ప్రసిద్ధ ప్రచురణ కర్త ఒకాయన, ఈ మధ్య సుభాష్ చంద్ర బోస్ మీద ఒక జీవితచరిత్ర వెలువరిస్తో, ముందుమాట రాయగలరా అని నాకు పంపించాడు. ఆయన ఆ పుస్తకం పంపి నాకు గొప్ప ఉపకారం చేసాడు. లేకపోతే, నేతాజీ పుట్టి 125 ఏళ్ళు కావొస్తున్న ఈ తరుణంలో కూడా నేనింకా నేతాజీకి యోజనాల దూరంలోనే నిలబడిపోయి ఉండేవాణ్ణి.
వాడ్రేవు చినవీరభద్రుడు
ఆ జీవితచరిత్ర చదవడమైతే పూర్తి చేసేసానుగాని, ఈ రెండువారాలుగా నా ఆలోచనలు నేతాజీ చుట్టూతానే పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఆయన గురించి చదవవలసినంతగా చదవలేదనీ, తెలుసు కోవలసినంతగా తెలుసుకోలేదనీ అనిపిస్తూ ఉంది. అందుకని రచనల కోసం వెతికాను.
ఆయన జీవితకాలంలో రాసిన వ్యాసాలూ, ఉత్తరాలూ మాత్రమే కాక, ఆయన మొదలుపెట్టి పూర్తి చెయ్యలేకపోయిన స్వీయ చరిత్రకూడా ఇంటర్నెట్ పుణ్యమా అని ఇప్పుడు మనకి లభ్యంగా ఉన్నాయి. An Indian Pilgrim (1948) అనే ఆయన స్వీయ చరిత్రతో పాటు, నేతాజీ రిసెర్చ్ బ్యూరో సంకలనం చేసిన Cross Roads 1938-40 (1962), Indian Struggle 1920-42 (1964) ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. తిరిగి ఈ రచనలనుండి ఎంపిక చేసిన ప్రసంగాలు పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన మరో పుస్తకం ఎలానూ ఉండనే ఉంది. మొత్తం రచనలన్నీ కలిపి వెయ్యి పేజీలకు మించి లేవు.
సుభాష్ చంద్ర బోస్ అనే అత్యంత ప్రతిభావంతుడూ, మహాసాహసికుడూ, మహాత్ముడు అభివర్ణించినట్టుగా ‘ప్రిన్స్ ఆఫ్ ద పేట్రియాట్స్’, లేదా మహాత్ముడే మరోసారి అన్నట్టుగా ‘పేట్రియాట్ ఆఫ్ ద పేట్రియాట్స్ ‘ గురించి సమగ్ర అవగాహన ఏర్పరచుకోడానికి ఈ కొద్దిపాటి సంచయం చాలు. కాని ఈ రచనల్లో ఎంతో స్పష్టంగా, ఎంతో జాజ్వల్యమానంగా కనిపించే ఈ వీరాధివీరుడి గురించి మనకి, అంటే ప్రజాబాహుళ్యానికి మాత్రమే కాదు, చదువుకున్నవారికి కూడా తెలిసింది చాలా తక్కువ.
