Editorial

Wednesday, January 22, 2025
ప్రేమ‌ఇలాంటి మనుషులు కావాలి : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

ఇలాంటి మనుషులు కావాలి : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

మహూవా మొయిత్రలు, నూపుర్ శర్మలు కాదు, ఈ దేశానికి మరింతమంది గీతాంజలి శ్రీలు కావాలి

వాడ్రేవు చినవీరభద్రుడు

మహువా మొయిత్ర పార్లమెంటు సభ్యురాలు. గణితంలోనూ, ఆర్థికశాస్త్రంలోనూ అత్యున్నతవిద్యనభ్యసించింది. స్కాండినేవియన్ విద్యావ్యవస్థను ఎంతో దగ్గరగా పరిశీలించింది. కానీ ఇవేవీ ఆమెకి సంస్కారాన్ని నేర్పలేదు. ఈ మధ్య శివలింగం గురించిన వివాదంలో ఆమె తన హీనమైన అభిరుచుని చాటుకుంటూ ఒక అసభ్యకరమైన కార్టూన్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.

నూపుర్ శర్మ కూడా నిరక్షరాస్యురాలు కాదు. ఆర్థికశాస్త్రంలో ఉన్నతవిద్యతో పాటు న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించింది. ఆమెకి రాజ్యాంగం గురించీ, రాజ్యాంగ విలువల గురించీ, ఏ జాతీయోద్యమ స్ఫూర్తితో రాజ్యాంగం రూపొందిందో తెలియకుండా ఉంటుందని ఎట్లా అనుకోగలం? కాని ఆ చదువేదీ ఆమె సంస్కారహీనత్వాన్ని దాచలేకపోయింది. ప్రవక్త మహమ్మద్ పైన చిల్లర వ్యాఖ్యలు చేసి తన సొంత పార్టీతోటే ‘చిల్లర గొంతు’ అనిపించుకుంది.

దేశవిదేశాల్లో ఉన్నత విద్యని అభ్యసించి, జీవితం, సమాజం తమకి అందించిన ఉన్నతస్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు రాజకీయనాయకులూ సంస్కారశూన్యులుగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? రాజకీయ ప్రయోజనాలు. తాము ఉన్న స్థానం నుంచి రాజకీయంగా మరింత ఉన్నతస్థానానికి ఎగబాకాలన్న ఆతృత.

నూటయాభై ఏళ్ళ కిందట ఇంగ్లిషు వాళ్ళు ఈ దేశంలో ఆధునిక విద్యని ప్రవేశపెట్టినప్పుడు భారతీయులు ఆ విద్యద్వారా ప్రపంచాన్ని అవగాహన చేసుకుంటారనీ, సైన్సు, ఆధునిక రాజనీతి నేర్చుకుంటారని, తాము నేర్చుకున్నదాన్ని తిరిగి తమ దేశభాషల్లో తమ ప్రజలకి అందచేస్తారనీ భావించారు. కాని అలా చదువుకోవడం మొదలుపెట్టగానే అప్పటిదాకా భారతీయులుగా ఉన్నవాళ్ళు హిందువులుగా, ముస్లిములుగా విడిపోయారు. ఇండియన్ సివిల్ సర్వీసులో మరిన్ని సీట్లకోసం, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మరింత చోటుకోసం ఒకరితో ఒకరు కలహించుకోవడం మొదలుపెట్టి చివరికి ఈ దేశాన్ని రెండు దేశాలుగా, మూడు ముక్కలుగా చీల్చేసారు. ఆ పుండు ఇప్పటికీ చల్లారలేదు.

ఈ ఉన్నత విద్యావంతులు, ఈ అధికార ప్రతినిధులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా విషం కక్కుతూ, విద్వేషం రగిలిస్తూ, మనుషుల మధ్య కొత్త సరిహద్దు రేఖలు గీస్తూ ఉండగా, మరొక వైపు ఇద్దరు మహిళలు ఎంతో ఓర్పుగా, ఓపిగ్గా, ప్రేమతో, ఆవేదనతో, కన్నీళ్ళతో, తమ కన్నీళ్ళను ఆపుకోడానికి నవ్వుతో, ఆ గీతాల్ని చెరుపుకుంటూ వస్తున్నారు.

