Editorial

Saturday, January 11, 2025
కాల‌మ్‌The Brothers Karamasov : నలభయ్యేళ్ళ నా ఎదురుచూపు - వాడ్రేవు చినవీరభద్రుడు

The Brothers Karamasov : నలభయ్యేళ్ళ నా ఎదురుచూపు – వాడ్రేవు చినవీరభద్రుడు

 

డాస్టొవెస్కీ రాసిన Brothers Karamazov  ఇన్నాళ్ళకు తెలుగులో. ‘కరమజోవ్ సోదరులు (సాహితి ప్రచురణలు, 2021). ఇది ఎటువంటి సంఘటన తెలుగులో! ఈ పాటికి వార్తాపత్రికల్లోనూ, అన్నిరకాల సమాచార ప్రసారసాధనాల్లోనూ ఇది పతాకవార్తగా రావలసిన సంఘటన కాదూ! ప్రతిరోజూ ఈ పుస్తకమ్మీద, ఈ అనువాదం మీద టివిలో లైవ్ డిబేట్లు జరుగుతూ ఉండవలసిన విషయం కాదూ! కాని తనకి సంభవిస్తున్న గొప్ప భాగ్యాల్ని గుర్తుపట్టలేని దురదృష్టం తెలుగు జాతిది.

వాడ్రేవు చినవీరభద్రుడు

నేను రాజమండ్రిలో ఉండే రోజుల్లో జనమంచి కామేశ్వరావు గారనే పెద్దాయన ఒకరుండేవారు. జనమంచి వెంకటరామయ్య అనే కవికి సోదరుడు. గాంధేయవాది. ఆయన దగ్గర చాలా పుస్తకాలుండేవి. వాటికోసం అప్పుడప్పుడు ఆయనదగ్గరకు వెళ్తుండేవాణ్ణి. ఒకరోజు మాటల మధ్యలో ఆయన ‘నువ్వు బ్రదర్స్ కరమజోవ్ చదివేవా? ‘ అనడిగారు. లేదన్నాను. ఆ పేరు వినడం కూడా అదే మొదటిసారి. ‘కరమజోవ్ బ్రదర్స్ చదవకుండా సాహిత్యం గురించి ఏమి మాట్లాడతావు? ‘ అన్నాడాయన నిస్పృహగా. ఆ మాట నన్ను బాణం ములికిలాగా గుచ్చుకుంది. ఆ తర్వాత పుస్తకప్రదర్శనలో రాదుగ వారి ప్రచురణ బ్రదర్స్ కరమజోవ్ రెండు సంపుటాలూ కొనుక్కున్నాను. పుస్తకం కొనుక్కుంటూనే మొదటి పేజీ తెరిచాను. ఆ నవలను డాస్టొవెస్కీ తన భార్యకు అంకితమిచ్చిన వాక్యంతో పాటు, యోహాను సువార్తలోని ఒక వాక్యం కూడా కనబడింది.

Verily, verily, I say unto you, еxcept a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.

ఇది నా ఇరవయి ఏళ్ళప్పటి మాట. అప్పటికి నాకు ఇంగ్లీషు పుస్తకాలు నేరుగా చదివేటంత ఇంగ్లిషు రాదు. ఆ రెండు సంపుటాల ఆ నవలను ఎప్పటికి చదవగలనో తెలియదు. కాని ప్రతి సారీ ఆశగా, ఆ పుస్తకాలు అవశ్యమే చదవాలన్నంత కుతూహలంతో తెరిచేవాణ్ణి. ఆ మొదటి పుట దగ్గర, ఆ మొదటి ఉల్లేఖనం దగ్గరే ఆగిపోయేవాణ్ణి. ఎందుకు ఆ సువార్తవాక్యాన్ని డాస్టొవెస్కీ ఆ నవలకు ప్రారంభవాక్యంగా రాసాడు? ఏముంది ఆ నవల్లో? ఎందుకు ఆ పెద్దాయన నేను ఆ నవల చదవకపోతే సాహిత్యం గురించి మాట్లాడి ప్రయోజనం లేదని నిట్టూర్చేడు?

