Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌నల్ల వజ్రం మననం : మండేలా... ఓ మండేలా ...

నల్ల వజ్రం మననం : మండేలా… ఓ మండేలా …

ప్రపంచమంతా ఎంతగానో గౌరవించే నేత నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగక పోరాడి, సమాన హక్కుల సాధన ఉద్యమంలో దేశ ద్రోహం నేరం మోపబడి ఇరవై ఏడు సంవత్సరాల ఒంటరి జైలు శిక్షని ద్వీపాంతరంలో అనుభవించిన ఆ నల్ల సూరీడి వజ్ర సంకల్పం సదా చిరస్మరణీయం.

మహనీయుడు, అవిశ్రాంత పోరాట పథికుడు 2013 డిసెంబర్  5న జోహెన్స్ బర్గ్ లో కన్నుమూసినప్పటికీ వారి స్ఫూర్తి పోరాడే ప్రతి చోటా గొప్ప ప్రేరణ. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడేందుకు సహజ భరోసా. నేడు వారి వర్థంతి సంధర్భంగా ఆ నల్ల వజ్రాన్ని మననం చేసుకోవడం అంటే అపురూపమైన గెలుపు తెలుపు. అది సంఘర్శణ కోసం కాదు, బాధాకరమైన పోరాటానికీ కాదు, అవశ్యమైన స్వేచ్చకోసం, ప్రేమ కోసం, అంతిమంగా శాంతి కోసం.

రమేశ్ చెప్పాల

వెనుకబడిన దేశాలకు నాగరికతను నేర్పే పేరుతో తెల్లజాతి ప్రజలు పాల్పడిన ఘోర కృత్యాలను వర్ణించడానికి ఏ భాషా సరిపోదు. వారు స్థానిక జాతులను ఎన్నో చోట్ల సమూలంగా నాశనం చేశారు. బతికి బట్టకట్టిన వారిని బానిసలుగా చేసుకుని సంపద పెంచుకున్నారు. సమాజం పైమెట్టుకి వెళ్ళటానికి అణిచివేత, దోపిడి తప్పదన్న వాదనలతో తమ ఘాతుకాలను సమర్థించుకున్నారు. బందీలైన తమ జాతి ప్రజల విముక్తి కోసం నెల్సన్ మండేలా జరిపిన పోరాటం ఒక నమ్మక శక్యం కాని చరిత్ర. స్ఫూర్తిదాయకమైన ఆచరణ.

“తమ నేలలో ఉన్న వజ్రాలనూ, బంగారాన్ని తెల్లపాలకులు కొల్లగొడితే దక్షిణాఫ్రికా ప్రజలు మండేలా రూపంలో అద్వితీయమైన “నల్లవజ్రాన్ని” కనుక్కొన్నారు.

కాలం ప్రతిసారీ ఒక వీరుడిని కంటుంది అనడానికి ఉదాహరణ మండేలా. ఆ మహానేతని చూస్తే లెనిన్, మావో, గాంధీ, హోచిమిన్ గుర్తుకు వస్తారు. ఆయన్ని గురించి ఇలా అభిమానంగా చెప్పొచ్చు : “తమ నేలలో ఉన్న వజ్రాలనూ, బంగారాన్ని తెల్లపాలకులు కొల్లగొడితే దక్షిణాఫ్రికా ప్రజలు మండేలా రూపంలో అద్వితీయమైన “నల్లవజ్రాన్ని” కనుక్కొన్నారు.

నేపథ్యం

17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హిందూ మహా సముద్రం చుట్టూ ఉన్న వాణిజ్య కేంద్రాలపై ఆధిపత్యాన్ని సంపాదించింది. కొన్నాళ్ళకు బ్రిటిష్ వారు వచ్చి డచ్ వారిని మారుమూల ప్రాంతాలకు తరిమివేశారు. మొత్తానికి బ్రిటిష్ వారు, డచ్ వారు స్థానిక జాతులను అణచివేశారు.

