Editorial

Wednesday, January 22, 2025
ఆనందంమామిడిపూల గాలి : చినవీరభద్రుడి పుస్తక వీచిక

మామిడిపూల గాలి : చినవీరభద్రుడి పుస్తక వీచిక

నిన్న ఖాన్ మార్కెటులో ఫకీర్ చంద్ అండ్ సన్స్ లో ఈ  పుస్తకం  దొరికింది. Delhi through Seasons (2015). ప్రసిద్ధ రచయిత, అనువాదకుడు, పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ రచన.

విమానప్రయాణం పూర్తయ్యేలోపు ఆ పుస్తకం చదివేసాను. రాత్రి పదింటికి హైదరాబాదులో దిగేటప్పటికీ, నా గుండెలో రక్తం బదులు మామిడిపూల గాలి ప్రవహిస్తున్నదని నాకు తెలిసిపోయింది.

వాడ్రేవు చినవీరభద్రుడు

ఖాన్ మార్కెట్ దగ్గర అడుగుపెట్టేటప్పటికి గుప్పుమంటూ మామిడిపూల గాలి. ఆ ఆవరణలో రెండు పెద్ద మామిడిచెట్లు విరగబూసి ఉన్నాయి. ఆ దుకాణాల ఎదురుగా, పార్కు చేసిన కార్ల మధ్య, జనసందోహం మధ్య కొద్దిపాటి ప్రాంగణంలో కామదహనంకోసం కట్టెలు పేరుస్తున్నారు. మహానగరాల్లో కుగ్రామాలు కనిపించే అటువంటి తావులు చూస్తే నాకు స్పృహ తప్పుకుండా ఎలా ఉంటుంది?

అసలు నిన్న ఢిల్లీ నగరమంతా ఒక పుష్పప్రదర్శనలాగా ఉంది. మామూలుగా వీథిచివర ఎవరో ఒక ఫ్లోరిస్టు అమర్చిపెట్టే పూలకొలువు కాదు, కొత్త డిల్లీలో బాటలకిరుపక్కలా, లాన్లలో, చిన్న చిన్న పార్కుల్లో, ఎక్కడ చూడు, లవండర్లు, పేన్సీలు, డాలియాలు, పాపీలు, జినియాలు, నస్టూర్షియం లు, ఫ్లాక్సులు, పింక్ లు. కాని మహారణ్యాల్ని తలపించే కొత్త ఢిల్లీ చెట్లమీద ఇంకా ఫాల్గుణం కూడా పూర్తిగా రాలేదు. ఇంకా అవి మలిహేమంతంలోనే ఉన్నట్టుగా పండుటాకుల్ని వర్షిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ మద్ది చెట్లు.

మహానగరాల్లో రెండు లోకాలుంటాయనేది నాకు చిరకాలం హైదరాబాదులో జీవించినమీదట అనుభవానికొచ్చింది. ఒకటి అందరికీ తెలిసిన జనసందోహపు, జనసమ్మర్దపు నగరం. మరొకటి, ఫలాలకీ, పుష్పాలకీ, చెట్లకీ, పిట్టలకీ, క్రిమికీటకాలకీ చెందిన దేశం.

ఆ అర్జున వృక్షాల శీర్ణపత్ర కోలాహలం మధ్య, రాలిన బూరుగుపూల పరాగపాంసులం. ఏదో కలవరం. ఏదో కలకలం. మనం ఇల్లు మారేటప్పుడు సామానంతా సర్దుకుంటూ ఉంటామే అట్లాంటిదేదో ఒక హడావిడి. మా చిన్నప్పుడు సంక్రాంతి పండగ రావడానికి ఇంకా రెండు మూడు వారాలుందనగా మా అమ్మ ఇంటికి వెల్ల వేయించడంకోసం ఇల్లంతా బూజులు దులిపేది. అరుగులూ, గోడలూ చెక్కించేది. అట్లా ఏదో రాబోతున్న పండగ కోసం నగరం బూజు దులుపుతున్నట్టుగా ఉంది. ఆ హేమంతం, ఆ శిశిరం గతించిపోయినజీవితమన్నట్టుగా ఏదో ఒక packing up.

