Editorial

Monday, December 23, 2024
కథనాలు'బిజిలీ కే సాబ్' : కందుకూరి రాము నివాళి వ్యాసం

‘బిజిలీ కే సాబ్’ : కందుకూరి రాము నివాళి వ్యాసం

ఫోటో : భరత్ భూషణ్

నిన్న సాయత్రం గుండెపోటుతో  మృతి చెందిన శ్రీ నిజాం వెంకటేశం గారి సాహిత్య వ్యక్తిత్వం గురించి తెలియని వారుండరు. కానీ వారి వ్యక్తిగత జీవన విశేషాలు మటుకు కొద్ది మందికే తెలుసు. ఈ ఆత్మీయ నివాళి వారి జీవన రేఖలను చూపే కాసింత వెలుగు.

కందుకూరి రాము

నిజాం వెంకటేశం గారు పాలిటెక్నీక్ కోర్సు లో ఎలెక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమా చేసి, చెన్నయిలో AMIE చదివారు, 1968లో ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో NMR (తాత్కాకాలిక ఉద్యోగి)గా చేరి 29 సంవత్సరాలపాటు నిబద్ధతతో పనిచేసి Asst. Divisional Engineer (ADE) హోదాలో 1997 సంవత్సరంలో VRS తీసుకుని హైదబాద్ లో స్థిరపడ్డారు. వీరికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు ముగ్గురూ చక్కగా స్థిరపడ్డారు. ప్రస్తుతం 72 సంవత్సరాల వయసులో AVOPA స్టేట్ జనరల్ సెక్రెటరీగా సేవలందిస్తూ స్వయంగా పలు సమాజసేవ కార్యక్రమాలు చేస్తూ సంతృప్తిగా జీవిస్తున్నారు.

మంచి పుస్తకాలను కొని నలుగురికి పంచడంలో వీరిని మించినవారు లేరని చెప్పాలి.

నిజాం వెంకటేశం అనగానే.. ఎవరికైనా పుస్తకాలు గుర్తుకొస్తాయి. పుస్తకానికి వీరి జీవితానికి విడదీయరాని అనుబంధం ఉంది. లిటరరీ సర్కిల్ లో వెంకటేశం గారిని ఎరుగని వారు అరుదు. ఎవరి జీవితంలోనైనా మొదటి స్థానం తల్లితండ్రులది, రెండవ స్థానం గురువులది, మూడవ స్థానం పుస్తకానిదని చెప్తారు. “నా వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా పుస్తక పఠనమే కారణం” అని అంటారు. వీరు పుస్తంతో దోస్తీ చేసి జీవితంలో గొప్పగా ఎదగడమే కాకుండా ఎందరో రచయితలను, కవులను ప్రోత్సహించి, ఆర్ధిక సహాయం చేసి వారు సాహిత్యకారులుగా ఎదిగేవిధంగా దోహదపడ్డారు. మంచి పుస్తకాలను చదవడమే కాకుండా, వాటిగురించి చర్చించడం.. పుస్తకాలను కొని నలుగురికి పంచడంలో వీరిని మించినవారు లేరని చెప్పాలి. ఇప్పటివరకు లక్షలాది రూపాయల విలువైన పుస్తకాలను సాహితీ మిత్రులకు, వివిధ సంస్థలకు ఇచ్చారు. ఏదైనా మంచి పుస్తకం మార్కెట్లో కాపీలు అయిపోతే.. స్వయంగా లేదా మిత్రులతో కలిసి ముద్రించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

చక్కని చేతివ్రాత

వీరు 1948 నవంబర్ 14వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జన్మించారు. తల్లిదండ్రులు నిజాం సత్యమ్మ, నిజాం విశ్వనాథం. తల్లిదండ్రులకు ఇద్దరు సంతానంలో వెంకటేశం పెద్దవారు. వీరికి ఒక చెల్లెలు ఉంది. వెంకటేశం గారి తండ్రి నిజాం విశ్వనాధం, ఆ కాలానికి చాలా తెలివి గలవారనే చెప్పాలి.

