మిత్రులు పరాయీకరణ గురించి, పీడన గురించి, రాజ్యధిక్కారాల గురించీ, రహస్యోద్యమాల గురించీ రాస్తూ ఉండగా ఈ కవిత, నా భయాల్నీ, నా బౌద్ధిక బానిసత్వాన్నీ ధిక్కరించి పైకి ఉబికింది.
దానికి ఎంతో స్ట్రగుల్ కావలసి వచ్చింది. ఆ నేపథ్యం తెలుపు కవిత – వ్యాసం ఈ రచన.
వాడ్రేవు చినవీరభద్రుడు
నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులెవరూ అడవుల్లో పుట్టిపెరిగినవాళ్ళు కారు. అటవీప్రాంతాల్లో అధికభాగం జీవించినవాళ్ళూ కారు. (కనీసం 1970 కన్నా ముందు. ఆ తర్వాత సంగతి నాకు తెలీదు.) కాబట్టే వాళ్ళకి అడవిగాలి ఏ మాత్రం సోకినా అద్భుతమైన పాటలు పాడకుండా ఉండలేకపోయారు. ఒకనాడు నంద్యాల మీంచి కర్నూలు రైల్లో ప్రయాణం చేస్తూ నల్లమల అందాలు చూసేటప్పటికి ఆకులో ఆకునై పాట పాడిన కృష్ణశాస్త్రి లాగా. కిన్నెరసాని వాగు చూసేటప్పటికి కిన్నెరసాని పాటలు పాడకుండా ఉండలేకపోయిన విశ్వనాథ లాగా.
కాబట్టి ఎనభైల మొదట్లో నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అడివి గురించీ, ఋతువుల గురించీ, పూలకారు గురించీ, కోకిల పాట గురించీ రాస్తూ ఉంటే నా మిత్రులు నన్నొకింత సందేహంగా చూసేవారు. ఆధునిక కవికి ప్రకృతి సౌందర్యం గురించి పాడే అవకాశం గాని, అధికారం గాని ఉండవని వారికి గట్టి నమ్మకం ఉండేది. అందుకని నేను చెట్ల గురించీ, పిట్టల గురించీ రాసినప్పుడు ఇస్మాయిల్ నో, శేషేంద్రనో అనుకరిస్తున్నాననీ, నా సొంతగొంతు నాకింకా దొరకడం లేదనీ నా మీద జాలిపడేవారు.
ఆధునిక కవికి జీవితం నిర్మలంగానూ, సూటిగానూ గోచరించే అనుభవం దొరకదనీ, అతడి లోకం పూర్వకాలంలాగా అఖండం కాదనీ, అది ముక్కలయిపోయిందనీ, వాళ్ళు చెప్తుంటే తెలుసుకున్నాను. నా kingdom of truth, beauty and goodness కూలిపోయిందని కొన్నాళ్ళకు నేను కూడా నమ్మడం మొదలుపెట్టాను. అందుకనే, ‘నిర్వికల్ప సంగీతం’ లో చెక్కుచెదరని లోకంతో పాటు, ముక్కలైపోయిన లోకం కూడా కనిపిస్తుంది.
నాకు తెలిసిందేమిటంటే నాలో నా బుద్ధిని దాటి, నా సొంతగొంతు ఏదో నాలో మార్మోగుతూ నన్ను నిలవనివ్వకపోవడం వల్లనే, నేను నా మిత్రులు కల్పిస్తున్న ఆ న్యూనతాభావాన్ని కూడా దాటి, అట్లాంటి కవితలు రాయగలిగానని.
