Editorial

Monday, December 23, 2024
విశ్వ భాష‌వారిది 'నోబెల్' స్థాయి కవిత్వం - వాడ్రేవు చినవీరభద్రుడి నివాళి

వారిది ‘నోబెల్’ స్థాయి కవిత్వం – వాడ్రేవు చినవీరభద్రుడి నివాళి

సాధారణంగా వామపక్ష భావజాలం గల కవులు, రచయితలు, మేధావుల నుంచి వచ్చే విమర్శ ప్రశంసలతో పోలిస్తే స్వతంత్రంగా, ఎట్టి రాజకీయాల పరిమితి లేకుండా సౌహర్ద్రంగా సృజన శీలతను భేరీజు వేసి ప్రశంసించే వారి మాటలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. ఆ లెక్కన గద్దర్ కవిత్వంపై  వాడ్రేవు చినవీరభద్రుడి గారి అభిప్రాయం ఎంతో  విశేషమైనది. 

నిన్న గద్దర్ కి వారు ఘనంగా నివాళి అర్పిస్తూ, “ఈ కవి గీతాల్ని కొద్ది ఎడంగా, ఎంతో నిశితంగా, గొప్ప గౌరవంతో పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళలో తాను కూడా ఉన్నాను” అంటూ “తెలుగులో మన సమకాలీన సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందడానికి పూర్తి అర్హత ఉన్న కవిత్వం అంటూ ఎవరిదైనా ఉంటే అది గద్దర్ పాట మాత్రమే” అనడం విశేషం.

అంతేకాదు, ఇన్నేళ్లుగా హైదరాబాదులో ఉంటూ కూడా ఆయన్ని ఒక్కసారి కూడా కలుసుకోలేక పోయినందుకు ఎంతగానో విచారించారు.

గద్దర్ మరణించిన ఈ సమయంలోనే కాదు, దాదాపు మూడేళ్ళ క్రితం వంగపండు గారు కాలం చేసినప్పుడు రాసిన వ్యాసంలో కూడా వారు గద్దర్ కవిత్వం గురించి ఎంతో గొప్పగా ప్రశంసించిన వైనాన్ని  మరోసారి గుర్తు చేసుకోవడం సందర్భోచితం. ఆ వ్యాసంలో వారు ఏమంటారో చూడండి…

…వంగపండు రాసిన ప్రతి పాట మీదా, ఆ మాటకొస్తే గద్దర్ రాసిన ప్రతి పాట మీదా కూడా  చక్కటి విశ్లేషణా, విమర్శా రావాలని కోరుకుంటాను” అంటూ “వారు రాసిన కొన్ని పాటల పల్లవులు విన్నప్పుడు, మహనీయులైన పూర్వ వాగ్గేయకారుల పల్లవులు విన్నప్పటిలానే నిశ్చేష్టుణ్ణవుతూ ఉంటాను” అన్నారు. .

“పాటకి పల్లవి ప్రాణం అని ఊరికే అనలేదు. పల్లవి అంటే ఒక కవి గుండె తెరుచుకునే చప్పుడు. కొన్నిసార్లు అతడి గుండె బద్దలయ్యే చప్పుడు కూడా.” అంటూ ఇలా విశ్లేషిస్తారు. 

‘నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా ‘ అనే పల్లవి త్యాగరాజాత్ములైనవారిని ఎట్లా సంభ్రమపరుస్తుందో….

‘నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’

‘కొండలు పగలేసినం, బండలను పిండినం
మా నెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో…అనే పల్లవులు ఎంత విద్యుత్తును సృష్టిస్తాయో…

‘యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ఓరన్నో లమ్మీ రైలూ
లారీ కారూ బస్సూ మిల్లూ మిషనూ, మోటారు సైకిలు
యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ..’ అనే పాట మొదలుకాగానే నా వళ్ళంతా విద్యున్మయం కాకుండా ఉండలేదు. అయితే, ఆ పల్లవి ఆయనకెట్లా స్ఫురించిందో ఆ ఆల్కెమీనీ మనం వివరించలేకపోవచ్చుగానీ, ఆ పల్లవిని ఆయన నిర్మించిన తీరు నిస్సందేహంగా మనం మరింత మరింత అధ్యయనం చెయ్యవలసిన అంశం.

…బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ లేనంతమంది శక్తిమంతులైన ప్రజాగాయకులు తెలుగు భాషలో మాత్రమే కనవస్తున్నారు. నా మాటమీద అనుమానం ఉన్నవాళ్ళు, protest song గురించిన సమాచారం నెట్ లో శోధించి చూడవచ్చు. తక్కిన నేల కన్నా తెలుగు నేల మరిన్ని పోరాటాల పురిటిగడ్డ అని నేను చెప్పలేనుగానీ, పోరాటాన్ని పాటగా మార్చగలిగే ఒక సౌలభ్యం, ఒక వేగం, ఒక సంప్రదాయం తెలుగు సాహిత్యంలో పుష్కలంగా ఉంది.”

“మనిషి ఒక పాటగా మారే అత్యంత అపురూపమైన సామాజిక సందర్భం మన కళ్ళముందే సంభవిస్తున్నా కూడా వారిని ఒక ప్రజాగాయకుడని పేర్కోడాన్ని మించి మనం అతడికీ, అతడి పాటకీ ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండానే ఇన్నాళ్ళూ గడిపేసాం” అని కూడా బాధ పాడుతారు.

-ఈ కొన్ని పేరాలు అప్పటి వ్యాసంలోని కొంత భాగం. ఇక, తాజాగా వారు రాసిన గద్దర్ నివాళి చదవండి.

గద్దర్ : కళ్ళ ముందు కదిలే విద్యుద్వలయం

హరీన్ చటో, గిరాం మూర్తీ ఇటీవలి మా ఇన్ స్పిరేషన్ అని రాశాడు శ్రీ శ్రీ ఒకసారి. గద్దర్, చెరబండరాజు మా ఇన్స్పిరేషన్ గా ఉన్న కాలం కూడా నాకు ఒకటి ఉండేది.

1980- 1985 మధ్యకాలంలో గద్దర్ నా దృష్టిలో ఒక హీరో. 1981 లో నేను బిఎ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. అప్పుడు సూర్య కళామందిరంలో ఒక సాయంకాలం గద్దర్ బృందం పాడిన పాటలు విన్నాను. కొన్నాళ్లపాటు ఆ పాటలు గుర్తొస్తే చాలు ఒక విద్యుద్వలయం కళ్ళ ముందు కదులుతూ ఉండేది.

నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో ఆయన పాటలు పాడుకోవడం మమ్మల్ని మేము ఛార్జ్ చేసుకుంటూ ఉండే ప్రక్రియలో భాగంగా ఉండేది. మహేష్, సుబ్బూ, వసీరా, గోపీచంద్, ఎర్రా ప్రగడ- మేమంతా కలిసి కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు గద్దర్ పాట గుర్తు చేశేవారు. అంతే, ఆ వాతావరణం మొత్తం మారిపోయేది. అప్పట్లోనే రంగుల కల సినిమా కూడా వచ్చింది. అందులోని ‘మదన సుందరి’ పాట వసీరా పాడుతున్నప్పుడల్లా మహేష్ చెప్పలేనంత భావోద్వేగానికి లోనవుతూ ఉండేవాడు.

పాటలు ప్రవహించిన కాలం

ఆ కాలంలో మా పల్లెల్లో రాడికల్స్ ప్రవేశించారు. పీపుల్స్ వార్ ప్రభంజనాలు మా అడవుల్ని అతలాకుతలం చేస్తూ ఉండేవి. ఒక గిరిజన గ్రామానికి గ్రామ కరణంగా మా నాన్నగారు ఆ ఆటుపోట్లలో విపరీతంగా నలిగిపోతూ ఉండేవారు. మరొకవైపు నేను రాజమండ్రిలో మిత్రులతో కలిసి గద్దర్ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఇంత విరోధాభాసతో కూడుకున్న కాలం నా జీవితంలో మరొకటి లేదు.

