Editorial

Monday, December 23, 2024
ఆధ్యాత్మికంపద్మం ఒక అనుగ్రహం : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

పద్మం ఒక అనుగ్రహం : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

ఆ రేకల్లో అంత కాంతి, అంత నిర్మలత్వం, ఆకాశమంతా అక్కడే కుదురుకుందా అన్నంత ఒద్దిగ్గా, నిండుగా, పరిపూర్ణంగా. యుగాలుగా భారతీయ కవులు, వేదాంతులు, శిల్పులు, చిత్రకారులు కీర్తిస్తూ వచ్చిన పద్మమిదేనా?

అప్పుడు తెలియనేలేదు నాకు, అది నాకింత సన్నిహితంగా ఉందనీ, అది నాదేనని, ఆ పరిపూర్ణమాధుర్యం నా హృదయాంతరాళంలోనే వికసించిందనీ.’

వాడ్రేవు చినవీరభద్రుడు 

ఎన్నాళ్ళుగానో ఓ కోరిక, ఓ కల, తెల్లవారగానే ఇంటిముంగిట్లో ఒక తామరపూల కొలను కనబడాలని,కనీసం ఒక తొట్టెలోనైనా ఒకటిరెండు తామరపూలేనా వికసిస్తుంటే చూడాలని.

అద్దె ఇల్లే కానీ, ఇన్నాళ్ళకు ఈ కల నిజమయ్యింది, ఆదివారం తెచ్చి ఒక తామరతీగ తొట్టెలో నాటానా, రాత్రి కురిసిన రహస్యపు వానకి, తెల్లవారగానే-

‘చూసావా, పువ్వు పూసింది ‘అన్నాడు ప్రమోద్.

ఒక్క ఉదుటున పోయి చూద్దునుకదా, నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను.

ఆ రేకల్లో అంత కాంతి, అంత నిర్మలత్వం, ఆకాశమంతా అక్కడే కుదురుకుందా అన్నంత ఒద్దిగ్గా, నిండుగా, పరిపూర్ణంగా.

యుగాలుగా భారతీయ కవులు, వేదాంతులు, శిల్పులు, చిత్రకారులు కీర్తిస్తూ వచ్చిన పద్మమిదేనా?

అందరికన్నా ముందు టాగోర్ గుర్తొచ్చాడు. గీతాంజలి లో సుప్రసిద్ధ గీతం:

‘పద్మం వికసించిన రోజున నాకు తెలీనే లేదు, నా మనసెక్కడో సంచరిస్తూంది, నా సజ్జ శూన్యంగా మిగిలిపోయింది, ఆ పువ్వు పిలుపు నా చెవిన పడనే లేదు.

ఇప్పుడు నన్ను దిగులు చుట్టుముట్టింది, నా కలల్లోంచి ఉలికిపడి మేలొన్నాను, దక్షిణమారుతంలో ఏదో ఒక మధురపరిమళం అనవాలు తోచింది.

ఆ అస్పష్టమాధుర్యం ఏదో వెతుకులాటతో నా హృదయాన్ని కలతపరిచింది. పరిపక్వం కావటానికి వేసవి మారుతం పడుతున్న ఆరాటం లాగా తోచిందది.

అప్పుడు తెలియనేలేదు నాకు, అది నాకింత సన్నిహితంగా ఉందనీ, అది నాదేనని, ఆ పరిపూర్ణమాధుర్యం నా హృదయాంతరాళంలోనే వికసించిందనీ.’

ఎర్రని ఆ మట్టినీళ్ళల్లో ఆ తామరపువ్వు మరింత ప్రకాశభరితంగా ఉంది. ఎరుపు రంగు నేపథ్యంలో ఎరుపు ఇట్లా శోభించగలదని నేనెప్పుడూ ఊహించలేదు.

భగవదనుగ్రహాన్ని గుర్తుపట్టకపోవడంలోని దిగులూ, గుర్తుపట్టిన తరువాతి ప్రశాంతీ రెండూ ఈ కవితలో కనిపిస్తాయి. కాని నేను మరింత అదృష్టవంతుణ్ణనిపించింది.

భగవదనుగ్రహం నన్నింత త్వరగా చేరవస్తుందని ఊహించలేదు నేను.

ఎర్రని ఆ మట్టినీళ్ళల్లో ఆ తామరపువ్వు మరింత ప్రకాశభరితంగా ఉంది. ఎరుపు రంగు నేపథ్యంలో ఎరుపు ఇట్లా శోభించగలదని నేనెప్పుడూ ఊహించలేదు. వాన్ గో పొద్దుతిరుగుడు పూలు బొమ్మ గీసినప్పుడు బంగారు రంగుపసుపు బాక్ గ్రౌండ్ మీద మళ్ళా బంగారు రంగు పొద్దుతిరుగుడుపూలని గీసినప్పుడు ఆ పూలకి అంత శోభ ఎట్లా సాధ్యమయ్యిందో ఇప్పటికీ అంతుపట్టనట్టే.

