ఈ రోజు కాదు, ఎ రోజైనా మీ జ్ఞాపకం మనిషి పుట్టిన రోజే. మనిషి మరణించిన అని ఎందుకు అనాలి? మిమ్మల్ని చూశాక కూడా…
కందుకూరి రమేష్ బాబు
కేవలం మనిషి. పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన జస్ట్ ఎ మ్యాన్ కైండ్.
దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా ఒక మానవ ప్రయత్నం. ఈ చిరు నివాళి. యాది.
మోహన్ గారు కేవలం మనిషి. ఆయన నేరుగా మనిషితో వ్యవహరిస్తాడు. కులం, మతం, వర్గం, లింగం, ప్రాంతం, ధనం – ఇటువంటివేవీ లేకుండా -పేరు, ప్రఖ్యాతి, హోదా వీటితో ఇసుమంత కూడా నిమిత్తం లేకుండా ఆయన మనిషితో నేరుగా ఉంటాడు. సదరు మనిషితో పూర్తిగా అంగీకారంతో ఉంటాడు.
కావాలంటే మీరు వెళ్ళినప్పుడు చూడండి. మీరెవరు? ఎక్నడ్నుంచి వచ్చారు? ఏం కావాలీ అని అడగరు. తెరిచిన తలుపులతో ఆయన సదా అందుబాటులో ఉంటారు. తనవద్దకు అలా వచ్చి అట్లా ఉండిపోయిన మనుషులు కూడా చాలా మందే ఉన్నారు. అయినా ఆయన మారలేదు. మనిషి మారలేదు.
మళ్లీ చెప్పాలంటే, ఆయన కేవలం మనిషి. వివరించి చెప్పాలంటే, తాను మీతో మాట్లాడుతున్నాడంటే వారికి మీ వ్యక్తిత్వం నచ్చో కానక్కరలేదు. నచ్చక పోయినా మాట్లాడుతాడు. నచ్చడం, నచ్చక పోవడం. అభిరుచులు కలవడం, కలవకపోవడం అన్నదాంతో సంబంధం ఏమీ లేదు. నిజానికి, అవేవీ లేకుండాను, మానవ సంబంధాల్లో ఏదో ఒక ఆశింపు ఉంటుంది చూడండి. అలాంటిది కనీసం లేశమాత్రం కూడా లేకుండా వారు మనతో బిహేవ్ చేస్తారు. జీవిస్తారు. కేవలం మనిషిగా బతుకుతారు. ఉనికిలో ఉంటారు. అంతే. అదీ ఆయన విశేషం. అంతకుమించి ఇంకేమీ లేకపోవడమే మోహన్!
ఒక మనిషి మరో మనిషితో నెరిపే సంబంధ బాంధవ్యాలకు అతనొక నిజ వ్యక్తిత్వం.
ఏదీ ఆశించకుండా అంతా ఔదార్యంగా ఉండటంలో అతడి విశేషం, సామాన్యత.
ఫుకువోకా చెప్పినట్టు ‘ఏమీ చేయకుండా ఉండటం’ ఎలాంటిదో చెప్పేందుకే వ్యవసాయం చేశాను అన్నట్టు, ఏమీ చేయకుండా ఉండటం ఏమిటో అద్భుతంగా అనుసరించిన మనిషి తాను.
ఫుకువోకా చెప్పినట్టు ‘ఏమీ చేయకుండా ఉండటం’ ఎలాంటిదో చెప్పేందుకే వ్యవసాయం చేశాను అన్నట్టు, ఏమీ చేయకుండా ఉండటం ఏమిటో అద్భుతంగా అనుసరించిన మనిషి తాను.
ముందే చెప్పినట్టు, తనకు పెద్దవాడూ చిన్నవాడు… ధనికా పేదా… ఆడా మగా…పరిచితుడూ అపరిచితుడూ…గురువూ శిష్యుడూ…ఇటువంటి వేవీ ఉండవు. ఆయనకు మనిషి వినా మరేదీ అక్కర్లేదు.
ఫలానా మనిషి తనతో పని చేయించుకుంటాడని తెలుసు. అయినా ఫరవాలేదని ఊరుకునే తాత్వికత ఆయనది.
వారు క్యాపిటలిస్టూలా కమ్యూనిస్టులా అని కాదు, మనుషులు దోచుకుంటారని తెలుసు. అయినా దోపిడీకి గురవుతున్నామన్న చర్చోపచర్చలు లేని స్థితప్రజ్ఞత వారిది.
తనవారా పరాయి వారా అని కాదు, మనుషులు తనని వాడుకుంటారని తెలుసు. అయినా వాడకొకూడదని పెనుగులాడిన క్షణం లేని మనిషి తాను.
తాను ఇవన్నీ కాదు. అయన కేవలం ఒక పిడికిలి.
తాను ఇవన్నీ కాదు. అయన కేవలం ఒక పిడికిలి.
ఆయనకైనా మరో మనిషికైనా అంతకన్నా’సొంత ఆస్థి’ ఇంకేదీ ఉండదని తాను బలంగా భావిస్తారేమో! బహుశా అందుకే ఆ పిడికిలి తప్పా ఆయన ప్రపంచానికి ఇచ్చింది ఇంకోటి లేదనే అనుకుంటాను, నేనైతే!
