Editorial

Wednesday, January 22, 2025
స్మరణనివాళి'శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ'- వాడ్రేవు చినవీరభద్రుడి ఘన నివాళి

‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ’- వాడ్రేవు చినవీరభద్రుడి ఘన నివాళి

సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ.’

 

వాడ్రేవు చినవీరభద్రుడు 

కార్తిక ప్రభాతం. ఇప్పుడే శ్రీశైలేశుని దర్శనం చేసుకుని వచ్చాను. నల్లమల గిరిసానువులంతటా శారద ప్రాతః కాంతి. ఎవరో పసిడి కరిగించి శ్రీపర్వతాన్ని అభిషేకిస్తున్నారు. నా మనసులో ఆగీ ఆగీ నా మిత్రుడి తలపులు కదలాడుతూ ఉన్నాయి. ‘ఆ చిలక నువ్వే కావాలి, ఆ రాచిలుక నువ్వే కావాలి’ అంటున్నాడు నా మరొక మిత్రుడు కవితా ప్రసాద్ గగనపు విరితోటలోకి సీతారామశాస్త్రిని స్వాగతిస్తూ.

2
సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. తన యవ్వనకాలంలో గంగావతరణాన్ని రాసినప్పటినుండి, తను కైలాసగామి అయ్యేచివరిరోజుల్లో శివకావ్యం రాస్తుండేదాకా ఆయన అన్నిటికన్నా ముందు శివకవి, అన్నిటికన్నా చివరగా శివకవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ.’

3
ఆయన సినిమాపాటలు రాయడం యాదృచ్ఛికం అనే కన్నా శివేచ్ఛ అనడం సబబుగా ఉంటుంది. ఆయన సినిమా కవి ఏమిటి! ‘సిరివెన్నెల తరంగాలు ‘పుస్తకం చదివి ఆయనతో అన్నాను: ‘మీరు నిర్మాతల్ని మభ్యపెట్టి సినిమాపాటల రూపంలో గొప్ప కవిత్వ్వాన్ని దోసిళ్ళతో విరజిమ్ముతున్నారు ‘అని. ఎందుకంటే ‘గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే/బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే’ అని ఏ కవి అయినా అనగలడు. కాని ‘గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే’ అని అనగలగడం మామూలు కవికి సాధ్యం కాదు. దాన్ని సినిమాపాటగా జనులనోట నానేట్టు చేయడం శివానుగ్రహం కాక మరేమిటి!

4
సీతారామశాస్త్రితో నా అనుబంధం నలభయ్యేళ్ళకు మించింది. కాకినాడలో డెబ్భైల చివరలో సి.వి.కృష్ణారావుగారు నడిపిన నెలనెలా వెన్నెల రోజులనాటిది. కొద్ది రోజుల్లోనే 80, 81 లో నేను కాకినాడలో తిరిగిన రోజుల్లో ఆయన నా ఆత్మీయుడైపోయాడు. ఎన్నో రాత్రులు మల్లయ్య అగ్రహారంలో వాళ్ళ ఇంట్లో మేము వాదోపవాదాలతో, కావ్యచర్చల్తో గడిపేవాళ్ళం. రాంషా, ఆకెళ్ళ, సి.ఎస్. రాజేంద్రప్రసాద్, ఫణికుమార్, గోదావరి శర్మలు అప్పట్లో మా ఇన్స్పిరేషన్.

ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు మేమిద్దరం కలిసి తిరిగేం, కవిత్వం చదువుకున్నాం, వాదించుకున్నాం, గొడవపడ్డాం, సమాధానపడ్డాం. ఒకరి హృదయంలోకి మరొకరం చొచ్చుకుపోయేం. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన్ని తలుచుకుంటూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు.