ఎన్నో యుద్ధాల అనంతరం ఇరుదేశాల తెల్లవారికి మధ్య ఒప్పందం కుదిరి 1910 మే 31న యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆవిర్భవించింది. నల్లజాతి వారికి ఓటు హక్కు లేకుండా చేశారు. దీంతో రెండేళ్ళ తర్వాత నల్లవారి హక్కుల కోసం పోరాడేందుకు ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఏ.ఎన్.సి ఏర్పడింది అయినా ప్రభుత్వం ఆలోచనల్లో మార్పు లేదు సరి కదా ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చి నైపుణ్యంతో కూడిన పనులకు నల్ల వారిని అనర్హులని చేసారు. ఏయే ప్రాంతాల్లో నల్లవారు నివసించాలో నిర్దేశించింది కొన్ని పట్టణాల్లో నల్లవారు అడుగు పెట్టకూడదని శాసించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నల్లవారి ఉచ్ఛ్వాసశ్వాసాల్ని ప్రభుత్వం నియంత్రించింది. ఈ నేపథ్యంలో నెల్సన్ మండేలా ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు.

రాత్రిపూట విన్న కథలే ప్రేరణగా…

క్యూన్ అనే గ్రామంలో 1918 జూలై 18న నెల్సన్ మండేలా జన్మించారు. మండేలా తండ్రి చిన్న తెగకు నాయకుడు. ఆయన మూడో భార్యకు మండేలా మొదటి సంతానం. మండేలాకు పదేళ్ల వయసు వచ్చేసరికి తండ్రి చనిపోయారు. సమీప బంధువు మండేలా పెంపకం బాధ్యతను స్వీకరించారు చిన్నతనంలో స్కూల్ అనగానే పశువులు కాసేవాడు. మండేలా తెల్లవారు రాకముందటి స్వేచ్ఛ జీవితాన్ని గురించి రాత్రిపూట పెద్దలు చెప్పే కథలు మండేలలో ఆలోచనలను రేకెత్తించాయి. నల్లజాతి ప్రజల గోస వింటున్నప్పుడే తమ ప్రజల మేలుకోసం ఏదైనా చేయాలన్నా ఆలోచన మండేలాలో చిగురించింది.

డిగ్రీ పూర్తి చేసే నాటికి వాల్టర్ సిస్లూ తో మండేలాకు పరిచయమైంది.సిస్లూ ఇంట్లోనే మండేలా ఉండేవారు. నర్సుగా పని చేస్తున్నా ఏవ్లిన్ మేస్ ని మండేలాకు సిస్లూ పరిచయం చేశారు. ఇద్దరు 1944 లో వివాహం చేసుకున్నారు. కుటుంబ భారాన్ని ఎవ్లిన్ మోయటంతో మండేలాకు విట్స్ యూనివర్సిటీలో ‘లా’ చదివే వెలుసుబాటు లభించింది. సిస్లూ సాంగత్యంతో ఏ.ఎన్.సి కార్యకలాపాల్లో మండేలా పాల్గొనటం మొదలైంది. 1948 నాటికి ఏ.ఎన్.సి (ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) యూత్ లీగ్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు.

అణచివేత అరుదెంచిన మండేలా

అదే ఏడాది నల్ల వారిని మరింతగా అణిచి వేసి జాతి విచక్షణను క్రూరంగా అమలు చేస్తామన్న వాగ్దానంతో “నేషనల్ పార్టీ” అధికారంలోకి వచ్చింది. విభజించు పాలించు సూత్రంతో అకృత్యాలకు పాల్పడింది. మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తితో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని మండేలా వాదించారు. ఏ.ఎన్.సి సమ్మె పిలుపునకు మంచి స్పందన రావటంతో మండేలా పేరు మార్మోగింది. 1952లో ఏ.ఎన్. సి జాతీయ అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. ‘ఇరాక్ యుద్ధం అమెరికా,ఇంగ్లాండ్ సృష్టిస్తున్న విషాదం’ అంటూ అమెరికాకి ఇరాక్ ఆయిల్ కావాలి అందుకే యుద్ధం’ అని ప్రపంచ అభిప్రాయాన్ని ప్రకటించే సాహసం చేశాడు.