పోరు బాటలో ఒక పిడికిలి. కుడి ఎడమలతో సంబంధం లేదు.
వామపక్షం వాళ్లడిగినా చంద్రబాబు అడిగినా ఇచ్చాడు. తన సాహిత్యం అదే అన్నట్టు, నోరు తెరిచి ఎవరు అడిగినా సరే, తల పంకించి ఆ బొమ్మ వేసిచ్చారు.
అది కూడా తానూ ఒక మనిషిని అన్న ఎరుకతోనే తప్పా అదొక గొప్ప అచీవ్ మెంట్ అని కూడా ఆయన అనుకోలే. ఇంత సింపుల్ మనిషిని నేనూ ఊర్లో ఒకరిద్దరినే చూశాను. అదృష్టం అంటే నాది.
చిత్రమేమిటంటే, మోహన్ గారు మనుషులకు సంబంధించి వాళ్ల పూర్వపరాలు, స్థితిగతులతో సంబంధం లేకుండా వ్యవహరించడం ఎంతో గొప్పగా ఉంటుందీ అంటే గొప్ప ఈజ్ అది. అలా ఉండటం కారణంగా ఎందరో పెద్దవాళ్ళు అయ్యారు. పెరిగిపోయారు. వాళ్ళు తనకోసం ఒక్క రూపాయి విదల్చకపోవడం కూడా ఆయన గొప్పతనమే. వాళ్ళు ఒక్క పుస్తకం వేయకపోవడం, ఒక్క సంస్థను తన పేరిట స్థాపించకపోవడం, అతడి కీర్తిని యశస్సును ప్రపంచానికి చాటక పోవడం కూడా తన అదృష్టమే. ఎందుకంటే వారు వాళ్ళలా ఉండటం ఆయన మనిషిగా ఉండటం కదా కావాలసింది, తనకూ… అందరికీ.
తాను బహుశా అందరికీ అందుబాటులో ఉండటం మనకు బాగుంటుంది. తలలో నాలుకలా మెసలడం మనకు బాగానే ఉంటుంది. ఓ మనిషి తనకోసం తాను ఆలోచించకపోవడం కూడా ఎవరికైనా హాయిగా ఉంటుంది. కానీ ఆయన ఇంతమంది మనుషులను భరించి వెళ్లిపోయేదాకా మనిషిగానే ఉండగలగడం నాకు ఒక వింత.
ఓ మనిషి తనకోసం తాను ఆలోచించకపోవడం కూడా ఎవరికైనా హాయిగా ఉంటుంది. కానీ ఆయన ఇంతమంది మనుషులను భరించి వెళ్లిపోయేదాకా మనిషిగానే ఉండగలగడం నాకు ఒక వింత.
ఒక సారి, నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభపు రోజుల్లో మోహన్ గారు ఒకరిద్దరు మనుషులను పంపారు. వారి గురించి ఎన్నో సార్లు వాకబు చేశారు. “పనైందా లేదా?” అని ఎన్నో సార్లు ఆరా తీశేరు. ఒక రోజు “వాళ్లు మీ మిత్రులా?” అని అడిగితే, “లేదబ్బా…ఏమో! ఎవరో ఏమో!” అన్నారు.
మరొకసారి ఆయన ఎవరితోనో ఇష్టంగా మందు సేవిస్తున్నారు. చాలా సేపటికి తెలిసింది, వారి సంభాషణల్లో…వాళ్లూ తానూ అపరిచితులు…మొదటిసారి అవతలి వ్యక్తి ఈ మనిషి దగ్గరకు వచ్చారు.
అదీ ఆయన పద్ధతి. అపరిచుతులైనా పరిచితులైనా ఒకటే.
మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం!
వాళ్లు ఏం కోరిక కోరినా సరే, అది ఉద్యోగంలో పెట్టివ్వమనడం కావచ్చు, బొమ్మ వేసి పెట్టడం కావచ్చు. ఆకలి, దాహం ఇత్యాది బాధలు కావొచ్చు. పుస్తకం గురించి కావచ్చు. యానిమేషన్ కావచ్చు.
అది పది పైసల కార్యం కావచ్చు, కోటి రూపాయల వ్యవహారం కావచ్చు. ఏదైనా ఒకటే. అడిగిన వాళ్లకు ఆ అర్హత ఉందా లేదా అన్న విచారణ తనకు లేదు. ఆ పని చేయడం తప్పా అందుకు ఇంకే హేతువూ తనకు అక్కర్లేదు.
మరో మాటలో చెబితే, అవతలి వాడు మనిషిగా ఏం అడిగితే దానికి ప్రతిస్పందనగా ఈ మనిషి వ్యవహరించడం! ఇంతకుమించిన అద్భుతం నేనూ ఈ భూమ్మీద చూడలేదు!
ఈ రోజు కాదు, ఎ రోజైనా మీ జ్ఞాపకం మనిషి పుట్టిన రోజే. మనిషి మరణించిన అని ఎందుకు అనాలి? మిమ్మల్ని చూశాక కూడా.