అప్పటికి నేను ఎట్లానో Crime and Punishment పూర్తిగా చదివి ఉన్నాను. అది కూడా ఇట్లానే, బైరాగి ‘రాస్కల్నికావ్ ‘ కవిత నన్ను వదలకుండా వెంటాడుతుంటే, ఆ కవితని అర్థం చేసుకోవడం కోసం ఆ నవల చదివాను. నేను ఇంగ్లీషులో పూర్తిగా చదివిన మొదటి నవల అదే అప్పటికి. ఆ నవల చదవడానికి వారం రోజులు పట్టి ఉంటుంది. ఆ వారంరోజులూ నాకు ఒళ్ళు తెలియని జ్వరం. ఇప్పటికీ ఆ నవలని తలుచుకుంటే ఆ జ్వరమే గుర్తొస్తుంది ముందు.

కాని బ్రదర్స్ కరమజోవ్ అట్లా వెంటనే చదవలేకపోయాను. ఎందరో అనువాదకులు, ఉప్పల లక్ష్మణ రావు, నిడమర్తి ఉమారాజేశ్వరావు, ఆర్వీయార్ వంటి గొప్ప అనువాదకులుండికూడా ఆ నవలను ఎందుకు తెలుగులోకి అనువదించలేదా అని ఎన్నోసార్లు నా పట్లనేనే విసుక్కున్నాను, తపించాను, బాధపడ్డాను. చివరికి ఎలాగైతేనేం, ఆతర్వాత నాలుగైదేళ్ళకు Brothers Karamazov రెండు సంపుటాలూ ఇంగ్లీషులో చదవగలిగాను. ఆమూలాగ్రం, ప్రతి ఒక్క వాక్యం కూడబలుక్కుంటూ చదివాను. అదొక profound experience. రెండు నవలలు, War and Peace, Brothers Karamazov-ఆ రెండు పుస్తకాలూ చదవడం పూర్తయ్యాక నా అనుభూతి ఒకేలా ఉండింది. పెద్ద కొండ ఏదో ఎక్కి దిగినట్టు.

పుస్తకమైతే చదివానుగాని, ఈ నలభయ్యేళ్ళుగా ఆ పుస్తకానికి ఒక తెలుగు అనువాదం వస్తే బాగుండుననే కోరిక నా అంతశ్చైతన్యంలో అట్లానే ఒక ఉండలాగా చుట్టచుట్టుకుపోయినట్టుంది, ఏడెనిమిది వారాల కిందట కుమార్ కూనవరపు, బ్రదర్స్ కరమజోవ్ నవలను తెలుగులోకి అనువదిస్తున్నారనీ, తాము డాస్టొవెస్కీ 200 వ పుట్టినరోజు సందర్భంగా ఆ పుస్తకం విడుదల చేస్తున్నామనీ చెప్పగానే నాకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు.

ఈ పుస్తకం కోసం. నలభయ్యేళ్ళుగా ఎదురు చూస్తున్నాను ఈ పుస్తకం గురించి అన్నాను.

మొన్న సాహితీ ప్రచురణల అధినేత, ఎమెస్కో లక్ష్మిగారికి ఫోన్ చేసి ఆ పుస్తకం వచ్చిందా అంటే ఉందన్నారు. వెంటనే వాళ్ళ ఆఫీసుకి పరుగెత్తేను. ఈ పుస్తకం మీ ఆఫీసుకే పంపించి ఉండేదాన్ని కదా అన్నారు. నేనన్నాను కదా: ‘ఒకవేళ, మీరు ఇక్కడ కాకుండా ఇక్కడికి ఏ పది పదిహేను మైళ్ళ దూరంలోనో ఉండి ఉంటే, అక్కడికి రావడానికి కారూ బస్సూ లేకపోయి ఉంటే, ఈ సాయంకాలం తప్పకుండా నడిచి మీ ఇంటికి వచ్చేసి ఉండేవాణ్ణి, ఈ పుస్తకం కోసం. నలభయ్యేళ్ళుగా ఎదురు చూస్తున్నాను ఈ పుస్తకం గురించి ‘ అన్నాను.

నా ఎదురుచూపు వ్యర్థం కాలేదు. 912 పేజీల బృహద్గ్రంథం. రెండురోజుల్లో చదివేసాను. నా చిన్నప్పుడు చదివేవాణ్ణి అట్లా. పుస్తకం సాయంకాలం తెరిస్తే తెల్లవారేలోపు పూర్తయిపోయేది. ఇన్నాళ్ళూ నాలోపల గూడుకట్టుకున్న ఆ hunger వల్లనో లేదా ఆ పుస్తకం మహిమనో, లేదా అనువాదకురాలు అరుణా ప్రసాద్ కౌశల్యమో చెప్పలేను, రెండురోజులు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే, ఒకటిన్నర రోజు మాత్రమే.

