Editorial

Wednesday, January 22, 2025
Opinion'RRR' అనే సినిమాపై వాడ్రేవు చినవీరభద్రుడి సమీక్ష

‘RRR’ అనే సినిమాపై వాడ్రేవు చినవీరభద్రుడి సమీక్ష

ఇగ్నొరెన్సు ని క్షమించవచ్చు. యారొగెన్సుని క్షమించలేం.

వాడ్రేవు చినవీరభద్రుడు

నిన్న రాత్రి RRR అనే సినిమా చూసాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైన అబ్సర్డ్ సినిమా మరొకటి ఉండదనుకుంటాను. అటువంటి సినిమా కథని కన్సీవ్ చెయ్యగలిగిన ఆ టీమ్ ప్రతిభా పాటవాలముందు నోరు తెరుచుకుని నిలబడిపోవడం తప్ప మరేమీ చెయ్యలేననిపిస్తోంది.

తమ సినిమాలో ప్రస్తావించిన వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు ప్రతి ఒక్కటీ కల్పితాలనీ, తమ సినిమా పూర్తి అభూత కల్పన అని మొదట్లోనే ఒక డిస్ క్లెయిమర్ రాసుకున్నరు కాబట్టి నిజానికి ఆ కథ గురించి గాని, ఆ సినిమా గురించి గాని ఏమీ మాటాడకూడదు.

ఈ సినిమా వల్ల తమ మనోభావాలు గాయపడ్డాయనో, చరిత్రను వ్యక్తీకరించారనో మరొకటో ఇంకొకటో న్యాయపరమైన చిక్కులో, వివాదాలో వస్తాయని ఇటువంటి డిస్ క్లెయిమర్ రాసి ఉండవచ్చు. కాని మామూలుగా ఇటువంటి డిస్ క్లెయిమర్ ఎందుకు రాస్తారంటే, దాదాపుగా యథార్థ సంఘటనల ఆధారంగా, అత్యంత వాస్తవికంగా ఒక కథ చెప్తూ, అటువంటి కథ నిజంగానే ప్రేక్షకులకి ఆ యథార్థ సంఘటనని గుర్తు చేస్తుంది కాబట్టి, దానివల్ల రాబోయే చిక్కులనుండి బయటపడటానికి.

ఈ సినిమా నిజంగానే అభూత కల్పన కాబట్టి ఇటువంటి డిస్ క్లెయిమర్ అవసరం లేదు, నిజానికి. కాని ఇందులో అన్నీ అభూత కల్పనలే అయి ఉంటే నాకు ఇబ్బంది ఉండేకాదు.

కాని ఈ సినిమా నిజంగానే అభూత కల్పన కాబట్టి ఇటువంటి డిస్ క్లెయిమర్ అవసరం లేదు, నిజానికి. కాని ఇందులో అన్నీ అభూత కల్పనలే అయి ఉంటే నాకు ఇబ్బంది ఉండేకాదు. కాని అదిలాబాదు, ఢిల్లీ, ఆగ్రా, విశాఖపట్టణం లాంటి స్థలాలూ, లాలా లజపత్ రాయి, నిజాం వంటి చారిత్రిక వ్యక్తులూ, గోండులూ, భారతీయులూ, బ్రిటిష్ వాళ్ళు లాంటి తెగల, దేశాల, జాతుల పేర్లు ప్రస్తావించారు కాబట్టి, సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన సందేహం, ఆ స్థలాలూ, ఆ పేర్లూ కూడా అభూతకల్పనలేనా అని.

గత ఇరవై ముప్పయ్యేళ్ళుగా మన పాఠశాలల్లోగాని, కళాశాలల్లోగాని, మన వార్తాపత్రికల్లోగాని, సమాచార ప్రసార సాధనాల్లోగాని చరిత్ర, సామాజిక శాస్త్రం, మానవవిజ్ఞాన శాస్త్రం లాంటివి ఎక్కడా కనిపించకపోవడం వల్లా, తెల్లవారితే మన టెలివిజన్ లో సినిమా వాళ్ళే కనిపిస్తూండటం వల్ల, ప్రస్తుతం సినిమా వాళ్లే మన జాతీయ నాయకులు కాబట్టి ఏ ఇద్దరు హీరోల్ని చూపించినా అదే చరిత్ర అయిపోతుందని ఈ చిత్రదర్శకుడు గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. కాని నా సమస్య ఏమిటంటే, వీళ్ళు తీసే సినిమాల్లో స్థలాల పేర్లూ, కొందరు వీరుల పేర్లూ కూడా ఏవో ఊహించి పెట్టి సినిమాలు తియ్యడం లేదు. అక్కడ మాత్రం నిజంగానే కొందరు చారిత్రిక వ్యక్తుల, సమకాలిక జాతుల, దేశాల, పోరాటాల పేర్లు వాడుతుంటారు. ప్రజాస్మృతిలో బలంగా ఉన్న కొందరు ఆరాధ్య పోరాట వీరుల పేర్లు కావాలని తమ సినిమాల్లో చొప్పిస్తారు. ఇదే నాకు ఈ సినిమా పట్ల ఉన్న ప్రధాన అభ్యంతరం.