ఆ రేకల్ని, ఆ సుకుమారమైన ఆ రేకల్ని మరింత దగ్గరగా చూసాను. అందులో గులాబీల ఎరుపు ఉంది, కలువ పూల తెలుపూ ఉంది.

గత మూడువందల ఏళ్ళుగా గులాబీలకీ, లిల్లీపూలకీ మధ్య యూరోప్ లో పెద్ద స్పర్థ కొనసాగుతూనే ఉంది. గులాబీ ఆసియా ఖండంనుండి పారశీక ఉద్యానాల్లోంచి యూరోప్ లో అడుగుపెట్టింది. లిల్లీ ఉత్తరభూగోళానికి చెందిన సమశీతోష్ణదేశాలకి చెందిన పువ్వు. ఆ రెండు పూలలో ఏది అందమైందో ఐరోపీయ కవులు ఒక పట్టాన తేల్చుకోలేకపోయారు.

తూర్పు దేశాల వర్ణవైభవాన్ని విరజిమ్మే డెలాక్రా చిత్రాలా, లేక ఐరోపీయ రేఖావిన్యాసాన్ని ప్రతిబింబించే ఇంగ్రె చిత్రాలా ఏవి గొప్పవని అడిగితే ఏం చెప్పగలం?

గులాబీకీ, లిల్లీకి మధ్య తలెత్తిన ఈ స్పర్థని విలియం కౌపర్ (1731-1800) అనే ఒక ఇంగ్లీషు కవి సానునయంగా పరిష్కరించే ప్రయత్నం చేసాడు. ఆ రెండింటి సౌందర్యం సమానమేననీ, ఆ రెండింటినీ మించిన మూడవ పువ్వొకటి తలెత్తేదాకా, పుష్పసామ్రాజానికి ఆ రెండు పూలూ రాణులేననీ వనదేవత సర్దిచెప్పిందని ఆయన తన The Lily and The Rose (1782) లో ప్రకటించాడు. కాని పారశీక దేశాల ఐహిక జీవితేచ్ఛని మనసారా అంగీకరించలేకపోయిన విలియం బ్లేక్ (1757-1827) మళ్ళా లిల్లీకే పట్టం కట్టాడు. తన The Lily (1794) కవితలో ఆయన లిల్లీది ముల్లు లేని సంతోషమనీ, సౌందర్యమనీ ప్రస్తుతించాడు.

బ్లేక్ క్రైస్తవ మిస్టిసిజంలో పారశీక సూఫీతత్త్వానికి చోటులేకపోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకని లిల్లీకి, గులాబీకీ మధ్య ఆ స్పర్థ కొనసాగూనే ఉంది, చివరికి కౌపర్ చెప్పినట్టు ఆ రెండింటికన్నా మహిమాన్వితమైన మూడవ పువ్వు తలెత్తేదాకా.

రోజంతా ఆ పద్మాన్నే ధ్యానిస్తూ ఉన్నాను. అది ఒట్టి పువ్వా? అరవిందులు అన్నట్లుగా అది భగవంతుడి గులాబి.

అపురూపమైన భారతీయాంగ్ల కవయిత్రి తోరూదత్ (1856-1877) ఒక సౌగంధికాన్ని తెచ్చి ప్రతిష్టించేదాకా.

గులాబీనీ, లిల్లీని, రెండింటి అందాన్నీ పొదువుకున్న ఆ పువ్వు తామరపువ్వని తోరూదత్ ఇట్లా సుమనోహరంగా చిత్రించేదాకా:

పువ్వులన్నింటికీ రారాణిలాంటి పువ్వేదని
ప్రేమదేవి ఒకనాడు వనరాణిని ప్రశ్నించింది,
ఘనగౌరవంకోసం గులాబికీ, లిల్లీకి మధ్య
చిరకాలం రగులుతున్న స్పర్థ తెలిసిందే కద.
కవిగాయకులు రెండింటితరఫునా వంత పాడారు
గులాబీ లిల్లికెప్పుడు సాటిరాగలదని కొందరు,
లిల్లీ నిజంగా అంతప్రేమాస్పదమా అనిమరికొందరు.
పూలవీథుల్లోని కలకలం రతీనికుంజాన్ని తాకింది.
‘నాకొక పువ్వు కావాలి,’ అనడిగిందామె వనదేవిని.
‘గులాబిలాగ సుకోమలం, కలువలాగ సుధీరం’
‘సరే, మరి రంగు?’ ‘గులాబిలాగా ఎర్రగా ‘అని
అన్నంతలోనే మాట మార్చి, ‘లిల్లీలా తెల్లగా’ అంటూ
సరిదిద్దుకుని, ‘కాదు రెండు రంగులూనూ’ అంది,
అప్పుడనుగ్రహించింది వనలత, గులాబిరక్తిమ
దిద్దిన శ్వేతోత్పలాన్ని, పుష్పసామ్రాజ్ఞిని.

