“ఆమె రచనల్లో సర్వోత్తమమైందిగా చెప్పదగ్గ ‘L’événement’ (2000; ‘Happening’, 2001) చట్టవిరుద్ధంగా అబార్షన్ కు పాల్పడిన ఒక 23 ఏళ్ళ కథకురాలి అనుభవాన్ని ఎంతో శస్త్రతుల్యమైన సంయమనంతో చెప్పిన రచన. ఆ కథనం అత్యంత కర్కశమైన నిజాయితీతో కూడినదే కాక, ఆ ‘సంఘటన’ జరిగిన పాతికేళ్ళ తరువాత కూడా పాఠకుణ్ణి ఆ సంఘటనలో సంలీనం చేసుకునే విధంగా ఆ సాగుతుంది.’
వాడ్రేవు చినవీరభద్రుడు
‘నేను చెప్తున్న ఈ కథనం చదివి కొంతమంది పాఠకులు ఆగ్రహోద్రిక్తులు కావచ్చు, లేదా జుగుప్సకి లోనుకావచ్చు. అది సభ్యసమాజం వినడానికి రుచించని విషయంగా కూడా భావించవచ్చు. కానీ ఏ అనుభవమైనా సరే, అది ఎటువంటిది కానీ, దాన్ని నలుగురికీ తెలిసేటట్టుగా నమోదు చెయ్యవలసిన హక్కు ప్రతి అనుభవానికీ ఉంటుందని నమ్ముతాను నేను. సత్యంలో తక్కువ స్థాయి సత్యమంటూ ఏదీ లేదు. అదీకాక నేను ఈ నా ప్రయత్నంలో, అంటే నా అనుభవాన్ని నమోదు చెయ్యడంలో విఫలమయితే ఎందరో స్త్రీల జీవితాల్ని మూగబోయేటట్టు చేసే అపరాధం చేసినట్టే, తద్వారా ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని అభిశంసించకుండా ఉండిపోయినట్టే’
ఈ రోజు నొబేల్ కమీటీ సాహిత్యానికి నోబెల్ బహుమతి ప్రకటించిన ఫ్రెంచి రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ (జ.1940) నవల Happening (రచన 1999) లో వాక్యాలివి.
పట్టుమని 130 పేజీలు కూడా లేని ఈ కథనం చదివిన తరువాత స్త్రీపురుష ప్రేమ, లైంగిక సంబంధాలు, గర్భధారణ, అబార్షన్, నీతిసూత్రాలు, చట్టాలు, సమానహక్కుల ఉద్యమాలు, మతం, మతనియమాలు- వీటన్నింటి గురించిన మన ఆలోచనలు పెద్ద కుదుపుకి లోనవుతాయి.
ఆ నవల ఒక ఉత్తమపురుష కథనం. అక్షరాలా రచయిత్రి స్వీయ అనుభవం. 1963 లో ఆమె ఇంకా కాలేజి విద్యార్థిగానే ఉండగానే ‘సంభవించిన ‘ ఒక అవాంఛిత గర్భం, ఆ గర్భవిచ్ఛిత్తికోసం ఆమె పడిన దుర్భర సంఘర్షణ ఆ నవలకి ఇతివృత్తం. కాని అంతకన్నా ముఖ్యం, ఆ అనుభవానికి ఆమె అక్షరరూపాన్నివ్వడం. ఆ happening ని writing గా మార్చడం అత్యంత సాహసోపేతమైన చర్య మాత్రమే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఒక విముక్తి గాథ కూడా. తన కథనం (దాన్ని నవల అని పిలవాలనిపించడం లేదు) చివరి పేజీలకు వచ్చేటప్పటికి ఆమె ఇలా రాస్తున్నది:
‘ఒక తీవ్రాతితీవ్రమైన మానవానుభవానికి అక్షరరూపాన్నివ్వడం పూర్తి చేసాను. జీవన్మరణాల అంచుల్లో, కాలం, చట్టం, నీతులు, నిషేధాల మధ్య- నేను నా దేహాన్ని దాటిపోగలిగిన అనుభవం అది.’
