Editorial

Wednesday, January 22, 2025
ARTSYeelen : ఆఫ్రికనీయం ఈ చిత్రం - వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

Yeelen : ఆఫ్రికనీయం ఈ చిత్రం – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

గత రెండు వందల ఏళ్ళుగా మనకి పాశ్చాత్య ప్రపంచం ఒక రియలిజం ని పరిచయం చేసింది. అది దర్జీవాడు మనకొలతల్తో నిమిత్తం లేకుండా మనకి కుట్టి ఇచ్చిన చొక్కా. మనం ఆ రియలిజానికి తగ్గట్టుగా ఒదిగి ఉండటాన్ని ప్రాక్టీసు చేస్తూ మన చేతులూ, కాళ్ళూ ముడుచుకు కూచోడానికి అలవాటు పడిపోయాం. కాని ఇదిగో, ఇటువంటి ఆఫ్రికన్ కళాకారులు, లాటిన్ అమెరికన్ రచయితలు మన జీవితాల్లో మనకి బాగా తెలిసి కూడా మనం విస్మరిస్తూ వచ్చిన ‘మాజిక్’ ని మనకు గుర్తుచేస్తున్నారు.

వాడ్రేవు చినవీరభద్రుడు

నా చిన్నప్పుడు మా ఊళ్ళో అచ్యుత రామరాజుగారనే ఆయన ఉండేవాడు. ఆయన్ని వంకమెళ్ళ రాజు అని కూడా అనేవారు. ఆయనకి మంత్రాలు తెలుసని చెప్పుకునేవారు. ఆయన అక్కనో, చెల్లెలో కొండమ్మగారనే ఆవిడ కూడా ఉండేది. ఆమె బాలవితంతువు. జీవితం పూర్తిగా దేవుడికి అంకితం చేసి జీవించేది. ఆ అన్నాచెల్లెళ్ళ ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి. వాళ్ళ ఇంటి పక్క ఒక చాపరాయి ఉండేది. ఆ చాపరాయిదగ్గర ఒక చింతచెట్టుండేది. నడుం వంగిపోయిన వృద్ధమహిళలాగా ఉండే ఆ చెట్టుని మాలకొండమ్మ చింతచెట్టనే వారు. ఆ చెట్టుకింద దేవుడి రాళ్ళూ, కొంత పసుపూ కుంకుమా కనిపించేవి. కిందకి నడ్డివాలినట్టుండే ఆ చెట్టు ఎక్కాలని ఆ చిన్నతనంలో మాకు పదేపదే అనిపించేది. కాని దేవుడి చెట్టు, ఎక్కకూడదనేవారు. ఆ చెట్టుకీ, చాపరాయికీ ఆనుకుని ఒక పాత ఇల్లుండేది. నాకు తెలిసి కొన్నాళ్ళు ఆ ఇంట్లో భజనలు చేసేవారు. ఆ తర్వాత ఆ ఇల్లు బాగా పాడుపడి ఎండకి మాడుతూ వానకి తడుస్తూ ఉండేది. ఆ చెట్టుకీ, ఆ ఇంటికీ కొద్ది దూరంలో అంటే రెండుమూడు ఫర్లాంగుల దూరంలో జెండాకొండ ఉండేది.

మన జీవితాలు పాశ్చాత్యీకరణ చెందుతున్న క్రమంలో అన్నిటికన్నా ముందు మనం మన దేవీదేవతలను పోగొట్టుకున్నాం.

