Editorial

Wednesday, January 22, 2025
సాహిత్యంఇది పిల్లల ప్రేమికుల పాఠ్యపుస్తకం : వాడ్రేవు చిన వీరభద్రుడు తెలుపు

ఇది పిల్లల ప్రేమికుల పాఠ్యపుస్తకం : వాడ్రేవు చిన వీరభద్రుడు తెలుపు

నిజానికి మనకు కావలసింది ఉపాధ్యాయుల అనుభవాలు వినడం. ఆ అనుభవాల ఆసరాగా వాళ్ళెట్లాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకోవడం. ఇంకా చెప్పాలంటే, ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ శిక్షణలో తాము తెలుసుకున్న అంశాల్ని తమ అనుభవాలు ఏ మేరకు అంగీకరిస్తున్నాయో, ఏ మేరకు ప్రశ్నిస్తున్నాయో తెలుసుకోవడం. ఇది ఎంత విస్తృతంగా జరిగితే మన పాఠశాలలు అంతగా బలపడతాయి. మన పిల్లల బోధన, అధ్యయనం అంతగా వన్నెకెక్కుతుంది. అందుకనే ఉపాధ్యాయులు తమ అనుభవాల్నీ, తమ బడికథల్నీ విరివిగా పంచుకోవాలని కోరుకునేవాళ్ళల్లో నేను ముందుంటాను. సమ్మెట ఉమాదేవి అటువంటి ఉపాధ్యాయిని. ఈ పుస్తకం అందుకు గొప్ప దోహదకారి.

వాడ్రేవు చిన వీరభద్రుడు

ప్రసిద్ధ విద్యావేత్తల గురించి చదువుతుంటే ఒక విషయం తెలుస్తూంటుంది. అదేంటంటే వాళ్ళు ప్రధానంగా పిల్లలతో గడిపారు. పిల్లల్ని బాగా దగ్గరగా పరిశీలించారు. పిల్లలకి ఏది ఆసక్తి కలిగిస్తుంది, వాళ్ళని ఉత్సాహపరిచే విషయాలేమిటి, దేనికి వాళ్ళు ఉల్లాసపడతారో దగ్గరగా చూసారు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, తమ చుట్టూ ఉండే సామాజిక పరిసరాల్నీ, ప్రాకృతిక పరిసరాల్నీ ఎలా సమీపిస్తారు, ఆ క్రమంలో తమ వ్యక్తిత్వాల్ని ఎట్లా రూపొందించుకుంటారో ఆ విద్యావేత్తలు ఎంతో దగ్గరగా చూసి ఉంటారు. మీరు ఎవరి రచనలైనా చదవండి, ఫ్రోబెల్‌, మాంటిస్సోరి, స్కిన్నర్‌ లాంటి మనస్తత్వశాస్త్రవేత్తలు లేదా గాంధీ, టాల్‌ స్టాయి, గిడుగు రామ్మూర్తిలాంటి సామాజిక విద్యాతత్త్వవేత్తలు ఎవరైనా గానీ, విద్య గురించి వాళ్ళ దృక్పథం పిల్లలతో దగ్గరగా గడిపినందువల్లనే సాధ్యపడిరదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

కానీ వాళ్ళల్లో చాలామంది జీవితకాలం పాటు పిల్లలతో దగ్గరగా గడిపినవారు కారు, నిరంతరం ప్రయోగాలు చేసినవారూ కారు. కొన్నేళ్ళ పాటు పిల్లల్ని దగ్గరగా గమనించి చేసిన పరిశీలనలమీంచే వాళ్ళు తమ విద్యాతత్త్వశాస్త్రాన్ని నిర్మించారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్య గురించిన తాత్త్విక భావాల్ని గాఢంగా ప్రభావితం చేస్తున్న వైగోట్స్కీ నే తీసుకోండి. ఆయన క్షేత్ర స్థాయి ప్రయోగాలు, అధ్యయనాలూ మొత్తం పది పదిహేనేళ్ళ వ్యవధిలోపే. కానీ ఆ పరిశీలనల్ని మరింత లోతుగా విశ్లేషించుకుంటూ, ప్రతిపాదనలు రూపొందించడంలోనే ఆయన ఒక ప్రభావశీల విద్యావేత్తగా రూపొందాడు.

‘మా పిల్లల ముచ్చట్లు- ఒక టీచర్ అనుభవాలు. రచన – సమ్మెట ఉమాదేవి. ప్రచురణ – శాంతా వసంతా ట్రస్ట్, హైదరాబాద్. పేజీల సంఖ్య 258. వేల -అమూల్యం. పుస్తకం కోసం సంప్రదించండి. రచయిత్రి, కేరాఫ్ శ్రీ బి.డి.కృష్ణ, ఇంటి నంబర్. 3-2-353. సెకండ్ ఫ్లోర్, స్వామి వివేకానంద స్ట్రీట్, ఆర్. పి. రోడ్, సికింద్రాబాద్ – 500003. మొబైల్ : 9849406722