కమ్యూనిజం వ్యాప్తికి తోడ్పడుతున్నారనే ఆరోపణపై మండేలాతో సహా 22 మంది నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. 1955 జూన్ 26 న జోహన్నెస్బర్గ్ లో జరిగిన మా సభకు వేలమంది నల్లజాతీయులు హాజరై మండేలా తయారుచేసిన హక్కుల పత్రం “ద ఫ్రీడమ్ చాప్టర్” ను ఆమోదించారు. ఆగ్రహించిన ప్రభుత్వం మండేలతో బాటు 156 మంది నాయకులపై దేశకుట్ర కేసు మోపింది. దాంతో 1956 నాటికి మండేలా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి ఏవ్లిన్ డివోర్స్ తీసుకోని వెళ్ళిపోయింది.

“స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కుని విక్రయించలేను. మీ స్వేచ్ఛ నా స్వేచ్ఛ అవిభాజ్యమైనవి” అంటూ మండేలా దక్షిణాఫ్రికా ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఇతర వర్ణాలకు ప్రాతినిధ్యం వహించి పార్టీలతోనూ సన్నిహితంగా మెలగాలని మండేలా వాదన. ఆ ప్రతిపాదన 1958లో ఏ.ఎన్.సి లో చీలికకు దారి తీసింది. “పాన్ ఆఫ్రికన్ కాంగ్రెస్” ఏర్పాటయింది. కొత్త రాజ్యాంగం కోసం జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలన్న తమ సూచనలను ప్రభుత్వం తిరస్కరించటంతో ఏ.ఎన్.సి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీన్ని ప్రభుత్వం కఠినంగా అణచి వేసింది. ఇక హింసాయుత పోరాటం తప్పదని ఏ.ఎన్.సి కమ్యూనిస్ట్ పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

రాబెన్ ఐలాండ్ జైల్లో… కటిక నేలపై…

మండేలా రహస్యంగా పలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. స్వదేశానికి వచ్చి మారువేషాల్లో తిరుగుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మండేలా కోసం పోలీసులు అప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నారు. 1962లో ఓ రోజు కారులో వెళుతున్న ఆయనను చేజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి ఏడాది మండేలాతో బాటు మరో తొమ్మిది మందిపై కొత్త అభియోగాలు మోపారు. నిరసన పెల్లుబికినా ప్రభుత్వం లెక్క చేయలేదు. “మండేలాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు” ఏళ్ల తరబడి మండేలా రాబెన్ ఐలాండ్ జైల్లో అరకొర ఆహారంతో కటిక నేలపై పడుకుని రోజులు వేళ్ళదీయాల్సి వచ్చింది.

బేషరతుగానే విడుదల చేయాలి…

1976 నాటికి పరిస్థితులు శరవేగంతో మారిపోవటం మొదలైంది. దేశంలో ఆందోళన ప్రజ్వరిల్లటానికి తోడు అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వం దేశాన్ని వదిలిపోతే జైలు నుంచి విడుదల చేస్తామని మండేలా వద్దకు రాయబారాలు పంపించింది. బేషరతుగానే విడుదల చేయాలని ఆయన ఖరాఖండిగా చెప్పారు. క్రమంగా మండేలా అకుంఠిత పోరాట దీక్ష ప్రపంచదేశాల మన్ననలు పొందింది. హింసధోరణి వీడితే మండేలాను విడుదల చేస్తామని అధ్యక్షుడు పి డబ్ల్యూ బో తా ప్రకటించారు. హింసను ఖండించితే ఏ.ఎన్.సి చేస్తున్న పోరాటాన్ని తాను ఖండించినట్లేనని భావించి మండేలా అందుకు నిరాకరించారు.

“మీకంటే జీవితాన్ని నేనేమి తక్కువగా ప్రేమించలేదు. నా జన్మ హక్కుని నేను అమ్ము కోలేను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కుని విక్రయించలేను. మీకు స్వేచ్ఛ లభించే దాకా ప్రభుత్వానికి ఏ వాగ్దానం చేయలేను. మీ స్వేచ్ఛ నా స్వేచ్ఛ అవిభాజ్యమైనవి” అని మండేలా జైలు నుంచి ప్రజలకు రాసిన స్పష్టం చేశారు. 1988 జూలై 18న ఆయన జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి జరగనంత ఘనంగా జరిగాయి.

