Editorial

Saturday, January 11, 2025
కాల‌మ్‌The Brothers Karamasov : గోధుమగింజలాగా నేలరాలడం – వాడ్రేవు చినవీరభద్రుడు

The Brothers Karamasov : గోధుమగింజలాగా నేలరాలడం – వాడ్రేవు చినవీరభద్రుడు

‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.’, యోహాను 12:24

వాడ్రేవు చినవీరభద్రుడు

గోధుమ కంకి భూమ్మీద ఒంటరిగా ఉంటుంది, కాని నేలరాలినప్పుడు మాత్రం విస్తారంగా ఫలిస్తుందనేమాట ఈ నవలలో మనకి ఫాదర్ జోషిమా నోటివెంట వినిపిస్తుంది. ఆయన తనకీ తన రహస్య అతిథికీ మధ్య జరిగిన సంభాషణలో భాగంగా తాను సువార్త లోంచి ఆ వాక్యాన్ని ఎత్తివినిపించానని ఫాదర్ జోషిమా చెప్తాడు.

బ్రదర్స్ కరమజోవ్ నవలలో ఫాదర్ జోషిమా అత్యంత ఆదర్శపాత్ర. పాశ్చాత్యీకరణ చెందని, సెక్యులరీకరణ చెందని, పీటర్ చక్రవర్తి సంస్కరణలకన్నా పూర్వపు రష్యాకి అతడు ప్రతినిధి. రష్యన్ జీవగడ్డకీ, నిరాడంబర, నిష్కల్మష రైతు స్వభావానికీ ఆయన ఒక చిహ్నం. నవల్లోని కథానాయకుడు అల్యోష వ్యక్తిత్వం మీద ఫాదర్ జోషిమా ప్రభావం అపారం. కాని ఈ కారణాలన్నిటివల్లా ఆ గోధుమగింజ ద్వారా రచయిత ఫాదర్ జోషిమా ని ఉద్దేశిస్తున్నాడని చెప్పలేం. ఎందుకంటే అది మరీ వాచ్యంగా చెప్పడమే అవుతుంది. తాను ఒక నవల కాకుండా ఒక నీతికథ రాయాలనుకుంటే తప్ప డాస్టవిస్కీ తన కథాసారాంశాన్ని అంత వాచ్యంగా చెప్తాడనుకోను.
మరి ఇంకెవరై ఉండవచ్చు?

డాస్టవిస్కీ పండితులుగాని, బ్రదర్స్ కరమజోవ్ విమర్శకులు గాని ఇంతదాకా పట్టించుకోని అత్యంత ముఖ్యమైన అంశం ఒకటుంది. అదేమంటే, ఆ నవల్లో పిల్లల పాత్ర. అసలు పిల్లలకోసం తన కన్నీరు ప్రవహింపచెయ్యడం కోసమే డాస్టవెస్కీ ఈ నవల రాసాడా అనిపిస్తుంది.