ఉదాహరణకి, తక్కిన రచనలు అలా ఉంచి, ఆయన ఆత్మ కథ తీసుకుందాం. దీన్ని ఆయన ‘ఇండియన్ స్ట్రగుల్’ (1934) పుస్తకంతో పాటు 1937 లో తన సహచరి, ఆస్ట్రియన్ వనిత ఎమిలి షెంకె కి డిక్టేట్ చేసారు. 1897 నుంచి 1937 దాకా నడిచిన తన జీవితప్రయాణాన్ని ఆయన, ఆస్ట్రియాలో బడ్గస్టెయిన్ లో ఉన్నప్పుడు, స్వీయచరిత్రగా రాయడం మొదలుపెట్టారు. మొత్తం 13 అధ్యాయాలుగా రాయాలని సంకల్పించుకున్న తన ఆత్మకథని ఆయన 1921 నాటి దాకా మాత్రమే రాయగలిగారు. ఆ తర్వాత భారతదేశానికి రావడంతో, మరి వెనక్కి తిరిగి చూడటానికి వ్యవధి లేకపోవడంతో ఆ రచన అసంపూర్తిగా ఆగిపోయింది. అయినప్పటికీ, ఆ అసంపూర్తి రచనని ప్రచురించాలని అనుకున్నప్పుడు దానికి ఏమి పేరుపెట్టాలని మిత్రులు అడిగితే An Indian Pilgrim ( ఒక భారతీయ తీర్థయాత్రీకుడు) అని పేరుపెట్టమన్నారాయన.
పట్టుమని నూటయాభై పేజీలు కూడా లేని ఈ రచన నేను చదివిన అత్యున్నత జీవితచరిత్రల్లో మొదటివరసలో నిలబడే రచన అని నిస్సంకోచంగా చెప్పగలను. ఇందులో నేతాజీ తన జీవితంలోని మొదటి 24 ఏళ్ళ సంఘటనల్ని మాత్రమే వివరించినప్పటికీ, ఆ తర్వాత 24 ఏళ్ళ పాటు ఆయన ఒక మహోన్నత నాయకుడిగా ఎలా రూపొందాడో తెలుసుకోడానికి ఈ రచన సంపూర్ణ నేపథ్యాన్ని సమకూరుస్తుంది. ఈ రచనని తెలుగులో ఎవరన్నా అనువదించారో లేదో నాకు తెలియదు. కాని నేతాజీ గురించి తెలుసుకోవలసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ రచన అవశ్య పఠనీయం.
నేను కూడా అసంఖ్యాకులైన ఆయన అభిమానుల్లాగా, నేతాజీకి వర్ధంతి లేదనే నమ్ముతాను. తనని చూడవచ్చిన నేతాజీ బంధువులతో, 1945 లో మహాత్ముడు, నేతాజీకి శ్రాద్ధ కర్మలు చేయవద్దు, కేవలం ప్రార్థనలు ఘటించండి అని చెప్పాడుట.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 1897 లో కటక్ లో జన్మించారు. (అల్లూరి సీతారామరాజు పుట్టింది కూడా ఆ ఏడాదే కావడం గమనార్హం. ఇద్దరి జీవితాలకీ చాలా పోలికలు ఉన్నాయి.) 1945 లో అదృశ్యమైపోయారు. ఆయన మృతి మీద ఇప్పటికి మూడు ఎంక్వయరీ కమిషన్లు, 200 నివేదికలు వెలువడినప్పటికీ, ఆయన మృతి చెందాడని పూర్తిగా నమ్మనివాళ్ళు ఇంకా ఉన్నారు. 2018 లో వెలువడిన అశీష్ రే రచన Laid to Rest లో నేతాజీ మృతి చెందినట్టే అని సంపూర్ణంగా నిర్ధారించినప్పటికీ, నేను కూడా అసంఖ్యాకులైన ఆయన అభిమానుల్లాగా, నేతాజీకి వర్ధంతి లేదనే నమ్ముతాను. తనని చూడవచ్చిన నేతాజీ బంధువులతో, 1945 లో మహాత్ముడు, నేతాజీకి శ్రాద్ధ కర్మలు చేయవద్దు, కేవలం ప్రార్థనలు ఘటించండి అని చెప్పాడుట. నేతాజీకి మరణం లేదనే మహాత్ముడి నమ్మకంలో ఉన్న అమాయికత్వం నాకు కూడా సిద్ధించుగాక!.
