Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంతెలంగాణ తల్లి పోలిక : అల్లం పద్మక్క

తెలంగాణ తల్లి పోలిక : అల్లం పద్మక్క

తాను మనల్ని విడిచి వెళ్లి అప్పుడే పది రోజులైంది. నేడు తన దశదిన కర్మ. ఈ సందర్భంలో తన అస్తిత్వం గురించి రెండు మాటలు చెప్పుకోకపోతే చేయవలసిందేమిటో ఆలోచించకపోతే తిన్నది పేనవట్టదు. సాధించిన దానికి అర్థం లేదు.

కందుకూరి రమేష్ బాబు

తెలంగాణ అనేక దశలు దాటుకుంటూ ముందుకు వచ్చింది. ఒకనాడు అన్నలు, అక్కలు తెలంగాణని విముక్తం చేయప్రయత్నించిన ఉద్యమకారులు. కానీ నిత్య నిర్బంధ తెలంగాణ, కరువు కాటకాల తెలంగాణ, పొట్ట చేతబట్టుకుని వలసపోయిన తెలంగాణ, భాష యాసలకోసం ఆత్మగౌరవం కోసం తండ్లాడిన తెలంగాణ, సీమాంధ్ర ఆధిపత్యాన్ని సహించని తెలంగాణ, స్వీయ రాజకీయ అస్తిత్వ సోయి మరచిన తెలంగాణ – మలి తెలంగాణ ఉద్యమ సమయంలో అమ్మలనూ కన్నది. అంతకు ముందరి అక్కలు అమ్మలుగా అవతరించిన ప్రత్యేక సందర్భం అది. అటువంటి అమ్మల తెలంగాణకు అచ్చమైన ఉదాహరణ అల్లం పద్మక్క.

అందరూ ఉద్యమించమని చెబుతున్నప్పుడు బిడ్డలకు అన్నం పెట్టడం గురించి ఆలోచించిన అక్క- అమ్మల సంఘం అల్లం పద్మక్క.

తాను మనల్ని విడిచి వెళ్లి అప్పుడే పది రోజులైంది. నేడు తన దశదిన కర్మ. ఈ సందర్భంలో తన అస్తిత్వం గురించి రెండు మాటలు చెప్పుకోకపోతే తిన్నది పేనవట్టదు. సాధించిన దానికి అర్థం లేదు.

అల్లం పద్మక్క హాస్పిటల్ బెడ్ పై బరువుగా శ్వాస తీసుకుంటున్నప్పుడు చూశాను. ఆ తర్వాతి రోజే తాను శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. అంతిమ చూపు తిరిగి మహాప్రస్థానంలో.

మధ్యలో నిమ్స్, తర్వాత ఇల్లు. అక్కడి నుంచి మహాప్రస్థానం. హైదరాబాద్ నుంచే కాదు, గ్రామాల నుంచి సైతం ఇక్కడికి వచ్చారు.

ఒక్క మాటలో సకల జనుల మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వారంతా కన్నీటి నివాళి అర్పించేందుకు, అక్కను కడసారి చూసేందుకు వచ్చారు. ఇది ఒక అమ్మ సాధించిన విజయం. అల్లం పద్మక్క అందుకున్న ఘన నివాళి.

అక్కడికి వచ్చిన వారిని చూస్తే ఇటీవలి కాలంలో ఉద్యమ తెలంగాణ ఒక్క చోట రూపు కట్టిన వైనం బహుశా అదొక్కటే కావొచ్చనిపించింది.

అంత్య క్రియల్లో అందరూ వెంట ఉన్నారు. తెలంగాణ సాధనలో ముందుండి పోరాడిన పాత్రికేయులు వెంట ఉన్నారు. తాను అన్నం పెట్టిన ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థి వీరులు వెంట ఉన్నారు. పోరుబాటలో కేసులు ఎదుర్కొన్న వారికి అండగా నిలిచిన న్యాయవాదులూ వచ్చారు. ధూమ్ ధామ్ నడిపిన కవులు, కళాకారులు, పాటగాళ్లు వచ్చారు. ఉద్యోగ సంఘాలను ముందుండి నడిపించిన నాయకులూ చివరి చూపుకోసం వచ్చారు. ఒక్క మాటలో సకల జనుల మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వారంతా కన్నీటి నివాళి అర్పించేందుకు, అక్కను కడసారి చూసేందుకు వచ్చారు. ఇది ఒక అమ్మ సాధించిన విజయం. అల్లం పద్మక్క అందుకున్న ఘన నివాళి.

మావోయిస్టు పార్ట్ సైతం పద్మక్క మరణానికి అంజలి ఘటిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేయడం తల్లి ఋణం తీర్చుకోవడం. తెలంగాణ అక్క సాధించిన అపురూప విజేయం. ఇలాంటి గౌరవం ఇటీవల మరొకరు అందుకోలేదనే చెప్పాలి.

చిత్రమేమిటంటే, ప్రభుత్వం. అది కూడా వినయంగా తలవొంచి నివాళి అర్పించింది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మొదలు మంత్రులూ శాసన సభ్యులూ వివిధ ప్రజా ప్రతినిధులు అక్క మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. అది కాదు విశేషం. పదవుల్లో ఉన్న విద్యార్థి నాయకులూ వచ్చారు. పదవి లేని విద్యార్థులూ వచ్చారు. అట్లే, అత్యున్నత పదవుల్లో ఉన్న పాత్రికేయులు, న్యాయవాదులు, ఉద్యోగులు వచ్చారు. పదవి అందుకుని తిరిగి నిరుద్యోగులుగా మారిన వారూ వచ్చారు. పదవి కోసం తహతహ లాడుతున్న వారూ వచ్చారు. ఇవ్వాళ ఎవరు ఏ దిక్కున ఈ పక్షం వహిస్తున్నప్పటికీ అవేమీ ముఖ్యం కాదనుకుని వచ్చారు. వ్యక్తిగత స్థాయిలో మలి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఎట్లైతే అక్క అక్క అనుకుంటూ తిరిగారో వారందరూ పేగుబంధంతో వచ్చారు. తెలంగాణ బిడ్డలుగా వచ్చి నివాళి అర్పించారు. అది విశేషం.