5
సీతారామ శాస్త్రి అని పిలవడం మాకు కొత్త. మాకు ఆయన భరణిగానే పరిచయం. నా తాడికొండ సహాధ్యాయి రాజేంద్రప్రసాద్ కాకినాడ టెలిఫోన్ అకౌంట్స్ ఆఫీసులో పనిచేస్తుండే రోజుల్లో అంటే ఇప్పటికి నలభయ్యేళ్ళ కిందట భరణి తో కలిసి పనిచేసేడు. అతడి పాటల గురించీ, ప్రపంచం పట్టని అతడి వైఖరి గురించీ ఎంతో ఆరాధనాపూర్వకంగా మాట్లాడేడు. అప్పట్లో నేను అసంపూర్ణ మథనం అనే నవల రాస్తే ఆ చిత్తు ప్రతి తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చాడు. అది మొదలు భరణికీ నాకూ మధ్య ఒక ఆత్మీయానుబంధం మొదలు. ఆ తర్వాత ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు మేమిద్దరం కలిసి తిరిగేం, కవిత్వం చదువుకున్నాం, వాదించుకున్నాం, గొడవపడ్డాం, సమాధానపడ్డాం. ఒకరి హృదయంలోకి మరొకరం చొచ్చుకుపోయేం. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన్ని తలుచుకుంటూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు.

6
ఒకరోజు ఇద్దరం సైకిళ్ళమీద కాకినాడ టౌను రైల్వే స్టేషను దాకా వచ్చాం. అక్కడ రైలు గేటు పడితే కిందకి దిగాం. ఏ కవిగురించో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. రైలు వచ్చింది, వెళ్ళిపోయింది. మేమట్లా మాట్లాడు కుంటూ ఉండగానే పెద్ద వాన కురిసింది, ఆ వానలో తడిసిపోయాం. వాన వెలిసింది, మా దుస్తులు తడిసి ఆరిపోడం కూడా మొదలయ్యింది. కాని మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం.

7
ఒకరోజు ఆయనకి బైరాగి రాసిన రాస్కల్నికావ్ కవిత వినిపించాను. ఆ గీతం ఆయనకి హృదయస్థమయిపోయింది. ఎన్ని వందల సార్లు ఆయన పాడగా వినిఉంటాను: ‘త్రోవ ఎక్కడ సోనియా?’. ఆ పాట పాడుతో ఒకసారి ఆయన ‘శప్తమానవ హృదయభూమిని అనవరతమొక అగ్నివర్షణ ‘ అంటో ‘వాహ్ ‘ అన్నాడు. ఆశ్చర్యారాధనలు కలగలిసిన ఆ వషట్కారాన్ని నేనెప్పటికీ మరవలేను.

‘జగమంత కుటుంబం నాది/ఏకాకి జీవితం నాది/సంసార సాగరం నాది/సన్యాసం శూన్యం నావే’ ఆ పాట వినగానే అది నా జీవుని వేదన కూడా అనిపించింది. నా మాటలే ఆయన పాటగా పాడేడనిపించింది.

8
కాకినాడలో కలవపువ్వు మేడ వీథిలో మా అక్క ఇంటి అరుగు మీద ఆయన అప్పటిదాకా రాసిన పాటలన్నీ గుక్కతిప్పుకోకుండా పాడి వినిపించిన ఒక మధ్యాహ్న-సాయంకాల-రాత్రి. అప్పుడే మొదటిసారి విన్నాను: ‘జగమంత కుటుంబం నాది/ఏకాకి జీవితం నాది/సంసార సాగరం నాది/సన్యాసం శూన్యం నావే’ ఆ పాట వినగానే అది నా జీవుని వేదన కూడా అనిపించింది. నా మాటలే ఆయన పాటగా పాడేడనిపించింది.

9
ఆయన్ని రాజమండ్రి సాహితీవేదిక మిత్రులకి పరిచయం చెయ్యాలని తహతహలాడేను. ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన్ని పరిచయం చేస్తూ సమాచారంలో ఒక వ్యాసం రాసేను. అందులో ‘భరణి మన తరంలో అరుదైన ఒక సాంగ్ మేకర్ ‘అని రాసాను. ఆ మాట ఆయన చివరిదాకా గుర్తుపెట్టుకున్నాడు.

