మానవ వికాసానికి పెద్దలు కాదు, పిల్లలే ఎంతో దోహదకారి. వాళ్ళ మాట్లాడే విశ్వ భాష మానవత్వానికి పెద్ద పీఠ. ఉబుంటు – ఈ ఒక్క పదం చాలు, మన జీవన వ్యాకరణానికి పెద్ద బడి.
కందుకూరి రమేష్ బాబు
అది ఆఫ్రీకా దేశం. అక్కడ ఒకానొక చోట కొందరు గిరిజన బాలబాలికలు ఆడుకుంటూ ఉంటారు. ఒక మానవ పరిణామ శాస్త్రవేత్త వారికోక పరీక్ష పెడతాడు. చిత్రమేమిటంటే, అది కాస్తా అతడికి వారి సంస్కృతి తాలూకు ఒక అరుదైన స్వభావాన్ని తెలియజెప్పే మహత్తర సమాధానం కావడం విశేషం.
“పిల్లలూ, ఆ చెట్టు మొదట్లో నేనొక స్వీట్ బాక్స్ పెట్టాను.మీలో ఎవరు ముందుగా వెళ్లి తీసుకుంటే అది వారికే చెందుతుంది” అంటాడు.
వాళ్ళు క్షణం కూడా ఆలోచించరు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని మూకుమ్మడిగా వెళ్లి అందుకుంటారు.
ఆ పరిణామాన్ని సదరు శాస్త్రవేత్త అస్సలు ఊహించడు.
నిజానికి ప్రతిసారి పైనుంచి రుద్దే నమూనాలు కింది దాకా వెళ్ళవు. కానీ, కింది నుంచి పైకి వికాసం పొందేవే ఎప్పటికైనా నిలిచే ఉంటాయి. అవి ఏ సమాజానికైనా స్ఫూర్తి నిస్తాయి. ఉదాహరణకు పిల్లల నుంచి ప్రాచుర్యం పొందిన ఈ అందమైన ఆఫ్రీకా కథ చూడండి.
ఆ పిల్లలు అలా సమిష్టిగా వెళ్లి అందుకోవడం, ఆ స్వీట్లను తలా ఒకటి అందరూ సంతోషంగా పంచుకోవడం అతడిని ఎంత చకితుడిని చేస్తుందీ అంటే, “ఇలా చేయాలని ఎలా అనిపించింది మీకు?” అని అనాలోచితంగా అనేస్తాడు. వాళ్ళు నవ్వి, “ఉబుంటు” అంటారు.
“ఒకరు విచారంగా ఉంటే మరొకరు సంతోషంగా ఎలా ఉంటారు?” అన్నది దానర్థం అట!
సంతోషానికైనా దుఃఖానికైనా “ఒక్కరు కాదు, అందరం కారణం” అన్న నిగూడార్థం అందులో దాగి ఉన్నదట!
అది పదం కాదు, “మనవల్లనే నేనిలా ఉన్నాను” అన్న లోతైన భావన దాగి ఉన్న జీవన విధానమట.
అది పదం కాదు, “మనవల్లనే నేనిలా ఉన్నాను” అన్న లోతైన భావన దాగి ఉన్న జీవన విధానమట.
ఆ మానవ పరిణామ శాస్త్రవేత్త ఆఫ్రికాలోని ఆ మారుమూల తండాలోంచి ఈ పదాన్ని గ్రహిస్తాడు. మరీ ముఖ్యంగా బాలబాలికల స్థాయిలోనే, వారి సంస్కృతిలో జీర్ణించుకున్న సమిష్టి జీవన స్వామ్యానికి ముచ్చటపడి వందనాలు అర్పిస్తాడు.
మనం తెచ్చుకుందామా ఈ పదాన్ని.
అందరితోటిదే మన సుఖమని సదా గుర్తు పెట్టుకునే జీవన సత్యాన్ని.