డాస్టొవెస్కీ రాసిన Brothers Karamazov (1880) ఇన్నాళ్ళకు తెలుగులో. ‘కరమజోవ్ సోదరులు (సాహితి ప్రచురణలు, 2021). ఇది ఎటువంటి సంఘటన తెలుగులో! ఈ పాటికి వార్తాపత్రికల్లోనూ, అన్నిరకాల సమాచార ప్రసారసాధనాల్లోనూ ఇది పతాకవార్తగా రావలసిన సంఘటన కాదూ! ప్రతిరోజూ ఈ పుస్తకమ్మీద, ఈ అనువాదం మీద టివిలో లైవ్ డిబేట్లు జరుగుతూ ఉండవలసిన విషయం కాదూ! కాని తనకి సంభవిస్తున్న గొప్ప భాగ్యాల్ని గుర్తుపట్టలేని దురదృష్టం తెలుగు జాతిది.

మనం యూరప్ ని అర్థం చేసుకోవాలనుకుంటే, ఐరోపీయ సమాజానికి మూలధాతువులేమిటో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా చదవవలసిన సాహిత్యం కొంత ఉంది. Western Canon అంటారు దాన్ని. అందులో మరీ ముఖ్యంగా మూడు పుస్తకాలు: సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’, షేక్స్పియర్ రాసిన ‘హేమ్లెట్, ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్’, డాస్టవిస్కీ రాసిన ‘బ్రదర్స్ కరమజోవ్.’ ఈ మూడింటి విషయం ఒకటే, పితృహత్య. అందులోనూ బ్రదర్స్ కరమజోవ్ రచన వెలువడితే తప్ప యూరపియన్ మూలధాతువు ఎందుకంత పితృహననాత్మకంగా ఉందన్నది అర్థం కాలేదు. అందువల్ల ఆ రచన వట్టి నవల కాదు. అందులోంచే ఇరవయ్యవశతాబ్దపు అస్తిత్వవాద దర్శనాలూ, ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రమూ పుట్టుకొచ్చాయి. ఆ నవల చదవకపోతే మనకి కాఫ్కా అర్థం కాడు, సార్త్ర్, కామూ, బెకెట్ లాంటి రచయితలు బోధపడరు. తెలుగులో బైరాగి, బుచ్చిబాబు, మోహన ప్రసాద్, అజంతా, త్రిపురలు అర్థం కారు.

బ్రదర్స్ కరమజోవ్ నవల వట్టి నవల కాదు. అది ఇతిహాసం. ప్రతి జాతికీ తన అన్నదమ్ముల గురించిన ఇతిహాసం కనీసం ఒకటైనా ఉంటుంది. మన సమాజానికి రెండున్నాయి. బ్రదర్స్ కరమజోవ్ రష్యాకి చెందిన అన్నదమ్ముల కథ.

దేవుడంటూ ఒకడు లేకపోతే మనం ఆయన్ని సృష్టించుకోవలసి ఉంటుంది అన్నాడట వోల్టేర్. అది పద్ధెనిమిదో శతాబ్దం నాటి మాట. ‘దేవుడు మరణించాడు. మరణించే ఉంటాడు. ఎందుకంటే మనమే ఆయన్ని చంపేసాం..’ అన్నాడు నీషే. అది పందొమ్మిదో శతాబ్ది చివరిరోజుల్లో మాట. ఈ రెండు మహాప్రకటనలమధ్య కాలంలో ‘బ్రదర్స్ కరమజోవ్’ నవల రూపుదిద్దుకుంది. దేవుడున్నాడా లేడా? లేకపోతే ఆయన్ని కనుగొందాం అనుకునే ఒక అన్వేషణకీ, తమని పుట్టించి తమ కష్టనష్టాల్ని పట్టించుకోకుండా వదిలేసిన తండ్రిలాంటి దేవుణ్ణి హత్యచేయాలనుకునే హననాభిలాషకీ మధ్య నలుగులాట ఆ నవల.

