Editorial

Wednesday, January 22, 2025
కథనాలుEtikoppaka మూడు నదుల దేశమూ బొమ్మల కొలువు - వాడ్రేవు చినవీరభద్రుడి సందర్శన

Etikoppaka మూడు నదుల దేశమూ బొమ్మల కొలువు – వాడ్రేవు చినవీరభద్రుడి సందర్శన

పక్వానికి వచ్చి కోతలు సాగుతున్న చెరకుతోటల మధ్యనుంచి, అరటితోటల మధ్యనుంచి, అప్పుడప్పుడే పూత మొదలవుతున్న మామిడితోటల మధ్యనుంచి ఏటికొప్పాకలో అడుగుపెట్టాను. ఎప్పణ్ణుంచో అనుకుంటున్నది, ఇన్నాళ్ళకి ఆ బొమ్మలకొలువు చూడగలిగాను.

వాడ్రేవు చినవీరభద్రుడు

ఎవరేనా గ్రామాలు చూడటానికో, ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేయడానికో బంగ్లాదేశ్ నో, శ్రీలంకనో లేదా ఏదేనా దక్షిణాసియా దేశానికో వెళ్తున్నామంటే నాకు అనిపిస్తుంది, ముందు, మన దేశం, మన ప్రాంతం, మన గ్రామాలు మనకి ఎంత మాత్రం తెలుసని? ఎలమంచిలి దాటి ఎన్నిసార్లు విశాఖపట్టణం ప్రయాణించలేదు? కాని హైవే దిగి పది పన్నెండు కిలోమీటర్లదూరంలో ఉన్న ఈ హస్తకళల గ్రామానికి ఇన్నాళ్ళూ ఎందుకు వెళ్ళలేకపోయానంటే సమాధానం ఏమిటి?

ఈ మధ్య కొండపల్లి, పెడన లాంటి కళాకారుల గ్రామాలు చూసినతర్వాత ఏటికొప్పాక కూడా చూసితీరవలసిందే అనుకున్నాను. ఎందుకంటే తెలుగు సంస్కృతిని నిర్మించిన గ్రామాలివి. బయట ప్రపంచానికి అంతగా తెలియని ఈ గ్రామాలే మన జీవనశైలిని నిర్దేశించే geographical indicators.

ఏటికొప్పాక ఎక్కడ అని అడుగుతూ దారి వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళం, ఊళ్ళో అడుగుపెట్టిన తరువాత బొమ్మలు తయారు చేసేదెక్కడ అని అడుగుతూ ఉన్నాం. బహుశా అలా ఎవరో ఒకరు కారుమీద ఆ ఊళ్ళో అడుగుపెడుతూ బొమ్మల గురించి అడగడం ఆ ఊరికి అలవాటయినట్టే ఉంది. కాని వాళ్ళు నేను బొమ్మలు కొనడం కోసం వస్తున్నానుకుని బొమ్మల దుకాణాల వైపు దారి చూపిస్తూ ఉన్నారు. ఊరి మధ్యలో ఒక వీథి పొడుగునా బొమ్మల దుకాణాలున్నాయి. అందులో కొద్దిగా పెద్దదిగా కనిపిస్తున్న దుకాణంలో అప్పటికే కొంతమంది చేరి బొమ్మలు బేరమాడుతున్నారు. కొందరు తాము కొనుక్కున్నవాటికి లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు కొన్నవాటిని పాక్ చేయించుకుంటున్నారు. నేను ఆ దుకాణంలో అడుగుపెట్టి ఆ బొమ్మలన్నీ ఒకసారి కలయచూసాను. ఆ షాపు యజమానితో ‘ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఎక్కడుంటారు’ అని అడిగాను. అతడు ‘ఈ వీథి మలుపు తిరిగితే ఒక కాలనీ వస్తుంది. అక్కడ దాదాపు రెండుమూడు వందల ఇళ్ళు ఉంటాయి. ప్రతి ఇల్లూ ఒక్క బొమ్మల తయారీ కుటీరమే’ అని జవాబిచ్చాడు. నేనా బొమ్మలు మరోమారు పరిశీలనగా చూస్తూ ‘వీటికీ కొండపల్లికీ తేడా ఏమిటి?’ అనడిగాను. ‘స్పీడు ‘ అన్నాడతడు. ‘కొండపల్లి బొమ్మలు నెమ్మదిగా చేత్తో తయారు చేస్తూ, ఒక్కొక్క బొమ్మకే రంగులు వేసుకుంటూ నెమ్మదిగా తయారు చేస్తారు. కాని ఇవి అలాకాదు. శరవేగంతో తయారయ్యే బొమ్మలు’ అన్నాడు.

