Editorial

Wednesday, January 22, 2025
ఆనందంThe Book of Tea : ఒక కప్పు తేనీరు - ఒక ఆవిరిపూల కొమ్మ...

The Book of Tea : ఒక కప్పు తేనీరు – ఒక ఆవిరిపూల కొమ్మ – వాడ్రేవు చినవీరభద్రుడు

Picture by Ganga Reddy A

డి.టి.సుజుకి జెన్ బౌద్ధం మీద రాసిన గ్రంథాలు చదివాను. బషొ యాత్రానుభవాలు తెలుగు చేసాను. హైకూ ఉద్యానవనాల్లో ఎన్నోసార్లు సంచరించాను. కాని ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఒక కప్పు టీ కాచుకోవడమెలానో, తాగడమెలానో తెలిస్తే తప్ప, బహుశా, ఈ జెన్ దేశంలో పౌరసత్వానికి అర్హత దొరకదని అర్థమయింది.

వాడ్రేవు చినవీరభద్రుడు

అన్ని ఇజాల్నీ చూసిన తరువాత టీయిజం వైపు మనసు మొగ్గుతూ ఉంది. ఒకాకురొ కకుజొ ఇలా రాస్తున్నాడు:

‘సౌందర్యశాస్త్రం అనేది చాలా మామూలు మాట కాబట్టి ‘టీ తత్త్వశాస్త్రం’ కేవలం సౌందర్యశాస్త్రం కాదు. మతాన్నీ, నైతికతనీ ఒక్కచోట చేర్చుకుని మనిషి గురించీ ప్రకృతి గురించీ వెలువరించగల సమగ్ర దృక్పథం అది. పరిశుభ్రతని కోరుకుంటుంది కాబట్టి ‘ఆరోగ్య ఉద్యమం’. ఆడంబరాన్నీ పటాటోపాన్నీ కాక నిరాడంబరతని ప్రోత్సహిస్తుంది కాబట్టి అది ‘ఆర్థికశాస్త్రం’. అసలు ఈ విశ్వప్రమాణాల గురించే మనకొక స్పష్టతనిస్తుంది కనుక దాన్ని’నైతిక క్షేత్రమితి’ అనవచ్చు. అది తన అభిమానులందరికీ సమానంగా అభిరుచిని కలిగిస్తుంది కాబట్టి అసలు ‘ప్రాచ్యదేశాల ప్రజాస్వామిక స్ఫూర్తి’కి అది ప్రతీక అని చెప్పవచ్చు.’

ఇంకా అంటాడు కదా, అందులో కన్ ఫ్యూసియస్ సంయమనం, లావోత్సే జీవితేచ్ఛ, శాక్యముని అలౌకికానందం మూడూ వున్నాయట. కకుజొ రాసిన The Book of Tea (1906)చదివిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రసజ్ఞులు జపాన్ యాత్రీకులుగా మారారు. జెన్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. టాగోర్ లాంటి వాడు జపాన్ చిత్రకళ గురించీ, సౌందర్యదృక్పథం గురించి కకుజొ దగ్గర నేర్చుకుని రమ్మని ఏకంగా ఒక అధ్యయన బృందాన్నే జపాన్ పంపిచాడు. ఆయన పంపిన ఒక శిష్యుడి దగ్గర వాష్ టెక్నిక్ నేర్చుకుని అవనీంద్ర నాథ్ టాగోర్ ఏకంగా నీటిరంగుల చిత్రలేఖనంలో ఏకంగా బెంగాల్ స్కూల్ నే ప్రారంభించాడు.

నువ్వు జీవితంలో ఎంతో దూరం ప్రయాణిస్తేగాని, ఎంతో వ్యథకి లోనయిఉంటేగాని, ఎంతో వృథాచేసుకున్నాననే చింత నిన్ను దహిస్తే గాని, అంత సరళ, సులభమార్గాలవైపు దృష్టి పడదు.