ఉర్దూ మీడియంలో మూడవ తరగతి దాకా చదివాడు. క్లాసులో ఫస్ట్ వచ్చేవారు. ఆ పుస్తకాలతోపాటు తెలుగులో పెద్ద బాలశిక్ష, రామాయణం, భారతం, భాగవతం లాంటివి చదివాడు. ఆయనది చక్కని చేతివ్రాత. తెలుగు, ఉర్దూ లో చక్కగా రాసేవారు. విశ్వనాధంగారు సిరిసిల్ల పట్టణంలో జనరల్, కిరాణా షాపు నడిపేవారు. వెంకటేశం గారికి తండ్రి నుంచే తెలివితేటలు అబ్బాయి అని చెప్పొచ్చు.

ఇంటి పేరు నేపథ్యం

‘నిజాం’ అనే ఇంటిపేరు మనం ఎక్కడా వినం, విభిన్నంగా అనిపిస్తుంది, దీని నేపథ్యం.. నాలుగైదు తరాలక్రితం వీరి పూర్వీకులు నిజాం ప్రభువుల వద్ద పనిచేసేవారు. ఆ సమయంలో హైదరాబాద్ లో గల మింట్ కాంపౌండ్ నుంచి వెండి నాణేల మూటలను ఎడ్లబండిలో ముందు వెనుకకు నలుగురు జవాన్లు గుఱ్ఱాలపై కాపలాతో సిరిసిల్ల పట్టణంలో గల ట్రెజరీకీ తీసుకొచ్చి అప్పగించేవారు. సిరిసిల్ల లో వీరి కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు.. “వాళ్ళా?నిజామోళ్ళు” అని అనే వాళ్ళు, ఆలా ‘నిజాం’ వీరి ఇంటిపేరుగా స్థిరపడింది.

వీరి సాహిత్య ఆసక్తికి బీజం ఓ సందర్భంలో ప్రముఖ రచయితలు విశ్వనాధ సత్యనారాయణ గారు, దాశరధి కృష్ణమాచార్య గార్లను చూసే అవకాశం రావడంతో ఏర్పడింది.

మూడున్నర సంవత్సరాలకే ఇంటి పక్కన ఉన్న బడికి పోవడం మొదలుపెట్టిన మన వెంకన్న సంవత్సరంన్నర కాలంలో మూడు తరగతులు చదవడం పూర్తి చేసి, చదువుపై తన ఆసక్తి కనబరిచాడు. పది సంవత్సరాలప్పుడు.. ఓ సందర్భంలో ప్రముఖ రచయితలు విశ్వనాధ సత్యనారాయణ గారు, దాశరధి కృష్ణమాచార్య గార్లను చూసే అవకాశం రావడం, వారు చదివిన కవిత్వాన్ని విని సాహిత్యంపై ఆసక్తి కలిగింది. వీరు హైస్కూలో చదువుతున్నప్పుడు తెలుగు, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఫస్ట్ మార్కులతో అవ్వడమే కాకుండా అన్నీ కవిత్వపోటీల్లో, వక్తృత్వ పోటీల్లో చురుకుగా పాల్గొనేవారు.

 ‘డేల్ కార్నిగే’ ప్రేరణతో…

జీవితం చాలా విచిత్రమైనది.. ఎన్నో గమ్మత్తులు చేస్తుంది, ఒక్కోసారి పరీక్ష పెడుతుంది, ఒక్కోసారి పాఠం నేర్పుతుంది అనే నిజాం వెంకటేశం.. వీరి జీవితంలో కూడా అనేక ఊహించని గమ్మత్తులు జరిగాయి. అందులో ఒకటి.. నిజాం వెంకటేశం గారికి డాక్టర్ కోర్సు చదవాలని ఉండేది, అంత ఆర్ధిక స్తోమత లేక తండ్రి వద్దన్నాడు. ఆ కారణంగా మనస్పర్ధలతో కొంతకాలం తండ్రీకొడుకులు మాట్లాడుకోలేదు కూడా.. కొన్ని రోజుల తరువాత హైదరాబాద్ లో ఉండే వాళ్ళ తాత వద్దకు పంపించారు, వారి సలహామేరకు Politeknik (Electrical Engg లో డిప్లమా) పూర్తిచేసి ఆ తరువాత చెన్నయి లో AMIE, Post Graduation చేశారు.