10

శ్రీ శ్రీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వారం రోజులవుతుందేమో. భరణి దగ్గరకు వెళ్ళాను. కాకినాడలో ఆ ఇంట్లో ఆయనొక్కడే ఉన్నాడు. విద్యుద్దీపపు కోరారంగు కాంతి. ఆయన నన్ను చూడగానే ఏమీ మాట్లాడలేదు. శ్రీ శ్రీ గురించి అసలు మాట్లాడలేదు. తన పక్కనున్న షెల్ఫులోంచి మహాప్రస్థానం తీసి ‘నిద్రకు వెలియై నేనొంటరినై ‘గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. మొదట మంద్రంగా, ఆపై బిగ్గరగా. చివరికి వచ్చేటప్పటికి ‘చీకటిలోపల నా గదిలో, నా గదిలో చీకటిలో, ఆకటితో ‘అనే మాటలు పలగ్గానే నేనొక విద్యుదాఘాతానికి లోనయ్యాను. ఒక కవిత నా శరీరం మీద కూడా అంత ప్రభావం చూపించగలదని అప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే, ‘ఆకటితో ‘ అంటే ఏమిటో శ్రీ శ్రీకి ఎంత తెలుసో, సీతారామశాస్త్రికి కూడా అంత తెలుసు కాబట్టి.

11
భరణి సినిమాల్లోకి వెళ్ళడం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారడం, ఆ వార్తలన్నీ రాజేంద్రప్రసాద్ నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తూండేవాడు. అప్పటికింకా భరణి తన ఉద్యోగానికి రిజైన్ చెయ్యలేదు. మధ్యలో వచ్చి కొన్నాళ్ళు టెలిఫోన్స్ లో పనిచేసి మళ్ళీ వెళ్తుండేవాడు. అట్లాంటి ఒకరోజుల్లో మా ఆప్తమిత్రుడు సి.ఎస్ ఇంట్లో ఒక రాత్రి మళ్ళా ఆయన పాటలు వినిపించాడు. అప్పుడు ఆ గోష్టిలో ఎవరో ఒకరిద్దరు మిత్రురాళ్ళు కూడా ఉన్నారు. వారెవరో, వారి పేర్లేమిటో కూడా ఇప్పుడు నాకు గుర్తులేదు. కాని ఆ రాత్రి వాళ్ళతో కలిసి ఆ పాటలు విన్నందుకు వాళ్ళు నాకు ఆ క్షణాన ఎంత ఆత్మీయులుగా తోచారని! ఇప్పుడు ఆ రాత్రి లేదు, ఆ గోష్టి లేదు. కాని ఆ పాట ఉంది. ‘ఏమి లీల నీ వినోదము/మాయామతివి నీవు/తెలియరాదు నీ విలాసము.’ సీతారామశాస్త్రి నాకు తెలియని ఎత్తుల్లో విహరిస్తున్నాడని ఆ రాత్రే మొదటిసారిగా తెలుసుకున్నాను.

ఆయనకి తొలిసారి నంది పురస్కారం వచ్చినప్పుడు నేనొక ఉత్తరం రాసానట. నాకు గుర్తు లేదు. ‘వీళ్ళెవరు మీకు సన్మానం చెయ్యడానికి? నేను చేస్తాను మద్రాసు మహాసముద్రం ఒడ్డున ‘అని రాసానట.

12
ఆయనకి తొలిసారి నంది పురస్కారం వచ్చినప్పుడు నేనొక ఉత్తరం రాసానట. నాకు గుర్తు లేదు. ‘వీళ్ళెవరు మీకు సన్మానం చెయ్యడానికి? నేను చేస్తాను మద్రాసు మహాసముద్రం ఒడ్డున ‘అని రాసానట. ఆ తర్వాత నేను కలిసిన ప్రతి సారీ ఆయన ఆ మాటలు గుర్తుచేసుకుంటూనే ఉండేవాడు.

13
1999. ఆయన శివదర్పణం గీతాల సంపుటం ఆవిష్కరణ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించేడు. అదొక గొప్ప గౌరవంగా భావించేను. ఆ తర్వాత చాలా కాలం పాటు శివదర్పణం గీతాలతో నా ఇల్లు, నేను తిరిగే వాహనం మారుమోగిపోతుండేవి. ఆయన మామూలు కవి కాదు, శివకవి అని గుర్తుపట్టిందప్పుడే. ఆ మాటే రాసాను, శ్రీశైలం మీద నేను రాసిన యాత్రాకథనంలో.