ఆ పూలరాణి, ప్రాక్పశ్చిమాల మేలుకలయికగా తోరూదత్ కి సాక్షాత్కరించిన ఆ సౌందర్యసామ్రాజ్ఞి నా ముందు నా ఇంటిముంగిట్లో ప్రత్యక్షమైతే నా గుండె ఎట్లా కొట్టుకుని ఉంటుందో ఊహించండి.

ఆ కమలం (దానికీ రాజకీయాలకీ సంబంధం లేదు) నాలో ఒక కాంతి ధారకి తలుపు తీసినట్టనిపించింది. ఆ పువ్వు నిజంగానే ఈ లోకానికి చెందిన పువ్వు కాదు. కాని ఈ లోకం తాలూకు పంకంలోనే అది వేళ్ళు తన్నుకుంది. కాని దాని చూపు, దాని సంతోషం ఆకాశానివి, సూర్యుడివి, అందుకనే భూమ్యాకాశాలు మేళవించే చోటు ఎక్కడుందంటే వైదిక ఋషికి పద్మమే స్ఫురించింది.

ఆ రోజంతా ఆ పద్మాన్నే ధ్యానిస్తూ ఉన్నాను. అది ఒట్టి పువ్వా? అరవిందులు అన్నట్లుగా అది భగవంతుడి గులాబి.

రాత్రి పొద్దు పోయి ఇంటికి వచ్చేటప్పటికి, ఆ పువ్వు పూర్తిగా ముడుచుకుపోయిఉంది. ప్రమోద్ ఇంటికి రాగానే ‘అమ్మా, ఆ పువ్వు ఏమైపోయింది’ అని కంగారుపడ్డాడని విజ్జి చెప్తోంది. అట్లా రేకలన్నీ తనలోకి ముడుచుకుని ఒద్దిగ్గా ఆకులమధ్య ఇమిడిపోయిన ఆ పువ్వుని చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. అచ్చు కవులు వర్ణించినట్టే ముడుచుకుపోయి కనిపించింది. కాని ఆ ముడుచుకున్న రేకల కొనలమధ్య ఒకింత రాగరేఖ, కాళిదాసు శ్లోకమొకటి గుర్తుచేస్తూ.

బద్ధకోశమపి తిష్టతి క్షణం సావశేషవివరం కుశేశయమ్
షట్పదాయ వసతిం గ్రహీష్యతే ప్రీతిపూర్వమివ దాతుమంతరమ్ (కుమారసంభవం:8:39)

(పద్మం పూర్తిగా మొగ్గగా ముడుచుకుపోయాక కూడా, ఒకింత చోటు వదిలిపెట్టినట్టే ఉంది, ప్రేమతో తచ్చాడుతున్న తుమ్మెదకి నీడనివ్వడంకోసమా).

రాత్రి ముకుళితమైన ఆ పువ్వు మళ్ళా రేకలు చాపుతూ ఉంది. 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాంతికేంద్రంతో అది అప్పుడే సంభాషణ మొదలుపెట్టింది. ఇంతకన్నా గొప్ప సూర్యారాధకులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండగలరా అనిపించింది.

తెల్లవారుతూనే మళ్ళా పోయి చూసాను. రాత్రి ముకుళితమైన ఆ పువ్వు మళ్ళా రేకలు చాపుతూ ఉంది. 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాంతికేంద్రంతో అది అప్పుడే సంభాషణ మొదలుపెట్టింది. ఇంతకన్నా గొప్ప సూర్యారాధకులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండగలరా అనిపించింది. ఇన్నేళ్ళుగా సంధ్యావందనం ఆచరిస్తూనే ఉన్నానే, కాని సావిత్రీ ఉపాసనలో ఈ చిన్నారిపువ్వు ముందు నేను చాలనని తోచింది, సిగ్గనిపించింది.

అట్లా జీవించగలనా, కాంతికి మాత్రమే విప్పారి, చీకటికి ముడుచుకుపోయి, మళ్ళా కాంతికోసం తెరుచుకుని.

జీవిస్తే అట్లా కదా జీవించాలి, జీవితమంతా ఒక ‘సద్ధర్మ పుండరీక సూత్రం’లాగా.

ఇటువంటి మరెన్నో వ్యాసపద్మాల నిలయం, వాడ్రేవు చినవీరభద్రుడు కుటీరం.
మరి అక్కడ సేద తీరడానికి ఇది క్లిక్ చేయండి

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article