దిలీప్ కుమార్ . నిజ జీవితంలో కూడా ఆయన ‘దిల్’ విశాలమైందే, వేదన నిచ్చిందే.
ప్రతాప్ రాజులపల్లి
98 ఏళ్ళ జీవితానికి, 54 ఏళ్ళ సుదీర్ఘ నట జీవితానికి తెరదించుతూ నక్షత్రాల సహజ స్థావరానికి తరలి వెళ్ళాడు మహా నటుడు దిలీప్ కుమార్. ఆ పేరే ఎదుటి వారిలో ఎనలేని గౌరవాన్ని రేకెత్తిస్తుందంటే ఆశ్చర్యమేమీ లేదు.
జ్వార్భాట (1944 ) నుండి ఖిలా (1998) వరకు యాభై నాలుగేళ్ళల్లో ఆయన కేవలం 65చిత్రాల్లో మాత్రమే నటించాడంటే అచ్చెరువొందక తప్పదు.
అందులో నేను చూసిన చిత్రాలు కూడా తక్కువే. మొగల్ ఏ ఆజం చిత్రం చూసినప్పుడు ‘పెద్ద అందగాడు కాడే’ అనిపించింది. ‘మధుమతి’ చిత్రం చూస్తున్నప్పుడు “అబ్బా! ఎంత అందగాడు!! హాలీవుడ్ నటులు కూడా బలాదూరే”అనుకున్నాను.
వినబడీ, వినబడనట్లు అనార్కలితో మాట్లాడుతుంటే చెవులు కిక్కిరించి వినేంత ఏకాగ్రత నాలో మొలకెత్తించాడు. మాటలకంటే మిన్నగా కళ్ళల్లో హావభావాలు ప్రస్ఫుటించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా ఆకర్షించాడు.
తలిదండ్రులతో వివాదించేప్పుడు మాత్రమే ధ్వని పెంచి, నటుడనేవాడు అన్నిసార్లూ అరవాల్కిన అవసరం లేదని నిరూపించాడు. ఎన్నో చిత్రాలలో అద్భుతంగా నటించినా, ‘మశాల్’ లో చనిపోతున్న తన భార్యను కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించే భర్తగా – ఆ ఒక్క చిన్న సన్నివేశం చాలు – ఆయన విస్త్రత నట విరాట్ స్వరూపం చూడ్డానికి.
నాటకీయత నిండిన నాటి హిందీ చలనచిత్ర సీమ కు తొలిసారిగా Method acting ను పరిచయం చేసిన ఘనత ఈ మొదటి ఖాన్ దే అని ప్రతీతి.
నాటకీయత నిండిన నాటి హిందీ చలనచిత్ర సీమ కు తొలిసారిగా Method acting ను పరిచయం చేసిన ఘనత ఈ మొదటి ఖాన్ దే అని ప్రతీతి.
అశోక్ కుమార్, దేవానంద్ లను పెద్ద హీరోలను చేసిన హిమాంశు రాయ్ బాంబే టాకీస్ స్టూడియోనే దిలీప్ కుమార్ ను నటుడిగా, రాజ్ కపూర్ ను సహాయ దర్శకుడిగా పరిచయం చేసింది. చిన్ననాటి స్నేహితుడు రాజ్ కపూర్ తో పష్తో భాషలో పిచ్చాపాటీ చేసిన దిలీప్ బహుభాషా కోవిదుడు.
తనే రచించి, ghost direct చేసిన ‘గంగా జమున’ (ఆయన ghost direct చేసిన మరో చిత్రం “దిల్ దియా దర్ద్ లియా) ఆయన నిర్మించిన ఒకే చిత్రం.
నిజ జీవితంలో కూడా ఆయన ‘దిల్’ విశాలమైందే, వేదన నిచ్చిందే. కామినీ కౌశల్, మధుబాల, వైజయంంతి మాలలతో పలుమార్లు ప్రేమలో పడ్డ ఆయన తన పొరిగింట్లో వున్న హీరోయిన్ నసీంబాను 12 ఏళ్ళ కూతురు – మొదట తన కారుతో, దరిమిలా ఏకంగా తనతోనే ప్రేమలో పడిందని తెలుసుకోవడానికి మరో 10 ఏళ్ళు పట్టింది. తన 44వ ఏట,తనను పిచ్చి గా ప్రేమించిన 22 ఏళ్ళ ఆ పిల్లను ఆయన పెళ్ళి చేసుకున్నారు (అస్మా గురించి వ్రాయాలో, వద్దో తెలియలేదు).
మొగల్ ఏ ఆజం చిత్రం షూటింగ్ లో మధుబాల చెంప నిజంగానే చెళ్ళు మనిపించడం, ఆ చిత్రం ప్రీమియర్ కు ఆయన రాకపోవడం, కోర్టులో తను మనసారా ప్రేమించిన ఆవిడకు విరుద్ధంగా వాజ్ఞూలం, రామ్ ఔర్ శ్యామ్ చిత్రీకరణ సమయంలో మార్కస్ బార్ట్లేతో గిల్లి కజ్జా – కొన్ని అపస్వరాలు
“సగీనా మహతో” బెంగాలీ చిత్రం షూటింగ్ కు కలకత్తాకు వెళుతున్నప్పుడు, విమానపు బిజినెస్ క్లాస్ లో తన ప్రక్కనే కూర్చున ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త తనను పలుకరించలేదు సరిగదా, కనీసం గుర్తుకూడా పట్టకపోవడం తన అహాన్ని పటాపంచలు చేసిందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
ఆయన చిత్రాలు చూసి, ఉత్తేజితులై బాంబే దారి పట్టామని చెప్పుకున్న ధర్మేంద్ర, మనోజ్ కుమార్ లు, తనతో సహా “ఒక తరం నటులు ఆయన శైలి ననుకరించి బ్రదుకుదెరువు గడించార”ని ఉల్లేఖించిన అమితాబ్ బచ్చన్ ల వ్యాఖ్యల ముందు ఆయన ప్రతిభను గురించి వ్రాయాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది.
భారతీయ చిత్రసీమలోనే అది ఆయన తరం.
“తరం మారుతోంది.మన స్వరం మారుతోంది”.
కాని నటుడిగా ఆయన కీర్తి అజరామరం.