14
2001. మచిలీపట్నంలో కవితాప్రసాద్ తన పుస్తకాలు ఆవిష్కరించడానికి పెద్ద సభ పెట్టుకుని సీతారామశాస్త్రినీ నన్నూ ఆహ్వానించేడు. కలిసి ప్రయాణించే హైదరాబాదునుంచి పాటల్తో, మాటల్తో. మేము విజయవాడ రాగానే ఒక లాయరు గారు నిలువెత్తు గులాబీమాలతో ఆ రోడ్డుమీదే సీతారామశాస్త్రికి స్వాగతం పలకడం చూసాను. ఆ తర్వాత క్షణం కూడా ఆయన సీతారామశాస్త్రిని వదిలిపెట్టలేదు. అర్థమయింది నాకు, నా కవిమిత్రుడు ఇప్పుడు ప్రపంచానికి , ఆరాధ్యసఖుడిగా మారిపోయేడని.

15
2002. నా మిత్రురాలు, తన తొలియవ్వనంలో తన సహవిద్యార్థిని ప్రేమించింది. కాని అతడు ఆమె హృదయాన్నందుకున్నాడుగాని చేయి అందుకోలేకపోయాడు. ‘ఈ వేళలో నువ్వు ఏమి చేస్తు ఉంటావు ‘అనే పాట ఎప్పుడు విన్నా తన తొలిప్రేమ గుప్పున గుండెలో ఎగిసిపడుతుందని, ఒక తడిగుడ్డ మెలిపెట్టినట్టుగా తన హృదయం నలిగిపోతుందనీ. తన మనసులో గూడుకట్టుకున్న ఆ తీయని దిగులుని పాటగా మార్చిన ఆ కవికి కన్నీళ్ళతో అభిషేకం చేయాలని ఉందని చెప్పిందామె. ఆ కవి నా మిత్రుడని చెప్పాను. ఆశ్చర్యపోయింది ఆమె. ఆమె కళ్ళల్లో నేను హిమాలయమంత ఎత్తు ఎదిగిపోయాను ఆ క్షణాన. శాస్త్రిగారిని అడిగాను, నా మిత్రురాలు ఆయన్ని చూడాలని అనుకుంటూ ఉందని, రావొచ్చునా అని. ఆయన ఎంతో దయతో, ఇష్టంతో, లాలనతో మాకోసం ఒక రాత్రంతా పాటలు పాడుతూనే ఉన్నారు. బయట మరొకగదిలో కృష్ణవంశి ఎదురు చూస్తున్నాడని మాటిమాటికి ఎవరో ఒకరు ఆయనకి గుర్తుచేస్తూనే ఉన్నారు. కాని ఆయన మనసు, ధ్యాస, ప్రాణం అటువైపు లేనేలేవు. ఇప్పుడు ఆయన లేరు, ఆ నా మిత్రురాలు కూడా నా నుంచి దూరంగా జరిగిపోయింది, కాని ఈ వాక్యాలు మాత్రం మార్గశిరమాసపు తొలిజాములో రాలిపడ్డ పారిజాతాల్లా నా మనసుని లాక్కుంటూనే ఉంటాయి:

నడిరేయిలో నీవు నిదురైన రానీవు
గడిపేదెలా కాలమూ
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీమీదనే ధ్యానమూ..

16
నా ఒక పుట్టినరోజు హైదరాబాదులో నేనుండే అద్దె ఇంటిమేడ మీద జరిపేం. మరే కారణం లేదు. రంగాచార్యగారినీ, సీతారామశాస్త్రినీ, పద్మనీ ఒక్కచోట చేర్చాలనీ, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వినాలనీ. నా మిత్రుడు ఎమెస్కో విజయకుమార్ ఏర్పాటు చేసిన గోష్టి అది. ఆ తర్వాత సీతారామశాస్త్రీ, రంగాచార్య గారూ చెప్పలేనంత గాఢమిత్రులైపోయారు. ఒకరోజు రంగాచార్య విజయకుమార్ తో అన్నారట: ఆ శాస్త్రి సిగరెట్లు మానకపోతే అరెస్టు చేయిస్తానని చెప్పాను అతడితో అని.