నేను ఈ బృందంలో కొద్దిగా ఆలస్యంగా చేరినవాణ్ణి. టాగోర్ రాసిన జపాన్ యాత్రానుభవాలు ఒకప్పుడు చదవకపోలేదుగానీ, అది మరీ చిన్నవయస్సు. అంత సరళ సత్యాల్ని అర్థం చేసుకోగల వయసుకాదది. నువ్వు జీవితంలో ఎంతో దూరం ప్రయాణిస్తేగాని, ఎంతో వ్యథకి లోనయిఉంటేగాని, ఎంతో వృథాచేసుకున్నాననే చింత నిన్ను దహిస్తే గాని, అంత సరళ, సులభమార్గాలవైపు దృష్టి పడదు.
కాబట్టి ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలి? డి.టి.సుజుకి జెన్ బౌద్ధం మీద రాసిన గ్రంథాలు చదివాను. బషొ యాత్రానుభవాలు తెలుగు చేసాను. హైకూ ఉద్యానవనాల్లో ఎన్నోసార్లు సంచరించాను. కాని ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఒక కప్పు టీ కాచుకోవడమెలానో, తాగడమెలానో తెలిస్తే తప్ప, బహుశా, ఈ జెన్ దేశంలో పౌరసత్వానికి అర్హత దొరకదని అర్థమయింది.

అందుకని ఈ నగరంలో టీ కాచుకోవడం గురించి చెప్పేవారెవరైనా ఉన్నారా అని నెట్ లో శోధిస్తే, టీ విశ్వవిద్యాలయాలు, టీ కోర్సులు, టీ డిప్లొమాలు ఏకంగా ఒక తేయాకు విశ్వమే కనిపించింది! కాని నాకు కావలసింది అక్షరాభ్యాసం. టీ కాచుకోడానికి నీళ్ళు ఎలా మరిగించాలి, ఎన్ని నీళ్ళల్లో ఎంత తేయాకు వెయ్యాలి, కాచిన నీళ్ళు టీ గా మారడానికి ఎంతసేపు ఆగాలి- అంటే దాదాపుగా నీటిరంగుల చిత్రాలు వేయడం నేర్చుకున్నట్టే అన్నమాట. అక్కడా నీటితో సంభాషణే, ఇక్కడా నీటితో సంభాషణే.

Kakuzō Okakura

ఏమైతేనేం, నేనూ గంగారెడ్డీ కలిసి బంజరా హిల్స్ లో ఒక టీ దుకాణాన్ని పట్టుకున్నాం. అక్కడ మేఘాలయ నుంచి వచ్చిన కుర్రవాడొకడున్నాడు. అతడి దగ్గర వందరకాల తేయాకులున్నాయి. అతణ్ణి అడిగాం, చీనాలో, జపాన్ లో టీ ఎట్లా కాచుకుంటారో కాచి చూపించమని. ఆ టీపాత్రలు, కప్పులు, స్పూనులు ప్రతి ఒక్కటీ దగ్గరగా చూసాం. అతడు మా కోరిక మన్నించాడు. మాకోసం టీ కాచిపెట్టాడు. రెండు కప్పులు తేనీరు అందించాడు. రెండవ రౌండులో ఆ తేనీటిలో కొంత తేనె కూడా కలిపాడు.
ఆ తేనీరు తాగిన అర్హత తో కకుజొ రాసిన The Book of Tea తెరిచాను. పట్టుమని ఎనభై పేజీలు కూడా లేని ఆ రచన ఒక కావ్యం, ఒక మానిఫెస్టో. సరళసుందరమైన, ఆత్మను పరిశుభ్రం చెయ్యగల జీవనవిధానంలోకి తెరిచిన కిటికీ. అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతులు, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ. అందులో కళ ఉంది, కవిత్వం ఉంది, పూలున్నాయి, సంగీతం ఉంది, అన్నిటికన్నా మించి నువ్వు నీ ఇంట్లోనే ఉంటూ, ఒక కప్పు టీ తాగుతూ, విముక్తమానవుడిగా ఎట్లా జీవించవచ్చో చెప్పే ఆధ్యాత్మిక తత్త్వశాస్త్రమంతా ఉంది.

కకుజొ పుస్తకం చదవగానే నేను టీయిస్టుగా మారిపోయానని చెప్పుకోడానికి నాకు సంకోచం లేదు. ఎందుకంటే, ఆ పుస్తకంలో అటువంటి జీవితాలగురించి రాసాడాయన!