నేతాజీ దృశ్యజీవితం మొత్తం 48 ఏళ్ళు. అందులో మొదటి 24 ఏళ్ళు బాల్యం, విద్యార్థి దశ, చివరలో కేంబ్రిడ్జిలో కేవలం ఎనిమిది నెలల ప్రిపరేషన్ తో ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలో నాలుగవ స్థాయిలో ఉత్తీర్ణుడు కావడం, కాని ఆ ఉద్యోగంలో చేరకుండా రాజీనామా చేసి భారతదేశానికి రావడం ఉన్నాయి. ఆ తర్వాత 24 ఏళ్ళు మహోధృత జీవితం, సంగ్రామం. ఆయన రాసిన ఇండియన్ స్ట్రగుల్ పుస్తకంలో ఆ ఉత్తరార్థ జీవితం మనకి తన చరిత్రగా కాక, భారతదేశ చరిత్రగా కనిపిస్తుంది.
ఆయన ఆత్మకథలోని మొదటి 24 ఏళ్ళ జీవితం ప్రతి ఒక్క యువకుడూ చదవవలసిన పుస్తకం. ముఖ్యంగా పదిహేను, పదహారేళ్ళ వయసులో మొదలై పాతికేళ్ళదాకా ప్రతి యువకుణ్ణీ వేధించే ప్రశ్నలు సుభాష్ ని కూడా వేధించాయనీ, అది కూడా మామూలుగా కాదు, అత్యంత తీవ్రంగా వేధించాయనీ, వాటికి జవాబు వెతుక్కునే క్రమంలోనే ఆయన మహోన్నతుడైన వ్యక్తిగా రూపొందాడనీ అర్థమవుతుంది.
తొమ్మిది అధ్యాయాల ఈ రచనకి అనుబంధంగా ‘నా విశ్వాసాలు’ అనే మరొక అధ్యాయం కూడా ఉంది. నిజానికి ఆ అధ్యాయాన్ని ఆయన నా ఆధ్యాత్మిక విశ్వాసాలు, నా రాజకీయ విశ్వాసాలు, నా ఆర్థశాస్త్ర విశ్వాసాలు అని మూడు భాగాలుగా రాయాలని అనుకున్నారట. కాని ఆధ్యాత్మిక విశ్వాసాల భాగం దగ్గరే పుస్తకం ఆగిపోయింది. అలాగని ఆ పుస్తకం అసంపూర్ణమని అనిపించకపోగా ఆయన జీవితపూర్వార్థానికి సారాంశంగా కనిపిస్తుంది.
పుస్తకం చదివేక, ఆయన తనని తాను ఇండియన్ పిలి గ్రిమ్ అని ఎందుకు పిలుచుకున్నాడో మనకి అర్థమవుతుంది. ప్రాయికంగా ఆయన ఒక ఆత్మాన్వేషకుడనీ, తానొక యోగి కావాలని పరితపించాడనీ ఆ జీవితకథనం ప్రత్యక్షరం మనకి పొల్లుపోకుండా వివరిస్తుంది.
తొమ్మిది అధ్యాయాల్లోనూ మొదటి మూడు అధ్యాయాలూ తన తల్లిదండ్రులు, తన పూర్వీకులు, తాను పుట్టకముందు పరిస్థితుల చిత్రణ. తర్వాతి రెండు అధ్యాయల్లోనూ ప్రాథమిక పాఠశాల లో, హైస్కూల్లో తన చదువు గురించిన జ్ఞాపకాలు. ఆ తర్వాత రెండు అధ్యాయాల్లో కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజిలో చదువు, ఆ కాలేజినుంచి తనని బహిష్కరించడానికి దారితీసిన సంఘటనల వివరణ. ఆ తరువాతి అధ్యాయంలో తిరిగి మళ్ళ చదువు కొనసాగించిన సంగతి, చివరి అధ్యాయం, అన్నిటికన్నా పెద్ద అధ్యాయం తాను కేంబ్రిడ్జిలో చేరడం, సివిల్ సర్వీసులో ఉత్తీర్ణుడు కావడం, కాని బ్రిటిష్ యంత్రాంగం కింద బానిసగా పనిచెయ్యడం ఇష్టం లేక, ఆ సర్వీసుకి రాజీనామా ఇవ్వడం.