మహానగరాల్లో రెండు లోకాలుంటాయనేది నాకు చిరకాలం హైదరాబాదులో జీవించినమీదట అనుభవానికొచ్చింది. ఒకటి అందరికీ తెలిసిన జనసందోహపు, జనసమ్మర్దపు నగరం. మరొకటి, ఫలాలకీ, పుష్పాలకీ, చెట్లకీ, పిట్టలకీ, క్రిమికీటకాలకీ చెందిన దేశం. ఈ రెండో నగరంలో సూర్యకాంతి అపారంగా వర్షిస్తుంది. వెన్నెల కాసినప్పుడు పూర్తిగా నీళ్ళు చేరిన జలాశయంలాగా కనిపిస్తుంది. ఎంత కాలుష్యం, పొగ ఆవరించినప్పటికీ, ఒక వానపడగానే ఆకాశం శుభ్రపడి మేఘాలు మధ్యధరా సముద్రగగనాన్ని తలపిస్తాయి.

కొత్త ఢిల్లీ నిజంగానే ఒక అపురూపమైన ఉద్యానవనం, ఉష్ణమండల దేశాల కాననాల్ని తలపించే వైల్డ్ సౌందర్యమేదో ఆ చెట్లలో కనిపిస్తుంది. కొత్త ఢిల్లీ చెట్లమీదా, పక్షులమీదా ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎప్పుడేనా కొన్నాళ్ళు ఢిల్లీలో ఊరికే తిరుగుతూ, ఆ చెట్లనీ, ఆ పిట్టల్నీ పోల్చుకోవాలన్న ఒక కోరిక నాలో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. గిడుగు రాజేశ్వరావు గారనే ఒక సజ్జనుడు తాను రాసిన ఒక పుస్తకానికి నన్ను ముందు మాట రాయమని అడిగాడు. ఆయన ఢిల్లీలో ఎన్నో ఉదయాలు మార్నింగ్ వాక్ చేస్తూ గడిపినవాడు. ఆ పుస్తకంలో ఏ పేజీ తెరిచినా కూడా ఆయన భగవంతుడితో సంభాషణ చేసాడని అర్థమవుతుంది. ఆ మాటే రాసాను నా ముందుమాటలో.

నిన్న ఖాన్ మార్కెటులో ఫకీర్ చంద్ అండ్ సన్స్ లో అట్లాంటి పుస్తకం మరొకటి దొరికింది. Delhi through Seasons (2015). ప్రసిద్ధ రచయిత, అనువాదకుడు, పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ రచన. కుష్వంత్ తన జీవితంలో చివరి సంవత్సరాల్లో ఢిల్లీలో తన చిన్న ఇంటిచుట్టూ చిన్న పూలతోట పెంచుకున్నాడు. దానితో పాటు కొత్తఢిల్లీలో ఎన్నో ఉద్యానవనాల్లోనూ, చారిత్రిక ప్రదేశాల్లోనూ మార్నింగ్ వాక్ చేసినప్పుడో, లేదా తిరుగాడినప్పుడో ఆయా ఋతువుల్లో, వేళల్లో అక్కడ పూసిన పూల గురించీ, వచ్చి వాలిన పక్షుల గురించీ ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేవాడట. అలా ఏళ్ళ తరబడి తన దినచర్యలో భాగంగా రాసిపెట్టుకున్న పరిశీలనల ఆధారంగా రాసిన పుస్తకం అది. అది ఖుష్వంత్ సింగ్ ఈ లోకాని వదిలిపెట్టిన తరువాత ప్రచురితమైన పుస్తకం. అంటే ఒక విధంగా చివరి రచన అని చెప్పాలి.

జీవితమంతా తన చుట్టూ ఉన్న సామాజిక అవ్యవస్థతో పోరాటం చేసిన చలంగారు చివరిరోజుల్లో ‘బుజ్జిగాడు’ రాసినట్టుగా కుష్వంత్ ఈ పుస్తకం రాసాడనుకోవచ్చు.

కుష్వంత్ తన జీవితపు మలిదశలో శిఖ్కు గురువుల ప్రార్థనల్ని అనువాదం చేసాడు. ఉర్దూ ప్రేమ కవుల కవితల్ని కూడా ఇంగ్లిషులోకి అనువాదం చేసాడు. ఆ విధంగా ఆయన ఈ పుస్తకం రాయడానికి పూర్తి యోగ్యత సాధించాడని చెప్పుకోవచ్చు. జీవితమంతా తన చుట్టూ ఉన్న సామాజిక అవ్యవస్థతో పోరాటం చేసిన చలంగారు చివరిరోజుల్లో ‘బుజ్జిగాడు’ రాసినట్టుగా కుష్వంత్ ఈ పుస్తకం రాసాడనుకోవచ్చు.