17
ఒకరోజు సీతారామశాస్త్రి ఉన్నట్టుండి ఫోన్ చేసాడు. నా ‘పునర్యానం’ చదివేడట. దాదాపు గంటసేపు ఆ కవిత్వం గురించే మాట్లాడుతూ ఉండిపోయేడు. ఆ మాటలు రికార్డు చేసుకోకపోవడం నా దురదృష్టం.

18
హైదరాబాదులో ఒక సాహిత్య సభ. ఎవరు ఏర్పాటు చేసారో, ఎవరి పుస్తక ఆవిష్కరణనో గుర్తులేదు. కాని సీతారామశాస్త్రి ఉన్నాడు. ఆ సభ చివరలో ఆయన్ని ఒక పాట పాడమని అడిగారు. తత్ క్షణమే ఆయన ఎలుగెత్తి పాడాడు:

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారథెవరురా..
నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

ఆ పాట ఒక్కటి చాలు, ఆయన పాడుకుంటూ ఆంధ్రదేశమంతా తిరిగి ఉంటే ప్రకంపనాలు పుట్టిఉండేవి.

19

ఆ తర్వాత ఆయన్ని కలవడం బాగా అరుదైపోయింది. ఆయన్ని కలిస్తే ఆయన పాటలకి అడ్డుపడతానేమో అన్న సంకోచంతో నా కాళ్ళు కదిలేవి కావు. కాని పొద్దున్నే రేడియోలో, రాత్రి టివిలో, ఏ మధ్యాహ్నమో ఏ వీథిమలుపులోంచో, ఏ పల్లెటూరి గాలిలోనో, ఎవరో లోగోంతుకలో పాడుకునే కూనిరాగంలోనో, ఆయన పాటలు నన్నెప్పుడూ పలకరిస్తూనే ఉన్నాయి:

‘గుండెనిండా గుడిగంటలు, గువ్వల గొంతులు, ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే..’
‘తూనీగా తూనీగా ..’
‘జామురాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా..’
‘పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి..’
‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో..’
‘ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు..’

ఆయన వాళ్ళ కోసం ఆ స్టేషన్లో అలుపు లేకుండా గొంతెత్తి పాటలు పాడుతూనే ఉన్నాడు. కోకిలని హృదయగ్రాహి అని వాల్మీకి అన్నాడని మా మాష్టారు చెప్పారు. సీతారామశాస్త్రి అటువంటి హృదయగ్రాహి.

20
ఆయన్ని చివరిసారి కలిసింది ఎమ్మెస్ సూర్యనారాయణ ‘శబ్దభేది ‘ పుస్తక ఆవిష్కరణకు రాజోలు వెళ్ళినప్పుడు. ఆ రోజు పాలకొల్లులో రైలూ దిగినప్పటినుంచీ ఆ రాత్రి రైలెక్కేదాకా ఆయన నా కోసం పాటలు పాడుతూనే ఉన్నాడు. మేము ఆ రోజు తాటిపాకలో విడిది చేసిన సోమిసెట్టి లాండ్ మార్క్ హోటల్ మళ్ళా అటువంటి పాటలు ఎప్పుడూ వినే భాగ్యానికి నోచుకోదు. ఆ రాత్రి మేము భీమవరం రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూంలో కూచుని ఉండగా యువతీ యువకుల బృందమొకటి మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. నవతరం. ఒకటి రెండు క్షణాల బెరుకు తర్వాత వాళ్ళు ఆయన్ని ఎట్లా అల్లుకుపోయారని! ఆయన వాళ్ళ కోసం ఆ స్టేషన్లో అలుపు లేకుండా గొంతెత్తి పాటలు పాడుతూనే ఉన్నాడు. కోకిలని హృదయగ్రాహి అని వాల్మీకి అన్నాడని మా మాష్టారు చెప్పారు. సీతారామశాస్త్రి అటువంటి హృదయగ్రాహి.

21
చివరి సారిగా ఆయన నాతో మాట్లాడింది మువ్వా శ్రీనివాసరావు పుస్తకానికి తాను రాసిన ముందుమాట వినిపించడానికి. ఆ మాటలు మొత్తం రికార్డు చేసుకుని మరీ తనకి వినిపించారని చెప్పాడు శ్రీనివాసరావు ఈ మధ్య విజయవాడలో కలిసినప్పుడు.

