తన తండ్రి, ఈ లోకాన్ని వీడిన తరువాత, ఆ కొడుకు, తన తండ్రిని స్మరిస్తూ, మనందరికీ, ఈ రోజు ఒక ‘లోపలి దారి’ ని కానుక చేస్తున్నాడు. యూదు, హిందూ, బౌద్ధ, తావో, జెన్, సూఫీ, ఓషో సంప్రదాయాల్లో ఎందరో గురుశిష్యులు చెప్పుకున్న కథలనుంచి అద్భుతమైన కొన్ని కథల్ని సేకరించి పుస్తకంగా వెలువరిస్తున్నాడు. ఈ రోజు సాయంకాలం రవీంద్రభారతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ.
వాడ్రేవు చినవీరభద్రుడు
గంగారెడ్డి వజ్రంలాంటి పిల్లవాడు. ఇరవయ్యేళ్ళ కిందట తానింకా డిగ్రీ చదువుకుంటూ ఉండే రోజుల్లో మొదటిసారి మా ఇంటికి వచ్చాడు. సి.వి.కృష్ణారావు గారి దగ్గర నా పేరు విన్నానని చెప్తూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజు వినాయక చవితి. మా పిల్లలతో కలిసి పూజచేసుకున్నాడు. అప్పటి నుంచి మా ఇంట్లో భాగం అయిపోయాడు. నా కళ్ళముందే ఎంతో ఎత్తుకు ఎదిగాడు, ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు.
ఆన్ లైన్ క్లాసులంటే ఏమిటో ఈ దేశానికి ఇంకా తెలియకముందే ఇరవయ్యేళ్ళ కిందటే, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ ఆన్ లైన్లో కలిపి ఒక ఇ-లెర్నింగ్ ఇనీషియేటివ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండు వెళ్ళి లండన్ లో ఎం.బి.ఏ చేసాడు. తిరిగి వచ్చాక పెద్ద హోటల్ ప్రారంభించాలనుకున్నాడు. కాని తన ప్రాంతం అంటే నిజామాబాదు జిల్లా ఆర్మూరు, మోతె, బాల్కోండ లాంటి ప్రాంతాల్లో, (అప్పటికింకా తెలంగాణా రాలేదు), ప్రజల కష్టాలు చూసి, రాజకీయాల్లో ప్రవేశిస్తే తానేదైనా చెయ్యగలననుకున్నాడు. దాంతో బాల్కొండ ప్రాంతంలో ప్రజలతో కలిసి పనిచెయ్యడం మొదలుపెట్టాడు.
అనతికాలంలోనే అతడికి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎంత విశేషంగా ఉందంటే, అప్పటి శాసనసభ్యుడు వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి కాకుండా మరేదన్నా నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలనుకున్నాడు. కాని అనేక రాజకీయ కారణాలవల్ల గంగారెడ్డి ఆ ఎన్నికల్లో, అంటే, 2009 లో పోటీ చెయ్యలేదు.
ప్రాపంచిక జీవితంలో తలమునకలుగా కనిపించే ఆ యువకుడు ఒకసారి తన తల్లిదండ్రుల్ని పరిచయం చేసాడు. వాళ్ళ నాన్నగారు రాజులు గారిని చూడగానే ఆయన ఒక కర్మయోగి అని గుర్తుపట్టగలిగాను. ఆ యోగవశిష్టుడి యోగవాశిష్టమే గంగారెడ్డికి దక్కిందని అర్థమయింది.
అక్కడొక సత్త్రయాగం నడిపాడు
ఈసారి అతణ్ణి సినిమా ఆకట్టుకుంది. దర్శకత్వ రంగంలో కృషి చెయ్యాలనుకుని రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టి ట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీసిన మొదటి రెండు మూడు యాడ్ ఫిల్మ్స్ తోటే ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అప్పణ్ణుంచీ యాడ్ ఫిల్ములు, డాక్యుమెంటరీలు తీస్తూ ఉన్నాడు.
ఈలోగా కరోనా వచ్చింది. లాక్ డౌన్ వచ్చింది. ఒకరోజు తాను హైదరాబాదు నుంచి నిజామాబాదు వెళ్తుంటే వేలాదిగా వలసకార్మికులు మండుటెండలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసాడు. వాళ్ళకి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకని కాలం. అది అతడి హృదయాన్ని కలచివేసింది. అంతే, ఆర్మూరు దగ్గర ఒక శిబిరం తెరిచాడు. ఆ తర్వాత, వలసకార్మికుల నడకలు ఆగిపోయేదాకా, అక్కడొక సత్త్రయాగం నడిపాడు. అహర్నిశలు, వలసలు నడిచినన్ని రోజులూ, ఆ కార్మికులకి భోజనాలు ఏర్పాటు చేసాడు. నడవలేనివారికి, తాను పంపగలిగినంత దూరం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసాడు.
కాని ఇంతగా ప్రాపంచిక జీవితంలో తలమునకలుగా కనిపించే ఆ యువకుడిలో వయసుని మించిన ఒక విరాగి ఉన్నాడు. ముముక్షువు ఉన్నాడు. ఆ విరక్త స్వభావం అతడికి ఎక్కడినుంచి వచ్చిందో చాలా కాలం నాకు తెలియలేదు. ఒకసారి అతడు నన్ను ఆర్మూరులో వాళ్ళ అక్కగారి ఇంటికి తీసుకువెళ్ళాడు. తన తల్లిదండ్రుల్ని పరిచయం చేసాడు. వాళ్ళ నాన్నగారు రాజులు గారిని చూడగానే ఆయన ఒక కర్మయోగి అని గుర్తుపట్టగలిగాను. ఆ యోగవశిష్టుడి యోగవాశిష్టమే గంగారెడ్డికి దక్కిందని అర్థమయింది.