ఇక నిజంగానే నా గుండె బద్దలైన విషయం సినిమాలో గోండుల గురించిన ప్రస్తావన.

ఉదాహరణకి, ఈ సినిమా మొదట్లోనే ఒక హీరో ప్రతాపాన్ని పరిచయం చేయడానికి ఒక సన్నివేశం కల్పించి అందులో లాలా లజ్ పత్ రాయిని కలకత్తాలో అరెస్టు చేసారని చెప్తారు. లాల లజపత్ రాయి పంజాబ్ కేసరి. ఆయన్ను ఏ రోజూ కలకత్తాలో అరెస్టు చేయలేదు. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పంజాబ్ లో చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలో ఆయన్ని బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. ఆ గాయాల వల్ల ఆయన మరణించడం, దానికి ప్రతీకారంగా ఒక భగత్ సింగ్ పుట్టుకురావడం, ఇది చరిత్ర. కాని దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ రాసినవాడు లాలా లజ్ పత్ రాయి అనే పేరు ఎప్పుడో విన్నాడు. ఆ పేరు సినిమాలో వాడుకుంటే బాగుంటుందనుకున్నాడు. అంతే. కాని దురదృష్టం ఏమిటంటే, ఈ అభూత కల్పన కూడా ఇప్పుడు చరిత్రగా మారిపోతుంది. లాలా లజ్ పత్ రాయి మీద ప్రస్తుతం వికీపీడియా లో ఉన్న ఎంట్రీ చూడండి. అందులో ఈ సినిమా గురించీ, ఈ సన్నివేశం గురించీ కూడా రాసేసారు.

ఇక నిజంగానే నా గుండె బద్దలైన విషయం సినిమాలో గోండుల గురించిన ప్రస్తావన. సినిమాలో ఒకటి రెండు సార్లు అడవిలో ఒక పల్లెనీ, కొందరు మనుషుల్నీ చూపించి అది అదిలాబాదు అడవి అనీ, అది గోండు పల్లె అనీ, వాళ్ళు గోండులనీ చెప్తాడు. అయ్యో! నీకు గోండులంటే ఎవరో తెలుసా? వాళ్ళెలా ఉంటారో ఎప్పుడన్నా చూసావా? వాళ్ళ పల్లెలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అదిలాబాద్ అని రాయకుండా మాహిష్మతీపురం అనీ, వాళ్ళు కాలకేయులు అనే ఒక జాతి అనీ రాసి ఉంటే నాకే బాధా ఉండేది కాదు. కాని ఒకప్పుడు మధ్యభారతదేశంలో రాజులుగా అదిలాబాద్, ఈశాన్య మహారాష్ట్ర, నైరుతి మధ్యప్రదేశ్ లను పరిపాలించి, మొఘల్ చక్రవర్తులనుంచి, నిజాందాకా దుర్మార్గులైన పాలకుల్ని ఎదిరిస్తూ వచ్చిన ఒక సాహసోపేతమైన, సాంస్కృతికంగా సుసంపన్నమైన ఒక గిరిజన జాతిని నువ్వు subhuman beings గా చూపించావే, నీది బుద్ధిమాంద్యమని సరిపెట్టుకోనా లేకపోతే arrogance అనుకోనా? Sardar Harpal Singh గారూ, మీరు రోజూ ఫేస్ బుక్ లో పెడతారే, గోండుల, గోండు పండగల, గోండు పల్లెల ఫొటోలు, వాటి లింక్ పంపకూడదా ఈ దర్శకుడికి!