పుస్తకం చదివేక, ఆయన తనని తాను ఇండియన్ పిలి గ్రిమ్ అని ఎందుకు పిలుచుకున్నాడో మనకి అర్థమవుతుంది. ప్రాయికంగా ఆయన ఒక ఆత్మాన్వేషకుడనీ, తానొక యోగి కావాలని పరితపించాడనీ, ప్రాపంచిక బంధాల్లో కూరుకుపోకుండా, జీవితసత్యాన్ని దర్శించడానికి తపించాడనీ ఆ జీవితకథనం ప్రత్యక్షరం మనకి పొల్లుపోకుండా వివరిస్తుంది. తన స్కూలు రోజుల్లో వేణీ మాధవ్ అనే ప్రధానోపాధ్యాయుడు తన నిర్మల నైతికతతో బాల సుభాష్ హృదయం మీద చెరగని ముద్రవేసాడు. ఆ నైతికతకు గొప్ప మేధ తోడైతే ఎలా ఉంటుందో తర్వాత వివేకానందుడి రచనల్లో కనబడింది. ఆ మేధకూ, ఆ నైతికతకూ అవలంబంగా ఉండే ఆధ్యాత్మిక కాంతి రామకృష్ణ పరమహంసలో కనబడింది. ఆ విధంగా ముగ్గురు ఉపాధ్యాయులు ఆయనకు దొరకడం మన అదృష్టం.
తన అన్వేషణకు మార్గం చూపిస్తుందేమోనని ఆయన కళాశాలలో తత్త్వశాస్త్ర విద్యార్థిగా చేరాడు. కాని పాశ్చాత్య తత్త్వశాస్త్రం తనకి నిశ్చయాత్మక జ్ఞానాన్ని ఇవ్వకపోగా, ప్రతి నిశ్చయజ్ఞానాన్నీ ప్రశ్నించగల critical frame of mind ని ఇచ్చిందని చెప్పుకున్నాడు. మరొకవైపు శంకరాచార్యుల మాయావాదంతో ఆయన పెనగులాడుతూనే ఉన్నాడు. దాన్ని పూర్తిగా నమ్మలేడు, అలాగని వదులుకోలేడు. చివరికి తన కళాశాల ప్రిన్సిపాలు తనని కాలేజినుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పిన రోజున ఆ మాయావాదం ‘గోడకి కొట్టిన మేకు ‘ లాగా నిర్జీవంగా మిగిలిపోయిందని చెప్పుకుంటాడు.
యోగుల గురించిన అన్వేషణా, ఏదో ఒక రూపంలో సంఘసేవ చెయ్యాలన్న కోరికా తనని నిలవనివ్వకుండా నడుస్తున్న కాలంలో తండ్రి తనని సివిల్ సర్వీసు పరీక్ష కోసం కేంబ్రిడ్జి పంపించాడు. ఎనిమిది నెలల అతి తక్కువ వ్యవధిలో పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. తీరా పరీక్షలో సంస్కృతం పేపర్ రాస్తూ ఉండగానే టైం అయిపోయింది. తాను ఫెయిల్ అవడం ఖాయమనుకున్నాడు. విధి మరోలా తలిచింది. ఆయన మొత్తం దేశంలోనే నాలుగవ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. అది ఆయన జీవితంలో ఆ వయసు యువకుడు ఎవరూ అంతదాకా తీసుకుని ఉండని కఠోర నిర్ణయం వైపు నడిపించింది. దాంతో ఇండియన్ సివిల్ సర్వీసు చరిత్రలో మొదటిసారిగా ఒక భారతీయ యువకుడు సివిల్ సర్వీసులో చేరకుండా తన స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటానని ప్రకటించాడు.
