అత్యంత సున్నితమైన వస్తువును తీసుకుని ఇద్దరు మహిళలు ఒక నెల వ్యవధిలోనే రాసిన రెండు కవితలు తెలుపు చిరు సాహితీ పరామర్శ ఇది. ఆ కవితలు రేణుక అయోల, మహెజబీన్ లు రాసినవి. ఆ రెండూ ఒకే వృత్తంలోని శూన్యాన్ని చెప్పేవి. ఆ రెండు కవితలు తెలుపు మన ప్రపంచం.
కందుకూరి రమేష్ బాబు
మనకు మింగుడి పడని జీవన వాస్తవికతను, పేరుకు పోతున్న విషాద స్థితిని అత్యంత వాస్తవికంగాను ఎంతో ఔదర్యంతోనూ రాసి మనల్ని కలత పెట్టిన ఆ ఇద్దరు కవులు నిజంగానే అసామాన్యమైన పనికి ఒడిగట్టారు. వారిలో ఒకరు కవితను ప్రమోదంగా మలిచినప్పటికీ అవి రెండూ వర్తమానంలో ప్రమాద సూచికలను ఎగరేసేవే అని చెప్పాలి.
ఒకటి, శయన మందిరం. ఈ కవిత ప్రముఖ కవయిత్రి మహెజబీన్ రాయగా ‘విశ్రాంతి ఇల్లు కథ’ మరో సీనియర్ కవయిత్రి రేణుక అయోల రాశారు. ఈ రెండు కవితలూ దాపత్యం అనే నాణానికి గల చిత్తూ బొత్తుల్లో బొమ్మకు బదులు బొరుసు ప్రముఖ పాత్ర వహించడాన్ని ఎంతో సాహసోపేతంగా చూపిస్తున్నాయి. నిజానికి రెండో కవిత నాటకీయంగా కనువిప్పు కలిగించినట్లు చెప్పినా అవి రెండూ వర్తమాన జీవన సంక్షోభాన్ని చిన్న చిన్న పద చిత్రాలతో అద్భుతంగా పట్టిస్తున్నాయనే చెప్పాలి.
వెలుగు చీకట్లను ఆశ్రయించి ఒక కవిత ఇంటిని మొత్తంగా చూపగా మరో కవిత అంత్యంత ముఖ్యమైన పడక గది ప్రమాణంగా ఆధునిక జీవితల్లో పేరుకుంటున్న యాంత్రికతను, శూన్యాన్ని ఆర్ద్రంగా చిత్రించాయి. అవి ప్రశ్నించకనే ప్రశ్నిస్తున్నాయి.
విస్మయం ఏమిటంటే అత్యంత సున్నితమైన ఈ వస్తువులను ఆశ్రయించి ఆ రెండు కవితలనూ రాసింది మహిళలే కావడం. ఆ ఇరువురూ కటువైన నిజాలను సుతారంగా మన ముందుకు తేవడం. అది నిజానికి మనసు లోలోన చర్చకు పెట్టి అంతర్ముఖంలో పరిష్కారం చూసుకునేలా చేసేవే. ఆ ఇద్దరూ ఎంతో బాధ్యతంగా దంపతుల మధ్య ప్రేమ – ప్రణయ రాహిత్యాల స్థితిగతులను ప్రేమగా ఆవిష్కరించారు. ఆ ఇద్దరు కవయిత్రులకు తెలుపు అభినందనలు.
రేణుక అయోల దంపతులు వృద్దాప్యానికి చేరువైనప్పటి వైనం చెప్పగా యవ్వనమే వృద్దాప్యంలా మారిన నిజాన్ని లేదా ఆలక్ష్యాన్ని మహెజబీన్ కవిత్వీకరించారు.
అన్నట్టు, జబీన్ గారు రాసిన ‘శయన’ మందిరం అన్న కవిత అక్టోబర్ ౩ న ఆంధ్రజ్యోతి వివిధ పేజీలో అచ్చవగా మొన్న అంటే అక్టోబర్ 19 న రేణుక అయోల గారు ‘విశ్రాంతి ఇల్లు కథ’ అన్న కవితను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఆ ఇద్దరి ఇతివృత్తాలలో దాంపత్య జీవనంలో లేదా సహజీవనంలో దంపతుల మధ్య ప్రేమానురాగాలు లుప్తమవడం, దగ్గరితనం దూరం కావడం, పెరుగుతున్న ఎడం వంటివాటిని చర్చకు తెస్తూనే అందుకు వస్తుగత ప్రపంచం కారణం కావడాన్ని అలవోకగా చెబుతారు. మరో రకంగా చెబితే, రేణుక అయోల దంపతులు వృద్దాప్యానికి చేరువైనప్పటి వైనం చెప్పగా యవ్వనమే వృద్దాప్యంలా మారిన నిజాన్ని లేదా ఆలక్ష్యాన్ని మహెజబీన్ కవిత్వీకరించారు.
నిజానికి ఈ కవితలు రెండూ రెండు పుస్తకాలు. వాటిని లోతుగా చదివితే ఇంకా ఎంతో రాయవచ్చు. అనేక అంశాలను స్పృశిస్తూ రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ అవి కవితలు కావడం వల్ల, ఈ చిన్న ఉపోద్గాతం చాలనుకోవడం. వాటిని స్వయంగా చదివి అనుభూతి చెందించడం మరీ ముఖ్యం. ఇంకా చాలా విషయాలు మీరే గ్రహిస్తారు. అందుకే ఇలా క్లుప్తంగా ముగించడం. మరి చదవండి…
మహెజబీన్
శయన మందిరం
పడక గది సంక్షోభంలో ఉంది
Crises! Crises…
అక్కడ అన్ని పనులు జరుగుతాయి
ఆ ఒక్కటి తప్ప!
అన్ని పనులకు టైం దొరుకుతుంది
ఆ ఒక్కటి తప్ప!
ఎలా ఉండేదో నా పడక గది
సహజీవన దేహ పరిష్వంగం దృశ్యమై కదలాడేది
హృదయం పంచుకున్న క్షణాలను గుర్తుకు తెచ్చేది
మనసైన మాటలకు నెలవై ఉండేది
మోహం మా జీవితాల్నిఅల్లుకు నుండేది
ఇప్పుడు tension… tension
సమయమంతా నగరానికి అంకితం
Restricted Emotions,
Disconnected Intimacy
పిల్లలొస్తారు
పుస్తకాలు మంచం మీద పడేస్తారు
పని అమ్మాయి వస్తుంది
ఉతికి ఆరేసిన బట్టలు తెచ్సి మంచం మీద వేస్తుంది
బంధువులొస్తారు
మంచం మీద కూర్చొని తింటారు
ఫ్రెండ్స్ వస్తారు
చాయ్ తాగుతూ మంచం మీద కూర్చుంటారు
పగలనక రాత్రనక నా మంచం బిజీ గానే ఉంటుంది
మా అర్బన్ జీవితాల్లా
నా మంచం మీద జరగని పని అంటూ లేదు
ఆ ఒక్కటి తప్ప
రేణుక అయోల