ఇటీవలే థిచ్ నాట్ హన్ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారని మీకు తెలుసు. వారు రచించిన At Home in the World (2016) అన్న ఆత్మకథనాత్మకమైన వ్యాసాల సంపుటిని ఇంతకుముందు పరిచయం చేసాను. మరొక పుస్తకం Our Appointment with Life: The Buddha’s teaching on living in the present (1990,2014) అన్న పుస్తకాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పట్టుమని అరవై పేజీలు కూడా లేని చిన్న పుస్తకం ఎంతో ఎంతో విలువైనది.
వాడ్రేవు చినవీరభద్రుడు
సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఈ ప్రపంచం తాలూకు నీడలు మనమీద పడకుండా ఉండాలంటే, రాగద్వేషాలకు అతీతంగా జీవించాలనుకుంటే, తక్కిన మనుషులనుంచి దూరంగా, ఒంటరిగా జీవించడమొక్కటే మార్గమనుకుంటాం. అందుకనే ఏ అడవిలోకో, ఆశ్రమంలోకో, నది ఒడ్డుకో లేదా నలుగురికీ దూరంగానో బతకాలనుకుంటాం.
ఒకప్పుడు బుద్ధుణ్ణి ఈ ప్రశ్ననే అడిగారు. ‘భన్తే, ఏకవిహారి, ఏకవిహారి (ఒంటరిగా ఉండేవాడు) అని అంటూంటారు. ఏ విధంగా భన్తే, ఒకడు ఏకవిహారి అవుతాడు? ఒకడు ఏ విధంగా సద్వితీయ విహారి (రెండోవారితో కలిసి ఉండటం, మామూలుగా భాగస్వామితో, భర్తభార్యతో, భార్య భర్తతో కలిసి ఉండటం) అవుతాడు?’ అని.
వారికి బుద్ధుడు ఇచ్చిన సమాధానాన్ని సంయుత్త నికాయంలో మిగజాల సుత్త (బుద్ధుని సంయుక్త సంభాషణలు, 2 (2), అన్నపరెడ్డి బుద్ధఘోషుడి అనువాదం) ఇలా వివరిస్తున్నది:
‘మిగజాలా! కంటితో గుర్తించదగ్గ రూపాలు – కోరదగినవీ, ప్రియమైనవీ, ఇష్టమైనవీ, సంతోషకరమైనవీ, కామంతో బంధించేవి, ఉత్సాహాన్ని రేకెత్తించేవీ. ఒక భిక్కు వాటిలో ఆనందాన్ని చూస్తే వాటిని కోరుకుంటాడు. వాటిని తన హృదయానికి హత్తుకుంటే అతడికి ఆనందం కలుగుతుంది. ఆనందం వల్ల అనురాగం పుడుతుంది. అనురాగం వల్ల అనుబంధం ఏర్పడుతుంది. అది అతడికి బంధనంగా పరిణమిస్తుంది. ఆనంద సంయోజనం వల్ల బంధితుడయ్యాక అతణ్ణి మనం ఇంక ఏకవిహారి అనలేం, సద్వితీయ విహారి అనే అనవలసి ఉంటుంది.
వేదాంతులు తామరాకుమీద నీటిబిందువులాగా జీవించడమని చెప్తారు. కాని ఆ తృష్ణాత్యాగం ఎలా సాధ్యపడుతుంది? దానికి సమాధానంగానే తిచ్ నాట్ హన్ Our Appointment with Life రాసాడు.
మిగజాలా, ఈ విధంగా ఒక భిక్షువు, ప్రాపంచిక శబ్దాలకు దూరంగా ప్రజలకు దూరంగా విడిగా ఏకాంత వాసాన్ని అన్వేషిస్తో, అడవులకు వెళ్ళినా కూడా అతడు సద్వితీయుడే. ఎందుకని? తృష్ణ అతడి ద్వితీయం. అతడు దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. అందుకని అతడు సద్వితీయ విహారినే అవుతాడు.
