Editorial

Wednesday, January 22, 2025
Yours Sportingly'బట్లర్' ఇంగ్లీషు...ట్విట్టర్ తుఫాను - సి.వెంకటేష్ క్రీడావ్యాఖ్య

‘బట్లర్’ ఇంగ్లీషు…ట్విట్టర్ తుఫాను – సి.వెంకటేష్ క్రీడావ్యాఖ్య

సెలెబ్రిటీలు మాత్రం ట్విట్టర్‌ను ఇష్టపడతారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళూ ట్విట్టర్‌ని వాడుకుంటారు. అయితే ఒక్కోసారి ఈ చిట్టి పొట్టి ట్వీట్స్ వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఇంగ్లండ్ క్రికెటర్ ఒలీ రాబిన్సన్ విషయంలో అదే జరిగింది.

సి.వెంకటేష్ 

సూటిగా, సుత్తి లేకుండా మన అభిప్రాయాలు పంచుకోవడానికి పనికొచ్చే చక్కటి వేదిక ‘ట్విట్టర్’. ప్రతి ట్వీట్ మూడు, నాలుగు వాక్యాలు మించకూడదు కాబట్టి అందులో ఉపన్యాసాలు, ప్రవచనాలు ఉండవు. సామాన్యులు తమ ఫీలింగ్స్ వెళ్ళగక్కడానికి ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తారు కానీ సెలెబ్రిటీలు మాత్రం ట్విట్టర్‌ను ఇష్టపడతారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళూ ట్విట్టర్‌ని వాడుకుంటారు. అయితే ఒక్కోసారి ఈ చిట్టి పొట్టి ట్వీట్స్ వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఇంగ్లండ్ క్రికెటర్ ఒలీ రాబిన్సన్ విషయంలో అదే జరిగింది. ఇరవయ్యెనిమిదేళ్ళ లేటు వయసులో రాక రాక అతనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాసం వచ్చింది. మొట్టమొదటి మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి తన టెస్ట్ కెరీర్ అట్టహాసంగా ప్రారంభించాడు. కానీ అంతలోనే అతని కలల సౌధం కుప్పకూలింది. పదేళ్ళ క్రితం అతను చేసిన కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్స్ ఇప్పుడు బయటపడ్డాయి. ఆ ట్వీట్స్‌లో జాత్యహంకార ధోరణులే కాక మహిళలను కించపరిచే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వెంటనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది.

twitter

అయితే ఈ ట్విట్టర్ తుఫాను రాబిన్సన్ దగ్గరే ఆగిపోలేదు. మరో ఇంగ్లండ్ క్రికెటర్ పదిహేనేళ్ళ వయసులో చేసిన జాత్యహంకార ట్వీట్లు కూడా బయటికొచ్చాయి. అయితే అతని పేరు గోప్యంగా ఉంచారు. ఇంకో ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు జోస్ బట్లర్, ఒవిన్ మోర్గన్, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ కూడా తెర మీదికి వచ్చింది. రెండేళ్ళ క్రితం జరిగీన ఈ సంభాషణలో భారత క్రికెట్ అభిమానుల ‘బట్లర్ ఇంగ్లీష్’ను వెక్కిరిస్తూ ట్విట్టర్ వేదికగా ఆ ముగ్గురూ తెగ నవ్వుకున్నారు.

ఈ వ్యవహారమంతా చూస్తుంటే మనకు వెంటనే కలిగే ఫీలింగ్, ఎప్పుడో జరిగిపోయినవాటిని ఇప్పుడు తవ్వి తీయడం అవసరమా అని. నిజమే, అయితే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం నేపథ్యంలో క్రీడా ప్రపంచమంతా జాత్యహంకార ధోరణులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నది. చిన్న పొరపాటును కూడా సహించే పరిస్థితి లేదు.