‘నీ బాంచెన్ ‘ అని ఒక గోండు నోటమ్మట నేనెప్పుడూ వినలేదు.

గోండు మగవాళ్ళు పంచెకట్టుకుంటారు. తెల్లచొక్కా వేసుకుంటారు. తలపాగా కట్టుకుంటారు. వాళ్ళ నడకలో, నడవడిలో అపారమైన ఆత్మగౌరవం తొణికిసలాడుతుంది. ‘నీ బాంచెన్ ‘ అని ఒక గోండు నోటమ్మట నేనెప్పుడూ వినలేదు. అటువంటి గోండుల్ని అర్థనగ్నంగా చూపిస్తున్నప్పుడు, వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియనప్పుడు, నువ్వెప్పుడూ చూసి ఉండనప్పుడు, వాళ్ళని గోండులు అని ఎందుకు ప్రస్తావించాలి? మరేదైనా పేరు పెట్టుకుని ఉండవచ్చు కదా.

ఇగ్నొరెన్సు ని క్షమించవచ్చు. యారొగెన్సుని క్షమించలేం. అంతా అభూతకల్పనగా తీసిన సినిమాలో చివర బోస్, పటేల్, భగత్ సింగ్ లాంటి స్వాంతంత్య్ర వీరుల బొమ్మలు ఎందుకు కనిపించాయి? ఇక అత్యంత విషాదకరమైన హాస్యమేమిటంటే, వాళ్ళతో పాటు శివాజీ బొమ్మ కూడా కనిపించడం. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళ బొమ్మలన్నీ చూపించాలనుకున్నప్పుడు, ఈ మధ్య ఎక్కడ చూసినా శివాజీ పేరు కూడా తరచూ వినిపిస్తోంది కాబట్టి, ఏమో ఆయన కూడా బ్రిటిష్ వారితో పోరాడేడేమో, ఎందుకొచ్చిన గొడవ ఆయన్ని చూపించకపోతే బాగుండదని, పనిలో పని ఆయన బొమ్మ కూడా ఒకసారి చూపించేశాడు దర్శకుడు! లేదా ముందే డిస్ క్లెయిమర్ లో రాసుకున్నట్టుగా, ఆ బోసూ, పటేలూ, కిత్తూరు రాణి చెన్నమ్మ లాంటి పేర్లన్నీ కూడా నిజజీవితంలో పేర్లని పోలి ఉన్నట్టు కనిపించినా అభూత కల్పనలే అనుకోవాలా?
కన్యాశుల్కంలో రామప్పంతులు గిరీశం రాసిన ఉత్తరం చదువుతూ మధ్యలో ‘ఇంగ్లిషు కూడా వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ ‘ అంటాడు. ఈ సినిమా లో కూడా ఇంగ్లిషు బాగానే వెలిగించాడు గుంటడు. ఆ ఇంగ్లిషు గురించి, ఆ ఇంగ్లిషు వాళ్ళ చిత్రణ గురించీ, ఆ పాలన గురించీ దర్శకుడికి ఎంత తెలియదో చెప్పడం మొదలుపెడితే అదో పెద్ద వ్యాసమవుతుంది.

ఒకప్పుడు శ్రీ శ్రీ ఒక పత్రికని పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక అన్నాడు. ఈ సినిమా పెట్టుబడికీ, అభూతకల్పనకీ పుట్టిన విషపుత్రిక.

ఒకప్పుడు శ్రీ శ్రీ ఒక పత్రికని పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక అన్నాడు. ఈ సినిమా పెట్టుబడికీ, అభూతకల్పనకీ పుట్టిన విషపుత్రిక. నీకు చరిత్ర, యాంత్రొపాలజీ, సోషియాలజీ ఏవీ తెలియకపోయినా పర్వాలేదు, కనీసం వార్తాపత్రికలు చదవకపోయినా పర్వాలేదు, నీ దగ్గర డబ్బులుంటే, కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసే నలుగురు కుర్రాళ్ళు తెలిసి ఉంటే, ఇద్దరు స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వగలిగితే చాలు, నువ్వేమి తీసినా ప్రజలు ఎగబడి చూస్తారన్న యారొగెన్సు తప్ప మరేదీ ఈ సినిమాలో కనిపించలేదు.