మన పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఏ ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా అంతకన్నా ఎక్కువ కాలమే పిల్లల్తో గడుపుతారు. ఈ మధ్య ఒక ఉపాధ్యాయుణ్ణి చూసాను. ఆయన ముప్పై ఎనిమిదేళ్ళుగా పనిచేస్తున్నాడు. ఇంతకన్నా సుదీర్ఘమైన, సుసంపన్నమైన క్షేత్రస్థాయి జీవితం ఏ తత్త్వశాస్త్ర ఆచార్యుడికీ, ఏ పాలనాధికారికీ కూడా సాధ్యం కాదు. ముప్పై, ముప్పై అయిదేళ్ళుగా పిల్లల్తో, అది కూడా అయిదేళ్ళనుండి పదేళ్ళ వయసు కలిగిన పిల్లల్తో గడపడం నుంచి వాళ్ళెంతో తెలుసుకుని ఉంటారు, ఎంతో నేర్చుకుని ఉంటారు. పిల్లల అధ్యయనానికీ, తమ బోధనకీ సంబంధించి వారెన్నో మెలకువలు గ్రహించి ఉంటారు. కాని అవేవీ మనకు తెలియదు. మనం, ఒక్కరోజు కూడా పిల్లల్తో గడిపి ఉండనివాళ్ళం, ఒక్క గంట కూడా పాఠం చెప్పి ఉండనివాళ్ళం, ఉపాధ్యాయులు తమ విధి ఎట్లా నిర్వహించాలో చెప్తూనే ఉంటాం!

సమ్మెట ఉమాదేవి అన్నిటికన్నా ముందు సున్నితమైన మనిషి, పిల్లల ప్రేమికురాలు, అత్యున్నత సంస్కారవంతురాలు. జీవితమంతా పిల్లల్తో, అది కూడా, ఆదివాసి బాలబాలికలతో గడిపిన మహనీయురాలు. ఆమె తాను పనిచేసిన పాఠశాలల్లో పిల్లల్తో తాను గడిపినప్పటి ముచ్చట్లు ‘మా పిల్లల ముచ్చట్లు: ఒక టీచర్‌ అనుభవాలు‘గా ఇలా వెలువరించారు.

కాని నిజానికి మనకు కావలసింది ఉపాధ్యాయుల అనుభవాలు వినడం. ఆ అనుభవాల ఆసరాగా వాళ్ళెట్లాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకోవడం. ఇంకా చెప్పాలంటే, ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ శిక్షణలో తాము తెలుసుకున్న అంశాల్ని తమ అనుభవాలు ఏ మేరకు అంగీకరిస్తున్నాయో, ఏ మేరకు ప్రశ్నిస్తున్నాయో తెలుసుకోవడం. ఇది ఎంత విస్తృతంగా జరిగితే మన పాఠశాలలు అంతగా బలపడతాయి. మన పిల్లల బోధన, అధ్యయనం అంతగా వన్నెకెక్కుతుంది. అందుకనే ఉపాధ్యాయులు తమ అనుభవాల్నీ, తమ బడికథల్నీ విరివిగా పంచుకోవాలని కోరుకునేవాళ్ళల్లో నేను ముందుంటాను.
సమ్మెట ఉమాదేవి అటువంటి ఉపాధ్యాయిని.

వీరు అన్నిటికన్నా ముందు సున్నితమైన మనిషి, పిల్లల ప్రేమికురాలు, అత్యున్నత సంస్కారవంతురాలు. జీవితమంతా పిల్లల్తో, అది కూడా, ఆదివాసి బాలబాలికలతో గడిపిన మహనీయురాలు. ఆమె తాను పనిచేసిన పాఠశాలల్లో పిల్లల్తో తాను గడిపినప్పటి ముచ్చట్లు ‘మా పిల్లల ముచ్చట్లు: ఒక టీచర్‌ అనుభవాలు‘గా ఇలా వెలువరించారు.

ఆమె సహజంగానే గొప్ప రచయిత్రి కాబట్టి ఈ పుస్తకం ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పాలా లేకపోతే, ఆమెకి ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయికాబట్టి, ఆ అనుభవాలే ఆమెను ప్రభావశీలమైన రచయిత్రిగా రూపొందించాయా అన్నది చెప్పలేకపోతున్నాను.

మనం ఎంత ప్రయత్నించినా, పిల్లల్నీ, పాఠశాలనీ సమాజం నుంచి విడిగా మలచలేమనీ, సామాజిక జీవితంలోని ప్రతి ఒక్క స్పందనకీ పాఠశాలలో ప్రతిధ్వని వినిపించకుండా ఉండదని ఈ అనుభవాలు చదివితే మనకు తెలుస్తుంది.