గడచిన చరిత్రనుంచి ఏమీ నేర్చుకోకపోగా, ఈ ఉన్నత విద్యావంతులు, ఈ అధికార ప్రతినిధులు మరింత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా టెలివిజన్ ఛానెళ్ళలో, ట్విట్టర్లో, అన్నిరకాల సోషల్ మీడియాలో విషం కక్కుతూ, విద్వేషం రగిలిస్తూ, మనుషుల మధ్య కొత్త సరిహద్దు రేఖలు గీస్తూ ఉండగా, మరొక వైపు ఇద్దరు మహిళలు ఎంతో ఓర్పుగా, ఓపిగ్గా, ప్రేమతో, ఆవేదనతో, కన్నీళ్ళతో, తమ కన్నీళ్ళను ఆపుకోడానికి నవ్వుతో, ఆ గీతాల్ని చెరుపుకుంటూ వస్తున్నారు. ఒకరు గీతాంజలి శ్రీ, ‘రేత్ కీ సమాధి’ అనే నవలా రచయిత్రి. మరొకరు ఆ నవలను ఇంగ్లిషులోకి అనువదించిన డైసీ రాక్ వెల్, అమెరికన్ ఆనువాదకురాలు. ఒకప్పుడు ఈ దేశంలో జాతీయ నాయకులు రచయితలకు స్ఫూర్తిగా ఉండేవారు. ఇప్పుడు ఈ దేశ స్ఫూర్తిని రాజకీయనాయకులు మంట కలుపుతున్న సమయంలో, ఇదిగో, ఇటువంటి రచయిత్రులు, అనువాదకులు, ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఈ దేశప్రజల మాటలు కావనీ, ఈ దేశ ప్రజలు సరిహద్దుల్ని కోరుకోవడం లేదనీ, సరిహద్దుల్ని దాటిన సాంగత్యాన్ని కోరుకుంటున్నారనీ ఎలుగెత్తి చాటుతున్నారు.

ఉదాహరణకి, Tomb of Sand లో ఈ వాక్యాలు (పే.652-53) చూడండి:

ఇలా పుస్తకం మొత్తం తెలుగు చేసి చూపించాలని ఉంది. 732 పేజీలు. ఈ పుస్తకానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజు ఎందుకిచ్చారో తెలుసుకోడానికి చదివాను.

‘.. సరిహద్దు మూసెయ్యదు. తెరిచిపెడుతుంది. అదొక ఆకృతిని రూపొందిస్తుంది. అంచుల్ని అలంకరిస్తుంది. .. సరిహద్దు అంటే ఏమిటి? అది వ్యక్తిత్వాల్ని ఇనుమడింపచేస్తుంది. బలపరుస్తుంది. అది చించి పోగులుపెట్టదు. అందుకు బదులుగా గుర్తింపునిస్తుంది. ఆ అంచు దగ్గర రెండంచులూ కలిసి వికసిస్తాయి. వారి సమావేశాన్ని సరిహద్దు వెలిగిస్తుంది. ..”

“గాడిదలారా! సరిహద్దు అంటే ఆపేది కాదురా. అది రెండు విభాగాల్ని కలిపే వంతెన. రాత్రికీ, పగటికీ మధ్య, జీవితానికీ, మృత్యువుకీ మధ్య, కనుక్కోడానికీ, కోల్పోడానికీ మధ్య ఒక వంతెన. ఆ రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. వాటిని నువ్వు విడదియ్యలేవు. ”

“సరిహద్దు అంటే దిగంతం. రెండు ప్రపంచాలు కలుసుకునే తావు. రెండు ప్రపంచాల ఆలింగనం.”
“సరిహద్దు అంటే ప్రేమ. ప్రేమ కైదుల్ని సృష్టించదు. మన దారిలో ఎదురయ్యే ఆటంకాల్ని పక్కకు విసిరి పడేస్తుంది. సరిహద్దు అంటే ఒక సమావేశ రేఖ. ఆ భాగాన్నీ, ఈ భాగాన్నీ కలిపి అదొక సుందరాకృతిని రూపొందిస్తుంది. ఇద్దరు కలిస్తే ఏర్పడేదే సరిహద్దు. అదొక కూడలి. కూడల సంగమం.”

ఒక నవలగా ఈ రచన ఇచ్చిన ఆనందం కన్నా, ఒక సంక్షుభిత కాలంలో, సంస్కారహీనులైన రాజకీయనేతలు మాట్లాడే మాటల మధ్య ఈ రచన ఇచ్చిన మనోధైర్యం వెలకట్టలేనిది.