అలాకాక, ఒక భిక్షువు, కంటితో చూసినప్పుడు కోరదగినవిగా, ప్రియమైనవిగా, ఇష్టమైనవిగా, కామంతో బంధించేవిగా, రజనీయమైనవిగా కనిపించేవాటిలో ఆనందాన్ని పొందకపోయినట్లయితే, వాటిని మనసా కోరుకోనట్లయితే, అప్పుడు అక్కడ అనురాగమూ ఉండదు, అనుబంధమూ ఉండదు. అటువంటి ఆనంద సంయోజనం నుంచి విముక్తుడైనప్పుడు ఆ భిక్షువుని ఏకవిహారి అంటారు.
అటువంటి భిక్షువు గ్రామంలో ఉన్నా, తక్కిన భిక్షువులతోనూ, భిక్షుణిలతోనూ కలిసి మెలసి తిరుగుతున్నా, ఉపాసక, ఉపాసికలతోనూ, రాజులు, మంత్రులు, ఇతర శాఖల గురువులతోనూ, వారి శిష్యులతోనూ కలిసి తిరిగినా కూడా అతణ్ణి ఏకవిహారి అనే అంటారు. ఎందుకని? ఎందుకంటే అతడు తన భాగస్వామిగా ఉంటున్న తృష్ణని వదిలేసాడు కాబట్టి. అందుకని అతడింక ఏకవిహారి మాత్రమే.’
ఈ సంభాషణలో గమనించవలసిన కీలకమైన అంశం తృష్ణని వదిలిపెట్టడం. అది వదలగలిగితే ఒక సాధకుడు ప్రపంచంలో ఉన్నా కూడా అతణ్ణేదీ అంటదు. వేదాంతులు దీన్నే తామరాకుమీద నీటిబిందువులాగా జీవించడమని చెప్తారు. కాని ఆ తృష్ణాత్యాగం ఎలా సాధ్యపడుతుంది? దానికి సమాధానంగానే తిచ్ నాట్ హన్ Our Appointment with Life రాసాడు.
బహుశా 2500 ఏళ్ళ కిందటి ఈ సంభాషణని మనకి అర్థమయ్యే భాషలో చెప్పిన మొదటి బౌద్ధ పండితుడు థిచ్ నాట్ హనే అనుకుంటాను. తృష్ణా క్షయం అంటే భూతభవిష్యత్తుల పట్ల చింతని వదిలిపెట్టడం అని ఆయన చెప్పగానే ఈ సంభాషణ ఎంత వెలుగు విరజిమ్ముతున్నది!
అసలు ముందు Appointment అన్న మాట చూడండి. అది disappointment with Life కాదు. లేదా disenchantment కాదు. Appointment. అంటే జీవితం నుంచి దూరంగా జరిగిపోవడం కాదు. జీవితానికి ఎదురేగడం. తృష్ణారహితంగా జీవితాన్ని సమీపించడం. ఇదెలా సాధ్యం? ఇందుకు ఏకవిహారిగా ఉండటం మాత్రమే కాదు, భద్రేకరతవిహారిగా ఉండాలంటున్నాడు థిచ్ నాట్ హన్.