నా చిన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఏదో రహస్యమాంత్రిక వాతావరణంతో కనిపించేది. మాకు ఎప్పుడేనా తలనొప్పి అన్నప్పుడో లేదా ఆటల్లో కిందపడి దెబ్బ తగిలినప్పుడో, మా అమ్మ ఆ కొండమ్మ గారి దగ్గరకు తీసుకువెళ్ళేది. ఆమెని మంత్రం వెయ్యమని అడిగేది. ఆమె మమ్మల్ని దగ్గరకు పిలిచి ఒక్కొక్కరినే తన ఎదట కూచోబెట్టుకునేది. తాను గొంతుక్కూచుని కళ్ళు సగం మూసుకుని, తన నోరు చక్రంలాగా తిప్పి, ఏదో జపిస్తుండేది. ఒకటి రెండు నిమిషాల పాటు ఏదో జపించేక, అప్పుడు మాకు దెబ్బ తగిలినచోట గట్టిగా ఊదేది. ఆమెకు ఒకటిరెండు కన్నా ఎక్కువ చీరలు ఉండేవి కావనుకుంటాను. ఆ ఉన్న చీరల్నే పదేపదే పిండుకుని కట్టుకోవడం వల్ల కాబోలు ఆమె నుంచి ఏదో ఒక విచిత్రమైన వాసన వచ్చేది. ఆమె గట్టిగా ఊదినప్పుడు ఆ వాసనకూడా నన్ను చుట్టుముట్టేది. అట్లా నాలుగైదు నిమిషాలు గడిచాక పోయి ఆడుకో అనేది. ఆటల్లో పడగానే ఎప్పుడు అదృశ్యమయ్యిందో తెలియకుండానే ఆ నొప్పి అదృశ్యమైపోయేది.
కాలం గడిచాక, ఆ ప్రాచీన మాంత్రిక వాతావరణ నుంచి దూరంగా జరిగి, నాగరిక, హేతుబద్ధ, ఆధునిక ప్రపంచంలోకి పూర్తిగా వచ్చేసాక, ఆ రాజుగారూ, ఆయన అక్కా, ఆ మాలకొండమ్మ చింతచెట్టూ జ్ఞాపకాలుగా కూడా మిగలకుండాపోయేక, ఇప్పుడు వెనక్కి తిరిగిచూసుకుంటే, ఏమి చేసి ఆ లోకాన్ని వెనక్కి తెచ్చుకోగలనా అనిపిస్తున్నది. ఇప్పుడు కూడా కింద పడుతున్నప్పుడో, లేదా ఎవరో కిందకు పడదోస్తున్నప్పుడో ఆ కొండమ్మ గారి దగ్గరికి తీసుకువెళ్లి మంత్రం వేయమని అడగడానికి మా అమ్మ ఉంటే బాగుణ్ణనిపిస్తున్నది.

ఈ ఆరాటం నా ఒక్కడికే కాదు, ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్ దీవుల్లోని చాలా జాతులకు కలుగుతున్న ఆరాటం. మన జీవితాలు పాశ్చాత్యీకరణ చెందుతున్న క్రమంలో అన్నిటికన్నా ముందు మనం మన దేవీదేవతలను పోగొట్టుకున్నాం. నలుగురిముందూ మనం పోగొట్టుకుంటున్న ఆ విహ్వల క్షణంలో కృష్ణా అని పిలిస్తే పరుగుపరుగున చీరలు పట్టుకొచ్చే ఒక ఆత్మీయసన్నిధిని పోగొట్టుకున్నాం. మన కష్టంలో, సుఖంలో మన అన్నదమ్ములకన్నా, అక్కచెల్లెళ్ళ కన్నా ఇంకా దగ్గరగా మన పక్కన నిలబడి మనల్ని చేతులు పట్టుకు నడిపించే తోడునీ, ఆ తోడుని పట్టిచ్చే నీడనీ కూడా పోగొట్టుకున్నాం.

సరిగ్గా ఇటువంటి మనఃస్థితిలోంచే ఆఫ్రికన్ దర్శకుడు సౌలేమానే సిస్సే ‘యెలీన్ ‘సినిమా తీసాడు.

రెండు తరాల మధ్య సంభవించే సంఘర్షణను సిస్సే ఎంతో ప్రగాఢంగా చిత్రించేడు. ఇందులో పాత్రల ప్రాపంచిక దృక్పథం ఏవో జాతుల ఏదో ఆసక్తికల్గించే సంప్రదాయ చిత్రణలాగా కాకుండా ఆ జాతులు తాము రోజూ జీవించే అనుభవ సత్యంగా చిత్రించేడు.

అది మాలి దేశానికి చెందిన ఒక పురాణగాథ. మాలి సబ్ సహారన్ ఆఫ్రికాలో పశ్చిమప్రాంతానికి చెందిన దేశం. అక్కడి ప్రజలు అత్యధికులు మాట్లాడే భాష బంబారా. ఈ సినిమా కూడా బంబారాలోనే తీసారు. 13 వ శతాబ్దిలో బంబారా పూర్వీకులైన తండ్రీ కొడుకుల మధ్య సంభవించిన కథ అది. ఆ కథని చిత్రదర్శకుడు పూర్తిగా ఆఫ్రికన్ పద్ధతి కథనంలో చెప్పడానికి ప్రయత్నించాడు. అతడు తీసుకున్న మాధ్యమం ఒక్కటే పాశ్చాత్య ప్రపంచానికి చెందింది. తక్కినవన్నీ, కథ, కథనం, ఆ కథలో అతడు వెతుక్కున్న గతం, వినిపిస్తున్న సందేశం అవన్నీ పూర్తిగా ఆఫ్రికనీయం.