అక్క ఏ పదవిని గుర్తిపునూ కోరుకొని అచ్చమైన తెలంగాణ ఆడబిడ్డ మాదిరి లేదూ. ఊరూ వాడా సంబరాన్ని పంచి నిశ్శబ్దంగా చెరువులో అదృశ్యమయ్యే బతుకమ్మలా లేదూ….బిడ్డల ఆరోగ్యం చాలనుకున్న బువ్వ బోనంలా లేదూ…

ఈ వైనం చెబుతున్నదేమిటో ఈ పది రోజులుగా మనసులో సుడులు తిరుగుతున్నది. ఎవరు నాయకులు? అని! అక్కను ఎలా గుర్తుంచుకోవాలీ అని!!

విప్లవోద్యమంలో అమరులైన సోదరుల చెల్లెలిలానే కాకుండా, అల్లం నారాయణ అన్న జీవన సహచరిగానే కాకుండా, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు తల్లిలా, బంధు మిత్రురాలిగానే కాకుండా, అమ్మలా సంఘం వ్యవస్థాపకురాలిగా, తెలంగాణ జెఈసీ తో కలిసి నడిచిన ఉద్యమ కారిణిగానే కాక …అక్క నిశ్శబ్ద కృషి, మొత్తంగా తాను…పేరు ప్రఖ్యాతి పదవి హోదా వీటితో సంభంధం లేని ఒక సామాన్య తెలంగాణ తల్లికి ప్రతి రూపంగా లేదూ? అక్క అమ్మలా పరిణామం పొందిన త్యాగిలా లేదూ!

అక్క ఏ పదవిని గుర్తిపునూ కోరుకొని అచ్చమైన తెలంగాణ ఆడబిడ్డ మాదిరి లేదూ. ఊరూ వాడా సంబరాన్ని పంచి నిశ్శబ్దంగా చెరువులో అదృశ్యమయ్యే బతుకమ్మలా లేదూ….బిడ్డల ఆరోగ్యం చాలనుకున్న బువ్వ బోనంలా లేదూ…

అదే కదా అక్కను అంతమంది ఓన్ చేసుకునేలా చేసింది. ఆ సామాన్య తెలంగాణా స్వభావమే కదా తనచేత తెలంగాణ గురించి రంది పడేలా చేసింది. పోరాట బాటలో అడుగులో అడుగు వేసేలా చేసింది. చెట్టంత ఉద్యమ ఖిల్లా ఉస్మానియా ఆకలి తీర్చేలా చేసింది. ఆ తల్లి స్మృత్యర్థం మనం చేయవలసింది ఏమిటీ అన్నది ప్రశ్న?

ముఖ్యముగా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అక్కను గుర్తు చేసుకొనే పని ప్రతి ఏటా జరగాలి. పిల్లలలకు ఉద్యోగాలు లభించే దాకా అక్క స్మృతిని తాజగా ఉంచుకోవలసిందే. అప్పుడే అన్నం పెట్టిన తల్లి ఋణం తీర్చుకున్నట్టు.

లూపస్ అన్న ఒకానొక వ్యాధితో తాను అనుక్షణం పోరాడుతూ ఉన్నప్పటికీ, తన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ తననే దెబ్బ తీస్తూ ఉన్నా కూడా ఎన్ని సార్లు భంగపడ్డా తిరిగి మొలిచే తెలంగాణ ఉద్యమంలా అక్క ‘అమ్మ’లా ఓపికతో వేచి చూసింది. రాష్ట్రాన్ని సాధించుకుంది. తానొక తెలంగాణ. చెరగని ప్రతీక. తనని నిరంతరం స్మృతిలో ఉంచుకొని చేయవలసింది ఏమిటీ అన్నది ప్రశ్న?

అక్కని తెలంగాణ తల్లి విగ్రహంలో కాదు, తన రూపంలోనే చూడవలసి లేదా? రాష్ట్ర సాధన గురించి తపించిన పద్మక్కకు చిరస్థాయిగా స్మరించుకునే తోవ చూడకూడదా? తెలంగాణ అమర వీరుల తల్లులా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అక్క చిరస్మరణీయంగా ఒక మంచి పని చేయాలి. అదేమిటో ఆలోచించాలి.

ముఖ్యముగా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అక్కను గుర్తు చేసుకొనే పని ప్రతి ఏటా జరగాలి. పిల్లలలకు ఉద్యోగాలు లభించే దాకా అక్క స్మృతిని తాజగా ఉంచుకోవలసిందే. అప్పుడే అన్నం పెట్టిన తల్లి ఋణం తీర్చుకున్నట్టు.

అక్కలు అమ్మలైన తరుణంలో…అక్షరాలు తప్ప మరేమీ లేని పాత్రికేయ కుటుంబం నుంచి ఒక తమ్ముడి ఆత్మీయ నివాళి ఇది.

 

More articles

1 COMMENT

  1. అక్కా,
    మీకు నా ఆత్మీయ నివాళి.
    మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలుగాలని నా ప్రార్థన.
    🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article