ఆ రోజుల్లో కాకినాడలో ఒక ప్రభుత్వ అధికారి దగ్గర గద్దర్ పాటల క్యాసెట్ ఒకటి నాకు కనబడింది. ఒక్కసారి విని ఇస్తామంటే ఆయన అనేక షరతులు పెట్టి దాన్ని నాకు ఇచ్చాడు. ఒక పెన్నిధి దొరికినట్టుగా నేను దాన్ని రాజమండ్రి తీసుకువెళ్తే మాలో ఎవరో నాకు తెలియకుండా ఆ కాసెట్ కాపీ చేసుకున్నారు. అలా కాపీ చేసిన క్యాసెట్ విన్న మరొకరు ఎవరో ఆ ప్రభుత్వాధికారితో ‘ఈ మధ్య గద్దర్ పాటలు విన్నాను’ అని చెప్తే ఆ అధికారి అది తాను నాకు ఇచ్చిన కాసెట్టే అని గుర్తుపట్టాడు. నామీద అగ్రహోదగ్రుడైపోయాడు. ‘అత్యంత రహస్యంగా దొరికిన ఆ పాటల్ని నువ్విలా పబ్లిక్ చేస్తావనుకోలేదు’ అన్నాడు ఆయన. ఇంతకీ ఆ కేసెట్టు ఆయనకి ఒక పోలీస్ అధికారి నుంచి దొరికిందట. ఆ పోలీస్ అధికారి కూడా ఎన్నో షరతులు పెట్టి ఆయనక కేసెట్ ఇచ్చి ఉంటాడు. ఆ రహస్యం ఎక్కడ బయటపడుతుందో దానివల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అన్న భయమే ఆ అధికారి ఆగ్రహానికి కారణం. ఇదంతా ఇప్పుడు ఎందుకు రాస్తున్నాను అంటే గద్దర్ పాటలు చాప కింద నీరు లాగా సమాజంలో ప్రవహించిన కాలం ఒకటి ఉండేదనీ, ఆ కాలాన్ని నేను కళ్ళతో చూశాను అనీ చెప్పటానికి.

1997లో గద్దర్ పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు హైదరాబాదులో కవులు, రచయితలు పెద్ద ఊరేగింపు తీశారు. ఆ ఊరేగింపులో కలిసి రావలసిందిగా నామాడి శ్రీధర్, వొమ్మి రమేష్ బాబు పిలిస్తే నేను కూడా ఆ ఊరేగింపులో కలిసి నడిచాను. ఆ సాయంకాలం జరిగిన బహిరంగ సభలో దూరంగా ఉండి నేను వక్తల ప్రసంగాలు వింటూ ఉన్నాను. ఈ లోపు అదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు గిరిజన యువకులు నన్ను గుర్తుపట్టి పలకరించి ‘అక్కడ చూడండి ఎవరున్నారో ‘ అని ఒకవైపు చూపించారు. అక్కడ పార్కు చేసి ఉన్న కార్ల పక్కన క్రీనీడలో ఎస్.ఆర్. శంకరన్ గారు! గద్దర్తో కలిసి నడిచి, ఆడి, పాడి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ధిక్కరించిన అసంఖ్యాక ప్రజలతో పాటు ఆ కవి గీతాల్ని కొద్ది ఎడంగా, కానీ ఎంతో నిశితంగా, గొప్ప గౌరవంతో పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనీ, వాళ్లలో నేను కూడా ఉన్నాను అని చెప్పడానికే ఈ  ప్రస్తావన.

‘నోబెల్ పురస్కారం’ అర్హత ఉన్న కవి

నిన్నటి నుంచి గద్దర్ గురించి చాలామంది పెడుతున్న చాలా పోస్టుల్లో ఆయన పాటకి, బాటకి మధ్య వైరుధ్యం ఉందని కొందరు రాస్తూ ఉండడం గమనించాను. గద్దర్ బాట గురించి నాకు తెలియదు. ఆ రాజకీయాలు కూడా నేను అర్థం చేసుకోగలిగే కావు. కాని ఒక సాహిత్యకారుడిగా గద్దర్ పాట గురించి మాత్రం సాధికారికంగా చెప్పగలను. తెలుగులో నోబెల్ పురస్కారం పొందడానికి పూర్తి అర్హత ఉన్న కవిత్వం అంటూ మన సమకాలంలో ఎవరిదైనా ఉంటే అది గద్దర్ పాట మాత్రమే అని నా నమ్మకం.

ఇన్నేళ్లుగా హైదరాబాదులో ఉంటూ కూడా ఆయన్ని ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయాను. ఇక ఆ లోటు ఎప్పటికీ పూడదు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article