ఒకప్పుడు వరంగల్ జిల్లాలో చేర్యాలలో నఖాషీ కళాకారుల్ని కలుసుకోవాలనుకున్నపుడు, ఇలానే ఊళ్ళో అడుగుపెట్టి నాకు కనిపించిన మొదటి ఇంటికే వెళ్ళాను. ఏమాశ్చర్యం! ఈసారి కూడా అట్లానే నాకు కనిపించిన మొదటి ఇంట్లో అడుగుపెట్టాను.

మేమా దుకాణం నుంచి బయటకు వచ్చి ఆ కాలనీ వైపు బండి తిప్పాం. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత ఏ ఇంటికని వెళ్ళడం ఎవరిని అడగడం అనుకుంటూ ఉన్నాను. అప్పటికే నడిమధ్యాహ్నం కావొస్తూ ఉంది. నేనేమి తెలుసుకోవాలనుకుంటున్నాను? ఒకప్పుడు వరంగల్ జిల్లాలో చేర్యాలలో నఖాషీ కళాకారుల్ని కలుసుకోవాలనుకున్నపుడు, ఇలానే ఊళ్ళో అడుగుపెట్టి నాకు కనిపించిన మొదటి ఇంటికే వెళ్ళాను. అలా అడుగుపెట్టిన ఇల్లు జాతీయస్థాయి గుర్తింపు పొందిన కళాకారుడిది. ఆయన నాకు నఖాషీ గురించి ఎంత చెప్పాలో అంతా చెప్పాడు. ఏమాశ్చర్యం! ఈసారి కూడా అట్లానే నాకు కనిపించిన మొదటి ఇంట్లో అడుగుపెట్టాను. అది కూడా ఏటికొప్పాక కళలో సిద్ధహస్తుడిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఒక కళాకారుడి ఇల్లు!

రామాయణకావ్యం దండకారణ్య వృక్షాల గురించి వర్ణించేటప్పుడు ‘కుటజం’ అని పేర్కొన్నది అంకుడు చెట్టునే. ఇల్లు కట్టడానికి, సామగ్రి తయారీకి దేనికీ పనికిరాని కర్ర. దేవుడు ఆ చెట్టుని ఒక బొమ్మగా మారడం కోసమే సృష్టించాడు.

పెదపాటి ఆనందాచారి అనే ఆ కళాకారుడు పుట్టిందీ పెరిగిందీ ఏటికొప్పాకలోనే. ఇప్పుడతడికి డెబ్బై రెండేళ్ళు. తన తండ్రికి చాలా భూమి ఉండేది. తండ్రి తన పొలాన్ని కౌలుకిచ్చి బొమ్మలు తయారుచేయడంలోనే జీవితం గడిపాడు. తాను కూడా తండ్రిదారిలోనే బొమ్మలు చేయడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు దాదాపు మూడు నాలుగు వందల కుటుంబాలు బొమ్మలు తయారు చేస్తో బతికేవారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటయాభైకి పడిపోయింది.

‘ఎందుకని? బొమ్మలమీద ఆదాయం తగ్గిపోయిందా? ఇప్పుడు ఈ కళకి ఆదరణ కరువయ్యిందా?’