మహాత్ముడి సుప్రసిద్ధ కోర్టు వాజ్మూలం కూడా ఆ తర్వాత వెలువడిందేనని మనం గుర్తుపెట్టుకుంటే, అప్పటిదాకా, ఏ భారతీయుడూ అటువంటి స్వేచ్ఛా ప్రకటన చేసి ఉండలేదని చెప్పవచ్చు. అందులో ఆయన ఇలా రాస్తున్నాడు:
తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో ఆయన తన సోదరుడు శరత్ చంద్ర బోస్ కి సవివరంగా ఒక ఉత్తరం రాసాడు. సుప్రసిద్ధ అమెరికన్ స్వాతంత్య్ర ప్రకటనలాగా అది కూడా ఒక స్వాతంత్య్ర ప్రకటన. మహాత్ముడి సుప్రసిద్ధ కోర్టు వాజ్మూలం కూడా ఆ తర్వాత వెలువడిందేనని మనం గుర్తుపెట్టుకుంటే, అప్పటిదాకా, ఏ భారతీయుడూ అటువంటి స్వేచ్ఛా ప్రకటన చేసి ఉండలేదని చెప్పవచ్చు. అందులో ఆయన ఇలా రాస్తున్నాడు:
“. ఒక మనిషి తన అత్యున్నత జీవితాదర్శాలు ఒక ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి అంగీకరించవలసిన సర్వీసు కండిషన్లు ఒకదానితో ఒకటి పొసుగుతాయని అనుకోవడం ఆత్మవంచన తప్ప మరేమీ కాదు. ”
” మామూలుగా దారిన పోయే ఏ దానయ్య అయినా ఎంతో అద్భుతమైందిగా భావించే ఈ ఉద్యోగద్వారం దగ్గర నిలబడ్డ ఇప్పటి నా మనఃస్థితి ఏమిటో నువ్వు గుర్తించగలవనుకుంటాను. ఇటువంటి ఉద్యోగంలో ఉండే అవకాశాల గురించి ఎంతయినా చెప్పవచ్చు. జీవనోపాధి కి సంబంధించిన సమస్యని ఈ ఉద్యోగం ఒక్కసారిగా పరిష్కరించేస్తుంది. ఇక మీదట విజయాలతోనూ, వైఫల్యాలతోనూ సంబంధం లేకుండా జీవితాన్ని నిశ్చింతగా కొనసాగించవచ్చు. కాని నాలాంటి వ్యక్తిత్వం, ఇంకా చెప్పాలంటే విచిత్ర వ్యక్తిత్వం ఉన్నవాడికి అలా నిశ్చింతగా జీవితం వెళ్ళదీయడం ఎంత మాత్రం ఆదర్శం కానే కాదు. సంఘర్షణ లేకపోతే, సవాళ్ళు ఎదురుకాకపోతే జీవించడంలో ఆకర్షణే లేదు. ప్రాపంచిక సుఖాల పట్ల తృష్ణలేనివాడికి జీవితంలోని అనిశ్చయత భయం కలిగించే ప్రసక్తి లేనేలేదు. అదీకాక సివిల్ సర్వీసు సంకెళ్ళలో తగులుకున్నాక, నువ్వు నీ మాతృదేశాన్ని సంపూర్ణంగా సేవించడం సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే నా జాతీయ, ఆధ్యాత్మిక ఆదర్శాలు సివిల్ సర్వీసు విధేయతా ఒకదానికొకటి ఎంత మాత్రం పొసగవు…”