సంస్కృత కవులు ఋతువర్ణన చేసినట్టుగా, ఉత్తరాది జానపద గీతాల్లో ‘బారామాసి’ ప్రక్రియ ఉంది. పన్నెండు మాసాల్నీ వర్ణించే ఒక సంప్రదాయం. కబీరు, నానక్ వంటి భక్తి కవులు ఆ ప్రక్రియలో పన్నెండు నెలలూ భగద్విభూతినే దర్శిస్తూ గీతాలు రాసారు. మారుతున్న ఋతువుల్లో ఢిల్లీ అనే నెపం మీద, ఖుష్వంత్ సింగ్ కూడా ఒక బారామాసి రాసాడు. జనవరి నుంచి డిసెంబరు దాకా ప్రతి ఒక్క నెలలోనూ ఢిల్లీలో ఏ పూలు పుస్తాయి, ఏ పక్షులు వచ్చి వాలతాయి, ఎండ, వాన, చలి, మంచు ఎలా పరుచుకుంటాయి ఒక నీటిరంగుల చిత్రకారుడిలాగా ఆయన వర్ణించాడు. మధ్యలో కాళిదాసు, భర్తృహరి, అమరు, టాగోర్, మీర్, గాలిబు, కిప్లింగ్ వంటి కవుల కవితావాక్యాలు కూడా. శుద్ధసత్త్వ బసు అనే ఒక చిత్రకారుడు ఈ పుస్తకాన్ని మరొకవైపు నిజంగానే నీటిరంగుల చిత్రాలతో నింపేసాడు. రెండు విధాలుగా కూడా ఈ పుస్తకం ఒక అందమైన రంగుల కొలువు.

ఉదాహరణకి మార్చి గురించి ఇలా రాస్తున్నాడు:

‘ఫిబ్రవరిలో ఢిల్లీ అత్యంత ప్రేమాస్పదంగా ఉంటుందని రాసాను కదా, మార్చి లో అత్యంత సమ్మోహనకరంగా ఉంటుందంటాను. ఎటువైపు చూడు, అంతా ఒక రంగుల జల్లు.. మార్చిలో జన్మమృత్యువులు రెండూ స్పష్టంగా పక్కపక్కనే కనిపిస్తాయి. ఒకవైపు ద్రాక్షతీగలు, మధుమాలతి ప్రతి రోజూ కొత్త చిగుర్లు తొడుగుతూ ఉంటే, మరొకవైపు వేప, ఇప్ప, నేరేడు, రావి, మర్రి చెట్లు తమ ఆకుల్ని రాల్చేస్తూ ఉంటాయి. రాబోయే ఒకటి రెండు వారాల పాటు తోటమాలులు ఆ ఎండుటాకుల్ని ఏరి కుప్పపోసి వాటికి చితిపెడుతూ ఉంటారు. ఆ చితాగ్నులింకా మండుతూ ఉండగానే ఆ చెట్లు కొత్త చివుళ్ళతో పలకరిస్తుంటాయి.

నీ పుస్తకాల్లో దాచుకోడానికి ప్రకృతినుంచి నువ్వేదన్నా చిరు జ్ఞాపిక కోరుకోదలచుకుంటే, ఆ రావి ఆకుల్ని ఏరుకుని నీ పుస్తకాల్లో గట్టిగా అద్దుకుని పెట్టుకో.’

ఒక వైపు మరణిస్తూ, మరొక వైపు పునరుజ్జీవనం పొందే వాటిల్లో రావిచెట్లు, మర్రిచెట్లు సుకోమలమైన పత్రాలతో కనువిందు చేస్తాయి. శ్యామవర్ణంతో, అందమైన వన్నెతో, పట్టువస్త్రాల్లాగా ఆ చివుళ్ళు మిలమిలలాడుతుంటాయి. నీ పుస్తకాల్లో దాచుకోడానికి ప్రకృతినుంచి నువ్వేదన్నా చిరు జ్ఞాపిక కోరుకోదలచుకుంటే, ఆ రావి ఆకుల్ని ఏరుకుని నీ పుస్తకాల్లో గట్టిగా అద్దుకుని పెట్టుకో.’

ఢిల్లీ నా మీద విసిరిన ఆ రంగుల వలలో ఉక్కిరిబిక్కిరి అవుతూనే విమానప్రయాణం పూర్తయ్యేలోపు ఆ పుస్తకం చదివేసాను. రాత్రి పదింటికి హైదరాబాదులో దిగేటప్పటికీ, నా గుండెలో రక్తం బదులు మామిడిపూల గాలి ప్రవహిస్తున్నదని నాకు తెలిసిపోయింది.

పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ప్రభుత్వ ఉన్నతాధికారి.
వారి రచనల నిలయం నా కుటీరం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article