22
కవిత్వాన్నీ కులాలకీ, మతాలకీ ముడిపెట్టడం మొదలయిన తర్వాత మామూలు పాఠకుడూ, శ్రోతా కవులనుంచి దూరంగా జరిగిపోయారు. కాని మంచి కవిత్వం వినాలనుకోవడం ప్రతి మనిషికీ ఒక మానసిక అవసరం. అదిగో, అటువంటి అవసరాన్ని తీర్చగలిగాడు సీతారామశాస్త్రి తన పాటల్తో. మన నుంచి దూరంగా జరిగిపోయిన తూనీగల్నీ, సీతాకోకచిలుకల్నీ, నల్లమబ్బుల్నీ, వెండికాంతుల్నీ తిరిగి తీసుకొచ్చి ఆయన తన పాటలతో ప్రపంచం మీద విరజిమ్మాడు. ఆయన్ని తాము ఇంతలా ప్రేమించామనీ, ఆయన తమ జీవితాల్లో ఇంతగా విడదీయరాని భాగమైపోయాడనీ ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా వెళ్ళిపోయినదాకా తెలియనే లేదు తెలుగు జాతికి. ‘ఆయన మరణం లో ఆయన జీవితం మరింత ఉజ్జ్వలంగా వెలిగింది’ అన్నాడు ఎమెస్కో విజయకుమార్ సీతారామశాస్త్రి అంత్యక్రియలు చూసి వస్తూ.

23
మనుషుల్ని ఒక్కటి చెయ్యడం కోసం మనుషుల్ని విడదీయడమనే ద్వేష విద్యని సాధన చేస్తున్న సాహిత్యలోకంలో, వాదవివాదాలకీ, కులమతాలకీ, సిద్ధాంతరాద్ధాంతాలకీ సంబంధంలేకుండా కేవలం హృదయసంబంధ గీతాలు పాడుకుంటో జీవించాడు సీతారామశాస్త్రి. ఆయన గురించి తలుచుకుంటూ ఉంటే ఇదిగో ఈ పాట గుర్తొస్తున్నది. దీన్ని రాసినప్పుడు ఆయన తనకు తానే ఎంతో మురిసిపోయి నాకు పాడి వినిపించారు. ఇప్పుడు చూస్తుంటే ఆ పాట ఆయన తన గురించి తానే రాసుకున్నట్టు వినిపిస్తున్నది:
రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు

నన్ను చూసి అంతా అంటారు
క్షేమమేనా అబ్బీ అంటే నా వాళ్ళవుతారు
పాదమాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్ళే అయినోళ్ళు
కాదు పోరా అంటే రారా అంటది రేపింకో ఊరు.
గాలిలాలిపాడే నేల తల్లి ఒళ్ళో
ఆదమరిచి నేను నిద్దరోతాను
వెన్ను తట్టి లేపే పిట్ట పాట వింటూ మేలుకుని నేను సూర్యుడవుతాను
అష్టదిక్కులమధ్య నేను దిక్కులేనివాడిని కాను
చుట్టుపక్కల ఉండే వాళ్ళే చుట్టపక్కాలనుకుంటాను
గడ్డిపువ్వులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి
గుడ్డి గవ్వలు కూడా నాకు ఆడుకొందుకు పనికొచ్చాయి
దుఃఖమంటే మాత్రం అర్థం నాకు చెప్పలేదు ఎవరూ.
నువు వరస కలుపుకుంటే నీ కొడుకునవకపోను
నాకు చేతనైన సేవ నీకు చేయలేకపోను
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
అనుకోడంలోనే అంతా ఉందని పెద్దలు అంటారు.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు.

More articles

1 COMMENT

  1. బాషకు మాటలు నేర్పే కవులు మరి.గొప్ప నైన జ్ఞాపకాలు.మాటల్లో వర్ణించలేని పదకోశం వారి కే స్వంతం. వారి గతస్మృతులను ఈ క్షణం లో మనము చదివి గొప్ప అనుభూతికి లోనవడం చెప్పనలవి కాదు. మంచి అనుభూతుల ను పంచిన వ్యాసకర్తకు నమస్సుమాంజలులు.కీర్తిశేషులు సిరివెన్నలకు నివాళులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article