ఆమె ఇంకా ఇలా అంటున్నది:
‘ఈ సంఘటనకి సంబంధించిన ఒకే ఒక్క అపరాధభావమేదైనా ఉంటే దాన్నుంచి బయటపడ్డాను. అది ఈ అనుభవం నాకే ఎందుకు సంభవించిందనేది, అది నా ప్రయత్నం వల్ల జరిగింది కాదనేది. తిరస్కరించిన కానుకలాంటిదన్నమాట. నా గతానికి సంబంధించిన ఎన్నో సాంఘిక, మానసిక కారణాలన్నిటిమధ్యా, ఒక విషయం మాత్రం నాకు స్పష్టం. అదేంటే ఈ అనుభవాలు నాకెందుకు సంప్రాప్తమయ్యాయంటే నేను వాటిని నలుగురికీ చెప్పగలను కనుక. బహుశా నా జీవితం తాలూకు యథార్థమైన ప్రయోజనం నా దేహం, నా సంవేదనలు, నా ఆలోచనలు రచనలుగా మారడమే అనుకుంటాను. మరో విధంగా చెప్పాలంటే నా అనుభవాలు తద్వారా నలుగురూ అర్థం చేసుకోగలిగేవిగానూ, సార్వజనీనంగానూ మారి తద్వారా నా అస్తిత్వం ఇతరుల జీవితాల్లోనూ, భావనల్లోనూ సంగమిస్తుంది.’
ఒక అబార్షన్ కు సంబంధించిన కథనం అనడం ఈ రచనను సరిగ్గా వివరించినట్టు కాదు.
ఆమె మాటలు అక్షర సత్యాలు. పట్టుమని 130 పేజీలు కూడా లేని ఈ కథనం చదివిన తరువాత స్త్రీపురుష ప్రేమ, లైంగిక సంబంధాలు, గర్భధారణ, అబార్షన్, నీతిసూత్రాలు, చట్టాలు, సమానహక్కుల ఉద్యమాలు, మతం, మతనియమాలు- వీటన్నింటి గురించిన మన ఆలోచనలు పెద్ద కుదుపుకి లోనవుతాయి. వాటన్నిటి గురించీ మనకి ఇప్పటికే స్పష్టంగా ఏవో కొన్ని అభిప్రాయాలంటూ ఉన్నా, లేకపోయినా, లేక, మనకి అటువంటి అభిప్రాయాలున్నట్టు మనకి తెలియకపోయినా, మన ప్రాపంచిక దృక్పథం ఒక్కసారిగా పెద్ద పరీక్షకు లోనవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమె ఈ రచన చెయ్యడం ద్వారా యావత్ప్రపంచాన్నీ అగ్నిపరీక్షకు గురిచేసిందని చెప్పవచ్చు.
ఒక అబార్షన్ కు సంబంధించిన కథనం అనడం ఈ రచనను సరిగ్గా వివరించినట్టు కాదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం స్త్రీ దేహం మీద, ఆ దేహానికి సంబంధించిన అన్ని అనుభవాల మీద ఆమెకే పూర్తి హక్కు ఉండాలని ఎందరో మానవతావాదులు, ఫెమినిస్టులు, హక్కుల ఉద్యమకారులు చెప్తూనే ఉన్నారు. కాని ఆ మాటల్ని ఒక స్త్రీగా తన స్వీయానుభవాన్ని నిస్సంకోచంగా చెప్పడం ద్వారా చెప్పి మనల్ని పూర్తిగా తనవైపు తిప్పుకోవడమే ఈ రచన సాధించిన విజయం.
ఈ రచనలోని అనుభవం, ఆ సంఘర్షణా వాటికవే తీవ్రమైనవి. కాని వాటిని మనతో పంచుకుంటున్నప్పుడు ఆమె చూపించిన సంయమనం వల్ల ఆ కథనం మరింత తీవ్రీకరణ చెందింది. నొబేల్ కమిటీ తన ప్రకటనలో ఇలా అన్నదంటే ఆశ్చర్యం లేదు:
Happening ఒక సర్జను చేతిలో శస్త్రంలాగా ఎంతో నిర్మమత్వంతో, అపారమైన దయతో, ముఖ్యంగా స్త్రీల దుఃఖం పట్ల ఎంతో సహానుభూతితో చెప్పిన కథనం. ఆ కథకురాలు ఒక సాహిత్యవిద్యార్థి కావడం వల్ల ఆ రచన మరింత ప్రగాఢతను సంతరించుకుంది.