ఈ మధ్య అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ప్రజల ఇమేజినేషన్ లో బలంగా ఉన్నారు కాబట్టి (రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఇద్దరి పేర్ల మీదా రెండు జిల్లాలు కూడా ఏర్పడ్డాయి) వాళ్ళల్లో ఒకరు 1924 లో, మరొకరు 1940 లో ప్రాణత్యాగం చేసినప్పటికీ, వాళ్ళిద్దరి పేర్లూ స్ఫురించేలాగా ఇద్దరు హీరోల్ని పెట్టి సినిమా తీస్తే, మొదటివారంలో కలెక్షన్లతోనే మొత్తం పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందన్న ధీమా తప్ప మరేమీ కనిపించలేదు ఈ సినిమాలో.

సినిమా చూశాక నాకు ఏమి అర్థం అయ్యింది అంటే ప్రస్తుతం అన్నిటికన్నా పెద్ద మూగజీవి చరిత్ర అని.

అన్నట్టు, సినిమా మొదట్లో మరొక డిస్ క్లెయిమర్ కూడా ఉంది. ఈ సినిమాలో ఏ జంతువుల్నీ నిజంగా హింసించలేదు అని. ఈ సినిమా చూశాక నాకు ఏమి అర్థం అయ్యింది అంటే ప్రస్తుతం అన్నిటికన్నా పెద్ద మూగజీవి చరిత్ర అని. అయ్యా. మీరు జంతువుల్ని నిజంగా హింసించారో లేదో నాకు తెలియదు గాని, చరిత్రని మాత్రం అడుగడుగునా హింసించారు. జంతురక్షణ కు చట్టాలున్నట్టుగా, చరిత్ర రక్షణకు, చారిత్రిక వ్యక్తుల పేర్లకూ, వారి నిరుపమాన బలిదానాలకూ కూడా చట్టాలు వస్తే తప్ప ఇటువంటి హింస ఆగదనుకుంటాను.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి నిన్నటి వ్యాసం ‘పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం’ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

More articles

9 COMMENTS

  1. Excellent article.
    ఇటువంటి సినిమాలలో బ్రిటిష్ వాళ్ళందరూ కరడుగట్టిన దుర్మార్గులన్నట్టు కూడా చూపడం సర్వ సాధారణంగా ఉంటుంది. వారి ఆడవాళ్లు మాత్రం మన యువకులను చూసి ప్రేమలోకి జారిపోతున్నట్టు సృష్టించడం ఉంటుంది. ఇది భయంకరమైన పోస్ఇట్న్ఫీ కలోనియల్ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అని నా అభిప్రాయం.

  2. “”1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పంజాబ్ లో చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలో ఆయన్ని బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. ఆ గాయాల వల్ల ఆయన మరణించడం, దానికి ప్రతీకారంగా ఒక భగత్ సింగ్ పుట్టుకురావడం, ఇది చరిత్ర ” వీరభద్రుడుగారి ఈ వ్యాఖ్య నిజంగా చరిత్రను వక్రంగా చెప్తోంది.సైమన్ కమిషన్ ఈ దేశానికి రాకముందే చాలాకాలంనుంచీ భగత్ సింగ్ రాజకీయాల్లో ఉన్నారు. . అతనికి లజపతిరాయ్ తో సిద్ధాంత విభేదం ఉంది. అయినప్పటికీ ఆ లాఠీఛార్జ్ ని భారత ఆత్మకి తగిలిన గాయంగా పరిగణించి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ నాయకుడిగా ఉన్న సంస్థ నిర్ణయించింది.

    • ‘కాలం కడుపుతో ఉండి Karl Marx ని ప్రసవించింది’ అన్నారు ఒక కవి. (సమయానికి పేరు గుర్తు రావటం లేదు. మయకోవిస్కీ అనుకుంట. పొరపాటైతే తెలిసినవాళ్ళు చెప్పండి.) ‘భగత్ సింగ్ పుట్టుకు రావడం’ అన్నది ఆ spirit తో అర్థం చేసుకోవచ్చు అనుకుంట అండి. అది వక్రీకరణ కాదేమో Sir.

  3. Sir..The views and opinion of ur’s about this movie are Exactly like same opinions Have been floating as blood in my body and mind ..from the announcement of this movie..

    This movie is unethical attacking on two most valueble historical greatest characters sir.