డాస్టవిస్కీ పండితులుగాని, బ్రదర్స్ కరమజోవ్ విమర్శకులు గాని ఇంతదాకా పట్టించుకోని అత్యంత ముఖ్యమైన అంశం ఒకటుంది. అదేమంటే, ఆ నవల్లో పిల్లల పాత్ర. అసలు పిల్లలకోసం తన కన్నీరు ప్రవహింపచెయ్యడం కోసమే డాస్టవెస్కీ ఈ నవల రాసాడా అనిపిస్తుంది. అతడు ప్రతి పాత్రనీ ఆ పాత్ర బాల్యంలోకి ప్రయాణించి మరీ చూసాడు. ఫ్యోదోర్ కరమజోవ్ ని హత్య చేసిన అతడి అక్రమసంతానం స్మెర్ద్యకోవ్ పుట్టుక చూడండి (3:2). అంత దుర్భరంగా, దీనంగా, విషాదభరితంగా పుట్టినవాడు తన తండ్రిని హత్య చేయకుండా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. ఎప్పుడు అవకాశం దొరికినా తన తండ్రిని హత్య చేస్తానని ఎక్కడపడితే అక్కడ ప్రకటిస్తూ వచ్చిన ద్మీత్రీ కరమజోవ్ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు కాళ్ళకి చెప్పులూ, వంటిమీద కోటూ లేకుండా పెరట్లో పరుగెత్తే దృశ్యం డాస్టవెస్కీ మరవలేడు, ద్మీత్రీ గురించి వాదించిన డిఫెన్సు కౌన్సెల్ సరే, ప్రాసిక్యూటరు కూడా మరవలేడు (పే.829). ఇక ఇవాన్ కరమజోవ్ అయితే సరే సరి. తన సమకాలిక రష్యా పిల్లలపట్ల ఎంత క్రూరత్వాన్ని, అమానుషత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నదో అతడు ఉదాహరణ వెనక ఉదాహరణ ఇస్తూ పోగలడు (5:4). ( ఆ ఉదాహరణలన్నీ, చివరికి తమ చిన్నారిపిల్లతో మలం తినిపించి ఆమె ముఖానికి మలం పులిమిన తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కటీ యథార్థ సంఘటనేనని డాస్టవిస్కీ తన సంపాదకుడికి ఒక ఉత్తరంలో రాసాడు కూడా).

ఇవాన్ కరమజోవ్ వినిపించే ఆ హృదయవిదారకగాథ చదివి నిభాయించుకోవడం కష్టం. ఇక కథానాయకుడు ఆల్యోష యేసుతరహా వదనంతో ఒక పసిబాలుడిలానే నవల పొడుగునా మనకి కనిపిస్తాడు. అలాగని అల్యోషని ఆ గోధుమగింజగా భావిద్దామా? ఉహు. అల్యోష చేసిన త్యాగమేమీ లేదు కథలో.
ఇక్కడే మనం చూడవలసింది అందరికన్నా ముఖ్యమైన పాత్ర, నవల్లో చివరి అధ్యాయాల్లో ప్రముఖంగా మనముందు ఆవిష్కృతమయ్యే పాత్ర ఇల్యూషని. కెప్టెన్ స్నెగిర్వోవ్ గారి పుత్రుడు ఇల్యూష నవల్లో మొదట చాలా అప్రధానంగా, అసంగతంగా ప్రవేశించి చివరికి పతాకసన్నివేశానికి వచ్చేటప్పటికి అత్యంత కీలకమైన పాత్రగా మారిపోతాడు. ఆ పిల్లవాడి తండ్రి స్నెగిర్వోవ్ ఏదో కారణం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతడిది చాలా బీద కుటుంబం. రోగిష్టి భార్య, కూతురు. పూట గడవటం కష్టం. కాని అతడి గురించి తన తోటిపిల్లలు చెడ్డగా మాట్లాడుతుంటే అతడి కొడుకు ఇల్యూష విని భరించలేడు. ఆ పిల్లలమీద తిరగబడతాడు. ఒకరోజు సారాయి అంగడిదగ్గర ద్మీత్రీ కరమజోవ్ తన తండ్రిని అవమానించిన దృశ్యాన్ని చూసి తల్లడిల్లి, ఆ ద్మీత్రీ సోదరుడైన అల్యోషని కసితీరా కొరికేస్తాడు. తన తండ్రికి జరుగుతున్న అవమానానికి ప్రతీకారం తీర్చుకోలేక, ఎలా తీర్చుకోవాలో తెలియక, నెమ్మదిగా తన తోటిపిల్లలనుంచి దూరంగా జరిగిపోతాడు. చివరికి జ్వరపడతాడు. మరణిస్తాడు.

బ్రదర్స్ కరమజోవ్ నవలలో ఈ కథని డాస్టవెస్కి ఎందుకు చొప్పించాడు అన్నది విమర్శకులు పెద్దగా పట్టించుకోని అంశం. కాని నా వరకూ ఇది కథలో చాలా కీలకమైన అంశం.