సంయుత్త నికాయంలో ఏకవిహారి గురించిన చర్చ ఉంటే, మఝ్ఝిమ నికాయంలో ‘బద్ధేకరత సుత్త’ ఉంది. అంటే ఒంటరిగా ఉండటమే కాదు, అలా ఒంటరిగా ఉండటంలో అత్యున్నతమైన పద్ధతి ఏదో కూడా బుద్ధుడు ఆ సంభాషణలో వివరించాడు. థిచ్ నాట్ హన్ ఇలా రాస్తున్నాడు:
‘ఒంటరిగా జీవించడానికి ఏది ఉత్తమ సాధన అన్నది బౌద్ధంలో ఒక ముఖ్యమైన చర్చనీయాంశం. ఒక మనిషి చైతన్యవంతమైన జీవితం ఎలా జీవించాలని బుద్ధుడు భావించాడో దానిమీద ఆ చర్చ కొత్త వెలుతురు ప్రకాశింపచేస్తున్నది. గడిచిపోయిన విషయాల గురించి పాకులాడకుండా, రాబోయే విషయాల గురించి ఆతృతపడకుండా ప్రస్తుత వర్తమాన క్షణంలో ఏమి సంభవిస్తున్నదో దాన్ని లోతుగా పరికిస్తూ దాని యథార్థ స్వభావాన్ని కనుగొనే ఉద్దేశంతో పూర్తి ఎరుకతోనూ, స్పృహతోనూ జీవించడం గురించిన ఆలోచన అది. ‘
ఆయన ఇంకా ఇలా రాస్తున్నాడు:
‘ఒక్కడూ ఉండటమంటే సమాజాన్నీ, ప్రపంచాన్నీ నిరాకరించడం కాదు. బుద్ధుడు చెప్పిందేమంటే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఏమి జరుగుతున్నదో దాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండటమే నిజమైన ఏకాంతం. మనమట్లా జీవించగలిగితే గడిచిపోయిన దానిగురించి దుఃఖిస్తూ ఉండటం, రాబోయే కాలం గురింంచి తపిస్తూనూ ఉండం. మనం వర్తమాన క్షణంలో జీవించలేనప్పుడు మనం అడవికి పోయినా ప్రయోజనం లేదనే బుద్ధుడు చెప్తున్నాడు. అటువంటప్పుడు కీకారణ్యంలో ఉన్నా కూడా మనకి ఏకాంతం సాధ్యంకాదు. బుద్ధుడు చెప్తున్నదాన్ని బట్టి మనం మన ప్రస్తుత క్షణంలో పూర్తి స్పృహతో జీవిస్తూ ఉండగలిగినట్లయితే, జనారణ్యంలో జీవిస్తున్నా, నగరమధ్యంలో సంచరిస్తున్నా కూడా మనం ఒక్కరిగానే ఉండగలుగుతాం.’
బహుశా 2500 ఏళ్ళ కిందటి ఈ సంభాషణని మనకి అర్థమయ్యే భాషలో చెప్పిన మొదటి బౌద్ధ పండితుడు థిచ్ నాట్ హనే అనుకుంటాను. తృష్ణా క్షయం అంటే భూతభవిష్యత్తుల పట్ల చింతని వదిలిపెట్టడం అని ఆయన చెప్పగానే ఈ సంభాషణ ఎంత వెలుగు విరజిమ్ముతున్నది!
గుడ్డలు ఉతుక్కోవడమో, ఇల్లు ఊడ్చుకోవడమో, టీ కాచుకోవడమో, స్నానాల గది శుభ్రం చేసుకోవడమో, ఏదో ఒకటి దాని మీదనే దృష్టి పెట్టి చేసుకోవాలి. ఆ చిన్న చిన్న పనుల్లోనే, పూర్తిగా దృష్టి పెట్టి చేసుకునే ఆ చిన్నచిన్న పనుల్తోనే మన ఆధ్యాత్మిక జీవితం సుసంపన్నంగా మనకి సుసాధ్యమవుతుంది
ఆయన ఇంకా ఇలా రాస్తున్నాడు:
‘మనం మరపులో జీవిస్తున్నంతకాలం గతంలోనో, భవిష్యత్తు గురించిన చింతలోనో మనని మనం కోల్పోతూనే ఉంటాం. మన కోరికలూ మన అజ్ఞానం, మన కోపం మనల్ని తల్లకిందులు చేస్తున్నంతకాలం మనం మన వర్తమాన క్షణంలో పూర్తి ఎరుకతో జీవించలేం. మన వర్తమానంతో మన సంబంధం బలహీనంగా ఉన్నంతకాలం తక్కినవాళ్ళతో మన సంబంధాలు కూడా అంతే బోలుగా, డొల్లగా, బీదగా కొనసాగుతాయి.