ఇందులో ఆమె మనతో పంచుకున్న ప్రతి ఒక్క అనుభవం ఎంతో విలువైన పరిశీలన. ముఖ్యంగా మనం ఎంత ప్రయత్నించినా, పిల్లల్నీ, పాఠశాలనీ సమాజం నుంచి విడిగా మలచలేమనీ, సామాజిక జీవితంలోని ప్రతి ఒక్క స్పందనకీ పాఠశాలలో ప్రతిధ్వని వినిపించకుండా ఉండదని ఈ అనుభవాలు చదివితే మనకు తెలుస్తుంది. తమ కుటుంబాల్లోనూ, తమ సమాజంలోనూ ఉండే అన్ని రకాల అస్తవ్యస్త పరిస్థితులూ పాఠశాలలోకి కూడా ప్రవహిస్తాయి. అలా పాఠశాలలోకి అడుగుపెట్టి అవి ఆ పిల్లల్నీ, ఆ పిల్లలకోసం ఒక ఆదర్శ ప్రపంచాన్ని ఊహించే ఉపాధ్యాయినీ కలవరపరచకుండా ఉండవు. కాని, నిజమైన ఉపాధ్యాయిని కర్తవ్యం మొదలయ్యేది అక్కడే. ఆమె సామాజిక కఠోరవాస్తవాలనుంచి తన పిల్లలముందు మరుగుపరచదు సరికదా, వాటిని విప్పి చెప్పి, పిల్లలు ఆ అవరోధాల్ని ఎట్లా దాటాలో నేర్పుగా, ఓర్పుగా వివరిస్తుంది. ఈ పుస్తకం నిండా అటువంటి ముచ్చట్లు కొల్లలు.

ఉదాహరణకి ‘ఆరోపణలు’ అనే ఈ ముచ్చట చూడండి:

‘ఒక్కోసారి పిల్లల దగ్గరనుండి మనం ఊహించని ఆరోపణలు వింటూంటాం. ఆ అరోపణలు విన్నాక వారు ఎవరి మీదయితే ఆరోపణలు చేస్తున్నారో వారు కచ్చితంగా శిక్షించబడాలనే పిల్లలు కోరుకుంటారు. ముఖ్యంగా స్టాఫ్‌ మీటింగ్స్‌ ఉన్నప్పుడు, ఎవరైనా యూనియన్‌ వాళ్ళు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు ఓ అరగంటో, నలభై నిముషాలో కాస్త కాం గా ఉండమని చెప్పి లీడర్లను పెట్టి వెళ్తాము. మీటింగ్‌ అవుతుండగా..అయ్యాక ఎన్ని కంప్లైట్స్‌ వింటామో చెప్పలేం. టీచర్‌ తిరిగి క్లాస్‌ కి వచ్చేలోగా లీడర్‌ కొంతమంది పిల్లల పేర్లు బోర్డు మీద రాస్తాడు. టీచర్‌ రాగానే వాళ్ళని నిలబెట్టి కొట్టాలని మిగతా పిల్లలు కూడా భావిస్తారు.

‘అయినా మీలో ఒకర్ని టీచర్‌ వచ్చి కొట్టాలని మీకు ఎందుకు అనిపిస్తున్నది? మీ స్నేహితుణ్ణి టీచర్‌ కొట్టకుండా రక్షించుకునేవారే నిజమైన స్నేహితులు’ అని చెప్పాను.

నేను వెళ్ళిన దగ్గరనుండి ఈ బోర్డు మీద పేర్లు రాయడమనే అలవాటు మానిపించాను. క్లాస్‌ లో పిల్లలకు రకరకాల అవసరాలు ఉంటాయి. పెన్‌ కావాలనో, ఏ లెక్క హోమ్‌ వర్క్‌ చేయ్యాలో అడగడమో…ఈ ప్రశ్నకు జవాబు ఇంతవరకు రాస్తే చాలా ..? అనో అడగాల్సి ఉంటుంది. అస్సలు మాట్లాడుకోకుండా ఉండటం అసాధ్యం. ‘అయినా మీలో ఒకర్ని టీచర్‌ వచ్చి కొట్టాలని మీకు ఎందుకు అనిపిస్తున్నది? మీ స్నేహితుణ్ణి టీచర్‌ కొట్టకుండా రక్షించుకునేవారే నిజమైన స్నేహితులు’ అని చెప్పాను.

‘మీకూ పరస్పరం అనేక అవసరాలు ఉంటాయి. ఒకరికొకరు చిన్నగా మాట్లాడుకుంటూ..వీలయినంతవరకు బయటకు వెళ్ళకుండా ఉండటమే మంచి పిల్లలు చేసే పని. ఇకనుండీ మీరు ఎవరి మీదనయినా కంప్లయింట్‌ చేస్తే నేను అస్సలు వినను’ అని చెప్పాక చాలావరకు ఆరోపణలు తగ్గిపోయాయి.
అనుకూల సూచనలు అల్లరిపిల్లలను కొంతయినా దారికి తెస్తాయి కదా..!

ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ, ప్రతి ఉపాధ్యాయినీ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది. మరీ ముఖ్యంగా విద్యాశాఖాధికారులూ, పాఠ్యపుస్తకాల రూపకర్తలూ మరీ శ్రద్ధగా అధ్యయనం చేయవలసిన పాఠ్యపుస్తకం.

*రచయిత, కవి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article