బ్రదర్స్ కరమజోవ్ నవలలో ఈ కథని డాస్టవెస్కి ఎందుకు చొప్పించాడు అన్నది విమర్శకులు పెద్దగా పట్టించుకోని అంశం. కాని నా వరకూ ఇది కథలో చాలా కీలకమైన అంశం. ఇక్కడ డాస్టవిస్కీ రెండు కుటుంబాల్ని, ముఖ్యంగా రెండు తరహాల తండ్రీ-కొడుకుల్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూపిస్తున్నాడు. జీవితాన్ని నిరర్థకం చేసుకోవడంలో ఫ్యొదోర్ కరమజోవ్ కీ, స్నెగిర్యోవ్ కీ మధ్య పెద్దగా తేడా లేదు. ఇద్దరూ కూడా తమ పిల్లలకి బంగారు లోకాన్ని అందివ్వలేకపోయినవాళ్ళే. కాని కరమజోవ్ కొడుకులు తమ తండ్రిని క్షమించలేకపోయారు. అందులో ద్మీత్రీ బాహాటంగానే తన తండ్రిని తిడుతూనే ఉన్నాడు. స్మెర్ద్యకోవ్ రహస్యంగా తన తండ్రిని చంపేసాడు. ఆ హత్యకి ఇవాన్ మౌన సమర్థన లేకపోలేదు.

ఇక అత్యంత సాధువర్తనుడూ, కథానాయకుడూ అయిన అల్యోషా కూడా జరుగుతున్న సంఘటనల పట్ల సాక్షిగా నిలబడ్డాడే తప్ప, ఎటువంటి క్రియాశీలక పాత్రనీ పోషించలేదు. కాని ఇల్యూష అలా కాదు. అతడు తన తండ్రి పొందుతున్న అవమానాలకి తన తండ్రి ఎంత వరకు బాధ్యుడు అని ఆలోచించలేదు. అసలు అతడు తన తండ్రి పట్ల ఎటువంటి తీర్పుకీ పాల్పడలేదు. వయసులోగాని, శారీరికంగా గాని, ఆర్థికంగా గాని అతడు తన తండ్రి అనుభవిస్తున్న వేదనని తొలగించడానికి ఏ విధంగానూ శక్తుడు కాడు. కాని అతడు తన యావచ్ఛక్తి, మనసు, ప్రాణాలు ఒడ్డిమరీ తన తండ్రి గౌరవం మీద జరిగే దాడికి ఎదురు నిలుస్తూవచ్చాడు.
కాబట్టి అతడే ఆ గోధుమ గింజ అని చెప్పవచ్చు.

అయితే ఒక ప్రశ్న తలెత్తవచ్చు. గోధుమకంకి పండి పరిణతి చెంది భూమ్మీద పడ్డప్పుడు కదా విస్తారంగా ఫలించేది, ఒక పసిప్రాణంలో పండిన గోధుమ కంకిని ఎట్లా చూడగలం అని. కాని కావ్యధ్వని ఇక్కడే మహత్తరంగా ఉంది. అదేమంటే, క్రీస్తు ఒకచోట అన్నాడు కదా:

Truly I tell you, unless you change and become like little children, you will never enter the kingdom of heaven. Therefore, whoever takes the lowly position of this child is the greatest in the kingdom of heaven. And whoever welcomes one such child in my name welcomes me.

అంటే మామూలు జీవితంలో పిల్లలు దుర్బలురు. కాని ఆధ్యాత్మిక జీవితంలో, స్వర్గద్వారం దగ్గర, ఈశ్వరసన్నిధానంలో పిల్లలు అత్యంత పరిణతులు. unless you change and become like little children – ఈ మాట గమనించాలి. ( ఈ వాక్యం వైపు నా దృష్టి తిప్పినవారు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. వారికి అందుకు జీవితాంతం ఋణపడి ఉంటాను).