సౌభాగ్య చెప్పిన సాధువుల గాథలు
ఇదిగో, అటువంటి తన తండ్రి, ఈ లోకాన్ని వీడిన తరువాత, ఆ కొడుకు, తన తండ్రిని స్మరిస్తూ, మనందరికీ, ఈ రోజు ఒక ‘లోపలి దారి’ ని కానుక చేస్తున్నాడు. యూదు, హిందూ, బౌద్ధ, తావో, జెన్, సూఫీ, ఓషో సంప్రదాయాల్లో ఎందరో గురుశిష్యులు చెప్పుకున్న కథలనుంచి అద్భుతమైన కొన్ని కథల్ని సేకరించి పుస్తకంగా వెలువరిస్తున్నాడు. ప్రసిద్ధ కవి సౌభాగ్య తిరిగి రాసిన కథలవి. వాటిలో, సుమారు వెయ్యి కథల్లోంచి, రెండుమూడు నెలల పాటు మళ్ళీ మళ్ళీ చదివి 269 కథలు ఎంపికచేసి ఈ సంపుటిగా వెలువరిస్తున్నాడు. ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఇలా రాస్తున్నాడు:
“ఈ కథలన్నీ జ్ఞానసిద్ధి పొందిన జ్ఞానుల కథలు. ఆ అనంత శక్తికి పూర్తిగా శరణాగతి చెందిన కరుణామయులైన సాధువుల కథలు. ఈ కథలు చదువుతున్నప్పుడు హిందూ, బుద్ధ, తావో జ్ఞానులు భిన్న శాఖలకు చెందినట్లు కనబడుతున్నా, వాళ్ళనుండి ఒకే సత్యాత్మ, ఆ నిర్మల సత్యాన్ని వెల్లడి చేస్తున్నట్లు స్పష్టంగా తోస్తుంది. జ్ఞానులు వేరుగా కనిపిస్తున్నా, వారందరిదీ ఒకే స్వచ్ఛమైన మనస్సు.”
ఇంకా ఇలా రాస్తున్నాడు:
“ఇందులోని ఒక్కో కథ చదువుతున్నప్పుడు, ఆ సాధువులు, ఆ కథలోని పాత్రలు కళ్ళముందు కనిపించి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ సాధువుల జ్ఞానపు వెలుగుల ధగధగను, నిర్మలమైన వారి ప్రజన్స్ ను దగ్గరగా అనుభూతి చెందాను. కంటి తడిని ఆపుకోలేకపోయాను. మరపుకు గురైనప్పుడు, దారి తప్పినప్పుడు, ఎవరో తోడుగా నాలోనే ఉన్నారు అనిపించేది. నాలోంచే ఆ సాధువుల రూపంలో మరింత శక్తితో సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు అనిపించేది. అహం నశించిన ఈ జ్ఞానులు తమని తాము ఎప్పుడో కోల్పోయారు. కేవలం సత్యశక్తి మాత్రమే వారిని నడిపిస్తుంది. ఆ శక్తి ‘మేమెప్పుడూ మీ హృదయాల్లోనే ఉన్నాం. ఎటువంటి ఇన్ సెక్యూరిటీ అవసరం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా దారితప్పకండి, సత్యాన్ని వీడకండి’ అని ఓ నిశ్శబ్ద రాగంలో, నా చెవిలో పాడుతున్నట్టు అనుభూతి చెందాను. ఆ సాధువులవి నిర్మలమైన జీవితాలు, శూన్యశక్తి కేంద్రాలు.’
సాయంత్రం ఆవిష్కరణ
ఈ రోజు సాయంకాలం రవీంద్రభారతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ. తన తండ్రి స్మృతికి అంకితం చేస్తున్న ఈ పుస్తకం మొదటి ప్రతిని తన తల్లికి అందిస్తున్నాడు. ఆ సందర్భంగా ఈ కథల్ని పరిచయం చెయ్యమని నన్ను అడిగాడు. అది నా అర్హత వల్ల లభించిన భాగ్యం కాదు, అతడికి నా మీద ఉన్న ప్రేమ వల్ల నాకు పట్టిన అదృష్టం.
రండి, ఎలాగైనా వీలుచేసుకుని రండి.
ఆ కథలు ఎలా ఉన్నాయో ఒక ఉదాహరణ చూడండి:
కలలు
‘నాకెప్పుడు జ్ఞానోదయమవుతుంది?’
‘నువ్వు చూసినప్పుడు.’
‘ఏం చూడాలి?’
‘చెట్లు, పూలు, చంద్రుడు, చుక్కలు.’
‘నేను రోజూ చూస్తున్నాను కదా!’
గురువు ‘నువ్వు చూస్తున్నవి కాగితం చెట్లు, కాగితం పూలు, కాగితం చంద్రుడు, కాగితం నక్షత్రాలు,. నువ్వు వాస్తవంలో కాదు, నీ మాటల్లో, నీ ఆలోచనల్లో జీవిస్తున్నావు ‘అన్నాడు.
శిష్యుడు ఆశ్చరపోయాడు.
గురువు , ‘ఇంకో విషయం మరచిపోయాను. నువ్వు పేపర్ బతుకు బతుకుతున్నావు, పేపర్ మరణాన్నే మరణిస్తావు ‘ అన్నాడు.
‘లోపలి దారి’ పుస్తకం కావలసినవారు ఆన్వీక్షికి పబ్లిషర్స్ వారిని 9705972222 లేదా 9849888773 లో సంప్రదించగలరు.