‘అదేమీ కాదు. పూర్వంకన్నా ఇప్పుడు ఈ బొమ్మలకీ, ఇక్కడి తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఇదిగో చూడండి ‘ అంటో తన ఇంట్లో గుట్టగా పోసిన పూసల దండలూ, హారాలూ, కర్టెన్ల చుట్టూ వేలాడదీసుకునే అలంకారాలూ చూపిస్తూ ‘వీటిని మంచులక్ష్మి గారు ఆర్డర్ చేసారు. అమెరికా పంపిస్తారట. వారికోసం మా పిల్లవాడు పంపిస్తున్నాడు’ అని అన్నాడు.

‘మరింక సమస్య ఏమిటి?’

‘కర్ర. మేము ఈ బొమ్మల తయారీకి అంకుడు కర్ర వాడతాం. అది కృష్ణదేవి పేట, గొలుగొండ అడవుల్లో దొరుకుతుంది. ఒకప్పుడు విస్తారంగా దొరికేది. ఇప్పుడు తగ్గిపోయింది. ఆ ఉన్న కొద్ది పాటి కర్రనీ ఫారెస్టు డిపార్ట్మెంటు కన్ను కప్పి తేలేం. అందుకని ఫారెస్టు డిపార్ట్మెంటు వాళ్ళనే ఇక్కడికి పిలిచాం. వాళ్ళతో మీటింగు పెట్టాం. ఇక్కడ ఒక డిపో తెరవమని అడిగాం. ఇంకా ఆ ప్రయత్నాలు ఆ కొలిక్కి రావలసి ఉంది’ అన్నాడు. ‘అదిగో చూడండి, ఆ కర్ర ఎలా ఉంటుందో’ అన్నాడు, ఆ ఇంటివాకిట్లో మోపులుమోపులుగా కట్టినిలబెట్టిన కట్టెని చూపిస్తూ.

అంకుడు కర్ర. Wrightia Tinctoria. రామాయణకావ్యం దండకారణ్య వృక్షాల గురించి వర్ణించేటప్పుడు ‘కుటజం’ అని పేర్కొన్నది అంకుడు చెట్టునే. ఇల్లు కట్టడానికి, సామగ్రి తయారీకి దేనికీ పనికిరాని కర్ర. దేవుడు ఆ చెట్టుని ఒక బొమ్మగా మారడం కోసమే సృష్టించాడు.

‘ఆ కర్రని బొమ్మలుగా ఎలా మారుస్తారు? అందులో దశలేమిటి? కొండపల్లికీ మీకూ తేడా ఏమిటి’ అనడిగాను. అతడి ఇంట్లోనే ఒక పక్కగా చిన్న కార్ఖానా ఉంది. ఒక మనిషి కూచుని పనిచేసుకునేందుకు మాత్రమే పట్టే చోటు. ‘అది చూడండి’ అన్నాడు అతడు. ‘కొండపల్లి బొమ్మలు పొణికి కర్రతో చేస్తారు. వాళ్ళు ఆ బొమ్మల్ని చేతుల్తో చెక్కుతారు. మేము అంకుడు కర్రని మోటారుతో నడిచే యంత్రం మీద సానబెట్టుకుంటాం. ఆ కర్రని చెక్కేటప్పుడే దానికి లక్క పూస్తాం. లక్క మా ప్రత్యేకత ‘ అన్నాడు ఆనందాచారి.

అతడు నా కళ్ళముందు అంకుడు కర్ర ని మోటారుమీద పెట్టి తిప్పుతూ, తన దగ్గరున్న పనిముట్లతో దాన్ని తనకి కావలసిన ఆకారంలో మలుచుకుంటూ ఉన్నాడు. దానికి ఒక ఆకారం వచ్చిన తరువాత, తన దగ్గరున్న లక్క అచ్చుతో దానిమీద రంగుపూసాడు.

ఏటికొప్పాక బొమ్మల దుకాణం యజమాని మాకు చెప్పలేకపోయిన మాట అది.