బ్రదర్స్ కరమజోవ్ నవల వట్టి నవల కాదు. అది ఇతిహాసం. ప్రతి జాతికీ తన అన్నదమ్ముల గురించిన ఇతిహాసం కనీసం ఒకటైనా ఉంటుంది. మన సమాజానికి రెండున్నాయి: రాముడూ, అతడి తమ్ముళ్ళ కథ, యుధిష్టిరుడూ, అతడి తమ్ముళ్ళ కథ. మధ్యాసియాకి కూడా రెండున్నాయి: కెయిన్, అతడి సోదరుడు ఏబెల్ కథ, జోసెఫ్, అతడి సోదరుల కథ. బ్రదర్స్ కరమజోవ్ రష్యాకి చెందిన అన్నదమ్ముల కథ. ద్మీత్రీ కరమజోవ్, అతడి తమ్ముళ్ళ కథ అది. ఆ అన్నదమ్ముళ్ళల్లో ముగ్గురు తమ తండ్రిని హత్య చేసారు. ఒకడు నిజంగానే హత్యచేసాడు. మరొకడు ఆ హత్యచేయాలనుకున్నాడు. నిజంగా హత్యకు పాల్పడకపోయినా శిక్షనుంచి తప్పించుకోలేకపోయాడు. మూడవ వాడు ఆ హత్యకి తన మౌనసమర్థన వుందన్న నిజం అర్థం కాగానే మతిచలించి పిచ్చివాడైపోయాడు. ఇక నాల్గవవాడు, అతడే కథానాయకుడు, ఈ పితృహంతక నిష్టుర సమాజాన్ని నిలబెట్టే మార్గం, ఉపాధి, ఊనిక ఏదైనా ఉందా అని వెతుకుతూ ఉన్నాడు.

140 ఏళ్ళ కింద వెలువడిన ఈ నవలని ఇప్పుడు తెలుగులోకి తీసుకువచ్చినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మూడు ప్రయోజనాలున్నాయి. మొదటిది, సర్వశ్రేష్ట సాహిత్య కృతి (classic) అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది.

140 ఏళ్ళ కింద వెలువడిన ఈ నవలని ఇప్పుడు తెలుగులోకి తీసుకువచ్చినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మూడు ప్రయోజనాలున్నాయి. మొదటిది, సర్వశ్రేష్ట సాహిత్య కృతి (classic) అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అటువంటి రచన చదవడంలోని సాహిత్యసంతోషం ఎటువంటిదో అనుభవంలోకి వస్తుంది. రెండవది, రచయితలు కావాలనుకున్నవాళ్ళు, రచయితలుగా సాధన చేస్తున్నవాళ్ళు ఒక రచన ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు. వేళ్ళతో కాక, కంపిస్తున్న హృదయంతో వాక్యాలు రాయడమెలానో తెలుసుకుంటారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ప్రయోజనం మరొకటుంది.

డాస్టొవెస్కీ ఈ నవల రాస్తున్నప్పుడు పందొమ్మిదో శతాబ్ది రష్యాలో రెండవ అలెగ్జాండర్ చక్రవర్తి కొన్ని ముఖ్యమైన పాలనాసంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పటిదాకా రష్యాలో అమల్లో ఉన్న అర్థబానిసవ్యవస్థ (serfdom) ని ఆయన రద్దు చేసాడు. (అమెరికాలో బానిస వ్యవస్థని అబ్రహాం లింకన్ రద్దు చేసింది ఆ తర్వాత మరొక రెండేళ్ళకి). అది రష్యన్ సమాజంలో ఒక మహత్తర సంఘటన. దాంతోపాటు ఎన్నో ఉదారభావాలూ, సంస్కరణభావాలూ, సైన్సు, హేతువాదం, నిరీశ్వరవాదం కూడా రష్యన్ సమాజంలో నిలదొక్కుకోవడం మొదలయ్యింది. దాన్ని రష్యన్ సమాజం ‘పాశ్చాత్యీకరణ’గా గుర్తించింది. దాన్ని బలపరిచేవాళ్ళని Westerners అన్నారు. దానికి ప్రతిగా, పాశ్చాత్యప్రభావంలేని పూర్వపు రష్యా మళ్లా రావాలనికోరుకునే మరొక వర్గం ఏర్పడ్డారు. వాళ్ళని Slavophiles అంటారు. (అదే సమయంలో భారతదేశంలో కూడా anglicists, oreintalists అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయని మనకు తెలుసు). ఆ రెండు వర్గాల మధ్యా తాను ఎటువంటి రష్యాని ఎంచుకోవాలని ప్రతి ఒక్క రష్యన్ రచయితా తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకి తుర్జెనీవ్ ఒకలాంటి జవాబు సాధించుకుంటే, టాల్ స్టాయి మరొక సమాధానం వెతుక్కున్నాడు. తన కాలాన్నీ, తన దేశాన్నీ కుదిపివేస్తున్న ఆ ప్రశ్నకి జవాబుగా డాస్టవిస్కీ ఒకటి కాదు, రెండు కాదు, అయిదు నవలలు రాసాడు. ఆ అయిదింటినీ కలిపి డాస్టొవిస్కీ రాసిన అయిదంకాల విషాదాంతనాటకంగానూ, Notes from Underground నుంచి ఆ నాటకానికి ప్రస్తావనగానూ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఆ అయిదు అంకాల్లో బ్రదర్స్ కరమజోవ్ చివరి అంకం, అత్యంత నాటకీయమైన అంకం.