“ఆమె రచనల్లో సర్వోత్తమమైందిగా చెప్పదగ్గ ‘L’événement’ (2000; ‘Happening’, 2001) చట్టవిరుద్ధంగా అబార్షన్ కు పాల్పడిన ఒక 23 ఏళ్ళ కథకురాలి అనుభవాన్ని ఎంతో శస్త్రతుల్యమైన సంయమనంతో చెప్పిన రచన. అది ఉత్తమపురుష కథనం మాత్రమే కాక, తక్కినరచనల్లో లాగా ఆ కథకురాలి చారిత్రిక యథార్థాన్ని దూరంగ పెట్టినట్టు కనిపించదు. అప్పటికే సామాజిక అణచివేత స్వభావంవల్లా, చుట్టూ ఉండేవారు ఆమెనేదో ఉద్ధరిస్తున్నట్టు మాటాడే మాటల వల్లా ఆ కథకురాలి ‘నేను ‘ ఒక మనిషిగా కాక, ఒక వస్తుగతవిషయంగా మారిపోయింది. ఆ కథనం అత్యంత కర్కశమైన నిజాయితీతో కూడినదే కాక, ఆమె తన కథనం మధ్యలో బ్రాకెట్లలో పెట్టి చెప్తూ వచ్చిన వ్యాఖ్యలు ఏకకాలంలో స్వగతాలూ, పాఠకులతో సంభాషణలూ కూడా. ఆ ‘సంఘటన’ జరిగిన పాతికేళ్ళ తరువాత కూడా పాఠకుణ్ణి ఆ సంఘటనలో సంలీనం చేసుకునే విధంగా ఆ కథనం సాగుతుంది.’
నొబేల్ కమిటీ రాసిన వాక్యాల్లో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. రచయిత్రినే ఒక చోట ఇలా అంటున్నది:
‘నేను రాస్తున్నప్పుడు నా కోపమో, బాధనో కవితాత్మకంగా పొంగిపొర్లకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఈ కథనాన్ని నేను ఏడుపుతోనూ, పెడబొబ్బలతోనూ ఎందుకు నింపట్లేదంటే, ఆ రోజుల్లో అవి నా జీవితంలో లేవు కాబట్టి. ఆ రోజు నన్ను పరిశోధిస్తున్నట్టుగా పరిశీలించిన ఆ ఫార్మసిస్టు చూపులు, ఆ గదిలో ఆవిరిగక్కుతున్న వేడినీళ్ల బేసిన్ లో హెయిర్ బ్రష్ అవి నాకు ఏ అసంతోషాన్ని కలిగించాయో ఆ అసంతోషానుభవ ప్రవాహాన్ని అంతే స్థిరంగా పట్టుకోవడం నాకు ప్రధానం. కొన్ని చిత్రాలు చూసినప్పుడు, కొన్ని మాటలు విన్నప్పుడు నాకు కలిగే క్షోభ నేను అప్పుడు అనుభవించినదాని ముందు నిలబడగలిగేది కాదు. ఇవి సాహిత్య భావోద్వేగాలు. వీటి ప్రయోజనం ఒక రచనగా బయటపడటం, ఆ అనుభవ యాథార్థ్యాన్ని నిర్ధారించడం మాత్రమే.’
Happening ఒక సర్జను చేతిలో శస్త్రంలాగా ఎంతో నిర్మమత్వంతో, అపారమైన దయతో, ముఖ్యంగా స్త్రీల దుఃఖం పట్ల ఎంతో సహానుభూతితో చెప్పిన కథనం. ఆ కథకురాలు ఒక సాహిత్యవిద్యార్థి కావడం వల్ల ఆ రచన మరింత ప్రగాఢతను సంతరించుకుంది. ఒక విక్టర్ హ్యూగో, ఒక మార్సెల్ ప్రూ మహేతిహాసాలు రాయడం ద్వారా మనతో పంచుకున్న మానవానుభవ గాఢతని ఈ రచయిత్రి నూటముప్పై పేజీల్లోనే సాధ్యం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు.
ఆమె రచనలోని ఆ క్లుప్తత, గాఢత, ఆ సర్జనికుడి నిర్మోహత్వాల్ని చూపించడానికి ఏ వాక్యాన్ని ఉదాహరించాలంటే మొత్తం పుస్తకాన్ని ఎత్తి రాయవలసి ఉంటుంది. అయినా రెండు మూడు ఉదాహరణలు ఇవ్వడం నా ధర్మం. ఆమె ఇలా రాస్తున్నది:
‘మొదటిసారిగా నేను పుట్టుకకీ, చావుకీ రెండింటికీ జన్మనిచ్చాను..’
‘అది (అబార్షన్ అనుభవం) వర్ణించలేని దృశ్యం. జీవన్మృత్యువులు ఒక్క గుక్కలోనే అనుభవానికొచ్చాయి. క్రతువుల్లో బలి ఇచ్చే దృశ్యంలాంటిదది.’