ఆ లక్క కలకత్తానుంచి వస్తుంది. దాన్ని వాళ్ళు మళ్ళా కరగబెట్టి సేంద్రియవర్ణాలతో రంగరించి అచ్చులుగా పోసుకుంటారు. ఎరుపు, పసుపు, ఊదా, నీలం. ఏ రంగు ఏ కొమ్మలనుంచీ, కాయలనుంచీ, పండ్లనుంచీ చేస్తారో కూడా వివరించాడు. అప్పుడు మేము ఆ కార్ఖానాలో తదేకంగా పనిచేసుకుంటున్న కళాకారుణ్ణి చూసాం. అతడి పేరు ప్రసాద్. అతడు నా కళ్ళముందు అంకుడు కర్ర ని మోటారుమీద పెట్టి తిప్పుతూ, తన దగ్గరున్న పనిముట్లతో దాన్ని తనకి కావలసిన ఆకారంలో మలుచుకుంటూ ఉన్నాడు. దానికి ఒక ఆకారం వచ్చిన తరువాత, తన దగ్గరున్న లక్క అచ్చుతో దానిమీద రంగుపూసాడు. అప్పటికే వేడెక్కి ఉన్న ఆ కట్టెమీద లక్క అచ్చు తగిలించగానే లక్క కరిగి ఆ కట్టెచుట్టూ అందమైన రంగుపూత అల్లుకుపోయింది. ఆ రంగు అల్లుకుంటూండగానే సాండ్ పేపరు తీసుకుని దానికి నగిషీ పెట్టాడు. అప్పుడు ఆ బొమ్మని కత్తిరించాడు. సన్నగా తళతళలాడుతున్న అందమైన లక్క బొమ్మ నా కళ్ళముందు ప్రత్యక్షమయింది. ‘కరెంటు కోతలేకపోతే రోజుకి అయిదు వందల దాకా తయారు చెయ్యగలం ఇట్లాంటివి ‘ అన్నాడతడు.

లక్కబొమ్మలు. ఏటికొప్పాక అంటే లక్కబొమ్మలు. బహుశా భారతదేశంలో మైసూరు దగ్గర ఉన్న చన్నపట్నం తరువాత, లక్కబొమ్మలు తయారు చేసే ఒకే ఒక్క హస్తకళల గ్రామం ఏటికొప్పాక. ‘మా అబ్బాయి ఈ కళ గురించి దేశమంతా ప్రచారం చేస్తున్నాడు. చాలామంది పెద్దపెద్దవాళ్ళతో మా వాడికి పరిచయాలున్నాయి. ప్రతి ఏడాదీ కొత్త కొత్త బొమ్మలు తయారు చేసి పోటీలకి పంపిస్తుంటాడు. ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంటుంది’ అని గర్వంగా చెప్పుకున్నాడు ఆనందాచారి. అక్కడ గోడమీద చాలా ఫొటోలున్నాయి. ఒక దానిలో భారత రాష్ట్రపతి కలాం అవార్డు ఇస్తున్న దృశ్యం ఉంది. ‘అది మా పిల్లవాడి గురువుగారు’ అన్నాడు ఆ తండ్రి. మరొక ఫొటోలో అతడి కొడుకు అంబానీతో కనిపించాడు. ఇంకొన్ని ఫొటోలో స్థానిక మంత్రులు, రాజకీయనాయకులు, జిల్లా కలెక్టరు లాంటి వాళ్ళున్నారు. ఒక ఫొటోలో మాత్రం ఆనందాచారికి భారత ఉప రాష్ట్రపతి అవార్డు ఇస్తున్న దృశ్యం ఉంది. కొత్త కొత్త బొమ్మలు చేసినప్పుడల్లా అవార్డులు వస్తూనే ఉన్నాయి అని చెప్పాడు ఆ కళాకారుడు.