ఈ వ్యవహారమంతా చూస్తుంటే మనకు వెంటనే కలిగే ఫీలింగ్, ఎప్పుడో జరిగిపోయినవాటిని ఇప్పుడు తవ్వి తీయడం అవసరమా అని. నిజమే, టీనేజర్‌గా రాబిన్సన్ చేసిన్ కామెంట్లకు పదేళ్ళ తర్వాత ‘శిక్ష’ విధించడం తప్పుగానే కనిపిస్తుంది. అయితే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం నేపథ్యంలో క్రీడా ప్రపంచమంతా జాత్యహంకార ధోరణులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నది. చిన్న పొరపాటును కూడా సహించే పరిస్థితి లేదు. ఎప్పుడో పదేళ్ళ క్రితం నాటి కుర్రతనపు చేష్టల విషయంలో ఇప్పుడు చర్య తీసుకొవడం కఠిన నిర్ణయం గానే అనిపించవచ్చు. కానీ యువ క్రికెటర్లకు ఒక స్పష్టమైన సంకేతం పంపించినట్టవుతుంది. కీబోర్డ్ చేతిలో ఉంది కదా అని నోటికొచ్చిన కామెంట్లు చేయకూడదని, ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని వారికి తెలిసొస్తుంది.

మిగతా భాషల మాదిరిగానే ఇంగ్లీషును కూడా ఒక భాష మాత్రమే కదా. పరాయి భాష మనం బాగా మాట్లాడాలన్న రూల్ ఎవరు పెట్టారు?

ఇక మన క్రికెట్ అభిమానుల ఇంగ్లీషును వెక్కిరించిన ఆ ముగ్గురిని క్షమించి వదిలేయాలా? భాషను వెక్కిరించడం జాత్యహంకారం కిందకు రాదని సర్దుకుపోవాలా? మిగతా భాషల మాదిరిగానే ఇంగ్లీషును కూడా ఒక భాష మాత్రమే కదా. పరాయి భాష మనం బాగా మాట్లాడాలన్న రూల్ ఎవరు పెట్టారు? యూరప్ ఖండంలోని మిగతా దేశాలవారికి ఇంగ్లీషు రాదు. మరి వారు తప్పులు మాట్లాడితే ఈ ఇంగ్లీషు దొరలు వారిని వెక్కిరించరేం? ఒకప్పటి వలస పాలకులు కాబట్టి మన మీదనే వారికి చులకన భావం. ఇండియాలో జరిగే ఐపిఎల్ ఆడి కోట్లు మూటగట్టుకోవడం ఇష్టమే కానీ మన అభిమానులంటే మాత్రం లోకువ వీళ్ళకి. అసలు వేల కోట్ల రూపాయల క్రికెట్ సామ్రాజ్యానికి ప్రధాన పోషకులు ఈ అభిమానులే కదా. వారి వల్లమాలిన అభిమానమే క్రికెట్ పిచ్‌పైన కాసుల వర్షం కురిపిస్తున్నది. మన ఫ్యాన్స్‌ను అపహాస్యం చేసిన ఆ ఇంగ్లీషు బట్లర్ గారి పైన, మిగతా ఇద్దరి పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కనీసం ఒక ఏడాది పాటు ఆ ముగ్గురిని ఐపిఎల్ నుంచి బహిష్కరిస్తే వారికి ఇండియా విలువ, ఇక్కడ క్రికెట్‌ను వెర్రిగా ప్రేమించే అభిమానుల విలువ తెలిసొస్తుంది.

తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్. జాతీయంగా, అంతర్జాతీయంగా టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించిన తొలితరం కామెంటేటర్ కూడా. వారు BITS AND PIECES, SECOND IINNINGS, క్రీడాభిరామం- పేరిట వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. అలాగే, సికె నాయుడు ఆత్మకథ, సచిన్ పై SUCH A 100 అన్న గ్రంధాన్ని కూడా వెలువరించారు. ‘YOURS SPORTINGLY’ ప్రతివారం తెలుపు పాఠకులకు వారందించే క్రీడా స్ఫూర్తి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article