ఒక్కొక్కప్పుడు మనకి చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటీ సంతోష విహీనంగానూ, డొల్లగానూ అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో మనం ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉంటాయి. తక్కినవాళ్ళతో మన సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూసే కొద్దీ అంతగా అవి జారిపోతూనే ఉంటాయి. అటువంటప్పుడు మనం చెయ్యవలసిందేమంటే, మనకి బయట ఉన్న ప్రతి ఒక్కదాన్నుంచీ కొంతసేపు సెలవుతీసుకుని మనకి మనం చేరువకావడం. అంటే ‘ఏకవిహారులం’ కావడం అన్నమాట. అప్పుడు మనలోకి మనం చూపుసారిస్తూ, శ్వాస సక్రమంగా తీసుకుంటూ, వదుల్తూ మనలోపలా, బయటా ఏమి జరుగుతున్నదో శ్రద్ధగా పరికించడం మొదలుపెట్టాలి. మన చుట్టూ ఉన్న దృగివిషయాలన్నిటినీ మనం పరికిస్తాం. వాటికి హలో చెప్తాం. వాటిని చూసి చిరునవ్వుతాం. కాని వాటితో సంబంధంలేకుండా మనం చేసుకోవలసిన ఏదో ఒక పని, చిన్న చిన్న పనులే, నడవడమో, ధ్యానం చేసుకోవడమో, గుడ్డలు ఉతుక్కోవడమో, ఇల్లు ఊడ్చుకోవడమో, టీ కాచుకోవడమో, స్నానాల గది శుభ్రం చేసుకోవడమో, ఏదో ఒకటి దాని మీదనే దృష్టి పెట్టి చేసుకోవాలి. ఆ చిన్న చిన్న పనుల్లోనే, పూర్తిగా దృష్టి పెట్టి చేసుకునే ఆ చిన్నచిన్న పనుల్తోనే మన ఆధ్యాత్మిక జీవితం సుసంపన్నంగా మనకి సుసాధ్యమవుతుంది.’
అరవై పేజీల తన ప్రసంగమంతా థిచ్ నాట్ హన్ ఈ విషయాన్నే పదే పదే మరిన్ని ఉదాహరణలతో మరిన్ని సంభాషణల సాయంతో వివరిస్తాడు. తృష్ణాత్యాగం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదనీ, జరిగిపోయినవాటిగురించీ, జరగబోయే వాటి గురించీ ఆందోళన వదిలిపెట్టడమనీ ఆయన చెప్తూ ఉంటే అటువంటి సాధన ఏదో మనం కూడా చేపట్టగలమనిపిస్తుంది.
ఒకప్పుడు కోసల రాజు ప్రసేన జిత్తు చెప్పాడట: బుద్ధుడి బోధల పట్ల తనకి నమ్మకం కుదరడానికి కారణం బుద్ధుడి శిష్యులు జీవించే విధానమే అని. ఎటువంటి తొట్రుపాటూ లేకుండా, ప్రశాంతంగా, సంతోషంగా ఆ శిష్యులు తమ రోజువారీ జీవితాన్ని జీవించడం చూసినప్పుడు ఆ రాజుకి ఆ గురువు బోధల్లోని బలమేమిటో అర్థమయిందని చెప్పాడట. ఇప్పుడు ప్రసేనజిత్తు ఈ పుస్తకం చదివి ఉంటే కూడా ఆ మాటలే చెప్పి ఉండేవాడు.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ప్రభుత్వ ఉన్నతాధికారి. థిచ్ నాట్ హన్ పై వారు రాసిన రెండు సవివరమైన వ్యాసాల లింకులు ఇవి.
పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం,
‘ఒక యోగి ప్రేమ కథ’
A good and wonderful book….thanks