ఆ సినిమా గురించి ఒక చలనచిత్రపండితుడు తాను రాసుకున్న నోట్సులో ఇలా అంటున్నాడు:

‘… రెండు తరాల మధ్య సంభవించే సంఘర్షణను సిస్సే ఎంతో ప్రగాఢంగా చిత్రించేడు. ఇందులో పాత్రల ప్రాపంచిక దృక్పథం ఏవో జాతుల ఏదో ఆసక్తికల్గించే సంప్రదాయ చిత్రణలాగా కాకుండా ఆ జాతులు తాము రోజూ జీవించే అనుభవ సత్యంగా చిత్రించేడు. యెలీన్ లో బంబారా ఆచారాలు ఏదో పండగ పూట జరుపుకునే క్రతువుల్లానో లేదా ఏదో ఊరేగింపులోనో, తిరణాలలోనో దొరికే వింత తినుబండారంలానో కాకుండా ఆ సంప్రదాయం దానికదే జీవన ఔషధంగా, బతుకునిచ్చే ఆహారంగా చూపించేడు. ఒక సంస్కృతి గురించి బయట ప్రపంచంతోనూ, ఆ సాంస్కృతిక ప్రపచంతోనూ కూడా ఏకకాలంలో సంభాషించగల యెలీన్ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఒక తెగ నమ్మే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అత్యంత ప్రాణవంతమైన సన్నిధిగా ఆ చిత్రదర్శకుడు నమ్మడమే కాక, అందులో పాశ్చాత్యప్రపంచపు అంతః, బాహ్య సరిహద్దుల్ని, అతీత, వర్తమానాల్ని పూర్తిగా చెరిపేసాడు.

ఈ ప్రపంచంలో మానవుడు తనకంటూ సగర్వంగా ప్రముఖంగా నిలబడగల ఒక చోటుని కోరుకుంటున్నాడని చెప్పడంతో పాటు, ఆ దర్శకుడు, ఈ ప్రపంచంలో మానవేతర ప్రకృతి, దాని చెట్టుచేమలు కూడా అంతే శక్తిమంతమైన, ప్రముఖమైన సృష్టి అని కూడా చెప్తున్నాడు.

..విమర్శకులు ఈ కథనాన్ని ‘ప్రిమిటివ్ ‘అని కొట్టిపారెయ్యవచ్చుగాక, కాని ఒక కథకుడు మనం చూస్తున్న విశ్వం మనం అంత తేలిగ్గా బోధపరుచుకోగలిగేది కాదనీ, దాన్ని మనం అనుకున్నంత తేలిగ్గా నియంత్రించలేమనీ, అందుకు బదులు, ముందు అసలు దాన్ని ఉన్నదున్నట్టుగా చూడమని చెప్పే కథనం కన్నా ప్రిమిటివ్ మరెక్కడుంటుంది? ఈ ప్రపంచంలో మానవుడు తనకంటూ సగర్వంగా ప్రముఖంగా నిలబడగల ఒక చోటుని కోరుకుంటున్నాడని చెప్పడంతో పాటు, ఆ దర్శకుడు, ఈ ప్రపంచంలో మానవేతర ప్రకృతి, దాని చెట్టుచేమలు, పశుపక్ష్యాదులు, జలాలు సమస్తం కూడా అంతే శక్తిమంతమైన, ప్రముఖమైన సృష్టి అని కూడా చెప్తున్నాడు.

గత రెండువందల ఏళ్ళుగా మనకి పాశ్చాత్య ప్రపంచం ఒక రియలిజం ని పరిచయం చేసింది. అది దర్జీవాడు మనకొలతల్తో నిమిత్తం లేకుండా మనకి కుట్టి ఇచ్చిన చొక్కా. మనం ఆ రియలిజానికి తగ్గట్టుగా ఒదిగి ఉండటాన్ని ప్రాక్టీసు చేస్తూ మన చేతులూ, కాళ్ళూ ముడుచుకు కూచోడానికి అలవాటు పడిపోయాం. కాని ఇదిగో, ఇటువంటి ఆఫ్రికన్ కళాకారులు, లాటిన్ అమెరికన్ రచయితలు మన జీవితాల్లో మనకి బాగా తెలిసి కూడా మనం విస్మరిస్తూ వచ్చిన ‘మాజిక్’ ని మనకు గుర్తుచేస్తున్నప్పుడు, మనలో అంతదాకా ముడుచుకుపోయిన రెక్కలు విప్పుకోవడం మొదలవుతుంది. మనకి ఎగరాలనిపిస్తుంది.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి నిన్నటి వ్యాసం ‘పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం’ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article