అంతే కాదు, అంతకుమించిన రసధ్వని మరింత సూక్ష్మంగా ఉంది. యేసు ఎందుకు శిలువమోసాడు? తన తండ్రికోసమే కదా. యోహాను సువార్తలో గోధుమ కంకి గురించి క్రీస్తు మాట్లాడిన మాటలు అందరికన్నా ముందు క్రీస్తుకే వర్తిస్తాయి. తాను తలచుకుంటే, లేదా తన తండ్రి తలచుకుంటే, క్రీస్తు శిలువమోయవలసిన అవసరం ఉండేది కాదు. కాని దైవకుమారుడయి ఉండికూడా ఒక దుర్బలమానవుడిగా క్రీస్తు శిలువను భుజానికెత్తుకున్నాడు. దీన్ని kenosis అంటారు. అంటే తన దైవత్వాన్ని కూడా పక్కనపెట్టి పూర్తి పార్థివానుభవానికి లోనవడం. తనని తాను శూన్యం చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే తనని తాను త్యజించుకోవడం. గోధుమగింజలాగా నేలరాలడం. ‘న కర్మయా, న ప్రజయా, ధనేన, త్యాగేనైకే అమృతత్వమానశుః’ ( కర్మలవల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనంవల్ల కాదు, త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుంది) అంది ఉపనిషత్తు.

కాబట్టి-Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.

కరమజోవ్ సోదరులు చివరి పేజీలో ఈ వాక్యాలు చూడండి:

‘..మరి మనని ఈ మంచి దయగల భావంతో ఒక్కటి చేసినదెవరు? మంచివాడు, దయగల ఇల్యూష కాక మరెవరు? అతను మనకి ఎప్పటికీ ప్రియమైనవాడే. అతణ్ణి మనం ఎప్పటికీ మరవొద్దు. మన గుండెల్లో అతని జ్ఞాపకం ఎప్పటికీ నిలిచి ఉండాలి. ‘

‘ఔను, ఎప్పటికీ, ఎప్పటికీ!’ పిల్లలంతా ముక్తకంఠంతో అరిచారు.

‘మనం అతని మొహాన్నీ, అతని బట్టలనూ, అతని పేద చిన్న బూట్లనూ, అతని శవపేటికనూ,పాపం అతని పేదతండ్రినీ మొత్తం బడినెదిరించి అతను ధైర్యంగా తన తండ్రికోసం నిలబడ్డ విధానాన్నీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం.’

…. ‘చనిపోయిన పిల్లాడి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచి ఉండాలి.’ అల్యోష భావుకంగా అన్నాడు.

‘ఎప్పటికీ ‘ పిల్లలంతా ముక్తకంఠంతో పలికారు.

‘కరమజోవ్, మతంలో చెప్పినట్టు మనమంతా చనిపోయాక మళ్ళీ పైకి లేచి ఒకరినొకరు చూసుకుంటామా? అది నిజమేనా? ఇల్యూష కూడానా?’ అడిగాడు కొల్యా.

‘తప్పకుండా మనం లేస్తాం. ఒకరినొకరు చూసుకుని, జరిగినవన్నీ ఆనందంగా ఒకరికొకరు చెప్పుకుంటాం’ అల్యోష జవాబిచ్చాడు సగం నవ్వుతూ, సగం ఉత్సాహంగా. ‘ (పే.911-912)

కాబట్టి-Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.

“బ్రదర్స్ కరమజోవ్ నవల వట్టి నవల కాదు. అది ఇతిహాసం” అంటూ వాడ్రేవు చినవీరభాద్రుడు రాస్తున్న వ్యాస పరంపరలో పైభాగం రెండవది. తొలిభాగం “నలభయ్యేళ్ళ ఎదురు” చూపు ఈ లింక్ ని క్లిక్ చేసి చదవగలరు. తెలుగులో వచ్చిన ఈ పుస్తకం చదవాలనుకున్నవాళ్ళు సాహితి ప్రచురణలు, 0866-2436642, 98499 92890 కి ఫోన్ చెయ్యవచ్చు. వెల రు. 600/-

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article