Editorial

Monday, December 23, 2024
స్మరణవర్థంతిజంధ్యాల‌ : ఓ పడమటి సంధ్యారాగం

జంధ్యాల‌ : ఓ పడమటి సంధ్యారాగం

తెలుగు నాట విలక్షణ హాస్యానికి మారు పేరుగా మారిన జంధ్యాలను ఎవరమూ మరచిపోలేము. ఆయన పడమట వాలిన ఒక సంధ్య. నేడు వారి వర్థంతి. అయన మనల్ని వీడి సరిగ్గా రెండు దశాబ్దాలైనప్పటికీ వారి సినిమాలు, పాత్రలు ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాయి. మనసుని హత్తుకునే ఉంటాయి. ఆ సృజనకారుడి తలంపు నేటి ఆత్మీయ నివాళి.

హెచ్. రమేష్ బాబు

తెలుగు చిత్ర సీమ 80, 90 ద‌శకాల్లో అశ్లీల‌త‌, ర‌క్త‌పాతం, ద్వంద్వార్థాల సంభాష‌ణ‌ల‌తో క‌లుషిత‌మైన సంక్షుభిత‌కాలంలో ఏ మాత్ర‌ము వెకిలిత‌నం, బూతుల్లేని హాస్యంతో సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యాన్ని అందించిన ద‌ర్శ‌కులు జంధ్యాల.

‘జంధ్యాల’ గా ప్రసిద్ధిగాంచిన “జంధ్యాల దుర్గా వెంకట శివ సుబ్రహ్మణ్యశాస్త్రి కాలేజీ రోజుల్లోనే నాటకాలాడారు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో బి.ఎ. చదివారు. కాలేజీలోనే నాటకాలు వ్రాసి నటించి దర్శకత్వం వహించారు. ‘కళా భారతి’ అనే నాటక సమాజాన్ని స్థాపించి సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయశర్మ, ఎం.వి.రఘు (వారు కెమెరామెన్ అయ్యారు తర్వాత) మాధవపెద్ది రమేష్, నటి అన్నపూర్ణలతో కలసి పలు నాటకాలను ప్రదర్శించారు. ఇంకా చెప్పాలంటే ఏడో తరగతి చదువుతున్నప్పుడే జీవన జ్యోతి నాటకం రాసి అందులో ప్రధానపాత్ర పోషించారు. ఆ తరువాత విజయవాడ ఆకాశవాణి కోసం 30 నాటకాలు రాసి వాటిలో నటించారు కూడా. 1965లో పరిషత్ పోటీల కోసం తొలిసారిగా రాసిన ‘ఆత్మాహుతి’ అనే నాటకం ఎందరిచేతనో ప్రశంసలందుకొంది. ఆ తరువాత ‘ఏక్ దినా-సుల్తాన్’ నాటకం రాయగా అది తెలుగు నాటక అభిమానులను బాగా అలరించడమే గాక హిందీ, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమైంది కూడా. ఆంగ్ల వెర్షన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలా జంధ్యాల నాటక రచయితగా, నటునిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గుండెలు మార్చబడును, బహుకృత వేషం, ఓ చీకటి రాత్రి, లేత గులాబి, డా॥ సదాశివం, మధ్యతరగతి మందహాసం, సంధ్యారావంలో శంఖారావం, మరీచిక వంటి చక్కటి నాటకాలు రాశారాయన.

1973లో సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చిన జంధ్యాలను ఒక నాటక ప్రదర్శనలో చూసిన బి.ఎన్.రెడ్డి, బీనాదేవి నవల ‘హేంగ్ మిక్విల్’ ఆధారంగా సినిమాగా తీయాలని హీరోగా జంధ్యాలను ఎంపిక చేసుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే నాటక రచనలో సిద్ధహస్తుడైన జంధ్యాల ‘పెళ్ళికాని పెళ్ళి’ చిత్రానికి తొలుత రచయితగా పనిచేశారు. ముందుగా విడుదలైన చిత్రం మాత్రం ‘దేవుడు చేసిన మనుషులు’ ఆ తరువాత ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘శంకరాభరణం’, ‘సంధ్య’, ‘వేటగాడు’, ‘అడవి రాముడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అమరదీపం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఆఖరిపోరాటం’, ‘సప్తపది’, ‘మృగతృష్ణ’, ‘ఇంటింటి రామా యణం’ వంటి మొత్తం 400 చిత్రాలకు సంభాషణలు కూర్చారు.