“How to stop worrying & How to start living” అనే పుస్తకం చదివి జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదొడుకులను ఎదుర్కొనే ధైర్యం పొందారు.

హైదరాబాద్ లో Electrical Engg లో డిప్లమా చేసిన తరువాత ఉద్యోగం కోసం ఎన్ని ఆఫీసులు తిరిగినా .. No Vacancy బోర్డులు వెక్కిరించేవి. అలా హైదరాబాద్ లో తిరిగే క్రమంలో.. ఫుట్ పాత్ పై ఒకరోజు ఆంగ్ల రచయిత ‘డేల్ కార్నిగే’ రాసిన “How to stop worrying & How to start living” అనే పుస్తకం చూసి వెంటనే కొని చదివారు. అందులో.. జీవితంలో సమస్యలను ఎలా అధికమించాలి? మంచి మానవ సంబంధాలను ఎలా కలిగి ఉండాలి? అందరినీ సంతోషపెడుతూ.. మనం బాధపడకుండా జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలి.. ఇలా అనే అనేక విషయాలను చదివి జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదొడుకులను ఎదుర్కొనే ధైర్యం పొందారు. ఆ విధంగా ఆంగ్ల సాహిత్యం పై మక్కువ పెంచుకుని అనేక ప్రసిద్ధ రచయితలు రాసిన వ్యక్తిత్వ వికాసానికి సంబంధిన పుస్తకాలు చదివి ఆకళింపు చేసుకున్నారు.

నడిచే గ్రంధాలయం…

చెన్నై లో AMIE చదివుతున్నప్పుడు విశ్వవిద్యాలయంలో కవిత్వపోటీలో పాల్గొని రెండొవ బహుమతిగా 10 పుస్తకాలను అందుకున్నారు. ఆ సంఘటనతో సాహిత్యం అంటే మరింత ప్రేమ ఏర్పడ్డది. కాళీ సమయాల్లో మహాత్మా గాంధీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొదలైన వారి జీవిత చరిత్రలు.. సోషలిజం, కమ్యూనిజం.. జర్నలిజం, పర్యావరణం, సినీ రంగం గురించి.. అన్ని రకాల పుస్తకాలు చదివి, వాటిపై పట్టు సాధించారు. అవసరం వచ్చినప్పుడు సందర్భానుసారంగా ఆ పుస్తకాల్లోని అంశాలను ప్రస్తావించి అందరినీ ఆకట్టుకుంటారు. అందుకే తెలిసినవారు వీరిని నడుస్తున్న గ్రంధాలయం అంటారు.

నా నేల, నా ప్రజలు…

1966 నుండి 1968 వరకు ఉద్యోగం దొరకని ఖాలీగా సమయాన్నంతా తెలిసినవాళ్ల పేపర్ ఏజెన్సీ లో వచ్చే పుస్తకాలను చదివి అనేక విషయాలపై పట్టు సాధించారు. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసిన తరువాత 1968 లో జగిత్యాల ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో తాత్కాలిక ఉద్యోగిగా (NMR) నెలకు 96/- రూపాయలు వేతనంతో చేరారు. ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అన్ని శాఖలకు చెందిన అంశాలను కూలంకషంగా చదివి, ప్రావీణ్యం పొందారు.

నిజాయితీ కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవడం.. త్వరలోనే జగిత్యాల పట్టణంలో పర్మనెంటు ఉద్యోగిగా (electrical engineer) పోష్టింగ్ వచ్చింది. నా నేల, నా ప్రజలు అన్న మమకారం, కమిట్మెంట్ తో ప్రజలకు బాధ్యతతో కూడిన పనులు చేసి అందరి అందరి మన్ననలు పొందారు. 29 సంవత్సరాలపాటు ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన నిజాం వెంకటేశం గారు విధినిర్వహణలో.జరిగిన కొన్నిసంఘటనలతో మానసిక సంఘర్షణకు లోనై , 1997 లో Asst. Divional Engineer(ADE) స్థాయిలో ఉండగా ఉద్యోగానికి VRS తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసారు.