” బహుశా నువ్వొక మాట చెప్పవచ్చు. అదేమంటే, ఈ క్రూర వ్యవస్థని బయటనుంచి వదిలిపెట్టడం కంటే, దీనిలో ప్రవేశించి దాంతో పూర్తిగా పోరాడటం మంచిదని అనవచ్చు. కాని అప్పుడు అటువంటి పోరాటాన్ని ఒక్కడే ఒంటిచేత్తో చెయ్యవలసి ఉంటుంది. పైనుంచి అభిశంసన, ప్రమోషన్ల నిలుపుదల, దూరప్రాంతాలకు, అనారోగ్యకరమైన ప్రదేశాలకు బదిలీలు ఎలానూ తప్పవు. అటువంటి సర్వీసులో చేరి చెయ్యగల మంచి, అటువంటి సర్వీసులో చేరకుండా బయట ఉండి చెయ్యగల మంచిముందు లవలేశం కూడా కాదు. నిజమే, రమేష్ చంద్ర దత్తు ఉన్నాడు. ఆయన సర్వీసులో ఉండి కూడా గొప్పగా పనిచేయకపోలేదు. కాని ఆయన ఆ బ్యురోక్రసీలో భాగం కాకపోయుంటే అంతకన్నా గొప్ప పని చెయ్యగలిగి ఉండేవాడనుకుంటాను. అదీ కాక, ఇక్కడున్నది సిద్ధాంత పరమైన సమస్య. నా ముందున్న యంత్రాంగం కాలం చెల్లిన వ్యవస్థ. అదిప్పుడు యథాతథవాదానికీ, స్వార్థానికీ, హృదయరాహిత్యానికీ, రెడ్ టేపిజానికీ పర్యాయపదంగా మారిపోయింది. అటువంటి యంత్రాంగంలో భాగం కావడం సిద్ధాంతపరంగా నాకెంత మాత్రం అంగీకార యోగ్యం కాదు.”
23 ఏళ్ళ ఒక యువకుడు ఇటువంటి వాక్యాలు రాసాడంటే నమ్మశక్యంగా ఉండదు. కాని ఇటువంటి వాక్యాలు రాసాడుకనుకనే మరొక ఇరవయ్యేళ్ళ తరువాత ఆయన చరమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలుపెట్టగలిగాడు.
23 ఏళ్ళ ఒక యువకుడు ఇటువంటి వాక్యాలు రాసాడంటే నమ్మశక్యంగా ఉండదు. కాని ఇటువంటి వాక్యాలు రాసాడుకనుకనే మరొక ఇరవయ్యేళ్ళ తరువాత ఆయన చరమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలుపెట్టగలిగాడు.
ఆ యువకుడికి ఇంత ఆంతస్థైర్యాన్ని ఇచ్చిందెవరు? ‘ ఒక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే నువ్వు ఆ ప్రభుత్వంలో భాగం కాకూడదు ‘ అని కూడా రాసాడు ఆ ఉత్తరంలో. ‘నేనీ మాటలు రాయడానికి కారణం టాల్ స్టాయి చెప్పాడనో, గాంధీ చెప్పాడనో కాదు.. నేను ఈ విషయాన్ని స్వయంగా నమ్ముతుండటమే అందుకు కారణం ‘ అని కూడా రాసాడు.
ఆ కాలమంతటా ఆయన్ని అరవిందుడు ఆవహించి ఉన్నాడని కూడా మనకు తెలుసు. ఆధ్యాత్మిక, జాతీయ ఆకాంక్షలు ఒకదానికొకటి విరుద్ధం కాదనే నమ్మకం అప్పటికి ఆయనకి స్థిరపడింది. అయితే అది ఒకరోజులో జరిగింది కాదనీ, ఆ మొదటి ఇరవై మూడేళ్ళ జీవితమూ కూడా ప్రతి ఒక్కరోజూ, ఆయన్ని ఆ స్వేచ్ఛాసంకల్పం వైపుగా నడిపిస్తూనే ఉన్నదని ఈ స్వీయచరిత్ర చదివితే మనకి రూఢి అవుతుంది.
An Indian Pilgrim చదవాలనుకునే వారికోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి నిన్నటి వ్యాసం ‘పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం’ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.