వీరభద్రరావు, వేలులను ‘సుత్తి జంట’ గా పరిచయం చేసి సుత్తి అనే మాటను తమిళ, కన్నడిగులకు కూడా చేరవేసి హాస్యానికి సరికొత్త ఒరవడిని ఆపాదించారు.

 

దర్శకుడిగా 1981లో తొలి సారిగా ‘ముద్దమందారం’ చిత్రం తీసి ప్రదీప్ పూర్ణిమలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తరువాత ‘నాలుగు స్తంభాలాట’ తో భారీ విజయం సాధించారు. ఈ చిత్రంలో వీరభద్రరావు, వేలులను ‘సుత్తి జంట’ గా పరిచయం చేసి సుత్తి అనే మాటను తమిళ, కన్నడిగులకు కూడా చేరవేసి హాస్యానికి సరికొత్త ఒరవడిని ఆపాదించారు. ఆ తరువాత ఆయన 20 ఏళ్ళలో దర్శకునిగా అప్పుడప్పుడూ కొంత గ్యాప్ వచ్చినా తన కమిట్మెంట్స్ విషయంలో రాజీ పడలేదు.

ఈ నేప‌థ్యంలో ఆయన పల్లెపందిరి, నెలవంక, రెండుజెళ్ళసీత, అమరజీవి, మూడు ముళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి (తెలుగు, కన్నడం), రావుగోపాలరావు, పుత్తడిబొమ్మ, బాబాయ్ అబ్బాయ్, శ్రీవారి శోభనం, మొగుడు పెళ్ళాలు, ముద్దుల మనువరాలు, సీతారామకళ్యాణం (1980), రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయ్, పడమటి సంధ్యారాగం, రాసలీల, అహనా పెళ్లంట, చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, లేడీస్ స్పెషల్, బావాబావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం, విచిత్రప్రేమ, బాబాయ్ హోటల్, ప్రేమ జిందాబాద్, అఆఇఈ, ష్.. గప్ చిప్, ఓహో నా పెళ్ళంట, విచిత్రం వంటి మొత్తం సుమారు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వీటిలో పుత్తడిబొమ్మ, ఆనంద భైరవి, సీతారామకళ్యాణం తప్ప అన్ని కామెడిలే.

ఆనంధ భైరవి అద్భుత సంగీత నృత్య ప్రధాన చిత్రం. రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందికి ఎంపికైంది. ఆయన కూడ పలుమార్లు ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డు అందుకొన్నారు. సినిమా ఎక్స్ ప్రెస్ వారిచే ‘దశాబ్దపు ఉత్తమ సినీరచయిత’గా, రవీంద్ర భారతిలో జాలీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారిచే ‘హాస్య విపంచి’ బిరుదును కూడా అందుకున్నారు.

వారి సినిమాల్లో హాస్యమే కాదు, సంగీత, సాహిత్యాలు ఉన్నతాభిరుచితో ఉండటం, పడే పడే వారి సినిమాల్లోని సన్నివేశాలను జ్ఞాపకం చేసుకోవడం ప్రేక్షకుల హృదయాల్లో అయన స్మృతి పదిలం అనడానికి నిదర్శనం.

1951 జనవరి 14న నరసాపురంలో జన్మించిన జంధ్యాల జూన్ 19, 2001లో కాలం చేశారు. వారి మృతి తెలుగు చిత్ర సీమకు ఎన్నటికీ తీరని లోటు. రచయితగా, దర్శకునిగా ఉత్తమ చిత్రాలనందించిన జంధ్యాల భావితరాలకు ఆదర్శనీయులు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article