‘మొదటిసారిగా నేను పుట్టుకకీ, చావుకీ రెండింటికీ జన్మనిచ్చాను..’
“ఆ రోజుల్లో మా తల్లితండ్రులు హాస్పటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాక అప్పటి దృశ్యం ఒకే ఒక్కటి నాకళ్ళముందు ఇప్పటికీ కదలాడుతూ ఉంటుంది. నేను మంచం మీద పడుకుని ఉంటాను, ఎదురుగా తెరిచిన కిటికీ, నా చేతుల్లో గెరార్డ్ డి నెర్వాల్ కవితల పాపర్ బాక్ సంపుటి. బిగుతుగా ఉండే నల్లని పాంటులో కప్పబడ్డ నా కాళ్ళని చూసుకుంటూ ఉండేదాన్ని, వాటిమీద వర్షిస్తున్న సూర్యరశ్మి, ఇప్పుడు ఆ కాళ్ళు మరొక స్త్రీవి.’
అన్నిటికన్నా ముఖ్యంగా మరీ ఈ రెండు పేరాలు:
‘నా గదిలో బాక్ స్వరపరిచిన సెయింట్ జాన్ వేదనను వినేదాన్ని. క్రీస్తు వేదనని ప్రకటించడానికి ఆ సువార్తీకుడి వాక్యాల్ని గాయకుడు జర్మన్ లో ఆలాపిస్తున్నప్పుడు నేను ఆ ఆక్టోబరు నుంచి జనవరిదాకా అనుభవించిన వేదనని నాకు తెలియని ఏదో భాషలో ఆలపిస్తున్న్నట్టుగా అనిపించేది. అప్పుడు ‘వొహిన్! వోహిన్!’ అంటో కోరస్ వంత కలిపేది. దిగంతాలు విచ్చిపోయేవి. నాకు అబార్షన్ చేసిన ఆ గది, ఆ సూది, ఆ రక్తం, అవన్నీ ఈ ప్రపంచ దుఃఖంలో, నిత్యమృతువులో కలిసిపోయేవి. నేను రక్షించబడ్డాననిపించేది.”
‘ఆ నగరవీథుల్లో నడిచేను. ఆ జనవరి 20-21 రాత్రి రహస్యాన్ని నా దేహం ఒక పవిత్రానుభవంగా గుర్తుచేసుకుంటూ ఉంది. నేను భయానక అనుభవం అంచులకు చేరుకున్నానా లేక మహాసౌందర్య తీరానికి చేరుకున్నానా తేల్చుకోలేకపోయాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ అనుభవం సాధారణంగా ఒంటరివాళ్ళయిపోయిన నావికులకూ, దొంగలకూ, డ్రగ్ వ్యసనానికి లోనయ్యేవాళ్ళకి లభించే లాంటి అనుభవం. ఇతరులెవ్వరూ అడుగుపెట్టడానికి సాహసించని ప్రాంతాల్లో అడుగుపెట్టేటప్పటి అనుభూతి. బహుశా ఈ రచన రాయడానికి కూడా ఆ అనుభూతినే కొంత వరకూ కారణమనుకుంటాను.’
చివరగా ఏ వాక్యాలతో ముగిద్దామా అనుకుంటే నొబేల్ కమిటీ రాసిన ఈ వాక్యాలే మరొకసారి చెప్పదగ్గవిగా కనిపిస్తున్నాయి. స్వీడిష్ కమిటీ ఇలా అంటున్నది:
‘సాహిత్యానికున్న విమోచన శీల శక్తిని అన్నీ ఎర్నాక్స్ స్పష్టంగా నమ్ముతున్నది. ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో, అత్యంత పరిశుభ్రంగా, రాజీలేని విధంగా రాసిన సాహిత్యం. శ్రామిక వర్గానికి చెందిన అనుభవాలు కలిగించే వేదననీ, అవమానాన్నీ, న్యూనతనీ, అసూయనీ, నువ్వెవరో నువ్వు తెలుసుకోడానికి వీల్లేకుండా చేసే అశక్తతనీ గొప్ప సాహసంతోనూ, వైద్యనిదానంతోనూ ఆమె వెల్లడిస్తున్నప్పుడు, ఆ పని శాశ్వతంగా నిలిచేదిగానూ, ఎంతో ఆరాధనీయంగానూ కనిపిస్తున్నది.’
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి.
వారి రచనల కుటీరం ఇక్కడ చూడండి.