కరమజోవ్ బ్రదర్స్ నవల మీద ఎంతో విస్తారంగా రాసిన ఏ విమర్శకుడు కూడా ఈ వాక్యాల్ని ఈ నవలకు ఎలా అనువర్తిపచేసుకోవచ్చో చెప్పలేదు. ఇందులో భూమిలో పడి మరణించిన ఆ గోధుమ గింజ ఎవరు?

ఇంతకీ ఈ నవల్లో డాస్టవిస్కీ రాబట్టిన సమాధానం ఏమిటి? అతడు పూర్తిగా Westerner అయి ఉంటే, ఇవాన్ కరమజోవ్ కథానాయకుడు అయిఉండేవాడు. కాని ఆలెక్సీ కరమజోవ్ ని కథానాయకుడిగా ప్రతిపాదిస్తున్నాడు కాబట్టి, డాస్టవిస్కీని Slavophile అందామా? అనలేం. నిజానికి బ్రదర్స్ కరమజోవ్ రెండు భాగాల నవల. మొదటి భాగం మనం చదువుతున్నది. రెండవభాగం డాస్టవిస్కీ రాయాలని సంకల్పించి రాయకుండానే మరణించింది. ఆ రెండవభాగం కూడా పూర్తయిఉంటే తప్ప ఆయన ఎవరివైపు నిలబడ్డాడో మనకి పూర్తిగా తెలిసిఉండే అవకాశం లేదు.

సరే, ఇన్నాళ్ళకు నవల మళ్ళా తెలుగులో చదివాను. తెలుగులో చదివాను కాబట్టి, ఈ నవలని ఇదే మొదటిసారి చదవడం అని కూడా చెప్పవచ్చు ( తాను వైజ్ఞానిక విషయాల్ని ఇంగ్లీషులో బాగా అర్థం చేసుకుంటాననీ, సాల్ బెల్లోని కన్నడంలో మాత్రమే ఆస్వాదించగలననీ భైరప్ప ఒకసారి అన్నాడు). ఇప్పుడు మళ్ళా మొదటి వాక్యం దగ్గరికి వద్దాం:

‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.’, యోహాను 12:24

కరమజోవ్ బ్రదర్స్ నవల మీద ఎంతో విస్తారంగా రాసిన ఏ విమర్శకుడు కూడా ఈ వాక్యాల్ని ఈ నవలకు ఎలా అనువర్తిపచేసుకోవచ్చో చెప్పలేదు. ఇందులో భూమిలో పడి మరణించిన ఆ గోధుమ గింజ ఎవరు? హత్యకు గురైన కరమజోవ్ కాదనేది నిస్సందేహమే. అతణ్ణి హత్యచేసిన వాడూ కాడూ, హత్యానేరానికి శిక్షకు గురైనవాడూ కాడు. కథానాయకుడు అల్యోష అందామా? అస్సలు కాదు. మరెవరు?

(ఇంకా ఉంది)

ఈలోగా పుస్తకం చదవాలనుకున్నవాళ్ళు సాహితి ప్రచురణలు, 0866-2436642, 98499 92890 కి ఫోన్ చెయ్యవచ్చు. వెల రు. 600/-

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article