రాహుల్ గాంధీ మన్ననలు…

VRS తీసుకున్న తరువాత కూడా ఎలెక్ట్రికల్ రంగంలో వీరికి గల విశేష అనుభవాన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ M/s. Gneral Electric Company (GEC) ఆహ్వానం మేరకు 4 సంవత్సరాలపాటు తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలలో అనేక అద్భుతమైన పనులు చేశారు. ఆ తరువాత M/s. Vijay Electricals కంపెనీలో జాయిన్ అయి, రెండు సంవత్సారాలపాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ లో 320 కోట్ల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించారు.

ఒక ఇంజనీరు జీవిత కాలంలో చేయని పనులను రెండు సంవత్సరాల కాలంలో చేసి ‘బిజిలీ కే సాబ్’ అని గుర్తింపు తెచ్చుకోవడం వారికి పనిపట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా.. పగడ్బందీగా పనిచేసి 22 నెలల్లో 30 వేల ఎలెక్ట్రికల్ పోల్స్ వేసి, 40 వేల కనెక్షన్లు ఇప్పించారు. ఒక ఇంజనీరు జీవిత కాలంలో చేయని పనులను రెండు సంవత్సరాల కాలంలో చేసి చూపించారు. అమేథీ నియోజిక వర్గం అప్పటి MP రాహుల్ గాంధీ మన్ననలు కూడా పొంది ‘బిజిలీ కే సాబ్’ అని గుర్తింపు తెచ్చుకోవడం వారికి పనిపట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.

“దేతే గయేతో.. ఆతే రైతా..”

హైదరాబాద్ లో స్థిరపడ్డప్పటినుంచి 23 సంవత్సరాలుగా వారికి వచ్చే పెన్షన్ డబ్బుతో చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైన వారికి చేతనైన సహాయం చేస్తున్నారు. సంపాదించిన డబ్బు గల్లాపెట్టెలో దాచిపెడితే ఏమొస్తుంది “దేతే గయేతో.. ఆతే రైతా..” అని అంటారు. నిజాం వెంకటేశం గారి ఇంట్లో 1000 పుస్తకాల లైబ్రరీ ఉంది. తార్నాక ప్రాంతంలో ఒక ఫ్లాట్ రెంటుకు తీసుకుని 3.50 లక్షల ఖర్చు పెట్టి ఉచిత లైబ్రరీ నడుపుతున్నారు. “నీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే.. ప్రపంచమంతా మెచ్చుకునే గొప్ప పుస్తకం రాయి, లేదా.. నీ గురించి ఎవరైనా ఒక పుస్తకం రాసే విధంగా గొప్ప పనులు చేయి” అని వారు చదివిన ఒక సూక్తిని నిజం చేసి చూపించారు నిజాం వెంకటేశం గారు.

రేపు ఉదయం అంత్యక్రియలు

నిజాం వెంకటేశం గారి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయని వారి మిత్రులు శ్రీ బి ఎస్ రాములు తెలిపారు. ఇవాళ రాత్రి వరకు అమెరికా నుండి పెద్ద బిడ్డ విశాల వస్తుందని, మార్చురీ నుండి రేపు ఉదయమే భౌతిక కాయాన్ని పద్మారావు నగర్ లోని బెల్వెడేర అపార్ట్మెంట్ లోని ఇంటికి తెచ్చి సందర్శనార్థం ఉంచుతారని వారు వివరించారు. వారి తల్లి. నిజాం సత్తెమ్మ గారి అంత్యక్రియలు జరిగిన స్మశాన వాటికలోనే నిజాం వెంకటేశం గారి అంత్య క్రియలు జరుగుతాయి.

కందుకూరి రాము కాంతి ఫౌండేషన్ అధ్యక్షులు. వారి మొబైల్ నెంబర్ 9959911403

More articles

1 COMMENT

  1. Well explained and good information gathered about Nizam Venkatesham garu ..nicely written by you Ramu garu .great work and good job. Keep it up with such a great personalities in our society very few know about them, ur efforts are appreciable..with regards Mahesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article