఒకటే కుతూహలంగా ఉందని చెప్పాను. ఆయన మందస్మితంతో లోపలనుంచి, ఆ పుస్తకం తాలూకు విడి ఫారాలు పట్టుకొచ్చారు. నా ముందే మరొక కార్డుబోర్డు తీసుకొచ్చి కట్ చేసి ఆ విడి కాగితాలు ఆ కార్డుబోర్డు అట్ట కలిపి చేత్తోనే బైండ్ చేసారు. అప్పుడు ఆ బౌండు పుస్తకం లోపలి మొదటిపేజీమీద తన స్వహస్తాలతో నా పేరు రాసి ఎంతో ప్రేమగా నా చేతుల్లో పెట్టారు. అప్పటి నా సంతోషాన్ని ఏమని చెప్పేది!

ఆ రోజు వీర్రాజు గారు నా ఎదటనే తన పుస్తకం చేత్తో బైండ్ చేసి నా చేతుల్లో పెట్టినప్పుడు నేనొక అరుదైన మాంత్రికుణ్ణి చూసినట్టుగా ఫీలయ్యాను.

యూరోప్ లో ప్రింటింగ్ ప్రక్రియని ప్రారంభించినవారు చేతివృత్తుల కళాకారులు. మనం artisans అంటామే వాళ్ళు. మధ్యయుగాల యూరోప్ లో artist, artisan దాదాపుగా ఒకరే. ఎంగ్రేవర్లు, కాలిగ్రాఫర్లు, మీనియేచర్ చిత్రకారులు ప్రధానంగా చేతివృత్తుల కళాకారులు. ఆధునిక యుగం మొదలయ్యాక, చిత్రకారులూ, కవులూ వేరయ్యారుగాని, చాలా కాలం వరకూ కవులు కళాకారులు కూడా. ఆధునిక యుగంలో కూడా విలియం బ్లేక్ లాంటి కవి తనలోని ఎంగ్రేవర్ ని కాపాడుకుంటూనే ఉన్నాడు. కవి, కళాకారుడూ ఒకటిగా ఉండటమనేదానిలో మానవ పూర్వయుగాల మహిమాన్విత ప్రజ్ఞ ఏదో మనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఆ రోజు వీర్రాజు గారు నా ఎదటనే తన పుస్తకం చేత్తో బైండ్ చేసి నా చేతుల్లో పెట్టినప్పుడు నేనొక అరుదైన మాంత్రికుణ్ణి చూసినట్టుగా ఫీలయ్యాను.

ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే వీర్రాజు గారిని ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఆ తొలినాళ్ళ అద్భుత భావన, ఆరాధభావన నన్ను వెన్నాడుతూనే ఉండేవి. ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.
శీలా వీర్రాజుగారు కవిగా, కథా కావ్యకవిగా, కథకుడిగా, నవలాకారుడిగా సాగించిన కృషికి ఇంకా సరైన మూల్యాంకనం రావలసి ఉంది. కాని ఏకకాలంలో కవిగా, కళాకారుడిగా ఆయన చూపించిన సృజనవైదుష్యం మాత్రం ఒకటో రకం.

వీర్రాజు గారిని మొదట చూసినప్పుడు ఏ అనుభూతి నాకు లభ్యమయ్యిందో, అటువంటి అనుభూతిమధ్యనే, ఇప్పుడు తెలుస్తున్నది, ఆయన్ని చివరిసారి కూడా కలుసుకున్నానని.

ఆయనతో నా తొలిరోజుల అనుభవం దేవుడు బాగా గుర్తుపెట్టుకున్నాడు. నాలుగైదు నెలలకిందట ఆయన తన చిత్రలేఖనాలు దామెర్ల రామారావు ఆర్టు గాలరీకి బహూకరించాలనుకున్నప్పుడు, ఆ గాలరీ నాతో ప్రారంభించమని పడాల వీరభద్రరావుగారితో చెప్పారట. వీరభద్ర రావు గారు ఆ మాట చెప్పినప్పుడు, చిత్రకారుడు లేకుండా గాలరీ ప్రారంభించడమేమిటి, ఆయనకి రాజమండ్రి రావడం ఎప్పుడు వీలైతే అప్పుడే ఆ వేడుక చేద్దాం అన్నాను. అదృష్టంకొద్దీ, మొన్న మార్చిలో, ఆ అవకాశం లభించింది.

వీర్రాజుగారిది రాజమండ్రి. తాను చిత్రించిన చిత్రలేఖనాల్ని తాను పుట్టిన ఊరికి బహూకరించగలిగే అరుదైన భాగ్యం ఆయనకు దక్కింది. ఆ రోజు నేనూ, అక్కా, అన్నపూర్ణ గారూ, వసుధారాణిగారూ ఆ సభలో పాల్గొన్నాం. వీర్రాజు గారిని మొదట చూసినప్పుడు ఏ అనుభూతి నాకు లభ్యమయ్యిందో, అటువంటి అనుభూతిమధ్యనే, ఇప్పుడు తెలుస్తున్నది, ఆయన్ని చివరిసారి కూడా కలుసుకున్నానని.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి నిన్నటి వ్యాసం ‘పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం’ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article