తెల్లవారిపై ద్వేషం వెళ్లగక్కలేదు…

జాతి విచక్షణను రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచటం తప్పదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇంతలో మండేలా క్షయవ్యాధితో బాధపడుతున్నట్లుగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. కోలుకున్నాక చర్చలు సంప్రదింపుల అనంతరం 1990లో కొత్త అధ్యక్షుడు ఎఫ్ డబ్ల్యూ డిక్లార్క్ మండేలాను విడుదల చేశారు. విడుదలైన తర్వాత తెల్లవారిపై ద్వేషం వెళ్లగక్కే ప్రకటనలు మండేలా చేయకపోవటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మండేలా స్వియ చరిత్ర “లాంగ్ వాక్ టు ఫ్రీడమ్”, “ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ” 1994లో ప్రచురింపబడ్డాయి. అతను కారాగారంలో ఉండగానే రహస్యంగా వీటిని రచించారు.

వందల ఏళ్లుగా దేశంలో పాతుకుపోయిన తెల్లవారిని దేశం నుంచి పంపించటం సాధ్యం కాదని మండేలా గ్రహించారు. అన్ని జాతుల వారికి సమాన హక్కులు ఉండే ప్రజాస్వామ్యం వ్యవస్థని ఏర్పాటు చేయటం తక్షణ కర్తవ్యంగా మండేలా భావించారు. తెల్లవారు, నల్లవారన్న భేదం లేకుండా వారి మధ్య వైషమ్యాలు పెరగకుండా,ప్రజలందరూ ఒక్కటేనన్న భావన కలుగజేయగలిగాడు. ప్రజలకు భరోసా ఇవ్వటం, అందరినీ ఒక్కటిగా చూసే రాజ్యాంగ రచన చేయటం సాధించగలిగాడు.

రెండోసారికి నో…

కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ మండేలా కృషితో ప్రజాస్వామ్యం వ్యవస్థ ఏర్పడింది. కొత్త దక్షిణాఫ్రికాకు ఆయన ప్రథమ అధ్యక్షుడయ్యారు. రెండోసారి అధ్యక్ష పదవిని స్వీకరించనని ముందుగానే ప్రకటించారు. శతాబ్దాల పాటు అణిచివేత, విద్వేషం పొగలు చిమ్మిన దక్షిణాఫ్రికా ఆయన విశాల దృక్పధంతో క్రమంగా కోలుకుని ముందుకు పోతోంది .

హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు “దక్షిణాఫ్రికా గాంధీగా” పేరు తెచ్చింది.

హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు “దక్షిణాఫ్రికా గాంధీగా” పేరు తెచ్చింది. 1990లో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి నెల్సన్ మండేలాను భారతీయ సమాజం గౌరవించింది. 1993లో నెల్సన్ మండేలాకు “నోబెల్ శాంతి” బహుమతి లభించింది.

ఆ మహనీయుడు, అవిశ్రాంత పోరాట పథికుడు 2013 డిసెంబర్ 5న జోహెన్స్ బర్గ్ లో అస్తమించారు. ఐతే వారి స్ఫూర్తి పోరాడే ప్రతి చోటా గొప్ప ప్రేరణ. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు నెల్సన్ మండేలా ఒక ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తారు. ఆ నల్ల వజ్రాన్ని మననం చేసుకోవడం అంటే అది పోరాటం కోసం కాదు, ప్రేమకై… శాంతికై. అందుకే తెలుపు నీరాజనం.

*రమేష్ చెప్పాల రచయితా సినీ దర్శకులు. మానవాళి శ్రేయస్సుకోసం కృషి చేసే మహనీయుల గాథలు వారికి ఇష్టమైన అధ్యయనం. జీవన తాత్వికతను తెలుపే సజీవ గాథల కల్పన ఇష్టమైన అభిరుచి ‘మా కనపర్తి ముషాయిరా’ వారి కథల సంపుటి. త్వరలో తీర్థయాత్రా సాహిత్యానికి చేర్పుగా మరో పుస్తకం తెస్తున్నారు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article