  4. కథకు కాళ్లు లేవు అనే సామెతతో పాటు మనుషులకు బుర్రలు లేవు అనే గాఢ నమ్మకంతో, ఇద్దరు చారిత్రక నాయకుల పేర్లను (అడిగే వారుండరనే ధైర్యంతో) technology mimics వాడేసి డబ్బు చేసుకోవటమే ప్రధానంగా తీసిన సినిమా!

  5. మంచి వ్యాసమే. కానీ రచయితగారు “మహావ్యక్తుల దైవీకరణ” అనే సామాజిక ప్రక్రియ సర్వదా సర్వత్రా కలదన్న విషయం గుర్తించినట్టు లేదు. మహనీయుల మరణానంతరం వారిగురించి అనేకంగా అవాస్తవికమైన గాథలు పుట్టుకు వస్తూ ఉంటాయి. చిలకమర్తి వారు కాబోలు గౌతమబుధ్ధుడి విషయంలో ఈ ప్రక్రియని నిరూపించారు.

    అదేవిధంగా శ్రీరామచంద్రుడూ, ఏసుక్రీస్తూ, జార్జివాషింగ్టనూ, ఆర్థర్ రాజూ, రాబిన్ హుడ్డూ—ఇత్యాది వ్యక్తుల విషయంలోకూడా స్థూలంగా జనమస్తిష్కాలలో ఈవిధమైన పరిణామాలకే లోనయ్యారని భావించడం అసమంజసం కాదు.

    రచయితగారు ఎత్తిచూపిన లొసుగుల్ని ఒకవంక అంగీకరిస్తూనే, మరోవంక ఈసినిమా దాదాపు శతాబ్దంక్రితమే తెలుగుపండితులు విశదపరిచిన సామాజిక, సామూహిక కథాసృష్టి ప్రక్రియకి సజీవోదాహరణగా గుర్తించనూ వచ్చు. ఆనాడు చిలకమర్తి (?) వారికుండిన అవగాహన నేటి ఈరచయితలో లుప్తంకావడం గమనార్హవిశేషం.

  6. నేను ఈయనతో పూర్తిగా ఏకీభవిస్తాను. చరిత్ర చెప్పే ఉద్దేశ్యం లేకపోతే ఒక కాల్పనిక ప్రపంచం లో అని కథ మొదలుపెట్టి చందమామ కథ మాదిరి తీసి ఉంటే బాగుండేది. ఇది చరిత్ర కాదు ..కానీ చరిత్ర లా చిత్రీకరించే ప్రమాదాన్ని సృష్టించారు. ఈ కాలం పిల్లలకు చరిత్ర తెలుసుకునే అవకాశం సినిమాల్లో తప్ప ఉండటం లేదు. అటువంటపుడు film makers మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ చిత్రరాజం పుణ్యాన తప్పని సరిగా కొమురం భీమ్ అంటే ఇలా ఉండడు, భీమ్, సీతారామరాజు కలిసే అవకాశం లేదు అని ప్రత్యేకంగా పిల్లలకు బోధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. చాలా రోజులుగా ఈ విషయ ప్రస్తావన చేసి రివ్యూ రాయాలని తలచి తలచి అశ్రద్ధ చెయ్యటం వల్ల నేను రాయలేక పోయినా ఇలా ఒక రివ్యూ కనిపించగానే మనసుకు ఊరట కలిగింది.

  7. ఏనుగు పిత్తుతుంది, పిట్టుతుంది అంటే తుస్సుమంది అనే సామెతలా, ఈ సినిమా. చాలా నిరాశనే మిగిల్చింది. Veerabhadrudigari రివ్యూ చాలా బావుంది. సమయాభావం వల్ల వారు చాలా కుదించి వ్రసినట్లున్నారు.

  8. As Markanday Katju said “Most of the Indians ( I am adding World Population instead of Indians ) are fools”. It is once again proved after giving this cinema a super duper hit. I am happy at least some voice is raising against our poor and pathetic Telugu cinema industry. When people encouraged the foolish and illogical scenes of total absurdity of one man encountering 100 in Magadheera, Ballaladeva stopping the full momentum Bull ( is it humanly possible in any era, i think he is not only poor in history but also in physics and in future it may be more), etc etc it is obvious that he will have arrogance of getting blind applause and pre occupied mind audience. Telugu industry is nothing but the successors of once great heroes. After seeing this, we are loosing value on previous heroes. Hereditary politics, please compare with other state like kerala,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article