అతడి ఇంట్లోనే చిన్న సోకేసులో కొన్ని బొమ్మలున్నాయిగాని వాటిని ఊరికే నమూనాకు పెట్టినట్టుగా ఉంది. నేను ఆ షోకేసునీ, అక్కడ అలమారులమీద నిలబెట్టిన బొమ్మల్నీ చూస్తూండగా అక్కడ ఒక మూలన పడి ఉన్న హార్మోనియం మీద నా దృష్టి పడింది. ఇదెవరు వాయిస్తారు అనడిగాను. తనే అని చెప్పాడు. ‘నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఏళ్ళ పాటు నాటకాల్లో తిరిగేవాణ్ణి. హరిశ్చంద్ర, శ్రీకృష్ణార్జున యుద్దం, నాకు రాని పద్యాలు లేవు. ఒక్కక్కప్పుడు రోజులకి రోజులు ఆ నాటకాలు పట్టుకుని అలాగే తిరుగుతూ ఉండేవాణ్ణి’ అని చెప్పాడు. నాకోసం ఒక పద్యం పాడి వినిపించకూడదా అనడిగాను. ఆ హార్మోనియం పాడైపోయింది. అయినా చూద్దాం అనుకుంటూ దాన్ని చేతుల్లోకి తీసుకుని దాని మెట్లు సరిదిద్దాడు. ఒకటి రెండు సార్లు దాన్ని శ్రుతి చెయ్యబోయాడుగాని, ‘చూడండి, ఒక స్వరం నొక్కితే నాలుగు స్వరాలు వినిపిస్తున్నాయి’ అన్నాడు.

అప్పుడు చెప్పాడు అసలు సంగతి. ‘మాది మూడు నదుల దేశం. అనకాపల్లి అంటే శారదా నది. తుని పక్కనుంచి ప్రవహించేది తాండవ. మా ఊరుని పావనం చేసేది వరహా నది. ఈ మూడు నదుల మధ్య దేశం మాది. అసలు మా వరహా నది నీళ్ళు తాగినవాళ్ళకి ఎవరికైనా సరే పద్యాలు పట్టుబడకుండా ఉండవు’ అన్నాడు.

భారతదేశం అంటే గంగా, సింధూ మైదానం అనుకుంటాం. ఆంధ్రదేశమంటే గోదావరి, కృష్ణ అని చెప్పుకుంటాం. నువ్వు మరింత కిందకి దిగి, మరింత దగ్గరగా నీ దేశాన్ని పరికించి చూడగలిగితే, ఇదుగో, ఇట్లాంటి మూడు నదులు కనిపిస్తాయి.

ఇలా కదా ఒక ప్రాంతం తెలిసేది అనుకున్నాను. భారతదేశం అంటే గంగా, సింధూ మైదానం అనుకుంటాం. ఆంధ్రదేశమంటే గోదావరి, కృష్ణ అని చెప్పుకుంటాం. నువ్వు మరింత కిందకి దిగి, మరింత దగ్గరగా నీ దేశాన్ని పరికించి చూడగలిగితే, ఇదుగో, ఇట్లాంటి మూడు నదులు కనిపిస్తాయి. ఆ మూడు నదుల పరీవాహక ప్రాంతంలో ఇట్లాంటి కళాకారులు సాక్షాత్కరిస్తారు.

‘మీరు తిరిగి వెళ్ళడానికి మళ్ళా యెలమంచిలి వెళ్ళనక్కర్లేదు. ఇదుగో, ఈ అమ్మవారి గుడిపక్కనే వరహా నది ఉంటుంది. ఆ నది దాటితో అడ్డరోడ్డు వస్తుంది. అక్కడ మళ్ళా హైవే మీద కలుస్తారు ‘ అన్నాడు.

అతడు చెప్పినట్టే చేసాం. ఆ వరహానది దగ్గర ఒక క్షణం ఆగాం. ఎంతమంది రచయితలు పుట్టలేదు విశాఖపట్టణం జిల్లాలో. కాని ఒక్కరేనా ఈ వరహానది గురించి రాసారా? ఒక్క క్షణం పాటు నాకు మళ్ళా వెనక్కి వెళ్ళాలనీ, మళ్ళా ఆ కళాకారుడి దగ్గరికి పోయి అతడి జీవితం గురించి మరింత వినాలనీ, మరింత తెలుసుకోవాలనీ అనిపించింది. ఆ మూడు నదుల మధ్య జీవితం గురించి పెద్ద నవల రాయడానికి తగినంత ఇతివృత్తం అక్కడ ఉందనిపించింది.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ప్రభుత్వ ఉన్నతాధికారి.
వారి రచనల నిలయం నా కుటీరం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article