కొలనులో తామరపూలు కనే కలల్తో తన కలలు కూడా సమ్మిళితం కావాలని ఒక రాత్రంగా ఒక కొలను ఒడ్డున పడుకున్న ఒక జెన్ సాధువు గురించి విన్నారా మీరు? తన తోటలో పూసిన పూలని సంతోషపరచడం కోసం తన ఆస్థాన సంగీతబృందాన్ని తోటలోకి తీసుకువెళ్ళి వాటి కోసం ఒక సంగీత సమారోహం నిర్వహించిన చీనా చక్రవర్తిగురించి విన్నారా? ఒక ఇల్లు అగ్నిప్రమాదంలో చిక్కుకుంటే, ఆ ఇంట్లో విలువైన చిత్రలేఖనం ఒకటి ఉందనీ, అది కూడా తగలబడుతుందేమోనని దాన్ని రక్షించడం కోసం మంటల్లోకి దూకిన సమురాయి గురించి విన్నారా? చామంతుల్తో మాట్లాడటంకోసం తన కంచె దగ్గర బాసింపట్టు వేసుకు కూచున్న తావో యువాన్ మింగ్ గురించి విన్నారా?

శుభ్రం చెయ్యడమంటే ఊడ్చెయ్యడం కాదు, కొంత సౌందర్యాన్ని మిగుల్చుకోవడం కూడా అని.

చాలా విషయాలున్నాయి అందులో. జపాన్ టీ గురువు రికియు ఒక రోజు తన టీ కుటీరం దగ్గర ఉండే బాట శుభ్రం చెయ్యమని తన కొడుక్కి చెప్పాడట. అతడు ఆ దారి శుభ్రంగా తుడిచాడు. కాని ఆ తండ్రికి తృప్తి కలగలేదు. ఆ కొడుకు మళ్ళా రెండు సార్లు తుడిచాడు. కాని నీకు తుడవడమెలానో తెలియలేదన్నాడట తండ్రి. కొడుక్కి అర్థం కాలేదు. అప్పుడు రికియు లేచి ఆ బాట పక్కన ఉన్న ఒక చెట్టుదగ్గర నిలబడి ఆ చెట్టు కొమ్మల్ని గట్టిగా ఊపాడట. ఆకులూ, పూలూ ఆ బాటమీద జలజలా రాలాయట.ఆ తండ్రి కొడుకుతో అన్నాడట. శుభ్రం చెయ్యడమంటే ఊడ్చెయ్యడం కాదు, కొంత సౌందర్యాన్ని మిగుల్చుకోవడం కూడా అని.

కొబొరి ఎన్షియు దగ్గర గొప్ప చిత్రలేఖనాల సేకరణ ఉండేదట. అతడి శిష్యులు ఆ సేకరణ చూసి ‘ఎంత గొప్పగా ఉంది, ఇందులో దేనికదే, దేన్నీ తీసిపారెయ్యలేం,ప్రతి ఒక్కటీ విలువైందే, అదే రికియు దగ్గర చూడండి, ఆ చిత్రాలు వేలమందిలో ఏ ఒకడినో మాత్రమే ఆకర్షిస్తాయి’ అన్నారట. ఆ మాటలు వింటూనే ఆ గురువు సిగ్గుపడిపోయేడట. ‘రికియు ది ఎంత గొప్ప అభిరుచి. అతడు తనకి ఏది ఇష్టమో దాన్నే దగ్గరపెట్టుకున్నాడు. నేనో, వెయ్యి మంది ఇష్టాల్ని ఇక్కడ పోగుచేసుకుని కూచున్నాను’ అన్నాడట.

జపాన్ లోని నరా సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో కొమియొ మహారాణి ప్రసిద్ధురాలు. ఆమె ఒక ప్రభాతాన తన తోటలోకి వెళ్లిందట. అక్కడ నిండుగా పూసిన ఒక పూలమొక్క దగ్గర నిల్చుని ప్రార్థించిందట: ‘ఇంత అందమైన పూలని నా చేతుల్తో తెంపితే అవి మలినపడిపోతాయి. కాబట్టి, ఇదిగో, ఇక్కడ ఇలా విరబూసిన ఈ పూలనిట్లానే గతంలో జీవించిన బుద్ధులకి, ప్రస్తుతం జీవిస్తున్న బుద్ధులకి, రేపు రాబోతున్న బుద్ధులకి అందరికీ సమర్పిస్తున్నాను’ అని!

ఒక కప్పు టీలో ఇంత మహత్యం ఉంది. త్రిపురగారు కప్పు కాఫీని గోధుమరంగు ఊహ అన్నాడు. నేనంటానూ, ఒక కప్పు తేనీరు ఒక ఆవిరిపూల కొమ్మ అని!

The Book of Tea చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article