“సరిహద్దు ఒక ఖేల. సంతోషకరమైన ఆట. ఒక గీతగీస్తారు. అప్పుడు అటూ ఇటూ ఉన్నవారిద్దరూ తొక్కుడు బిళ్ళ ఆడుకోవడం మొదలుపెడతారు. గెంతు, గెంతు అని అరుస్తారు. ఒక తాడు కట్టి వేలాడదియ్యండి, ఉయ్యెలవుతుంది. అప్పుడు అటూ ఇటూ ఊగడం మొదలుపెడతారు. అటూ ఇటూ రెండువైపులా జారతారు. తీగ మీద క్రీడాకారుడు నడుస్తాడే, అటూ ఇటూ ఊగుతూ రెండు వైపులా, అలా అన్నమాట. పట్టలేనంత సంతోషంగా కేరింతలు కొట్టడం. ఆడుకోవడం. నవ్వుకోవడం, మళ్ళీ ఆడుకోవడం. ముందు మా వంతు. అప్పుడు మీ వంతు. బంతి విసరండి. అది బాటుకి తగులుతుంది. అప్పుడు బౌండరీ మీంచి ఎగురుతుంది. చక్కా! నువ్వు సిక్సర్ కొట్టావు! ఆ బంతి సరిహద్దుని తాకనివ్వండి. చక్కా! నాలుగు పరుగులు తీసినట్టు! ప్రతి ఒక్కరూ తుళ్ళిపడతారు. అబ్బా! ఆట ఎంత బాగా నడుస్తోంది!”

“ఆ బౌండరీ చుట్టూ ఎంత సరదా. పాటలు పాడండి, నాట్యం చెయ్యండి, కవిత్వం చదువుకోండి, దాన్ని మరింత సౌందర్యభరితం చెయ్యండి. అనంతం వైపుగా సాగిపొండి. నిర్భయంగా సాగిపొండి. అంచులదాకా ప్రయాణించండి. అంచు, అది పటానికి అంచు. కాని దానికి అతుక్కుపోకండి. ముందుకు పయనించండి, మరింత ముందుకు. భయరహితులుగా, గంభీరమైన, ప్రేమాస్పదమైన బృందంగా మారండి. కంటికి కనబడని ఒక తాటికి రెండు కొసలా నిలబడ్డట్టుగా టగ్ ఆఫ్ వార్ లాగించండి. మరింతగా, మరింతగా, కాని పట్టు తప్పకండి, విడిపోకండి, తెగిపోకండి. అటువైపుకు జరగండి.”

“పెద్దమనుషులారా, సరిహద్దు ఉన్నదే దాటడానికి.”

“సరిహద్దు నిన్ను గెంతమంటుంది. తనని దాటమంటో నిన్ను కవ్విస్తుంది. రా, వెనక్కి రా, గెంతు, ఆడు, చిరునవ్వు, స్వాగతం, కలుసుకో, పలకరించుకో, కొత్త సంతోషం సృష్టించుకో.”

“సరిహద్దుని దాటడంలో గొప్ప మజా ఉంది. అక్కడ నిరంతరం ఆదానప్రదానాలు కొనసాగుతూ ఉంటాయి. సరిహద్దు ఉన్నదే ఒకరితో ఒకర్ని కలపడానికి. ఒకరున్నారంటే రెండో వారూ ఉన్నట్టే. అది ప్రేమతో కలిపే గీత. ..”

ఎందుకంటే, నేను హిందువుని, ముస్లింని కూడా. ఇంకా చెప్పాలంటే, నేను హిందువునీ కాను, ముస్లింనీ కాను. భారతీయుణ్ణి. నాది కబీరు దారి. .

ఇలా పుస్తకం మొత్తం తెలుగు చేసి చూపించాలని ఉంది. 732 పేజీలు. ఈ పుస్తకానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజు ఎందుకిచ్చారో తెలుసుకోడానికి చదివాను. అక్షరం, అక్షరం, వాక్యం, వాక్యం చదివాను. ఒక బాధ్యతగా చదివాను. ఒక నవలగా ఈ రచన ఇచ్చిన ఆనందం కన్నా, ఒక సంక్షుభిత కాలంలో, సంస్కారహీనులైన రాజకీయనేతలు మాట్లాడే మాటల మధ్య ఈ రచన ఇచ్చిన మనోధైర్యం వెలకట్టలేనిది. ఈ దేశం పట్ల, ఈ దేశ సంస్కారం పట్ల, ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తి పట్ల నా నమ్మకం మరోసారి నిలబడింది.

ఎందుకంటే, నేను హిందువుని, ముస్లింని కూడా. ఇంకా చెప్పాలంటే, నేను హిందువునీ కాను, ముస్లింనీ కాను. భారతీయుణ్ణి. నాది కబీరు దారి. ‘సరిహద్దులెరగని జగజ్జనులారా! మానవుడే నా సంగీతం, మనుష్యుడే నా సందేశం’ అని నినదించిన మహాకవుల దారి.

మహూవా మొయిత్రలు, నూపుర్ శర్మలు కాదు, ఈ దేశానికి మరింతమంది గీతాంజలి శ్రీలు కావాలి, తెలుగుతో సహా, అన్ని భాషల్లోనూ కావాలి.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి.

More articles

1 COMMENT

  1. Is there any reason why two “female” politicians are brought into this article and compared to “female” author? Is it a suggestion that “females” should behave in a certain way? Is this female author not a role model for male politicians?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article