కాని సూర్యాస్తమయాల గురించీ, ఏటి జాలు గురించీ, వెన్నెల జల్లుగురించీ నేను రాస్తున్నది నా చిన్నప్పణ్ణుంచీ నేను చూస్తూ వచ్చిన సౌందర్యమేననీ, ఆ మాటకొస్తే, ఇస్మాయిల్ కీ,శేషేంద్రకీ అటువంటి మహాసౌందర్యం మధ్య జీవించే అవకాశం చిక్కనేలేదనీ నేను వాళ్ళతో వాదించేవాణ్ణి. కాని వాళ్ళు నన్ను ఆధునిక కవి అని ఎక్కడ అనుకోరో అని ఒకింత దిగులుగా ఉండేది. ఆ భయం నుండీ, మొహమాటం నుండీ బయటపడటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే నాలో నా బుద్ధిని దాటి, నా సొంతగొంతు ఏదో నాలో మార్మోగుతూ నన్ను నిలవనివ్వకపోవడం వల్లనే, నేను నా మిత్రులు కల్పిస్తున్న ఆ న్యూనతాభావాన్ని కూడా దాటి, అట్లాంటి కవితలు రాయగలిగానని.
పాటలు ఇలానే పాడుకోవాలి, ఇలానే ఎగరాలి, కవిత్వం ఇలానే రాయాలనే నిర్బంధాలేవీ లేకపోవడమే వాటి సంతోషానికి కారణమని గ్రహించాను.
ఒకసారి, భాద్రపదమాసపు ఒక అపరాహ్ణం మా ఊరి ఏటి ఒడ్డున ఎక్కడ చూసినా తూనీగలు సంతోషంగా, స్వేచ్ఛగా ఎగురుతూ ఉండిన దృశ్యమొకటి కనిపించింది. పాటలు ఇలానే పాడుకోవాలి, ఇలానే ఎగరాలి, కవిత్వం ఇలానే రాయాలనే నిర్బంధాలేవీ లేకపోవడమే వాటి సంతోషానికి కారణమని గ్రహించాను.
ఇదిగో, ‘జీవించడం ఒక లీల ‘అనే ఈ కవిత అప్పుడు పుట్టిందే. నా మిత్రులు పరాయీకరణ గురించి, పీడన గురించి, రాజ్యధిక్కారాల గురించీ, రహస్యోద్యమాల గురించీ రాస్తూ ఉండగా, ఈ కవిత, నా భయాల్నీ, నా బౌద్ధిక బానిసత్వాన్నీ ధిక్కరించి పైకి ఉబికింది.
ఏమో, ఎవరు చెప్పగలరు? బహుశా వందేళ్ళ తరువాత, నా కవిత్వం మిగిలి ఉంటే, బహుశా అప్పటి పాఠకులు ఈ కవితకే పట్టం కడతారేమో!
జీవించడం ఒక లీల
వానాకాలపు పల్చని నీడల్లో ఎగిరే తూనీగల స్వేచ్ఛా ప్రపంచంలోకి నాకూ ఆహ్వానం వచ్చింది.
హోరుపెడుతూన్న యీ జీవనసాగరం ఎదుట కళ్ళు తిరిగేటట్లు ఇలా ఎంతసేపని చూస్తో?
అర్థరాత్రి పల్చని సెలయేటి అద్దంలో బృహత్తారకల గగనం ప్రతిఫలించే దృశ్యాన్ని ఎంతకాలమయినా చూడగలను.
ఆ పైన, మంచుతెరల వెనక సింగారించుకునే ఉషాకుమారికి నాలుగు దిక్కులూ తెరచి ఆనంద గీతికల్తో స్వాగతిస్తాను.
జీవించడం ఇక్కడ నిత్యకల్యాణం, పచ్చతోరణం.
వెళ్ళిపోతున్న మిత్రులు, బృందాల్లో శ్రుతి కలుపుతున్న కొత్త గళాలు, పసిపాపల కేరింతలు, రాలిపోతున్న తారలు- యీ వెలుగునీడల రసరమ్య రూపకాన్ని యిష్టంగా నేత్రమందిరంలో ఆవిష్కరించుకుంటాను.
దారీ తెన్నూ తెలియకుండా తుపాను ప్రపంచాన్ని వూగిస్తోన్నవేళ తడిసిన చంద్రకాంతాల పరిమళాల్ని నమ్ముకొని ఏ సహృదయ సన్నిధిలోనో కాలం దేశం లేకుండా నిల్చిపోతాను.
ఎక్కడైనా ఎప్పుడైనా నాకు జీవించడం ఒక రహస్యలీల, రసమయ ఖేల.
21-9-1984
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి.